సత్యజిత్ రాయ్ వ్యాసావళి “Our films, their films” తెలుగు అనువాదం లో భాగంగా వస్తున్న ఈ వ్యాసం “Whats wrong with Indian films?” అన్న ఆంగ్ల వ్యాసం అనువాదం.
Disclaimer:
The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly non-profit. Please do get in touch with us in case you have any problem.
మనకాలంలోని గొప్ప మార్పులలో ఒకటి ఏదో యాంత్రిక ఆటబొమ్మ స్థాయినుండి ఈ శతాబ్దానికెల్లా అత్యంత వైవిధ్య భరితమైన మరియు శక్తివంతమైన కళా సృష్టిగా సినిమా ఎదగడం. తన తొలిరోజుల్లో సినిమా అన్న పదానికి అర్థం రకరకాలుగా మారింది – ఫొటోగ్రఫీ కి కొనసాగింపుగా, నాటకానికో సంగీతసభకో బదులుగా లేదా ఇంద్రజాలికుడి సామగ్రిలో భాగంగా – ఇలా ఎన్నో రకాలుగా. ఇరవైలనాటికల్లా అన్నీ తెలిసిన వారూ, అనుమానం తో చూసేవారూ – ఇద్దరూ తమ సణుగుడు మాని దీనిపై దృష్టి సారించారు. ఈరోజు సినిమాకి అన్ని సృజనాత్మక రంగాలకూ ఉన్నంత గౌరవం ఉంది. దీని క్లిష్టమైన సృజనాత్మకత ప్రక్రియలో ఇది వివిధ పాళ్ళలో కవిత్వం, సంగీతం, చిత్రలేఖనం, నాటకం, నిర్మాణం మరియు ఇతర చిన్నా చితకా కళలెన్నింటినో ఇముడ్చుకుంది. అంతేకాదు, విజ్ఞాన శాస్త్రం యొక్క తర్కాన్నీ, నిరాకారమైన మనిషి ఊహాశక్తి స్వరూపానికి మధ్య సంబంధం కుదర్చగలిగింది. సినిమా తీయడమంటే ఏమిటి? ఎవరికి అది ఉపయోగపడుతుంది? ఎలా ఉపయోగపడుతుంది – నిర్మాతకి లాభాలు తేవడం, రాజకీయ ప్రాపగేండా కి ఉపయోగపడడం, ఎవరో ఓ మేధావి కళా తృష్ణని తీర్చడానికో, ఇలా ఏదైనా సరే, సినిమా అన్నది ఒక విషయాన్ని కళ ద్వారా తెలియజేయగల ఒక ఆధారం. ఈ కళ అన్న భాష అది పుట్టాక నమ్మశక్యం కానంత తక్కువ వ్యవధిలోనే కుదురుకుంది.
అమెరికా దేశంలో సినిమాకి లభించినంత ప్రోత్సాహం మరెక్కడా లేకపోవడం అన్న విషయంలో ఆశ్చర్యమేం లేదు. లోతుగా పాతుకుపోయినా సంప్రదాయాలూ, కళలూ లేని దేశమైతేనే ఇలా ఓ కొత్త మాధ్యమాన్ని స్వాగతించగలదు, భేధ భావం లేకుండా ఆదరించగలదు. గ్రిఫిత్ వంటి పయొనీర్లవల్లా, ఎల్లప్పుడూ సంచనాలకోసమూ, కొత్తదనం కోసమూ ఎదురుచూసే ప్రేక్షకుల వల్లా సినిమా తీయడంలో ఓ ప్రాధమిక శైలి రూపొందుకోవడంతో పాటు సినిమా నిర్మాణానికి కావాల్సిన సామగ్రి అంతా అభివృద్ధి చెందే ప్రక్రియ తీసుకోవాల్సిన సమయం కంటే తక్కువ సమయమే తీసుకుంది. ప్రస్తుత సినిమా షేక్స్పియర్ నూ, సైకియాట్రీనీ ఒకే సామర్థ్యంతో తెరకెక్కించగల శక్తిని కలిగి ఉంది. సాంకేతికంగా నలుపు-తెలుగు రంగంలో సినిమా చాలా సులభంగా ఒదిగిపోయింది. ఇప్పుడు కొత్తగా రంగులూ, 3-డీ ఫొటోగ్రఫీ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. బహుశా ఈ దశాబ్దం ముగిసేలోపు సినిమా తీసే దృష్టిలో గణనీయమైన మార్పులు సంభవించవచ్చు.
ఇంతలో, “స్క్రీన్ రైటర్” లో ఓ అమెరికన్ రచయిత అన్నట్లు – “చైనా, ఇండియా వంటి ఎదురుచూడని ప్రదేశాల్లో కూడా స్టూడియోలు ప్రారంభమయ్యాయి.” ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటీ అంటే ఈ స్టూడియోలు పుట్టే ప్రహసనం భారతదేశంలో గత నలభై సంవత్సరాలుగా జరుగుతోందని. ప్రపంచ కేంద్రం నుండి దూరంగా ఉండే దేశమైన ఇండియా ఆ పరంగా చూస్తే సినిమాలు తీయడంలోకి చాలా తొందరగా ప్రవేశించిందనే చెప్పాలి. ఇక్కడి మొదటి లఘు చిత్రం 1907లోనూ, మొదటి ఫీచర్ ఫిల్మ్ 1913లోనూ వచ్చాయి. ఇరవైలనాటికల్లా ఇక్కడి చిత్ర పరిశ్రమ పెద్ద వ్యాపారమైంది. సంఖ్యా పరంగా చూస్తే ప్రపంచ సినిమా రంగంలో భారతదేశాన్ని మించగలిగేది హాలీవుడ్ మాత్రమే. అయితే, శ్రేష్టత పరంగా చూస్తే ఇదే విషయం చెప్పగలమా? మన సినిమాలు ఎందుకు బయటి దేశాల్లో చూపబడవు? భారత సినిమా తన ప్రజలకు మాత్రమే సరిపడే తరహా మార్కెట్ మాత్రమే కలిగిఉందా? లేక ఇక్కడి సినిమాల్లో ఉపయోగించే పోలికలు బయటి ప్రపంచానికి అర్థం కావా? లేక, మనం మన సినిమాల గురించి సిగ్గుపడుతున్నామా? భారతీయ మరియు విదేశీ సినిమాల ప్రమాణాల గురించి అవగాహన ఉన్నవారెవరికైనా ఈ ప్రశనలకి జవాబు తేలిగ్గానే దొరుకుతుంది.
నిజాన్ని ఎదుర్కోక తప్పదు. ఇప్పటిదాకా అన్ని రంగాల్లోనూ మెప్పు పొందిన భారతీయ సినిమా రాలేదు. ఇతర దేశాలు సాధించిన రంగంలో మనం ప్రయత్నం చేశాము. అది కూడా ఎల్లప్పుడూ నిజాయితీతో కాదు. కనుక, మన అత్యుత్తమ సినిమాని కూడా “ఎంతైనా భారతీయ చిత్రం కదా” అన్న భావనతోనే స్వీకరిస్తున్నారు. ఈ విధమైన పరిపక్వత లేకపోవడానికి కారణాలనేకం. నిర్మాతలను అడిగితే అగోచరమైన పదార్థమైన “మాస్” వైపు చూపుతారు, వారికి ఇదే కావాలంటారు. సాంకేతిక నిపుణులు తమకు లభించిన పరికరాలను, దర్శకుడు తానెన్నో విషయాల్ని తెరపై చూపుదామనుకున్నా అనుకూలించని పరిస్థితులనూ చూపిస్తారు. ఇవన్నీ నిజాలే కానీ, పూర్తిగా మనల్ని నమ్మించాలని ప్రయత్నాలు చేసేంత నిజాలు కావు. పైగా, ఇంతకంటే మెరుగైన సినిమాలు ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో వచ్చాయి. యుద్ధానంతర ఇటాలియన్ సినిమా ఈ విషయంలో అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. కారణం మరోచోటుంది. అది సినిమా తీయడంలోని ప్రాధమిక సూత్రాలలో దొరుకుతుందని నా నమ్మకం.
తొలిరోజుల్లో ఎక్కడ నిర్మితమయ్యాయి అన్న విషయం తో సంబంధం లేకుండా సినిమాలు ఒకేలాగా ఉండేవి. మార్గదర్శకులనదగ్గ వారందరూ ఈ సినిమా అన్నదానిలోని ప్రత్యేకతను గుర్తించడం మొదలుపెట్టగానే సినిమా భాష క్రమంగా వృద్ధి చెందింది. సినిమాకి ఆయువుపట్టు – చలనం – అది తెలియగానే ఇక శైలి, వస్తువు పరంగా పరిపక్వత సాధించడం, సాంకేతికంగా మెరుగవడం వంటివన్నీ కాలంతో పాటే జరిగాయి. భారతదేశంలో ఆ సమయంలో ఉన్న సందర్భోచిత నాటక ప్రక్రియ లోని ప్రాధమిక సూత్రాన్ని సరిగా అర్థంచేసుకోలేదేమో అనిపిస్తుంది. ఒక్కోసారి, ఒకానొక వింత తర్కం ద్వారా చలానాన్ని నటనతోనూ, నటనని మెలోడ్రామాతోనూ అన్వయించారు. సంగీతం విషయంలో పోలిక మన సినిమాల విషయంలో కలగలేదు. ఎందుకంటే, భారతీయ సంగీతం ప్రధానంగా improvisational కోవలోది కనుక. మొదట్లో కలిగిన ఈ అయోమయం మరియు అమెరికన్ సినిమాల ప్రభావం – ఈ రెండు విషయాలూ భారత సినిమ ప్రస్తుత పరిస్థితికి కారణాలని చెప్పవచ్చు. అమెరికా సినిమా శైలిలోని పైకి కనిపించే అంశాలు అసలు విషయం ఎంత అసంబద్ధమైనదైనా కూడా ఎంతో గౌరవంతో మనవారు అనుకరించేవారు. అమెరికన్ సినిమాలోని ప్రతి దశకూ భారతీయ సినిమాలో ఓ స్పందన ఉంది.
హాలీవుడ్ విజయాల ఆధారంగా, అక్కడి వాడుకలో నానిపోయిన ప్రయోగాలనూ ఎంతో శ్రద్ధగా మన సినిమాల్లో దాచుకున్నారు. కథ నిజమైన భారతీయ కథ ఐన సందర్భాల్లో కూడా నేపథ్య సంగీతంలో జాజ్ సంగీతం పై అభిమానం తొంగిచూస్తూనే ఉండేది. పుస్తకాలని సినిమాలుగా తీసేటప్పుడు సాధారణంగా రెండు పద్ధతులు ఉపయోగించేవారు. మొదటిది – కథని హాలీవుడ్ ఫార్ములాకి తగ్గట్లుగా ఇష్టమొచ్చినట్లు మార్చడం. రెండవది – మరీ సినిమా తీయడంలోని ధ్యేయాన్నే నిర్వీర్యం చేసేంతగా అసలు కథకి అతి విధేయత ప్రదర్శించడం. సగటు అమెరికన్ సినిమా మన సినిమాలకి నిజానికి సరైన నమూనా కాదు. ఎందుకంటే, అది చూపే జీవితానికి, మన దేశంలో జీవితానికి చాలా తేడా ఉంది. పైగా, హాలీవుడ్ సినిమాలకి దొరికే సాంకేతికపు పూత మన పరిస్థితుల్లో మనకి దొరకడం కష్టం. భారతీయ సినిమాకి ప్రస్తుతం కావాల్సింది అలాంటి హంగులు కావు. మరింత సృజనాత్మకత, మరింత నిజాయితీ, సినిమా అన్న మాధ్యమం యొక్క బలాబలాల గురించి ఒక తెలివైన అవగాహన.
మనకు సినిమాలకి సంబంధించిన ప్రాధమిక సామగ్రి ఉంది. సాంకేతిక నిపుణులు క్రేన్ షాట్, ప్రాసెస్ షాట్ వంటి యంత్రాలు లేవని గోలపెట్టినా కూడా నిజానికి అవి అవసరమైనవే కానీ, అవి లేకపోతే పని జరగనంత అత్యవసరం కావు. మనకున్న యాంత్రిక సాయాన్నే కాస్త తెలివితో బాగా వాడుకోవచ్చు. మన సినిమాకి కావాల్సింది ఒక శైలి, ఒక జాతీయ ముద్ర, ఒక భారతీయత. ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి కొన్ని అవరోధాలు ఉన్నాయి. పాశ్చాత్య నాగరికత ప్రభావం మన దేశంలో సృష్టించిన తేడాలు కనిపిస్తూనే ఉన్నాయి కదా. మనం మోటార్ కార్, రేడియో, టెలిఫోను, యూరోపు వస్త్రధారణ, నిర్మాణ శైలి – అన్నింటినీ మన జీవితంలో అంగీకరించాము. కానీ, సినిమాల్లో మాత్రం వాటిలోని అసంబద్ధతను గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు తోస్తుంది. నాకు ఓ ప్రముఖ బెంగాలీ సినిమాలోని దృశ్యం గుర్తు వస్తోంది. అందులో కథానాయిక తన చేతుల్ని ఓ వైర్లెస్స్ చుట్టూ పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. దూరమైన రేడియో గాయకుడైనా తన ప్రియుడిని తన మనసులో ఆ వస్తువుతో అన్వయించుకున్నది ఆమె. మరో ఫక్తు హాలీవుడ్ తరహా ముగింపులో హీరోయిన్ ఓ కారులో వెళుతూ ఉంటుంది కోపంతో కాలినడకన వెళ్ళిపోయిన హీరోని అందుకోవడానికి. అతను కనబడగానే సింబాలిక్ గా ఆమె కారు వదిలేసి తక్కిన దారంగా నడిచి వెళ్ళి అతన్ని కలుస్తుంది.
మన సినిమాల్లో చాలావరకు ఇలాంటి ‘visual dissonances’ ఉంటాయి. “కల్పన” లో ఉదయ శంకర్ ఇలాంటివన్నీ కావాలనే తరుచుగా వాడాడు. దానితో అవి అతని సినిమా తీసే విధానంలో భాగమయిపోయాయి. కానీ, నిజమైన భారతీయ సినిమా ఇలాంటి విషయాలని వదిలి దాని కథా వస్తువుకోసం భారతీయ జీవితంలోని ప్రాథమిక విషయాలపై దృష్టి సారించాలి. ఇందులో – అలవాటు, మాట, ఆహార్యం, ప్రవర్తనా, నేపథ్యం, ప్రధాన రంగం అంతా కలిపి ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమవ్వాలి. శైలిలోనూ, కథా వస్తువులోనూ క్లిష్టతని గణనీయంగా తగ్గించడంలోనే భారతీయ సినిమా భవిష్యత్తు ఉంది. ప్రస్తుతం ఉన్న పద్ధతులన్నీ అలా క్లిష్టతని తగ్గించడంలో విఫలమౌతున్నాయి. సరిన ప్లానీంగ్ లేకుండా నిర్మాణం మొదలుపెట్టడము, ఒక్కోసారి స్క్రిప్ట్ కూడా సిద్ధంగా లేకపోవడం, కథలో మలుపులు పెట్టడం పై ఉన్న శ్రద్ధ ఒక సామాన్యమైన, సూటైన కథనం పై లేకపోవడం, అసందర్భంగా పాటలు పెట్టడం, స్పూర్థి కోసం అంతర్జాతీయంగా డాక్యుమెంటరీల వైపు చూస్తూ ఉంటే ఇంత మంచి భూభాగం ఉన్న మనం ఇండోర్ షూటింగ్లు చేసుకోవడమూ – ఇలాంటివన్నీ మనకంటూ ఓ శైలి ఏర్పడడానికి ఉన్న అవరోధాలు. ఈమధ్య వచ్చిన సినిమాల్లో అరుదుగా ఒక్కోసారి నవ్యత కనిపించింది. IPTA వారి “ధర్తీ కే లాల్” అన్నది దీనికి ఉదాహరణ. ఇదొక సాధారణ కథ, ఒక విలక్షణ శైలితో, నిజాయితీ తో మరియు సాంకేతిక విలువలతో ముందుకొచ్చింది. శంకర్ “కల్పన” ఒక వ్యక్తిగత ప్రయోగమే అయినప్పటికీ అదొక చిత్ర ఉద్యమాన్ని అర్థం చేసుకుని, తనలోని అత్యుత్తమమైన క్షణాల్ని సినిమా రంగంలో పతాకస్థాయికి తీసుకెళ్లగల సినీ సంప్రదాయాన్ని చూపిస్తుంది. పాల్ జిల్స్ UNడాక్యుమెంటరీలలో చూపిన భారతదేశాన్ని చూస్తే, విచక్షణ తెలిసిన కెమెరా మన భూభాగాన్ని ఎలా చూపగలదో తెలుస్తుంది.
సినిమా కి కావాల్సిన ముడిసరుకు జీవితమే. చిత్రలేఖనంలోనూ, సంగీతంలోనూ, కవిత్వంలోనూ ఎంతో స్పూర్థిని రగిలించిన ఈ దేశం ఒక దర్శకుడిని కదిలించలేకపోయిందే! అతను తన కళ్ళూ, చేవులూ తెరిచిఉంచుకోవాలి. చేయనిద్దాం.
1948.
కె.మహేష్ కుమార్ says:
సినిమాని ప్రేమించే అందరూ తప్పకుండా చదవాల్సిన వ్యాసాల్ని తెలుగులో ఇలా అందించడం…Thank you for doing this.
ట్రూ says:
1948 లోవ్రాసిన ఈ వ్యాసం ఇప్పటి సినిమాలకి కూడా వర్తిస్తుంది అంటే మన సినిమా పోకడా ఇంకా మారలేదు ఇది నిజంగా దురద్రుష్టకరం,హాలీవుడ్ సినిమా అనుకరణ కొనసాగిస్తూ మన భారతీయతను కోల్పోతున్నాం,అనుకరణ తప్పుకాకపోవచ్చు , కానీ మన సినిమా, మన సంస్క్రుతినికూడా ప్రపంచానికి తెలియచేయవల్సిన అవసరంవుంది.
సత్యజిత్ రే గారి అవర్ ఫిలింస్ దేర్ ఫిలింస్ ని తెలుగులో అందిస్తున్న నవతరంగానికి రచయితకి క్రుతగ్నతలు .