Menu

రెవల్యూషనరీ రోడ్

అసలీ సినిమా గురించి వ్రాయడం వేస్ట్. అలా అని ఈ పేరుతో వచ్చిన సినిమా కానీ పుస్తకం కానీ వేస్ట్ అని కాదు నా ఉద్దేశం. నాకు తెలిసిన వాళ్ళకయితే బలవంతంగా ఈ సినిమా చూపించాను. బలవంతంగానైనా పుస్తకం చదివేలా చేశాను. రెండూ అంతగా నచ్చాయి నాకు. కాకపోతే ఈ సినిమా గురించి గానీ పుస్తకం గురించి గానీ వ్రాయడం ఎందుకు దండగ అన్నానంటే కొన్నింటి గురించి ఎంత చెప్పినా వ్రాసినా ఆయా పుస్తకాలో సినిమాలో చూసినప్పుడు కలిగిన అనుభూతి మాటల్లో పెట్టడమో ఇలా సమీక్షించడమో చాలా కష్టమని నా అభిప్రాయం.

ఈ సినిమా ఈ మధ్యనే విడుదలయింది. అస్కార్ అవార్డులకు సైతం కొన్ని వర్గాల్లో నామినేట్ అయ్యింది కాబట్టి ఎలాగోలాగా ఈ సినిమా చూసే ప్రయత్నం చేయండి. లేదా ఇంకా మంచి పని మీ దగ్గరున్న బుక్ షాప్ లేదా లైబ్రరీలో రెవల్యూషనరీ రోడ్ నవల తెచ్చుకుని చదవండి. మీరు ఇండియా లో ఉన్నట్టయితే ఈ పుస్తకం ఎక్కడా దొరకటం లేదు. కాబట్టి ఎక్కడ దొరుకుతుందో చెప్పలేను. బ్రిటన్ లో అయితే మొన్నీ మధ్యే ఏదో వార్తాపత్రికతో పాటు ఈ పుస్తకాన్ని ఉచితంగా ఇచ్చారు. అమెరికాలోనూ ఈ పుస్తకం అన్ని పుస్తకాల షాపుల్లో దొరుకుతుందొచ్చు. ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా గురించి, పుస్తకం గురించి ఏమీ తెలుసుకోకుండా చూస్తే/చదివితే బావుంటుంది.

పైన చెప్పిందంతా చదివి కూడా ఇంకా చదువుతున్నారంటే మీకు ఈ సినిమా/పుస్తకం గురించి మరిన్ని వివరాలు కోరుకుంటున్నట్టున్నారు. అయితే సరే. పెద్దగా స్పాయిలర్స్ లేకుండానే ఈ సినిమా గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను.

ఒక పాతికేళ్ళ కుర్రాడిని తీసుకోండి. కుర్రాడు అప్పుడే కాలేజి నుంచి బయటపడి కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. కుర్ర వయసు కదా భవిష్యత్తంటే భయం లేదు. అప్పుడే జీవితమనే భారం మోయాల్సిన అవసరమూ లేదు. జీవితంలో ఏదైనా చేయొచ్చనే ధైర్యం, భవిష్యత్తుని శాశించి తన దాన్ని చేసుకోవాలనే కలలు అతని సొంతం.

ఇప్పుడు పాతికేళ్ళు నిండని ఒక అమ్మాయిని తీసుకోండి. ఆమెకి కళల పట్ల ఆసక్తి. జీవితంలో పెళ్ళి చేసుకుని ఇద్దరు ముగ్గురి పిల్లలు కని సంసార జీవితంలో సెటిలయిపోదామని కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనీ, ఒక మంచి కళాకారిణి గా పేరు గడించాలనీ ఆమె కల.

ఇప్పుడు ఆ అబ్బాయిని. అమ్మాయిని ఒక దగ్గరకు చేర్చండి. ఇద్దరూ సరైన జోడి. ప్రేమలో పడ్డారు. ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ. తమ తమ భవిష్యత్తు గురించి గంటలు గంటలు మాట్లాడుకుంటూ గడిపేశారు. తమ జీవితం గురించి ఎన్నో కలలు కన్నారు. కొన్నాళ్ళు ఈ కలల జీవితంలో గడిపాక ఇక ఆ కలలు నిజం చేసుకోవాలనుకున్నారు. పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళంటే మాటలా. ఉండడానికి ఇల్లు కావాలి. ఇల్లు కావాలంటే డబ్బులు కావాలి. ఆ అబ్బాయి ఎలాగో ఒక ఉద్యోగం సంపాదించాడు. ఈ లోగా వాళ్ళకొక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను చూసుకుని మురిసిపోయారు. ఆ అబ్బాయి ఉద్యోగం బాగానే ఉంది. అమ్మాయి కి పిల్లాడితోనే సరిపోతుంది. ఈ లోగా మరో బిడ్డ. ఈ సారి అమ్మాయి.

అయిపోయింది, అంతా అయిపోయింది. భవిష్యత్తు గురించి కన్న కలలు మర్చిపోయారు ఇద్దరూ. సంసార సాగరం ఈదడంలో బిజీ అయిపోయారు. ఇలా మరి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఇద్దరూ ముప్పైల్లో పడ్డారు. చాలా కుటుంబాల్లో లాగే ఈ ’స్మాల్ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలి’ లో కూడా చిన్న చిన్న గొడవలు తప్పితే అంతా బావుందన్న ఒక ఫీలింగ్. ఇంతవరకూ బాగానే ఉంది.

అంతా బావుంటే కథేముంది?

అనుకోకుండా జరిగిన ఒక సంఘటన కారణంగా మర్చిపోయిన గతమంతా ఆ ఇంటావిడకి గుర్తొచ్చింది. పదేళ్ళ క్రితం ఏం చెయ్యాలనుకుని ఇద్దరూ చేతిలో చెయ్యేసుకుని ప్రయాణం మొదలుపెట్టారో తిరిగిచూసుకుంది.ఎక్కడ దారి తప్పారో ఎప్పుడు దారి తప్పారో తెలియదు కానీ మొత్తానికి తమ కలలకు చాలా దూరంగా వేరే లోకంలో ఉన్నారని తెలుసుకుంటుంది. భర్తతో మాట్లాడి మళ్ళీ తమ ప్రయాణం మొదలుపెట్టి తమ కలలలోకం చేరుదామంటుంది. రెవల్యూషనరీ రోడ్ సరిగ్గా ఇక్కడే మొదలవుతుంది. అయితే మరో రచయిత అయితే ఇక్కడ నుంచి ఒక మంచి ఇన్స్పిరేషనల్ కథను మనకు చూపించుండేవాడేమో కానీ ఇక్కడ రచయిత రిచర్డ్ యేట్స్. అమెరికన్ ప్రజల సాధారణ జీవితాల్లోని బాధను అనుభవించి, వారి బాధలను తనవి చేసుకుని బాధపడుతూ వ్రాసిన యేట్స్ రచనల గురించి ఒక్క మాటల్లో చెప్పాలంటే ’గుండెలు పిండేస్తాడు’. ఎందుకో తెలియదు కానీ ఈ పుస్తకం అందరికీ కాకపోయినా కొద్దిమందికైనా లైఫ్ చేంజింగ్ పుస్తకమని నా నమ్మకం.

ఇక అంతటి బాధాకరమైన సబ్జెక్ట్ ని తీసుకెళ్ళి శామ్ మెండిస్ కిస్తే ఏం చేస్తాడు? అమెరికన్ బ్యూటి ద్వారా మనల్ని ఏడిపించిన మెండిస్ ఈ సినిమాతో మనసుల్ని ఒక రేంజ్ లో కదిలిస్తాడు. ఈయన దర్శకత్వానికి తోడు కేట్ విన్స్లెట్, లియనార్డో డి కాప్రియో, మైఖేల్ షానన్ అద్భుతమైన నటన తోడైతే ఇక ఈ సినిమా ఒక మాస్టర్ పీస్ కాకుండా ఎవరు ఆపగలరు?

ఆపగలరు. రివల్యూషనరీ రోడ్ ఒక నవలగా 10/10 ఇవ్వొచ్చు. కానీ సినిమా అన్ని విషయాల్లో అత్యద్భుతంగా ఉన్నా ఒక్క విషయంలో మాత్రం స్క్రీన్ ప్లే రచయిత పెద్ద తప్పు చేశారు. అదేంటో కొన్నాళ్ళ తర్వాత చర్చిద్దాం. ఆ ఒక్క విషయాన్ని వదిలేస్తే ఈ సినిమా తప్పక చూడాల్సిన సినిమా. ముఖ్యంగా వయసులో ఉండగా ఏదో చెయ్యాలని, సాధించాలని కలలు కని ఇప్పుడు పెళ్ళయి పిల్లలతో సంసార సాగరమీదుతూ అప్పుడప్పుడు మీ గతం ఫ్లాష్ లా మెరుస్తూ గుర్తొస్తూ ఉంటే ఈ సినిమా మీ కోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

4 Comments
  1. శంకర్ February 7, 2009 /
  2. shree February 9, 2009 /
  3. davidraj March 9, 2009 /