Menu

ది రెజ్లర్

wrestler-leadకొంతమంది దర్శకులుంటారు. వాళ్ళొక్క సినిమా తీస్తారు. ప్రపంచాన్నంతా ఆకర్షిస్తారు. అప్పట్నుంచి ఈ దర్శకుడు ఇక ఎలాంటి సినిమాలు తీస్తాడో,తర్వాత సినిమా ఎప్పుడు విడుదలవుతుందో అని, అందరూ కాకపోయినా, కొంత మంది వీరాభిమానులయినా ఎదురు చూసేలా చేస్తారు. అంతే కాదు ఈ సినిమా మూందూ ఆ దర్శకుడు ఏయే సినిమాలు తీసాడని వెత్కించేలా చేస్తారు. అప్పట్లో క్రిస్టోఫర్ నోలన్ ముందు ఒక ఇండీ ఫిల్మ్ ‘ది ఫాలోయింగ్’ తీసి ఆ తర్వాత ‘మొమెంటో’ తీసాక ఇదే పరిస్థితి. కాకపోతే ముందు తీసిన ‘ఫాలోయింగ్’ గురించి అందరికీ తెలిసింది ‘మొమెంటో’ హిట్టాయాకే. అలాగే ‘రిక్వియం ఫర్ ఎ డ్రీం’ అనే సినిమా తీసిన డారెన్ అరోనోస్కీ కూడా అంతే. ఈ సినిమా హిట్టాయ్యాకే ఆయన మొదట తీసిన ఇండీ సినిమా ‘పై’ గురించి చాలామందికి తెలిసింది.

‘రిక్వియం…’ చూసి పిచ్చెక్కి డారెన్ అభిమాని అయిపోయిన వారిలో నేనూ ఒకడిని. ఈ సినిమా తర్వాత డారెన్ తర్వాత సినిమా ఏంటా అని ఎంతో ఎదురు చూశాను. ఫౌంటెన్ అని ఒక సినిమా వచ్చిది, పోయింది కూడా 🙁 అయితేనేం అభిమానం అంటే ఒక్క సినిమా పోయినంతమాత్రాన పోయేది కాదుకదా. ఈ సారి గ్యారంటీగా హిట్టు కొడతాడులే అని ఎదురుచూస్తుంటే వచ్చి పడింది రెజ్లర్. చూసాను. మళ్ళీ చూసాను. మళ్ళీ మళ్ళీ చూస్తాను. కాకపోతే ఈ సారి డారెన్ కంటే కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించిన మికీ కోసం. ఇంత ఉపోధ్ఘాతం ఎందుకంటే మీకు రెజ్లర్ అనే ఒక మంచి సినిమాని పరిచయం చేయడంతో పాటు ఈ సినిమా దర్శకుడు డారెన్ నీ, ఈ సినిమాలో అత్యుత్తమ నటన ప్రదర్శించి ఉత్తమ నటునిగా అస్కార్ అందుకోబోతున్న (గ్యారంటీగా మికీ కే ఈ అవార్డు. బెట్టా?) మికీ రూర్కీని గురించి కూడా కాస్తా చెప్దామని….

అంతా బావుంది కానీ రెజ్లర్ గురించి మాటల్లో చెప్పగలమా?నాకైతే చాలా కష్టమనిపిస్తుంది. ఈ సినిమా చూసి తరించాల్సిందే కానీ ఇలా రివ్యూలు చదవడం దండగ. నా వరకూ రెజ్లర్ సినిమా ఒక ’experience’. ఈ మధ్య కాలంలో ఇంత మంచి సినిమా మరొకటి చూడలేదనే అంటాను. ఇంతకీ ఏంటీ సినిమాలో గొప్పతనమంటే…

రెజ్లర్ సినిమా కథ పేరు కు తగ్గట్టే ఒక ప్రొఫెషనల్ రెజ్లర్ కథ. ర్యాండీ ది రామ్ ఆనే వయసు మళ్ళిన రెజ్లర్ కథ ఇది.  కథ అనడం కంటే జీవితం అనొచ్చు. ఈ సినిమా స్క్రీన్ప్లే, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, నటీనటుల నటన ద్వారా ఎక్కడా మనం సినిమా చూస్తున్నట్టు అనిపించకుండా కథంతా మన కళ్లముందే జరుగుతున్న అనుభూతి కలుగుతుంది. 2008 లో వచ్చిన అత్త్యుత్తమ సినిమాల్లో ముందు వరసలో ఉంటుంది ఈ సినిమా.

ఈ సినిమా ఎందుకు చూడొచ్చంటే…

చిన్నప్పుడు TVలో  రెజ్లింగ్ చూసే రోజుల్లో అసలిదంతా నిజమేనా అనే అనుమానం ఉండేది. నాకు తెలిసిన వాళ్ళల్లో చాలా మందికీ ఇదే అనుమానం. రెజ్లర్ సినిమా ద్వారా డారెన్ ఒక రెండు గంటల పాటు రెజ్లర్స్ జీవితాలను ఎంతో దగ్గరగా చూసే అవకాశం కల్పిస్తాడు.

మికీ రోర్క్ నటన. అసలు ఈ సినిమా చూడకముందు నాకు మికి రోర్క్ అంటే ఎవరో తెలియదు. సినిమా చూసాక ఎవరో నిజమైన రెజ్లర్ చేత ఈ పాత్ర పోషించేలా చేసుంటారని అనుకున్నాను. ఆ తర్వాతే తెలిసింది మికీ రోర్క్ ప్రముఖ హాలీవుడ్ నటుడు అని. అసలు ర్యాండీ పాత్రలో మికీ రోర్క్ నటించాడనడం కంటే జీవించడాని చెప్పొచ్చు. మికీ రోర్క్ ఈ పాత్రలో అంతటి నైపుణ్యమైన ప్రదర్శన చేయడానికి ఒక ముఖ్య కారణం వుండొడొచ్చనిపిస్తుంది. Godard అంటాడు ’When you see your own photo, do you say you’re a fiction’.అలాగే ఈ సినిమా లో ర్యాండీ పాత్రలో నటించిన మికీ రోర్క్ నిజజీవితానికీ సినిమాలో ర్యాండీ పాత్రకీ చాలా పోలికలున్నాయి. నటుడిగా రాణిస్తున్న సమయంలో నటజీవితాన్ని కాదని బాక్సింగ్ వైపు వెళ్ళాడు మికీ. కానీ అప్పటికే వయసు పైబడడంతో బాక్స్రర్ గా రాణించలేకపోయాడు. ర్యాండీ పాత్ర తో పోలికులున్నాయి కాబట్టే మికీ ఈ పాత్రలో ఇంతగా లీనమైపోయుంటాడని నా నమ్మకం. మికీ రోర్క్ మాత్రమే కాదు సినిమాలో నటించిన వాళ్ళందరూ ఎంతో మంచి నటన ప్రదర్శించారు.

అయితే ఈ సినిమా అర్జెంటుగా చూసెయ్యాలనుకుని నిర్ణయించుకున్నవాళ్ళకి ఒక హెచ్చరిక:

నేను ఈ సినిమా గురించి తెగ పొగిడేస్తుంటే మా రూమ్ మేట్ ఆవేశపడి సినిమా చూడ్డం మొదలుపెట్టాడు. రెండు గంటల సినిమా పావుగంటలో అయిపోకొట్టి, ఇదేంటి డాక్యుమెంటరీలా ఉందన్నాడు. అదేంటో డాక్యుమెంటరీలా ఉండడం అంత పాపమా? అవును ఈ సినిమా మొత్తం కెమెరా హ్యాండ్ హెల్డ్ కావడంతో కాస్తా జెర్కీగా ఉంటుంది. అలాగే కెమెరా చాలా వరకూ ర్యాండీ పాత్రను వదిలివెళ్ళదు. అలాగే సినిమాలో ప్రతి సీనూ పచ్చి నిజం లా ఉంటుంది. కొన్ని చూసి తట్టుకోలేని సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఎక్కడా ప్రేక్షకులను మెప్పించాలనో ఒప్పించాలనో ప్రయత్నం ఉండదు. రెజ్లింగ్ గురించి, రెజ్లర్స్ గురించి నిజా నిజాలు తెలుసుకోమని కాదు కానీ ఒకప్పుడు బాగా బతికి చివరి రోజుల్లో చితికిపోయిన ఒక మామూలు వ్యక్తితో  కొన్ని రోజులు అతని వెంటే వుంటూ అతని జీవితాన్ని గమనిస్తూన్న అనుభూతి పొందాలంటే ఈ సినిమా చూడొచ్చు. అది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూడాలనుకుంటే పూర్తిగా చూడకుండా ఉండడమే మేలు.

13 Comments
 1. అబ్రకదబ్ర February 18, 2009 /
 2. shree February 18, 2009 /
 3. రత్నాకర్ February 18, 2009 /
  • sasank February 18, 2009 /
 4. అన్వేషి February 18, 2009 /
  • రత్నాకర్ February 18, 2009 /
  • అబ్రకదబ్ర February 23, 2009 /
   • anveshi February 24, 2009 /
   • అబ్రకదబ్ర February 25, 2009 /
 5. శంకర్ February 19, 2009 /
 6. గీతాచార్య February 24, 2009 /
 7. కొత్తపాళీ March 1, 2009 /