Menu

ఓ నిర్మాత కధ

cartoonనా పేరు సింహాచలం అండీ. మా ఊరు పాలకొల్లండి. నాకు ఓ వంద ఎకరాల మాగాణి ఉండేదండి. నలుగురు పిల్లలతో కడుపులో చల్ల కదలకుండా చక్కగా గడిచిపోయేదండి. మా ఆవిడ పే రు సావిత్రి అండీ. నాకు అక్క కూతురే నండి. చిన్నప్పటి నుంచి తెల్సినదవ్వటం వల్ల నా మీద చాలా డామినేషనేనండి. ఏదో పైలాపచ్చీసు గా నడిచిపోతున్న నా జీవితం లో కొరివి పెట్టింది నా తోడల్లుడే నండి, నాపాలిట తోడేలు గాడు.

సంక్రాంతికి మా బావ గారు అదే మామ గారింటికి వెళ్ళామండి. మా తోడల్లుడు వచ్చి వాళ్ళ అన్న కొడుకు రాజు, సినిమా ప్రోడక్షన్ చేస్తున్నాడని తెగ వర్ణించి చెప్పాడండి సినిమా మొదలు పెట్టగానే కోటి రూపాయల లాభం ట. వీడు నయాపైస పెట్టుబడి పెట్టలేదట. పైగా నన్ను పక్కకి పిలిచి మరీ చెప్పాడండి. వాడు హీరోయిన్ కి చాలా క్లోజుట. ఇద్దరు కలసి సింగపూరు వెళ్ళి వచ్చారట. ఈ విషయం వినగానే నాకు చాలా కుళ్ళేసిందండి. ఆడేమి నా కంటే అందగాడు కాదు.

కానీ తర్వాత అసలు చిక్కు వచ్చిపడిందంది. మా అక్క మా ఆవిడ కలసి మా బావ ని నన్ను ఉతికి ఆరేశారండి. ఎందుకు మీ బతుకులు..పాలకొల్లు లొ చావటానికా.. పదండి హైదరాబాదు పోదాము. అక్కడ మీరిద్దరు కలసి ఓ మంచి సినిమా తియ్యాలి.. రాఘవేంద్ర హీరో గా సత్యభామ హీరోయిన్ గా. వాళ్ళిద్దరే టాప్ గదండి అందుకని. మేం ఇద్దరం చెప్పాండి.. ఒసే ఎర్రి మొఖాలు ఇది మన వల్ల అయ్యేపని గాదులే అని. వింటే నా నండి. విషయం ఎంతవరకు వెళ్ళిందంటే మా యావిడ విషం తాగేంతవరకు.. చివరికి మా బావ తెలివిగా నన్ను బుట్టలో పడేశాడండి. ఒరే సింహం నువ్వన్నా ఇంటర్మీడియట్ చదివావు.. నాకు అంత తెలివిలేదు గదా. అందుకని నువ్వెళ్ళి సినిమా తియ్యి. నేను ఇక్కడ పొలం పనులు చూసుకుంటాను. మీ యావిడ అక్కడా ఇక్కడా తిరుగుతుంది అని.

సరే చెయ్యగలిగింది ఏముంది. ఛలో హైదరాబాద్ అని నర్సాపురం ఎక్స్ ప్రెస్ ఎక్కేశాను.

హైదరాబాద్ లో చక్రవర్తి అనే వాడి ని మా తోడల్లుడు వాళ్ళ అన్న కొడుకు పరిచయం చేశాడు. అరే బాబాయ్ ఈయనకి సినిమా ఫీల్డ్ లో అంతా తెలుసు. నీకు తెలియని వన్ని తెలుసుకో అని. పాపం మంచోడే లెండి. నన్ను స్టూడియో లకి తీసుకెళ్ళి షూటింగ్ లు చూపించాడు. చాలా మందికి కొత్తప్రొడ్యూసర్ అని పరిచయాలు చేశాడు. కొంత మంది హీరో, హీరోయిన్లకు చేతులు కలిపించాడు. కాని హీరోయిన్ రీటా ని చూసి దిమ్మదిరిగి పోయిందండి. సినిమా తీస్తే ఈ పిల్ల తోనే అనే నిర్ణయానికి కూడా వచ్చేశాను. ఆపిల్ల కూడా నవ్వుతూ బాగానే మాట్లాడిందండి. కావాలంటే సెక్రట్రీ ని కల్సుకోండి అని.

ఇంతలో అసలు ఎదవ తో పరిచయం అయ్యిందండి. డైరెక్టరు రణధీర్. ఈడు నాలుగైదు మంచి సినిమాలే తీశాడు లెండి. సాయంకాలం అన్నపూర్ణా లో సినిమా ఫంక్షన్ కి రండి అక్కడ మాట్లాడు కొందాము అని. అసలే కొత్త పిచ్చోడుని కదండి ఎగేసుకుంటూ వెళ్ళాము. ఆహా ఏమి ఆ పార్టీ అండి.. నాకు తెల్సిన సినిమా వాళ్ళందరిని చూశాను. వీళ్ళందరు నా వాళ్ళు.. ఇక నా జీవితం వీళ్లతోనే అనుకున్నా. తర్వాత రణధీర్ తో మాట్లాడాము. సినిమాకి పది కోట్లు తీసుకు రమ్మన్నాడు. నాకు మతి పోయింది. రాజు గురించి చెప్పాండి, పైసా పెట్టకుండా కోట్లు సంపాదించాడని. ఆడు నవ్వేసి ముందు నువ్వు కనీసం రెండు కోట్లు తీసుకురా. సినిమా మొదలు పెట్టుదాము. బయ్యర్లు ముహూర్తానికి డబ్బు సంచులతో వస్తారు. అంతే నీ రెండు కోట్లు వెనక్కి తీసుకుపో. నాలెక్కలో నీకు కనీసం పదికోట్లు మిగులుతాయి ఈ సినిమా పూర్తయ్యేసరికి అని. నాకు కళ్ళు తిరిగాయి. కానీ రెండు కోట్లు కావాలి గదా. రాత్రికి మా బావ తో మాట్లాడా. ఆయనేమి అన్లేదు గాని. మా అక్క మాత్రం ఓ యాభై ఎకరాలు అమ్మెయ్యంది రెండు కోట్లకి. పది కోట్లొస్తే రెండు వందల యాభై ఎకరాలు కొనొచ్చని చె ప్పింది. ఆడోళ్ళ లెక్కలే వేరండి. టక్ మని సలహాలిస్తారు. మా యావిడ పచ్చ జెండా ఊపటం వారంలో డబ్బు రావటం అంతా జరిగిపోయింది. ఇక్కడితో చక్రవర్తిని వదిలేశాను అదేనేమో నే చేసిన తప్పు.

రణధీర్ గాడి తో అగ్రిమెంట్ రాసుకున్నామండి. ఆడికి ఒక్కటిన్నర కోట్లు ఇవ్వాలి. హీరో రాఘవేంద్ర, రీటా తో నే సినిమాతియ్యాలని. మూడు నెలల్లో సినిమా పూర్తి చేసేటట్లు. అడ్వాన్స్ గా యాభై లక్షలకి తగ్గనన్నాడు. ఉన్నాయిగా వెంటనే ఇచ్చేశా. వాడికి నా విషయం అర్ధమయ్యింది. సింహం ఇక రీటా నీ కౌగిట్లో నే అన్నాడు. జాగ్రత్తయ్యో మా ఆవిడ వినగలదు అని తెగ నవ్వుకున్నాం..

మర్నాడు పొద్దున్నే రీటా ఇంటికి తీసుకెళ్ళాడు. డైరెక్ట్ గా చెప్పాడండి. మా ప్రొడ్యూసర్ కి మీరు బాగానచ్చారు. మీరు లేకపోతే ఈ సినిమా తియ్యరు అని. అలా నవ్వేసింది. కలుద్దాము లెండి అంది. సినిమాకి ఒప్పుకుంది.. అరవై లక్షలకి మాత్రం తగ్గనంది. పది లక్షల కాష్ ఓ పది లక్ష లకు చెక్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకున్నాము. ఆత ర్వాత ఓ వారం లోపు హీరో రాఘవేంద్ర తో పాటు మిగతా వాళ్లతో అగ్రిమెంట్లు రాసుకున్నాం. బాబోయ్ ఓ కోటి అడ్వాన్స్ ల కే అయిపోయింది.

రణధీర్ అన్నాడు. సింహం సింగపూర్ కి ఓ పది టికెట్లు బుక్ చేయించు అని. ఎందుకంటే స్టోరీ సిట్టిం గ్ అన్నాడు. ఇక్కడైతే కుదర్దు.. డిస్ట్రబెన్స్ అవుతుంది. అక్కడైతే మంచి పని అవుతుంది అని. నిజమే గదా అనుకున్నా. రైటర్ వాడి కి ఇద్దరు ఫ్రెండ్స్ రణధీర్ మరో ఇద్దరు అమ్మాయిలు నేను అంతా కలసి సింగపూరు వె ళ్ళాము. పది రోజులు పదిహేను లక్షలు ఖర్చు.. ప్రతి రోజు షాపింగ్ అని తి రగటం రాత్రికి తాగటం తప్ప కధ గురించి చర్చించింది నాకేమీ కనపడలేదు. అమ్మాయిలు హీరోయిన్ కావాలని ఆశ పడుతున్నారు. రణధీర్ చెప్పిందంతా చేస్తున్నారు. చివరికి ఓ రోజున అన్నాడు మన సినిమాలో వేషం ఇద్దాము అని. ఆరోజు రాత్రి మాత్రం ఓ అమ్మాయి నా రూమ్ లోనే పడుకొంది. చాలా సంతోషించా.. డబ్బు కు డబ్బు సుఖానికి సుఖం అని. అమ్మో మా ఆవిడకి తెలిస్తేనా.. వణుకు వేసింది. మర్నాడు అన్నాడు.. ఇది కొసరు మాత్రమే రీటా అసలు అని. చివరి రోజున రైటర్, రణధీర్ రూమ్ లో ఓ గంట తలుపేసుకుని కూర్చున్నారు. బయటికి రాగానే కధ సిద్దం అన్నారు. చాలా ఆనందం వేసింది. రైటర్ కి పాతిక లక్షలు ఇవ్వాలన్నారు. సినిమా పేరు “రక్తాక్షరాలు”. చాలా బాగుంది గదా. ఎప్పుడు రాని టైటిల్. పైగా వయొలెన్స్ లేని ప్రేమకధ అని చెప్పాడు.

తిరిగి వచ్చిన పది రోజులకి మారిషస్ కి పది టికెట్లు కావాలన్నాడు. మ్యూజిక్ సిట్టింగ్. మళ్ళీ మామూలే. పది రోజులు పదిహేను లక్షలు ఖర్చు.. ప్రతి రోజు షాపింగ్ అని తి రగటం రాత్రికి తాగటం తప్ప మ్యూజిక్ గురించి ఆలోచించినది నాకేమీ కనపడలేదు. ఈసారి వచ్చిన ఇద్దరు అమ్మాయిలతో నేను బాగానే గడిపాను. నాకూ నచ్చింది ఇలా ఊరు రావటం..మా ఆవిడకు తెలియనివ్వకుండా. పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి యాభై లక్షలట. ఏమిటో అందరు లక్షల్లోనే అడుగుతున్నారు. వీళ్ళకి వేయి లు తెలియదల్లేవుంది.

నెల అయిపోతోంది అనంగా ముహూర్తము పెట్టించాడు. చాలా మంది వచ్చారు. మంత్రి గారితో క్లాప్ కొట్టించాడు. మంత్రిగారు నన్ను పక్కకు పిలిచి రీటా బాగుంది. రాత్రికి గెష్ట్ హౌస్ కి పంపండి అన్నాడు. చాలా చిరాకు వేసింది. నేనేమన్నా బ్రోకర్ గాడినా. రణధీర్ తో చెప్పా. నే చూసుకుంటా అన్నాడు. తర్వాత తెలిసింది. సింగపూర్ పాప ను పంపించాడు అని. మంత్రి గారి వల్ల చాలా పనులు అవుతాయి.. షూటింగ్ పర్మిషన్ లు , సెన్సార్ గొడవలు వగైరాట.. కానీ ఘోరమైన విషయం ఏమిటంటే ఓ నలుగురు బయ్యర్లు వచ్చారు గాని ఎవ్వడు డబ్బు సంచీ తేలేదు. కానీ ఓ ఆరేడు రీళ్ళ సినిమా తీసిన తర్వాత సినిమా తప్పకుండా కొంటాము అన్నారు. ఈ మధ్య చాలా మంది సినిమాలు ప్రారంభించి డబ్బులు తీసుకుని పారిపోతున్నారు అందుకని వాళ్ళ జాగ్రత్త అని రణధీర్ అన్నాడు.

ఇక షూటింగ్ ఎలా జరిగేదంటే.. పొద్దున్న 9 కంతా అందరు వచ్చేవాళ్ళు. బ్రేక్ ఫాష్ట్.. నాలుగైదు రకాలుండేవి. ఒంటిగంటకి లంచి. సాయంకాలం టిఫిన్ ఓ పెళ్ళివారిల్లు లా ఉండెది. కానీ ఓ పేజీ కధన్నా షూట్ చే సేవారు గాదు. రణధీర్, రైటరు, మాటల రచయిత కూర్చుని డయిలాగులు ఆలోచించేవారు. ఈ పని ముందు ఎందుకు చెయ్యరో తెలిసేది గాదు నాకు. అడిగితే మూడ్ పోగొట్టుతున్నానని రణధీర్ తిట్టేవాడు. హీరో, హీరోయిన్ లు ఏదో బాతాఖానీ కొట్టుకుంటూ కూర్చునేవారు. అప్పుడప్పుడు విశ్రాంతి కావాలని మేకప్ రూమ్ లోకి వె ళ్ళి తలుపులు మూసుకుని కూర్చునేవారు. బయటికి రాగానే అలసిపోయామ్ అని వెళ్ళీపోయేవారు. ఇక ఆరోజు కి అంతే ప్యాకప్ చేసేవాళ్ళం.

ఈలోగా కాటరింగ్ వోడితో ఓ పెద్ద గొడవ. ఏరోజు మా షూటింగ్ లో అరవై మంది మించి లేరు. కానీ వాడు ప్రతిరోజు 200 మందికి బిల్లేసేవాడు. ఓ రోజున లెక్క అడిగేసరికి రంకెలు వేసుకుంటూ రణధీర్ తో అన్నాడు. ఏదో మీరు చెప్పారని కొత్త ప్రొడ్యూసర్ అయినా కాటరింగ్ కి ఒప్పుకున్నా. నన్ను అనుమానించాడు. ఇంకోళ్ళని చూసుకోండి అని. రణధీర్ నన్ను పక్కకు పిలిచి అలా అన్నీ పట్టించుకోకూడదు అని హుందాగా ప్రవర్తించమని చెప్పి వాడికి సర్ది చెప్పి పంపించాడు.

ప్రతిరోజు సాయంకాలం అయ్యేసరికి మందు పార్టీలు. అంతా చేరి రాత్రి ఒంటి గంట వరకు తాగి తందనాలు. ఏందిరా బాసూ అంటే అందరు మనం చెప్పిన మాట వినాలంటే ఇలాగే చెయ్యాలి లేక పోతే నువ్వు పీనాశోడివని అనుకుంటారు అని ఎక్కేసేవాడు. ఓస్ నిజమేకాబోలు అని రోజు రణధీర్ చెప్పినట్లు పార్టీలు ఇచ్చేవాడిని.

ఇలా ఓ పదిహేను రోజులయిన తర్వాత ముందు పాటల షూటింగ్ పూర్తిచేద్దాము యూరప్ కి ఇరవై టికెట్లు కొనమన్నాడు. నాదగ్గర డబ్బులేదన్నాను. బయ్యర్లను తెమ్మనమని చెప్పాను. అంత ఎత్తు ఎగిరాడు నామీద. నాలాటి వాళ్ళ వల్లే సినిమా లు ఆగిపోతున్నాయన్నాడు. డబ్బుతేలేకపోతే ఇంటి దారి పట్టమన్నాడు. నానాగోడవ అయ్యింది. ఇప్పుడు డబ్బు తేకపోతే అసలుకే ఎసరు వస్తుందని గమనించా. చేసేది లేక మా బావ కి ఫోన్ చేశా. మరోపాతిక ఎకరాలు బేరం పెట్టమని. ఈలోగా సంగతి తెల్సిన హీరో , హీరోయిన్ చెరో ఇరవై లక్షలు ఇస్తే గాని షూటింగ్ కి రామని కబురు. రణధీర్ కూడా పాతిక లక్షలు కావాలి లే కపోతే వేరే డైరెక్టరు ని చూసుకోమని గొడవ చేశాడు.

ఇక లాభం లేదనుకొని రణధీర్ ని తీసుకుని కంట్రీ క్లబ్ కి వెళ్ళా. ఆ రోజు నా జీవితం లో ఎప్పుడు తాగనంత తాగా. రణధీర్ కాళ్ళు పట్టుకొని ఏడిచా. డబ్బుల్లేవని. రణధీర్ అన్నాడు అరే సింహం నువ్వు నా వాడివయ్యా. నేను లేనా. రేపు ఆఫీస్ కి రా. అన్ని సంగతులు నేను చూస్తానుగా అని.

మర్నాడు నే వెళ్ళేసరికే అక్కడ ఓ నలుగురున్నారు. ఫైనాన్సియర్స్ అని చె ప్పాడు. నెలకు 6 శాతం వడ్డీ.. ఎన్ని లక్షలయినా ఇస్తారుట. కానీ ఓ కాగితం మీ ద సంతకం పెట్టాలి. సినిమా రిలీజు కాకముందే వాళ్ళ అప్పు తీర్చి తీరాలి. లేకపోతే సినిమా రిలీజు కాదు. లాబ్ నుంచి డబ్బాలు బయటకు రావు. నాకు చాలా భయం వేసింది. రణధీర్ అన్నాడు. భయమెందుకు సింహం సంతకం పెట్టెయ్యి. బయ్యర్లు డబ్బు ఇవ్వగానే వీళ్ళకి తిరిగి ఇచ్చెయ్యచ్చు. నేనున్నానుగా ఓ నెల ఆ మాత్రం ఓపిక లేదా అన్నాడు. రెండు కోట్లు తీసుకోమన్నాడు. మళ్ళీ మళ్ళీ ఎందుకని. వడ్డీ చాలా ఎక్కువయినా పరువు పోదులే అనుకున్నా. వాళ్ళు రణధీర్ గాడి పేరు చూసి మరీ డబ్బులు ఇచ్చారట లేకపోతే నాలాటి మొదటి సినిమా ప్రొడ్యూసర్ కి ఇవ్వరని నాకు చెప్పాడు.

యూరప్ టూర్ లొ రీటా కూడా ఉంటుందని సంతోషంగా ఉండమన్నాడు. ఆహో అనుకున్నా. నాలుగైదు దేశాలు వెళ్ళాం. పచ్చిక బయళ్ళు, కొండలు లో షూటింగ్ చేశాము. ఆ మాత్రం ఇండియా లో లేవా. మిగతా చోట్ల షూటింగ్ చెయ్యాలంటే డబ్బులు చాలా ఎక్కువ కట్టాలి పర్మిషన్ ల కోసం. ఎందుకు ఖర్చు అని వెనక్కి తగ్గానని చెప్పాడు. అటువంటప్పుడు ఎగేసుకుంటూ ఫారిన్ ఎందుకు వెళ్ళాలో నాకు అసలు అర్దం కాలేదు. ఇక రీటా విషయం. ప్రతీ రో జు హీరో ని అంటిపెట్టుకుని తిరిగేదే తప్ప మేమున్నామనే ధ్యాసే ఉండేది గాదు. ఓ రో జు ధైర్యం చేసి రణధీర్ ని అడిగా. ఓస్ ఇంతే గా అని రీటా దగ్గరికి వెళ్ళి ఇవాళ సింహం ని కరుణిస్తారా అన్నాడు. ఓ తప్పకుండా అని కనులు మిలమిలా మె రిపిస్తూ చె ప్పింది. ఆరోజు షూటింగ్ అవ్వగానే నా దగ్గరికి వచ్చి బయటకు వెళదామా అంది. నా ఆనందానికి అవధులు లేవు. ఇద్దరమ్ కలసి అలా నడుస్తూంటే ఎంత మజాగ ఉందో తెలుసా. దారిలో ఓ షాపింగ్ మాల్ లోపలికి వెళ్దామంది. చూస్తూండగానే ఓ నగల షాపులో దూరింది. ఓ నెక్లస్ చూపించి ప్లీజ్ కొనిపెట్టరూ అని గోముగా అడిగింది. ఓకే అనేశాను. బిల్లు చూసేసరికి కళ్ళు తిరిగాయి. 15000 యూరో లు అంటే దాదాపు పది లక్షలు. మేము అది తీసుకుని హోటల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆమెకు విపరీతమైన తలనొప్పి. ఏంచెయాలో తెలియక గుడ్నైట్ చెప్పి నా రూమ్ కి వెళ్ళిపోయాను. మధ్యరాత్రి నిద్ర పట్టక బయటకు వెళితే అప్పుడే రణధీర్ తో కలసి బయట నుంచి వస్తోంది. మర్నాడు మళ్ళీ వచ్చి బయటకు వెళదామని అడిగింది. బతుకు జీవుడా అని నాకే తల నొప్పని తప్పుకోవాల్సి వచ్చింది. రణధీర్ మటుకు అ విషయం మాట్లాడ కుండా జాగ్రత్త ప డేవాడు. ఆ ముచ్చట అలా ముగిసింది.

తిరిగి వచ్చాక మళ్ళీ టాకీ పార్ట్ షూటింగ్ మొదలు పెట్టాం. హీరో గారు ఓ రోజు వచ్చి మీ కిచ్చిన డేట్స్ అయిపోయాయి అన్నాడు. క్రిష్ణా రామా అని బతిమాలితే 10 రోజులకి 10 లక్షలు ఎగష్ట్రా అడిగాడు. పైగా అబిమానుల కోసం మరో రెండు పాటలు పెంచాలి అన్నాడు. రణధీర్ మాత్రం హీరో గారికి కోపం రాకూడదు ఓప్పుకో అంటాడు. అంటే మరో యాభై లక్షలకి నేను ముంపు. ఇద్దరు కలసి రీటా కి 2 లక్షలు మాత్రం ఇస్తే చాలన్నారు. చస్తానా ఒప్పుకోక.

ఓ రోజు షూటింగ్ బ్రహ్మండమైన సెట్ లో జరిగిందండి. రణధీర్ హుషారుగా వచ్చి 60 లక్షలు ఖర్చు అయ్యింది. ఎలా ఉంది అని అడిగాడు. గుండె లయ తప్పిందండి. పైగా ఓ పాటలో ఓ చరణంమాత్రమే షూట్ చేస్తున్నాడట అంటే ఓ రెండు నిమిషాలు మాత్రమే. దానికోసం అంత ఖర్చా అన్నాను. అంతే వాడికి విపరీతమైన కోపం వచ్చిందండి. తెగ అరిచాడు నామీద. ఆరోజు నుంచి నన్ను షూటింగ్ కి రావద్దని గొడవ. కాదంటే వేరే డైరెక్టర్ ని చూసుకోమని. ఏంటో సినిమా ఫీల్డ్ లో పతి వాడికి నిర్మాత అంటే లోకువ అండి. డబ్బులు పెట్టేవాడు వాడే అన్న సంగతి ప్రతివాడు మర్చిపోయి నిర్మాత డబ్బు తన సొంత డబ్బు లాగ ఖర్చు పెట్తారు.

పది రీళ్ల సినిమా తయారయ్యింది. కొనే నాధుడే లేడు. రణధీర్ మటుకు మార్కెట్ బాగులేదు. చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి. కంగారు పడకు అంటాడు. సినిమా పూర్తి అవ్వాలంటే ఇంకా కనీసం ఐదారు కోట్లు కావాలి. మా బావ ని కదపాలంటే భయం వేస్తోంది. వాళ్ళ దృష్టి లో నేను చేతకానివాడినయ్యాను. ఎందుకంటే రాజా గాడు పెట్టుబడి పెట్టకుండా కోటి పైగా సంపాదించాడాయె. మా ఆవిడ కూడా ఎకసెక్కంగా మట్లాడుతోంది. మరో విషయం తెలిసిన వాళ్ళందరి దగ్గరా తలో పది లక్షలు అప్పుచేశా. ఆ విషయం కాస్తా మా తోడేలు గాడు అందరికి చెప్పి నా పరువు మరీ తీశాడు. ఆ కోపంతో మా అక్క మాట్లాడటం లేదు. సర్లే సినిమా రిలీజు కానీ వీళ్ళందరికి జవాబు చెప్పచ్చు అని ఊరుకున్నా.

ఈసారి మా బావకు తెలియకుండా మిగిలిన పాతిక ఎకరాలు అమ్మేశా. అలా మొత్తం వంద ఎకరాలు హుష్ కాకీ అయిపోయాయి. మళ్ళీ ఫైనాన్సియర్స్ చుట్టూ తిరిగాను. ఈసారి 8% వడ్డీకి తీసుకున్నాను. మా వాళ్ళకు తెలియకుండా నా ఇల్లు కూడా తాకట్టు పెట్టేశాను. ఇదంతా రణధీర్ గాడికి చెపితే ఏం భయం లేదు బాసూ సినిమా సూపర్ గా వచ్చింది. పాటలు కూడా చాలా బాగున్నాయి. ఇక మనకు డబ్బే డబ్బు అని ఊదరగొట్టాడు.

ఇదిగో అదిగో అని సినిమా షూటింగ్ అయ్యిపోయిందండి. ఇక మ్యూజిక్, డబ్బింగ్ తదితరాల్లో నేను పడిన కష్టాలు చెపితే టైము సరిపోదులెండి. డిఐ చేయిద్దామనాడు లేకపోతే ఇంత చక్కగా వచ్చిన సినిమా కు అర్దం ఉండదన్నాడు. నిండా మునిగిన వాడికి చలేమిటండి. మళ్ళీ అప్పు తెచ్చాను అది పూర్తి అయ్యింది కానీ ఇంతవరకు కొనే నాధుడే కని పించలేదు. రణధీర్ ప్రెస్ మీటింగు పెట్టించాడు. సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు. నాలాటి ప్రొడ్యూసర్ ని చూడలేదన్నాడు. పూర్తి స్వాతంత్రం ఇచ్చినందుకు ధాంక్స్ చెప్పాడు. నేను కూడా రెచ్చిపోయి చాలా మంచి సినిమా తీసినందుకు ధాంక్స్ చెప్పాను. ఈ సినిమా వల్ల సమాజం ఎంతో నేర్చు కుంటున్నదని, మ్యూజిక్ సూపర్ హిట్ అని.. ఇంకా చాలా చాలా వాగేశాను. అయినా ఇంకా బయ్యర్లు ముందుకు రాలేదు.

ఇక లాభం లేదు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేద్దాము అన్నాడు. అమ్మో రిలీజ్ అయిపోతోందని బయ్యర్లు పరుగెత్తికొస్తారని ప్లాన్. మంచి మంచి ధియేటర్లలొ రిలీజ్ చెయ్యాలన్నాడు. తన పరపతి ఉపయోగించి అన్నిటిని రెడీ చేశాడు. కానీ బయ్యర్లు రాలేదు. రేపే రిలీజ్. లాబ్ నుంచి ప్రింట్లు బయటకు రాలేదు. అప్పులోళ్ళు అందరు కాగితాలతో లాబ్ దగ్గర నిలుచున్నారు. రణధీర్ నన్ను ఇంకా డబ్బు సర్దమంటున్నాడు. వల్లకాదని చెప్పా. అప్పులు ఇచ్చేవాళ్ళేలేరు. ఇక ఆఖరి ప్రయత్నంగా బయ్యర్లందరిని పిలిచి ఓ షో ఏర్పాటు చేశాము. ఇప్పటి వరకు నేను పూర్తి సినిమా చూడలేదండి. ఎప్పుడూ అప్పులకోసం తిరగటం, ఆలెక్క ఈ లెక్క చూడటం తప్ప నాకెక్కడి తీరిక ఉండేదండి.

ఓ యాభై మంది బయ్యర్లు నేను రణధీర్ అంతా కలసి చూస్తున్నామండి. నాకు కన్నీళ్ళు ఆగట్లేదు. సినిమా అంత బాగుందనుకొన్నారా లేక నేను పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది అనుకుంటున్నారా. కాదండీ బాబోయ్. ఇంత ఛండాలమైన సినిమా నేను ఎప్పుడు చూడలేదండీ. మ్యూజిక్ అంతా హిందీ పాటల కాపీ.. సినిమా కధ నేను ఐదు సార్లు చూసిన ప్రేమాభిషేకం అండీ. నాగేశ్వర రావు గారు నటించినది. కాస్త అటూ ఇటూ కధ మార్చాడు. అతుకులు బొతుకులుగా ఉంది. ఏమండి ఏమీ తెలియని నాకు సినిమా అంత ఛండాలంగా ఉంటే ఆ ఎదవ ఎన్నో సినిమాలు తీశాడు వాడికి తెలియదండి ఈ సినిమా చెత్తగా చేస్తున్నానని. నా ఖర్మ కాలి వీడి చేతుల్లో పడ్డాను. మా రాజు గాడు నయం సినిమా గొప్పగా ఆడక పోయినా కోటి సంపాదించాడు. నాకు పదికోట్లక్కరలేదండి. అప్పు లుతీరితే చాలు. మళ్ళీ ఈ సినిమాల జోలికి రాను. అరగంటలో బయ్యర్లు ఒకొక్కరు చల్లగా జారుకున్నారు. నేను రణధీర్ మిగిలామండి. అయ్యిపోయింది. నా జీవితం అంతమైపోతోందనిపిస్తోంది. కోపం ఆగలేదండి. రణధీర్ మీద పడి గట్టిగా కొట్టాను.. నా కొడకా నన్ను ముంచావు గదరా అని. తిట్టిన తిట్టు తిట్టకుండా నాకొచ్చిన బూతులన్నీ తిట్టాను.

వాడు నన్ను గట్టిగా తోశాండి. వెళ్ళీ గట్టుమీద పడ్డానండి. తలపగిలి నెత్తురొచ్చింది. వాడు నన్ను తిట్టటం మొదలెట్టాడు. పోలంగాడినట. పొలం దున్నుకుంటూ మధ్యలో వదిలేసి వచ్చానట. డబ్బుల్లేవని వాడి చేతులు కట్టేశానట. లేకపోతే సినిమా ఇంకా చాలా బాగా తీసేవాడట. అందుకనే రీటా కి నేనంటే అసహ్యంట. ఇంక నాకు కోపం ఆగలేదండి. పధ్నాలుగు కోట్లు ఎవడబ్బ సొమ్మురా నాయాల. అంటూ ఒక్క తోపు తోశాను. మూడో అంతస్తు బాల్కనీ లో నుంచి దబ్బున కింద పడిపోయాడు. తొంగి చూశాను. తల పగిలి రక్తం ఎర్రగా మెరుస్తోంది లైట్ వెలుతుర్లో. గబ గబా బయలుదేరి బయటకు వచ్చేశాను.

ఆటో ఎక్కి సికిందరాబాదు స్టేషన్ కి వెళ్ళమన్నాను నర్సాపూర్ అందుకోటానికి. సెల్ ఫోన్ మోగిందండి. మా ఆవిడ సావిత్రి. ఏడుస్తోంది బూతులు తిట్తూ. విషయం ఏమిటంటే రౌడీ లు వచ్చి ఇంట్లోంచి బలవంతంగా ఖాళీ చేయించారట. అడ్డొచ్చిన మా అక్కా బావ ను తన్నారట. చుట్టాలందరు ఫోన్లుచేసి డబ్బులు అడుగుతున్నారట. ఫోన్ పెట్టేశాను. ఏం చెయ్యగలనండీ. అంతా అయ్యిపోయింది. ఉన్న వంద ఎకరాలు పోయాయి. పది కోట్లు అప్పు ఉంది. నన్ను నమ్మి పిల్ల నిచ్చిన అక్కా బావలని తన్నించాను. నా సావిత్రి ని నిలువునా ముంచాను. ఎలా బతికి బట్ట గలనండి. చదువు సరిపోదు. రాజా లా తిరిగే వాడిని ఈ రోజు ఎందుకు కొరగాని వాడినయ్యాను. రణధీర్ గాడు చచ్చాడో బతికాడో. అదెన్ని కేసు లవుతుందో.

ఆటో టాంక్ బండ్ మద్యగా వెడుతోంది. మద్యలో బుద్దుడు నా గురించే ఎదురు చూస్తున్నట్లున్నాడు. ఆటో అపించి దిగిపోయాను. నడుస్తూ రైలింగ్ ని పట్టుకుని నిలబడ్డాను. ఏం చెయ్యగలను. సావిత్రీ, పిల్లలు నన్ను క్షమించండి. ఎక్కి దూకేశాను హుస్సేన్ సాగర్ లోకి.

–వెంకట్ ఉప్పలూరి

22 Comments
 1. mohanrazz February 18, 2009 /
 2. Jonathan February 18, 2009 /
  • shree February 19, 2009 /
   • మార్తాండ February 19, 2009 /
 3. ashok February 18, 2009 /
  • Telugu Abhimmani February 18, 2009 /
 4. parimalam February 18, 2009 /
 5. hero February 19, 2009 /
 6. శంకర్ February 19, 2009 /
 7. Venkat U February 19, 2009 /
  • shree February 19, 2009 /
 8. shree February 19, 2009 /
 9. మురళి February 19, 2009 /
 10. మార్తాండ February 19, 2009 /
 11. సుధీర్ February 21, 2009 /
  • సుధీర్ February 21, 2009 /
 12. kolord97@gmail.com February 28, 2009 /
 13. కొత్తపాళీ March 1, 2009 /
  • మార్తాండ March 2, 2009 /
 14. మార్తాండ March 2, 2009 /
 15. బాలు September 18, 2013 /