Menu

సాహెబ్ బీబీ ఔర్ గులాం

సహచర్యం, ఎడబాటు, ప్రేమ, విరహం, భావుకత గాంభీర్యం కలగలిసిన మనుషులూ, మానవ సంబంధాలూ గురుదత్ చిత్ర లక్షణాలు. నటుడు, నిర్మాత, దర్శకుడిగా 21 ఏళ్లపాటు చిత్రసీమలో వెలుగొందిన గురుదత్ హృదయావిష్కరణ చేయడంలోనూ, తన ఆలోచనలనీ, అనుభూతులనీ దృశ్యమానం చేయడంలోనూ తనకు తానే సాటి. హిందీ చిత్రసీమ స్థాయిలో గమనిస్తే గురుదత్ ఎనలేని భావుకత కలిగిన అద్భుత చలన చిత్రకారుడు. ముఖ్యంగా ఆయన ప్యాసా, కాగజ్ కే ఫూల్, సాహిబ్ బీబీ ఔర్ గులాం తదితర చిత్రాలు భారతీయ చలన చిత్రసీమలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించాయి.

కాగజ్ కే ఫూల్ తర్వాత తన చిత్రాలకి దర్శకుడిగా తన పేరు కాకుండా మరొకరిని పెట్టడం ఆనవాయితీగా చేసుకున్న గురుదత్ దార్శనికత ఆయన నిర్మించిన అన్ని చిత్రాల్లో సుస్పష్టంగా కల్గిస్తుంది. తన రచయితతోనూ, టెక్నీషియన్లతోనూ సంపూర్ణమైన సమన్వయంతో పనిచేసి గురుదత్ ప్రేమాస్పదమైన చిత్రాలకి రూపకల్పన చేశారు. అలాంటి చిత్రాల్లో ఒకటి ‘ సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ 19వ శతాబ్దం నాటి ఓ జమిందారి కుటుంబంలో చోటీబహు అనుభవాల్ని, ఆమె ఎదురుతిరిగీ, తనని తాను ఆర్పించుకున్న సందర్భాన్ని ఇందులో అద్భుతంగా చిత్రించారు.

ఆనాటి జమిందారీ కుటుంబమంటే పెద్ద పెద్ద గదులున్న కోటలాంటి ఇళ్లు, నిరంతరం విరామంగా ఉండే అందమైన స్త్రీలు వారి అలంకరణలూ, ఎప్పుడూ మత్తులొ ఓలలాడుతూ మందులోనూ, పొందులోనూ మునిగి తేలుతూ ఉండే పురుషులూ వారి అధికార దర్పామూ, వారి భవంతుల కావల ఆకలి శ్రమ వేదనల తోడుగా నివసించే కష్టజీవులైన రైతులూ ఈ వాస్తవ దృశ్యాల్ని ఇముడ్చుకున్న బెంగాలీ కథను పూర్తి స్థాయిలో చలన చిత్రంగా మలిచాడు గురుదత్.

బెంగాల్లో 19వ శతాబ్దంలో చౌదరీలది గొప్ప పేరున్న కుటుంబం. మజిల్ బాబు, చోటేబాబుల ఆధిపత్యంలో సాగే ఆ కుటుంబం ఓ పెద్ద హవేలీలో నివాసముంటుంది. ఇద్దరు సోదరులూ తమకు వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తిపాస్తుల్ని అనుభవిస్తూ ఉండడంతోపాటు మందులో తేలియాడుతూ క్రీడలు, వేశ్యాస్త్రీల సంపర్కమూ తదితరమైన విలాసవంతమైన అలవాట్లతొ కాలం గడిపేస్తూ ఉంటారు. ఇదంతా అలాంటి గృహాల్లో సర్వసాధారణం. అక్కడ ఏదీ అతికాదు. ఏదైనా ఆంగీకారమే. ఏళ్లుగా తరాలుగా వస్తున్న వారి కుటుంబ సామాజిక స్థితి పట్ల ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండదు. ముఖ్యంగా ఆ ఇంట్లో నివసించే స్త్రీలు తమ పురుషుల అలవాట్ల పట్ల ప్రవ ర్ తనలపట్ల ఉద్దాసీనంగా ఉండడం అలవాటు చేసుకుంటారు. కాని చోటే బాబు భార్య చోటీ బహు మాత్రం హవేలీలోని వాతావరణం భరించలేకపోతుంది. సున్నితమైన ఆమె మనస్సు విలవిల లాడిపోతుంది. కేవలం మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె తన భర్త తనను అలక్ష్యం చేస్తున్నాడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. తీవ్రమైన ఒంటరితనాన్ని , నిరాదరణను అనుభవిస్తున్న ఆమె సొంత ప్రపంచంలోకి ఓ కొత్త వ్యక్తి రాక సంచలనం కలిగిస్తుంది. ఆ హవేలీలో పనిచేసే తన బంధువు వద్ద ఉండడానికి వచ్చిన భూత్‌నాధ్ ఆమెలో చలనం కలిగిస్తాడు. దయాళువు, ప్రేమాస్పదుడూ అయిన భూత్‌నాధ్ చోటీ బహును విపరీతంగా ఆకర్షిస్తాడు. మోహిని సింధూర్ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. కంపెనీ యజమాని కూతురు జాబాతో భూర్‌నాధ్‌కి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కంపెనీ నుంచి సింధూర్ తెచ్చి ఇస్తూ ఉండడంతో భూత్‌నాధ్‌కి చోటీ బహూతో పరిచయ పెరుగుతుంది. తన భర్తను తనవైపునకు ఆకర్షించేందుకు చోటీ బహూ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమౌతాయి. కానీ ఒకరోజు చోటేబాబు, చోటీబహూల మధ్య మాటామాటా పెరుగుతుంది. ఆ వాదనలో చోటీబహూని తాగి చూడమని చాలెంజ్ చేస్తాడు బాబు. ఆ సంఘటన ఆమెలో పట్టుదలని పెంచుతుంది క్రమంగా తానూ తాగడం అలవాటు చేసుకుంటుంది. ఆ అలవాటు కాస్తా వ్యసనంగా మారే స్థితికి చేరుతుంది. భూత్‌నాధ్ ఆమెను అనేకవిధాలుగా ఓదర్చేందుకు, మామూలు మనిషిని చేసేందుకు ప్రయత్నిస్తాడు. కాని అవేవీ ఆమెను మార్చలేకపోతాయి. కానీ భూత్‌నాధ్ చోటే బహూల మధ్య సాన్నిహిత్యంపై హవేలీలోని వారికి అనుమానం కలుగుతుంది. వారు చోటీ బహూపై అనుమానం పెంచుకుని కుటుంబ గౌరవం అంటూ తలచి ఆమెను చంపేసి, భూస్థాపితం చేస్తారు.

చిత్రం మొత్తంలో ఫ్లాష్ బ్యాక్‌లో సాగే ఈ సినిమాలో చోటీ బహూ పాత్రను పోషించిన మీనాకుమారి నటన అత్యంత ఉన్నతంగా సాగుతుంది. ఆనాటి హిందీ చలన చిత్రసీమ విలువలమేరకు, లేదా ఆనాటికి ఉన్న చిత్రీకరణ స్థాయి మేరకు ఆలోచిస్తే ‘సాహెబ్ బీబీ ఔర్ గులామ్’ లో ఓ స్త్రీ పాత్ర, అందునా హవేలీ గోడల్లో ఉండే స్త్రీ పాత్రను తాగుబోతుగా చిత్రించడం అసాధారణమూ, ఆధునికమూ అనే చెప్పుకోవచ్చు.

ఈ చిత్రంలో కూడా గురుదత్ తన ఇతర సినిమాల్లోలాగే రెండు భిన్న స్థాయిల్ని ప్రొజెక్ట్ చేస్తాడు. ప్రధాన ఇతివృత్తం స్రవంతి హవేలీలోనూ చోటీబహూ అంతరంగంలోనూ నడుస్తూ ఉంటే మరోవైపు భూత్‌నాధ్ ఫ్యాక్టరీ జీవితం హాస్యం, జాబాతో ప్రేమ వ్యవహారం అంతా అక్కడ కొనసాగుతూ ఉంటుంది . అంటే హిందీ చిత్రసీమ ఆనవాయితీ మేరకు ప్రేమ, హాస్యం, రోమాన్స్, పాటలు అన్నీ భూత్‌నాధ్ జీవితంలో కనిపిస్తే, సీరియస్ విషయాల్ని ప్రధాన ఇతివృత్త అంశాల్ని మరో కోణంలో చిత్రించాడు గురుదత్.

హవేలీ వాతావరణానికి ఎదురుతిరిగిన చోటీబహూ తనని తాను సమిధలా చేసుకొని తనువు చాలించుకుంది. చిత్రీకరణలో కాని, కథను నడిపించడంలో కాని గురుదత్ ప్రతిభ సుస్పష్టంగా కనిపిస్తుంది. భూత్‌నాధ్ హాస్యం కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ చోటీబహూ మానసిక, కుటుంబ సంఘర్షనాత్మక చిత్రంగా ‘సాహెబ్ బీబీ ఔర్ గులామ్’ చాలా గొప్ప చిత్రం. గురుదత్ సృష్టించిన ఆణిముత్యాల్లో ఇదొకటి.

కథ : బిమల్ మిత్ర

సంగీతం : హేమంత్ కుమార్

దర్శకత్వం : అబ్రార్ అల్వి

నటీనటులు : గురుదత్, మీనాకుమారి, రెహ్‌మాన్, నాజర్ హుస్సేన్ మొ…

One Response
  1. Pradeep February 9, 2009 /