Menu

నిళల్ కుత్తు(షాడో కిల్)-మరో సమీక్ష

ఉపోధ్ఘాతం:

హత్యచేయడం నేరమే!కాని ఒక వ్యక్తిని చంపిన కారణంచేత హంతకుణ్ణి చంపేస్తే, అతన్ని చంపినందుకు ఎవర్ని శిక్షించాలి?
చావుకు చావే సమాధానమా?
ఒక వేళ మరణశిక్ష అమలయ్యాక హంతుకుడు నిర్దోషి అని తెలిస్తే పోయిన ప్రాణాన్ని తిరిగి తేగలమా?
అసలు మరణశిక్ష అవసరమా?
ఇలాంటి ప్రశ్నలు మీ మస్కిష్తంలో ఎప్పుడైనా ఉదయించాయా? అయితే అదూర్ గోపాల కృష్ణన్ దర్శకత్వం వహించిన నిళల్ కుత్తు  (shadow kill)సినిమా చూడండి.పై ప్రశ్నలన్నంటికీ ఈ సినిమాలో సమాధానం దొరక్కపోవచ్చు గానీ, మనసున్న ఏ మనిషిలోనైన ఇలాంటి ప్రశ్నలను రేపగల సత్తా గల సినిమా నిళల్ క్కుత్తు.

కథ:

ఒక దారినపోయే దానయ్య కి అనుమానం వచ్చింది. ‘ఒక హంతకునికి మరణశిక్ష విధించినప్పుడు, ఆ వ్యక్తి మరణానికి బాధ్యత ఎవరు వహిస్తారు? శిక్ష విధించే రాజు గారా? లేక శిక్ష అమలుపరిచే ఉరితీసే వ్యక్తా?’ అని. ఆదే విషయాన్ని మరో దారిన పోయే దానయ్య తో వెలిబుచ్చాడు. అందుకు సమాధానంగా ఆ రెండో వ్యక్తి ఇలా సమాధానం చెప్పాడు. ‘రాజు తెలివిగలవాడు.ఉరిశిక్ష విధించిన వ్యక్తికి చివరి నిమిషంలో క్షమాభిక్ష పెట్టి తన పాపాన్ని తెలివిగా కాలరాసేస్తాడు. కానీ ఈ సమాచారం కారాగారం చేరేలోపే ఉరి అమలైపోయివుంటుంది. ఈ విధంగా రాజు, ఒక వైపు తన పాపమేది లేకుండా చూసుకుంటూనే, మరో వైపు శిక్ష సక్రమంగా అమలయ్యేలా కూడా చూస్తున్నాడు.’

మరి అలాంటప్పుడు హంతకుని మరణానికి అమాయకుడైన ఉరితీసే వ్యక్తి పాపం మూట కట్టుకోవాలా? ఇలాంటి భయంతోనే తన జీవితమంతా గడిపిన ఓక ఉరితీసే వ్యక్తి కథే నిళల్ క్కుత్తు.

తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం కలియప్పన్ ఉరితీసే వ్యక్తి గా తన ధర్మాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. కాని సాటి మనిషి ప్రాణాలని తన చేతుల్తో తీసుకుంటున్నందుకు మనసులో తీవ్రంగా కుంగిపోయి తాగుడుకి బానిసవుతాడు. మరో వైపు కాళీ మాతే తన ద్వారా ఇవన్నీ చేపిస్తుందని నమ్ముతూ కాస్తంత ఊరట చెందుతాడు.

చాలా నాళ్ళగా ఖాళీగా ఉన్న కలియప్పన్ చేతుల్ని మరోసారి రక్తసిక్తం చేయడానికి రాజు దగ్గర నుండి ఆహ్వానం అందుతుంది.అసలే వయసు మీరిన కలియప్పన్ ఈ సారి మరో మరణశిక్షను అమలు పరిచగలడా? ఈ సారి హంతకుడు చేసిన నేరమేమిటి? అతను నిజంగానే దోషా? ఒక వేళ నిర్ధోషి అని తెలిసినా రాజు మాటకు ఎదురు చెప్పగల ధైర్యం కలియప్పన్ లో ఉందా? అని తెలుసుకోవాలని ఉంటే ఈ సినిమా తప్పక చూడవలిసిందే!

విశ్లేషణ:

2002వ సంవత్సరం లో విడుదలైన నిళల్ క్కుత్తు (shadow kill),దర్శకత్వపరంగా గానీ, కథాపరంగా గానీ, సాంకేతికంగా గాని, చిత్రానువాదం విషయంలో గాని ఏ మాత్రం రాజీ పడకుండా అంతర్జాతీయ సినిమాలకు ధీటుగా నిర్మింపబడిందనడంలో అతిశయోక్తి లేదు.

మరణశిక్ష గురించి చర్చిస్తూ గతంలో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ అందులో ఎక్కువ శాతం మరణశిక్ష విధింపబడ్డ నిందితుని భావోద్వేగాలపై కేంద్రీకరించబడ్దవి. అందుకు విరుధ్ధంగా ఈ సినిమా ద్వారా ఉరితీసే వ్యక్తి హృదయం లోతుల్లోకి మనల్ని తీసుకువెళ్ళి అతని బాధాపేశాల్ని మనకు పరిచయం చేయడంలో అదూర్ సఫలం కాగలిగారు.

ఇలాంటి సినిమాలను ‘art’సినిమాగా వర్గీకరించి, వీటిలో కన్నీళ్ళు, కష్టాలు తప్ప మరేమీ ఉండవని తక్కువ చేసి చూడడం మూలాన, గతంలో ఇలాంటి సినిమాలు మనకు అంతగా అందుబాటులో ఉండేవి కాదన్నది నిజం.కానీ నేడు ఇలాంటి సినిమాలు dvdల ద్వారా మనందరికి అందుబాటులో ఉన్నాయి. కళాతృష్ణ కలిగిన వారెవ్వరైనా తప్పక చూడవలిసిన చిత్రాలలో అదూర్ గోపాల కృష్ణన్ సినిమాలు ముందుంటాయి.

ఇలాంటి సినిమాల్లో ఏముంటుందని అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తారని అనుమానం చాలామంది వెళ్ళబుచ్చడం సాధారణంగా వింటుంటాం. ఒక పాటా లేదు, ఒక ఫైటూ లేదు , ఇదేం సినిమా అని చాలా మంది అభిప్రాయం. సంగీతం, సాహిత్యం లాగే సినిమా కూడా ఒక కళ అని నమ్మేవారేవరైనా ఈ సినిమాలో ఏముందో గ్రహించడానికి ఎంతో సమయం పట్టదు. నాకు తెలిసి ఈ సినిమా లో స్క్రీనేప్లే అత్యంత ప్రత్యేకమైనది. ఇంతకుముందు వచ్చిన ఏ సినిమా లోను లేనటువంటి కథాగమనం ఈ సినిమాకు ప్రత్యేకం.

సినిమా అంటే నిజజీవితానికి దూరంగా నిర్మింపబడ్డ ఒక అసత్యప్రపంచం కాదు. మన జీవితాల్లోంచి పుట్టుకొచ్చిందే సినిమా. మన రోజు వారీ జీవితాన్ని యధాతథంగా చిత్రించడం సినిమాలయొక్క ఉద్దేశం కాకపోయినప్పటికి, అర్థం లేని మాటలు , తర్కానికందని కథలు, సహజసిధ్ధ్దమైన స్వభావం లేని పాత్రలతో నిండీ పోయిన నేటి సినిమాలకు దూరంగా జీవితంలోని భావావేశాల్ని మనముందుంచే సినిమాలు మన ఆదరణలేకపోతే కష్టమే.
అదూర్ గోపాల కృష్ణన్ గురించి:

ఇటాలియన్ సినిమా ‘bicyle theives’ తో మొదలైన ‘neo-realism’, ఫ్రెంచ్ సినిమా ‘À bout de souffle’ ద్వారా మొదలయిన ‘new-wave’ అనే సినిమా ఉద్యమాలచే ప్రేరణ చెంది 1972 లో స్వయంవరం చిత్రం ద్వారా చలనచిత్ర పరిశ్రమ లో అడుగుపెట్టి ఇప్పటివరకూ తొమ్మిది చలనచిత్రాలు, మరో ఇరవైకి పైగా లఘచిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాలు సృష్టించి, నాలుగు సారి జాతీయ స్ఠాయి లో అత్యుత్తమ దర్శకునిగాను, మూడు సార్లు అత్యుత్తమ కథారచయితగాను అవార్డులు అందుకున్నఘనత కలిగిన అత్యుత్తమ దర్శకుడు అదూర్ గోపాల కృష్ణన్.

14 Comments
 1. ravi May 29, 2008 /
 2. శంకర్ May 29, 2008 /
 3. Uttara May 29, 2008 /
 4. Sowmya May 30, 2008 /
 5. Sai Brahmanandam Gorti February 7, 2009 /
  • రవి February 7, 2009 /
   • విజయవర్ధన్ February 7, 2009 /
   • విజయవర్ధన్ February 7, 2009 /
   • విజయవర్ధన్ February 7, 2009 /
 6. విజయవర్ధన్ February 7, 2009 /
 7. విజయవర్ధన్ February 7, 2009 /