Menu

సుమంగళి

చలన చిత్ర మాధ్యమాన్ని అధ్యయనం చేసే క్రమంలో బి.ఎన్.రెడ్డి నిర్మించిన చిత్రాలు నేటికీ పాఠ్య పుస్తకాల్లాంటివే. ఆయన చిత్రాల్లో కనిపించే భావుకత, నిర్మాణ సరళిలో ఆవిష్కృతమవుతున్న టెక్నిక్ నేటికీ నిత్యనూతనంగానే ఉంటాయి. ముఖ్యంగా ఆయన నిర్మించిన తొలి చిత్రాలు ఆయన దృక్పధాన్ని, ఆలోచనా రీతిని ప్రతిభావంతంగా మన ముందుంచుతాయి.

ఆయన తొలి చిత్రం ‘వందేమాతరం’ (1939) సామాజికాంశాన్ని, ఆనాటి రాజకీయాంశాల్ని చర్చిస్తే, రెండవ సినిమా ‘సుమంగళి'(1940)లో స్త్రీ సమస్యని, విధవా సమస్యని ఇతివృత్తంగా స్వీకరించారాయన. ఆరు దశాబ్దాల క్రితం నిర్మితమయిన ‘సుమంగళి’ నేటికి అనేక విషయాల్లో అన్వయం కలిగి వుండడం దాని ప్రత్యేకత. అయితే అప్పటికే తమిళంలో సుబ్రహ్మణ్యం ‘బాలయోగిని’ అనే చిత్రాన్ని నిర్మించాడు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమయిన బాలయోగినిలో నిజ జీవితంలో విధవరాలయిన ఓ బ్రాహ్మణ యువతి బాలయోగినిగా నటించింది. ఆ సినిమా ఫలితంగా స్వయంగా బ్రాహ్మణుడయిన సుబ్రహ్మణ్యంను ఆనాడే కులం నుంచి వెలివేశారు. అలాంటి సంఘటనల్ని గమనించి కూడా బి.ఎన్ తన రెండవ చిత్రంలోనే విధవా సమస్యని ఇతివృత్తంగా చేసుకొని సుమంగళి నిర్మించాడు. ఇతివృత్తాల్లోనే కాదు తన సినిమాల్లో నటీ నటుల్ని కూడా కొత్తవాళ్లనే తీసుకుని తన సినిమాకి ఫ్రెష్‌నెస్‌ని అద్దారు. వందేమాతరం గొప్ప విజయం సాధించిన తర్వాత సుమంగళిలో హీరో నాగయ్యకు ముసలి పాత్ర నిచ్చి ప్రధాన భూమికకు కొత్తవాడైన గిరిని తీసుకున్నాడు. సినిమా రంగంలో అది చాలా ధైర్యంతో కూడుకున్న చర్య. ఎప్పుడయినా నిర్దారితమయిన అంశాల్ని తీసుకుని నిలదొక్కుకున్న వారితో చలన చిత్రాలు తీయడం సేఫ్టీ అనుకునే మనస్తత్వాలు కనిపించే మన తెలుగు సినీ రంగంలో వి.ఎన్. ఆనాడే ప్రయోగాలు చేశారు. ప్రయోజనాల్ని ముందుకు తెచ్చి సినిమాను ప్రతిభావంతమయిన మాధ్యమంగా నిరూపించే యత్నం చేశారు. భావుకులయిన వారు ఏ రంగంలో నైనా సరే తమ పనుల్ని నిలకడగా పూర్తి చేస్తారు. రిజల్టు పట్ల పర్ఫెక్షన్‌ని మాత్రమే ఆశిస్తారు. దానికి కాలాన్ని డబ్బుని లెక్కచేయరు. బి.ఎన్. సరిగ్గా అలాంటి తత్వంతోనే సుమంగళి చిత్రాన్ని రాత్రులు షూట్ చేసి సంవత్సర కాలాన్ని తీసుకుని పూర్తిచేశారు.

లైటింగ్, కెమెరా మూవ్‌మెంట్, పాత్రల్ని రూపుదిద్దిన తీరు సుమంగళి చిత్రానికి శాశ్వతత్వాన్ని కలిగించాయి. నవ్య చిత్రోద్యమం వేళ్ళూనక ముందే వి.ఎన్. సొంత గొంతుకతో నాటకీయతకు భిన్నంగా దృశ్యలయతో తన చిత్రాల్ని రూపొందించారు. ఆయన నిర్మాణ పద్ధతికి స్క్రిప్ట్ ఆయువుపట్టు. ప్రతి చిన్న వివరంతో సహా, కెమెరా మూవ్‌మెంట్, నటీనటుల కదలికలు అన్నీ ప్రతి షాట్‌కు సంబంధించి స్క్రిప్ట్ లో రాసేవారమని బి.ఎన్.తానే స్వయంగా చెప్పుకున్నారు. అంతేకాదు నటీనటుల చేత నెలల కొద్ది రిహార్సల్స్ చేయించేవాడట బి.ఎన్. అందుకే ఆయన చిత్రాల్లో పరిపక్వత అంతలా సాధ్యమయింది.

‘సుమంగలి’ చిత్రం “విధివశాత్తు యవ్వనంలోనే మాంగల్యాన్ని కోల్పోయి సామాజిక ధూషణ చేత జీవచ్చవాల్లా బతుకుతున్న హిందూ స్త్రీల కోసం ఈ చిత్రం అంకితం” అన్న ఇంగ్లీషు మాటల్తో ప్రారంభమవుతుంది. నేపధ్యంలో నాగయ్య తెలుగు అనువాదాన్ని చదివి వినిపిస్తారు. చిత్రం గొప్ప ఆశావహంగా ఆరంభమయినప్పటికీ చిత్రం ముగింపులో విధవా వివాహాన్ని చూపించకుండానే ముగిస్తాడు. మళ్లీ పెళ్లిని చూపించక పోవడం ఓ పక్క నిరాశగా కనిపించినప్పటికీ పెళ్లంటే స్త్రీ మరోసారి చట్రంలో ఇమిడినట్టేననే భావాన్ని కూడా అన్వయించుకోవచ్చునేమో. మొత్తం మీద అత్యంత కళాత్మకమయిన రీతిలో విధవా సమస్యని చిత్ర బద్ధం చేసిన సినిమా ‘సుమంగళి’. చిత్ర కథాంశం విషయానికి వస్తే ప్రగతిశీలమయిన భావాలు కలిగిన సత్యం ఐపిఎస్ పాసై తన ఇల్లు చేరుకుంటాడు. అతని కజిన్ పార్వతి సత్యంపై మమకారాన్ని పెంచుకుని ఆయనతో జీవితాన్ని పంచుకోవాలని తలపోస్తూ ఉంటుంది.

మరోవైపు ఆధునికురాలు, ధనవంతురాలు, విద్యావంతురాలు అయిన సరస్వతి సత్యాన్ని ఆకర్షిస్తుంది. సత్యం ఆమెతో ప్రేమలో పడతాడు. కాని సనాతనుడయిన సరస్వతి తండ్రి ఆమెకు చిన్నప్పుడే పెళ్లిచేశాడని బాల్యవివాహమయిన కొద్దికాలానికే భర్త చనిపోయాడని సరస్వతికి తెలియదు. ఆ విషయాలేవీ ఆమెకు కనీసం స్ఫురణలో కూడా ఉండవు. ఆమె మనస్సును నొప్పించడం ఇష్టంలేక తండ్రి ఆమెకు చెప్పడు.

సత్యం, సరస్వతిలమధ్య ప్రేమ చిగురించి ముందుకు సాగిన తర్వాత సరస్వతికి తనకు చిన్ననాడే వైధవ్యం ప్రాప్తించిందనే విషయం తెలుస్తుంది. ఆమె ఆశలన్నీ కూలిపోతాయి. సత్యంపై మనసున్న పార్వతి అతని మనసు తెలుసుకొని దుఃఖితురాలవుతుంది. సత్యం సరస్వతి కోసం వెళతాడు. కాని ఆమె సత్యం జీవితం నుంచి తొలిగిపోతుంది. చిత్రం చివర్లో పార్వతి చనిపోతుంది. సత్యం సరస్వతిలు కలుసుకుని ఒకటి అవకముందే చిత్రం ముగిసిపోతుంది.

సుమంగళి నిర్మాణం సమయానికే సంఘ సంస్కరణోద్యమాలు దేశ వ్యాప్తంగా జరుగుతుండేవి. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కందుకూరి వీరేశలింగం నాయకత్వంలో సంస్కరణోద్యమం విస్తృతమయిన కాలమది. ఆయన రచనలు, ఉద్యమాలు బి.ఎన్‌పై ప్రభావం చూపించి సుమంగళి నిర్మించేలా చేశాయి. చివరికి నాగయ్య చేత కందుకూరిని పోలిన పంతులు పాత్రని కూడా వేయించాడీ చిత్రంలో . పారిస్ నుంచి తెల్లని విగ్గును తెప్పించి ముసలి పాత్రలో నాగయ్యని సజీవం చేశాడు బి.ఎన్.

సుమంగళి ఆర్ధికంగా విజయం సాధించకపోయినప్పటికీ విమర్శకుల చేత ఆనాడే విశేష ప్రశంసలు అందుకుంది. బాబూరావ్ పటేల్ ఈ చిత్రం చూశాక బి.ఎన్.రెడ్డిని ‘పాల్‌ముని ఆఫ్ ఇండీయా’ అని తన ఫిల్మ్ ఇండియా పత్రికలో ప్రశంసించారు. సుప్రసిద్ధ దర్శకుడు శాంతారాంతో సహా అనేక మంది సినీ ప్రముఖులు సుమంగళిని అందులోని చిత్రీకరణ పద్ధతిని విశేషంగా ప్రశంసించారు. సంగీత పరంగా కూడా సుమంగళి గొప్పగా ఉండి మన్ననలందుకుంది. ‘ప్రేమమయమీ జీవనమూ’, ‘ఆడబ్రతుకే మధురం’, ‘బాలా పసుపు కుంకుమ నీకు’, ‘వస్తాడే మా బావ’ లాంటి పాటలు ఆ కాలంలో విశేషంగా ప్రాచుర్యం పొందాయి.

మొత్తం మీద సుమంగళి అర్ధవంతమయిన సినిమాలకు తెలుగులో పాదులు వేసిందని చెప్పుకోవచ్చు. ఇన్ని గొప్పతనాలున్న సుమంగళి ప్రజల్నెందుకు ఆకర్షించ లేకపోయిందనే విషయానికి వస్తే ఆ చిత్ర హీరో నలభై ఏళ్ళ తర్వాత రాండార్‌గైతో చెప్పినట్టు ” ఆ చిత్రం ప్రజల ఆలోచనల్ని తట్టింది కాని హృదయాన్ని తాకలేదేమో” . బి.ఎన్.రెడ్డి మాటల్తోనే అన్వయించుకుంటే మధ్య తరగతి ప్రజలకీ చిత్రం ఇతివృత్తపరంగానే నచ్చలేదేమో. విధవా పునర్వివాహ ఆలోచనకే ఆనాటి మధ్య తరగతి వ్యతిరేకంగా ఉన్న కారణంగానే చిత్రం ఆడలేదేమో.

ఇవన్నింటినీ మించి ఏ గొప్ప కళారూపానికైనా తాత్కాలిక ప్రయోజనాలు, విజయాలకంటే శాశ్వతమయిన గుర్తింపూ అన్వయమే ప్రధానం. ఆ గుర్తింపూ, అన్వయమూ సుమంగళికి నేటికీ ఉంది. అదొక మాస్టర్ పీస్.

కథ, స్క్రీన్ ప్లే, ఎడీటింగ్, ఫోటోగ్రఫీ – రామ్ నాధ్,
మాటలు, పాటలు – సముద్రాల రాఘవాచార్య
సంగీతం _ నాగయ్య
దర్శకత్వం – బి.ఎన్.రెడ్డి
నటీనటులు – నాగయ్య, గిరి, కుమారి, మాలతి, లింగమూర్తి మొ..

ఆనంద్ వారాల పుస్తకం ’సినీ సుమాలు’ నుంచి ఈ వ్యాసాన్ని సేకరించి తెలుగు యూనికోడ్ లోకి మార్చినందుకు జ్యోతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

3 Comments
  1. పరుచూరి శ్రీనివాస్ February 24, 2009 /