Menu

మన చలనచిత్ర పరిశ్రమ భవిష్యత్తు

’రూపవాణి వారి ఆనాటి అమూల్యమైన రచనలు నేటితరానికి అందించేందుకు నవతరంగం పునఃప్రచురణగావిస్తున్న విషయం గతంలో కొన్నిసార్లు ప్రస్తావించడం జరిగింది. తరం మారినా మన సినిమా ప్రమాణాలు మారాలని కోరుకునే సినిమా ప్రేమికుల అభిరుచులు అప్పుడూ,ఇప్పుడూ మారలేదనడానికి ఈ రచనలే నిదర్శనం. ఎందరో ప్రముఖులు వ్రాసిన ఈ రచనలను ప్రచురించే అనుమతి ఇచ్చిన S V శ్రీనివాస్ గారికి ధన్యవాదములు.అచ్చులో ఉన్న ఈ వ్యాసాలను డిజిటైజ్ చెయ్యడంలో పాలుపంచుకుంటున్న నవతరంగం రచయితలందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ కార్యక్రమంలో భాగంగా చందూగారిద్వారా నవతరంగప్రవేశం చేస్తున్న ఈ వ్యాసాలను వారానికొక్కటి చొప్పున ప్రచురిస్తున్నాం. చదివి ఆనందించండి. ’

ఈ వ్యాస పరంపరలో వచ్చిన మిగతా వ్యాసాల కోసం ఇక్కడ చూడండి.

‘సౌండు ‘ పత్రికనుండి “శివం” అనుకరణ
ప్రచురణ: మార్చ్ 1946

ఈ 32 సంవత్సరాల్నించీ మన ఫిలిం పరిశ్రమ పొందిన అభివృద్ది యేమిటి? బోల్టునుంచి ముడి ఫిల్ము వరకూ స్వదేశంలో తయారు అయిన రోజునే యిది జాతీయ పరిశ్రమ అని అనగలం. అప్పుడే – మన చలనచిత్ర పరిశ్రమకు భవిష్యత్తు.

చలన చిత్రాలు భారతదేశములో అడుగుపెట్టి ముప్పది రెండేండ్లు అవవస్తూంది. అయితే యీ ముప్పది రెండేండ్లలోను – వాటిలో ఎంత పురోభివృద్ధి వున్నది?

మన దేశములో చలన చిత్రలములకు వక Entertainmentగ – కాలును నిలవద్రొక్కుకొనడానికి గాని, అట్టే కాలము అవసరములేకపోయినది. ప్రజలు వెంటనే ఆకర్షింపబడ్డారు. చలనచిత్రాల వయిపుకు చిత్ర పరిశ్రమ ‘బ్రహ్మాండమయిన పరిశ్రమాగా మారే సూచనలను మనవారు త్వరితముగానే గ్రహింపగలిగేరు కూడాను. వెనువెంటనే దేశములోని ముఖ్యపట్టణములన్నిటిలోను సినిమా థియేటర్లు జన్మించేయి. జనము గుంపులు గుంపులుగా వచ్చి, ఆనాడు చూపబడే అమెరికను దిగంబర చిత్రాలను నోళ్ళు తెరుచుకొని – వింతగా ఆనందించసాగేరు.

1913వ వత్సరములో గాబోలు ప్రథమ భారతీయ చిత్రము నిర్మింపబడినది. దాని వెనుకనే అనేక ప్రొడ్యూసింగు కంపెనీలు బయలుదేరేయి – కొల్హాపూరు, బొంబాయి, కలకత్తాలలో ఆనాడు (యీనాటికీ) విరివిగా బయటికొచ్చిన చిత్రాలన్నీ పౌరాణికాలూ, చారిత్రాత్మిక చిత్రాలూను. దేవుడూ, దేవతలు ఉంటే చాలు – Box Office Hit! ప్రజలు వేలం వెర్రిగా పరుగులెత్తేరు – ప్రొడ్యూసర్లు దీపముండగనే యిల్లును చక్కబెట్టుకొనసాగేరు. వ్యాపారదృష్టితో తప్పితే కళాదృష్టితో చలనచిత్రాలను నిర్మించడానికి – ఎవ్వరికీ పట్టలేదు.

1930లో చలనచిత్రాలకు శబ్దము జతచేయబడి, మొట్టమొదటిసారిగ మనదేశములో సశబ్ద చలనచిత్రము తయారు చేయబడింది. ప్రజలు వుత్సాహంతో ఆదరించేరు. యీ చిత్రాలను తర్వాత , 30 నుండి నేటివరకూ జరిగిన చెప్పుకోదగిన విషయమేమంటే వీలయిన ప్రతీ ప్రదేశములోనూ థియేటర్లు, స్టూడియోలు నెలకొల్పబడినాయి.

1937-38 నాటి లెక్కలను బట్టి మనదేశములో 50 స్టూడియోలు 150 ప్రొడ్యూసింగు కంపెనీలు, 1700 సినిమా హాల్సు వున్నట్లు తేలుతూంది. ఈనాడు 75 స్టూడియోలు, 2000 థియేటర్లు, 250 ప్రొడ్యూసింగు కంపెనీలకు పెరిగేయి. ప్రతియేటా దాదాపు 15 కోట్ల రూపాయలకు మించి, మనవారు చిత్ర పరిశ్రమకు వ్యయపరుస్తున్నారు. మన దేశీయులలో మ్యూజిక్ డైరక్టర్లు, డైరక్టర్లు, సౌండు యింజనీర్లు, కెమిరామెన్, యితర ఆర్టిస్టులు అనేకమంది ఏర్పడ్డారు. చలన చిత్రాలను, తారల తీరులను గూర్చి విమర్శించే అనేక పత్రికలూ జన్మించేయి. అంతా అపర హాలీవుడ్డే! ఇదంతాచూచి వీధివెంబడిపోయే సామాన్య ప్రజ నమ్మోహితుడై భారతదేశీయ చలనచిత్ర పరిశ్రమ జాతీయ పరిశ్రమ అయిపోయినదని నమ్ముతూ, వుద్రేకపూరితుడయి, ఫిలిం నిర్మాతల దృష్టి ప్రజలవిద్య, విజ్ఞాన, జాతీయాభివృద్ది లక్ష్యంపైకి మళ్ళాలని హెచ్చరిస్తున్నాడు.

ఏమిటిందంతా? నిజముగా 32 ఏండ్లనుంచీ మనం యిదేనా ముందుకు నడచినది? వీలయినచోట్లల్లా స్టూడియోలు, థియేటర్లు నిర్మించడమేనా మనవారు చేసినది? వీలయినన్ని విధాల కొద్దివ్యయముతో ప్రజలను అధికముగా గుంజటమేనా మనవారుచేసినది?

అవును. అదే వారు పొందిన పురోభివృద్ధి! 1939 వరకు పురాణాలన్నీ తిరగవేసి పారేసి – యిక తీయడానికి పురాణాలలో కథలు లేవని Declare చేసేరు మన నిర్మాతలు. ముందు ముందు సంఘాన్ని విమర్శించేవి, కళా దృక్పథాన నడిచే వుత్తమ చిత్రాలు రావచ్చునని ప్రజలు ఆశతో ఎదురుచూడసాగేరు. నిర్మాతల అదృష్టమంటూ ప్రపంచయుద్ధము బ్రద్ధలయింది. ఇష్టమొచ్చిన రీతిగా విరజిమ్మడానికి ప్రజలచేతిలో బాహుళ్యముగా ధనము వుండసాగింది. చూచిన ఆటనే చూస్తూ, పాత కథనే ఆనందిస్తూ – ప్రజలు ధనము వ్యయపరచడమే ముఖ్యమన్నట్లుగ వ్యవహరింపసాగేరు. నిర్మాతలు నిర్మాత ‘బ్రతుకు జీవుడా’ అనుకొని నక్క నిట్టుర్పును వదిలి – మామూలు ధోరణినే – పాత పాటల్నే పాడుతూ – పదివేల అడుగుల సెల్యులాడును పరుగెత్తెంచి ధన్నాని మూటకట్టుకోసాగేరు. కండ్లను అప్పుడప్పుడే తెరవబోతూన్న మన ప్రొడ్యూసర్లు కాస్త – ఏదో చక్కటి కల చెరిగిపోతూన్నట్లు – వెంటనే కండ్లను మూసుకొని తమ అంధ ప్రపంచములో ఆనందింపసాగేరు. యుద్దము దయవల్ల – ముందుకువేసిన రెండడుగులను వెనక్కి తీసుకొని – సులభముగా వెనకటి స్థితికి చేరుకోగలిగేము. ఇదీ మన భారతీయ చలనచిత్రాల 32 యేండ్ల చరిత్రము.

సామాన్యప్రజను వెర్రెతించి, తృప్తిపరచి గుప్పిటిలో ఉంచుకోవడము, యీ వాణిజ్యములోని ‘ టెక్నికు ‘ అయితే అయివుండవచ్చును – కానీ మధ్యమధ్య మన దేశీయ పరిశ్రమాభివృద్ధులను కోరేవారు కాస్త ఆత్మపరీక్ష చేసుకోవడము అంత చెడ్డపని కాదేమో.

భారతదేశీయ చలనచిత్ర పరిశ్రమకు ముప్ఫదిమూడవ ఏడు వచ్చినది. వయసుతోనే దానంతటదే తప్పటడుగులు వేస్తూనే కొంత ముందుకునడిచినది. కాదనలేం. భాషాభివృద్ది అయితేనేం, జాతీయవికాసానికయితేనేం, మరెందులకయితేనేం – మన పరిశ్రమలో కొంత పురోభివృద్ధి అగుపడుతూంది. కాని యీ విజాయాలన్నీ – వాణిజ్య పోటీలోని by-products మాత్రమే. వీటికి వెనుకగాని ముందుగాని వక ప్లాను అనేది ఏమాత్రమూ అగుపించదు.

ప్రొడ్యూసర్లు – లైసెన్సులకోసము, కోటాలకోసము, ప్రజాదరణకోసము ఎంతో మెలుకువగా వుంటూన్నా – పరిశ్రమలోని ముఖ్య సూత్రాలనుగురించి తమ విలువైన బుర్రలను పాడుచేసుకోదలచుకోలేనట్లు అగుపిస్తుంది.

ప్రజలు ఆతృతతో చలనచిత్రాల భవిష్యత్తును గురించి చక్కటికలలుకంటూ, ఏమేమో మాట్లాడుతున్నారు – మన చిత్రాలకు National Status ఉన్నట్లు! నిజానికి మనకు యింతవరకు సిసలయిన భారతజాతీయ చిత్రము వక్కటయినా వున్నదా అని?

మనలను మోసగించుకోకుండా వుండదలుచుకుంటే – చిత్రనిర్మాణానికి వుపయోగపడే కెమెరా, రికార్డింగు సెట్టు, ముడిఫిల్ము, లైట్లు, ప్రోసెసింగ్ మెషిన్లు, అన్నీ – అన్నీ విదేశీయులవే అని గ్రహించాలి. ఆఖరికి చిత్రముయొక్క ప్రాణంమీదకూడా (కథ అని నావుద్దేశం) విదేశీయుల ముద్ర – వాసనవుంటూంది. అయితే – మరి – గత ముప్పది మూడేన్లనుండి మనవారు చేసినదేమిటీ అంటే .. కొలది డజన్లమంది యీ పరదేశీయుల యంత్రాలను వుపయోగించడము మాత్రము అలవర్చుకున్నారు.

మన ప్రొడ్యూసర్లు విలువచేసిన,కొలది కోట్ల రూపాయలు విదేశములనుండి దిగుమతి అయే ముడిఫిల్ముకు, కెమికల్సుకు యంత్రాలకు వుపయోగింపబడుతూంది. మిగిలిన కొలది ద్రవ్యము ఆర్టిస్టులకు, గుమాస్తాలకూ, టెక్నీషియన్లకు ముట్టుతూంది. అనగా మూడు వంతుల ద్రవ్యము విదేశీయులకు జేరుతూందన్నమాట. ఈ విషయాన్ని గురించి విచారించిన వ్యక్తి వక్కడూలేడు అంటే శోచించవలసిన విషయం. యీ Serfdom నిర్మూలింపబడనంతవరకు మన పరిశ్రమ భవిష్యత్తు Doomed అని వక్కరూ విచారించుట లేదు.

క్షణక్షణమూ Producing Companiesను లేవదీసే యీ పెద్ద వ్యాపారస్థులంతా నేటి మన పరిశ్రమలను పరిస్థితులను విశాల దృష్టితో చూడలేకపోతున్నారు. ఎంతసేపూ తమలాభాలు రెండింతలు, మూడింతలు అయ్యే విధానములనే గురించి ఆలోచిస్తున్నారుగాని…దీనిని యావద్భారత జాతీయ పరిశ్రమగా వృద్ధిపొందించే అవకాశాలను గురించి ఆలోచించుట లేదు.

చిత్రాలు బొంబాయిలోను, మద్రాసులోను తయారయినంతమాత్రాన జాతీయపరిశ్రమ అని, మన చిత్ర పరిశ్రమను అనడానికి వీలుపడదు. మనదేశములోనే మనవాండ్ల చేతుల్లోనే ముడిఫిల్మునుండి బోల్టువరకు తయారయిననాడే యిది జాతీయ పరిశ్రమ అనబడుతుంది.

చిత్రపరిశ్రమలోని ద్రవ్యము రూపాయికి పరహారణాలు భారతీయునికి ముట్టనంతవరకు యిది జాతీయ పరిశ్రమ అని యెట్లా అనగలము? భారతదేశానికి కూలిడబ్బులు తప్ప మరొకటి ముట్టనపుడు యిది జాతీయ పరిశ్రమ అని చెప్పుకోవడము సిగ్గు! సిగ్గు! మనదేశములోనే మనకు కావలసిన యంత్రసామాగ్రి అంతా వుత్పత్తి అయి మన పరిశ్రమ Self supporting గ తన కాళ్ళపయి తాను నిల్చిననాడే మనకు చక్కని భవిష్యత్తు…పురోభివృద్దీను!

ఈనాటి మనదేశపరిస్థితులలో మనకు వలసినవి ఎక్కువ చిత్రాలు కావు. ఎక్కువ స్టూడియోలు కావు. మనము పరదేశీయులమీద ముడిఫిల్ములకొరకు ఆధారపడి వున్నంతవరకు – మనం ఎన్ని ఎక్కువ చిత్రాలు నిర్మిస్తే – మనం అంత అథపాతాళానికి జారుతున్నామనే విషయం మనవారు గ్రహించాలి. చిత్రాలు త్వర త్వరగా సాగుతూన్న కొలదీ మనద్రవ్యము గంగాప్రవాహములా ఝరీవేగముతో విదేశములకు పరుగెత్తుతూంది.

గత నూటయేబది వత్సరాలనుంచి మనలను విదేశీయులు అన్నిరంగాలలోను పీల్చి పిప్పిచేసేరు. 32 ఏండ్లనుండి విదేశీయులు – చలన చిత్రరంగములోకూడా – మనలను పీల్చడములో పాపం ఏలోపము చేయలేదు. నేడు, వారిక్కడ పీఠమువేసుకొని ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, ఎగ్సిబిషను వగైరాలనుకూడా వశపరుచుకునే సూచనలు గాఢముగా అగుపిస్తున్నాయి. ఇదే జరిగితే మనము మన పరిశ్రమలకు తిలోదకాలు వదలుకొనడములో అనుమానము ఉండబోదు.

కనుక ఇకనైనా మన ప్రొడ్యూసర్లు కండ్లను తెరిచి, నూతన స్టూడియోలు, థియేటర్లు నిర్మించేందుకు ద్రవ్యాన్ని వ్యయపర్చక, వెంటనే కార్యరంగానికి వురికి మనపరిశ్రమ తనకాళ్లపయిన తాను దీర్ఘకాలము నిలిచేందులకు ప్రయత్నించవలసిఉంటుంది.

ఇదేమంత తేలికపనికాకపోవచ్చు. కొంతకాలము పట్టవచ్చు. మనకార్యము నెరవేరడానికి పట్టనీయండి. అయిదేళ్ళ ప్లానునో, పదేళ్ళ ప్లానునో వకటి నిర్మించి మన భవిష్యత్తుకు సిమెంటు రోడ్డును నిర్మించి వెంటనే ప్రారంభించండి.

ఈనాటి మన ముఖ్య సమస్య – విదేశీయుల పోటీని తట్టుకోడం కాదనీ, విదేశీయుల Serfdom నుంచి తప్పించుకోవడమేననీ మన ప్రొడ్యూసర్లు గ్రహిస్తే భారతదేశము ధన్యమవుతుంది. (‘సౌండు ‘ నుంచి)

2 Comments
  1. shree February 16, 2009 /