లక్ ‘భలే’ ఛాన్స్ !

5904_luckbychancee

5904_luckbychancee“ఉదయం లేవగానే నేను ఉద్యోగం కోసం వెళ్ళను. నాకు ఇష్టమైన పని (నటన) చెయ్యడానికి వెళతాను. ఇంత అదృష్టం ఎంత మందికి ఉంటుంది?” అని గర్వంగా అనుకుంటుంది కొంకణా సేన్ శర్మ చేసిన ‘సోనా మిశ్రా’ అనే పాత్రధారిణి. ఇదే సినిమాలో “స్టార్ డమ్ ఒక కాక్టైల్ లాంటిది. ఇందులో కీర్తి,డబ్బు,అధికారం కలిసిన మత్తు (నషా) ఉంటుంది. అది చాలా ప్రమాదకరం” అని హీరో విక్రం జైసింగ్ (ఫర్హాన్ అఖ్తర్) తో అంటాడూ షారుఖ్ ఖాన్. బహుశా ఈ రెండూ కారణాలు చాలూ రోజుకు కనీసం వందమంది ఈ సినీపరిశ్రమవైపుగా తమ కలల్ని మోసుకుంటూ ప్రయాణం కట్టడానికి. సినీపరిశ్రమలోని రెండు విభిన్నమైన,విపరీతమైన పార్శ్వాలను సాధికారంగా,సహజంగా అదే సమయంలో వినోదభరితంగాకూడా తెరకెక్కించిన చిత్రం జోయా అఖ్తర్ దర్శకత్వం వహించిన ‘లక్ బై ఛాన్స్’.

చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూ ఒక పెద్ద నిర్మాత ‘పెద్ద’ అవకాశం ఇస్తాడని ఆశించే సోనా మిత్రా. హిందీ సినిమా హీరో అవ్వాలంటే నటనతోపాటూ, డ్యాన్సులూ,ఫైట్లూ,హార్స్ రైడింగ్ లాంటి విద్యలన్నీ తెలుసుండాలి కాబట్టి అది హాలీవుడ్ కన్నా కష్టం అని నమ్మే యాక్టింగ్ స్కూల్ నుంచీ, ఒక పోర్టుఫోలియో పట్టుకుని బయటపడి, అవకాశాల కోసం ప్రయత్నించే విక్రం జైసింగ్. ఈ ఇద్దరి జీవితాన్ని తెరపై ఉంచుతూనే బాలీవుడ్ సినీపరిశ్రమ స్థితిగతుల్ని గురించి చర్చించే సినిమా ఇది. కథాపరంగా సోనా- విక్రంల కథే అయినా, ప్రతి సినిమా ఒక టీం ఎఫర్ట్ అన్నట్లు వీరి జీవితాల్ని చాలా శక్తులు,వ్యక్తులు,పరిస్థితులూ, ప్రభావితం చెయ్యడంతో ఒదొక testimony on present day Hindi cinema గా అవతరిస్తుంది.

అంతమాత్రానా, ఇదేదో ‘నేనింతే’ తరహా అక్కసు వెళ్ళగక్కే సినిమానో లేక మధుర్ భంఢార్కర్ సినిమాల్లాగా (ఎక్కువగా)చీకటి కోణాన్ని మాత్రమే గుర్తుకుచేసే చిత్రమో కాదు. ఇందులో cynicism లేదు నిజం తప్ప. అప్పుడప్పుడూ రాం గోపాల్ వర్మ తన సినిమాల్లో చూపించే బాలీవుడ్ కోణాల్ని చూపిస్తూనే, వ్యక్తుల అంతర్మధనాన్నీ, వ్యక్తిత్వాల ఎదుగుదలనూ, పరిస్థితుల ప్రభావాలు ఎంత బలంగా సినీరంగంలో జీవితాల్ని శాసిస్తాయో గొప్పలు, అతిశయోక్తులు,అరుపులు లేకుండా గౌరవప్రదంగా చూపించే చిత్రం ఇది.

పాత్రకుతగ్గ నటుల్ని ఎంచుకోవడంతో సగం పని ఎలా పుర్తవుతుందో మనకు ఈ సినిమాను చూస్తే తెలుస్తుంది. ‘హీరో అవుతాడా కాదా’ అనే పాత్రలో ఫర్హాన్ అఖ్తర్. నటనలో ప్రతిభ ఉండీ ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడుతూ హీరోయిన్ కావాలని కోరుకునే పాత్రలో కొంకణా సేన్. సీనియర్ నిర్మాతగా ఉండీ తన పిల్లల వయసు హీరోల డేట్స్ కోసం నానా బాధలు పడుతూ, హీరోయిన్ తల్లి గొంతెమ్మ కోరికల్ని నవ్వుతూ భరిస్తూ, గుడ్డినమ్మకాల్నీ- పిచ్చి సెంటిమెంట్లను అలవోకగా ఫాలోఅయిపోతూ,తమ్ముడ్ని దర్శకుడ్ని చేసి మరో బంధువు సినిమాకు ఫైనాన్స్ చేయిస్తూ సినిమాని ప్రేమించే వ్యక్తిగా రిషి కపూర్. ఆ నిర్మాత ఫ్యాషనబుల్ భార్యగా జూహీచావ్లా.అసఫల నటుడు,ప్రస్తుతం దర్శకుడి పాత్రలో సంజయ్ కపూర్.  డెబ్బయిలలో ఒక వెలుగు వెలిగిన నటిగా, ఇప్పుడు కూతుర్ని launch చేస్తున్న స్టార్ తల్లిగా, మర్మమైన గతం ముక్కుపిండి పనులు చేయించుకోగల జాణతనం, పొగడ్తలకు పడిపోయే బేలతనం అన్నీ కలగలిపిన పాత్రలో డింపుల్ కపాడియా. Pampered star kid పాత్రలో ఇశా శర్వాణీ సరిగ్గా సరిపోయింది.  ఒక ఆకర్షనీయమైన బాలీవుడ్ హీరో, ఇంకా ఎదగాలనే ఆసక్తీ, ఆశా కలిగిన వ్యక్తిగా హృతిక్ రోషన్. ఇలా ప్రతిపాత్రా తెరపై కనపడగానే ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా మనకు తెలిసిపోవడం ఈ చిత్ర ప్రత్యేకతగా చెప్పుకోవాలి.

చిన్నచిన్న పాత్రల్లో ప్రముఖ సినీతారలు కనిపిస్తూ ఈ సినిమాలో believability ని నింపారు. అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ ఖన్నా, జాన్ అబ్రహం, రాణీ ముఖర్జీ, దియామిర్జా, కరీనా కపూర్, కరణ్ జొహర్, రాజూ హిరాణీ లాంటి నటీనటులు కనిపించి మాయమయ్యేవాళ్ళు కొందరైతే, సినిమాకు సంబంధించిన కీలకమైన దృశ్యాల్ని మరింత అర్థవంవం చేసేవాళ్ళుగా కొందరు కనిపిస్తారు. వ్యక్తిగతంగా యాక్టింగ్ స్కూల్ హెడ్ గా సౌరభ్ శుక్లా, కథా రచయితగా ప్రముఖదర్శకుడు అనురాగ్ కశ్యప్ పాత్రలు విపరీతంగా ఆకట్టుకున్నాయి.

రచయిత జావేద్ అఖ్తర్ సంభాషణల్లోని సహజత ఈ సినిమాకు మరో హైలైట్. శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం సినిమాను ప్రత్యేకస్థాయికి తీసుకెళ్ళకపోయినా, నేపధ్యసంగీతంతో దృశ్యాలకు మంచి బలాన్ని అందించారు. దర్శకురాలిగా జోయా అఖ్తర్ కు ఇది మొదటి సినిమానే అయినా, ఒక ప్రముఖ సినీరచయిత కూతురిగా, మరో యువదర్శకుడి చెల్లెలిగా స్కిప్ట్ పరంగా సరైన సహాయం అందుంటుందని అనుకోవచ్చు. కానీ, సినిమాలో స్త్రీపాత్రల తీరుతెన్నుల్లో కనబడే సున్నితత్వం, సంక్లిష్టత, పక్వత దర్శకురాలి సూక్ష్మదృష్తికి పరిచయంగా అనిపిస్తాయి. పింకీ చౌధరి పాత్ర. పత్రికలో వ్యాసం చదివి, ఆ వ్యాసం రాసిన మిత్రుడిపై కోపంతో కొట్టే దృశ్యం. డింపుల్ కపాడియా తన జీవితంలోని మర్మాన్ని ఒక్క డైలాగులో చెప్పే తీరు. సోనా తనకూ నిర్మాత చౌదరికీ మధ్యనున్న సంబంధాన్ని హీరోకు వివరించే విధానం. ఆఖర్న విక్రం తన తప్పుని ఒప్పుకుని మళ్ళీ కలుద్ధామన్నప్పుడు సోనా తీసుకునే ఒక ఆత్మగౌరవ నిర్ణయం. ఇలాంటి పాత్రలూ దృశ్యాలూ ఇదొక మహిళా దర్శకురాలి సునిశిత దృష్టిజనితం అని ఒప్పుకోక తప్పదు. అందుకే ఇది ఆద్యంతం జోయా అఖ్తర్ చిత్రం. తప్పకుండా చూడవసిన చిత్రం..

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

K మహేశ్ కుమార్

రచయిత:

పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లి. పెరిగింది కుప్పం, పీలేరు మరియు వాయల్పాడు గ్రామాలలో. ఆరోతరగతి నుండీ 'నవోదయ విద్యలయం' లో చదివా. ఈ సెంట్రల్ స్కూల్ పుణ్యమా అని హర్యాణా లోని హిస్సార్ జిల్లాలో రెండు సంవత్సరాలూ, అనంతపురం జిల్లా లేపాక్షి లొ రెండు సంవత్సరాలూ విద్యగడించి, స్కూలు (12th class) ముగిసే సరికీ కాస్త బయటి ప్రపంచంతోపాటూ హిందీ భాష కూడా వంటబట్టింది. ఇక నా జివితంలో సినిమాలంటారా! తమిళ నాడు బార్డరు మా పక్కనే కాబట్టి చిన్నప్పుడే తెలుగు సినిమాలతో పాటూ వాటినీ సాధించాం. అప్పట్లో మనం చూడని సినిమా లెదని నా నమ్మకం. "ఆ సినిమా బాగాలేదు" అని ఎవరైనా అంటే "ఎందుకు బాగాలేదో చూద్దాం" అని వెళ్ళే రకంగా మనకు ప్రసిద్ధి. ఇలా సినిమాలపై దండయాత్ర సాగిస్తుండగానే, కాలేజి చదువులకని మైసూర్ 'రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్' లో చేరటమూ, ఆటోమేటిక్ గా అక్కడి Film Club లో చేరడమూ 1994 లో జరిగిపోయాయి. అప్పటికే తెలుగు,తమిళ సినిమాకు దాస్యం చేస్తున్న మన బుర్రకు అక్కడే భారతీయ, ప్రపంచ సినిమాలు పరిచయమై, దాస్యాన్నితోలగించి కొంత మంచి సినిమా జ్ఞానాన్ని ప్రసాదించాయి. ఇలా సంపాదించిన సినిమా జ్ఞానంతో "ఇక సినిమాలు తియ్యడమే జీవిత లక్ష్యమ్" అనుకుని FTII కలలుకనగా, ఏదో సమస్య వలన ఆ సంవత్సరం అక్కడ "0 year" అయ్యి కూర్చ్ఘుంది. ఏమైతేనేం అని హైదరాబాద్ సెంటల్ యూనివర్సిటీ లో 'MA Communication' 2000 సంవత్సరంలో ముగించి కనీసం "డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్" అనిపించేసాం. ఆతరువాత టివీ చానళ్లలో, సిరియల్స్ లో కొంత 'ప్రయత్నం' చేసినా నిరాశ తప్ప నా ఆశను సాధింఛే మార్గం దొరకక, ఆర్ధికంగా కూడా గిట్టుబాటుకాక `Social/Development Communication Consultant' గా అవతారమెత్తి ఇప్పటిదా బ్రతుకుదెరువు కానిస్తూ, సినిమా కళాపోషణ చేస్తూ కలలు కంటున్నాను. అదేదో కృష్ణవంశి సినిమాలో సంగీత అన్నట్టు మనమూ "ఒక్క ఛాన్సిస్తే" అంటూ నవతరంగంలో చేరి "ఆ చాన్స్ మనమే కల్పింఛుకుందాం" అనే స్థితికి చేరి ఎదురుచూస్తున్నాం.

8 Comments to “లక్ ‘భలే’ ఛాన్స్ !”

  • I too watched the film!

    cant agree more!

    a nice movie!

    neninthey movie elaa teestey hit avutundo clear gaaa choopinchaaru [:)]

    hatsoff for the debut director!

    therez a romantic scene in the movie bwteen isha and farahn: It raises adrenaline with out actually showing anything..not even a kiss [:p]
    tht itself tells a lot about the movie!

  • I think Joya had earlier directed a Sushmita Sen’s Film (im not sure) in which a very popular asha bhonsle’s song was picturised in all white back drop, white costumes… I think the film’s name is Filhaal. :D

  • Zoya is Farhan’s elder sister.

    @Sujata
    Filhaal was directed by Gulzar’s daughter, Meghana.

  • తెలుగు వెబ్ సైట్ లొ హిందీ సినిమా గురించి తెలుగువారు ఇంగ్లీషులో వ్యాఖ్యలా?? !! :)
    సాధ్యమైనంతవరకూ తెలుగులోనే రాయండి.

  • చాలా..చాలా బాగా రాసారు..మళ్ళి సినిమా చూసిన ఫీల్ తీసుకొచ్చారు..
    -సూర్య ప్రకాష్

  • నిన్నే ఈ సినిమా చూసాను. మీరన్నట్టు నటీనటుల ఎంపికలోనే సినిమా సగం పూర్తైంది. ప్రత్యేకించి రిషి కపూర్, డింపుల్ కపాడియా, కొంకణాసేన్, ఫర్హాన్, హృతిక్ రోషన్ పాత్రలకు ప్రాణం పోసారు. అక్కడక్కడ డైలాగులు బాగున్నాయి.

    “నేను జబ్బర్ ఖాన్‌ని కాదు, జబ్బర్ ఖాన్ నా ఇమేజ్ పేరు. నేను జబ్బర్ ఖాన్ దగ్గర పనిచేస్తుంటాను.” – హృతిక్ రోషన్
    కొంకణా సెన్‌ని ఒక నిర్మాత మోసం చేసిన తరువాత “ఇప్పటిదాక మోసం చేసే వాడిని నమ్మావు. ఇప్పుడు నిన్ను నువ్వు నమ్ము” అంటూ ఫర్హాన్ చెప్పే డైలాగులు. ఇలాంటి చాలా వున్నాయి.

    “సపనోసే భరే నైనా..” పాట వినడానికి ఎంత బాగుందో ఆ సంధర్భానికి మరీ అద్భుతంగా సరిపోయింది.

    మొత్తం మీదా అక్కడక్కడా చాలా బాగుండి అంతా కలిపితే ఫర్వాలేదనిపించింది. స్క్రీన్‌ప్లే లోపమనిపించింది.

    • @అరిపిరాల,
      screenplay లేదేమో…అసలు రాయలేదేమో…

    • కొంచెం షాకింగ్. ఇలాంటప్పుడే ఈ స్క్రీన్ ప్లే అంటే ఏంటో తేల్చుకోలేను.మీకు కనిపించిన లోపాలు గుర్తుంటే చెప్పరూ!

      నా సిడీవాడు, క్లైమాక్స్‌‌తో ఓపెన్ చేసి, టైటిల్స్ వేసి, అప్పుడు ఓపెనింగ్ (ఇంటర్వ్యూ)తో మొదలెట్టాడు.నాకసలే అదే నచ్చింది;ఒరిజినల్ కంటే! ఎనీవేస్..నాకు లోపాలు తెలీలేదు. గుర్తుంటే,చెప్పగలరు.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories