Menu

ఆడూర్ గోపాలకృష్ణన్-మరో పరిచయం

1941 లో జన్మించిన ఆదూర్ గోపాలకృష్ణన్ గారు ఎనిమిదేళ్ళ అతి చిన్న వయసునుండే నాటక రంగం లోకి అడుగుపెట్టారు. తన చదువు పూర్తయే నాటికి దాదాపు 20 కి పైగా నాటకాలను రచించి దర్శకత్వం వహించారు. ఆర్ధిక మరియూ రాజనీతిఙ్ఞ శాస్త్రముల లో పట్టా పుచ్చుకున్న ఆయన అతి కొద్ది రోజులు కేరళ ప్రభుత్వొద్యోగిగా భాద్యతలు నిర్వహించి, తరువాత పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నందు చేరి 1965 లో స్క్రిప్ట్ మరియూ దర్శకత్వ శాఖలందు డిప్లొమా సంపాదించారు. అదునిక భారతీయ చలనచిత్ర థృవతార అయిన ఆదూర్, చలన చిత్ర నిర్మాణ, పంపిణీ మరియూ ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శన కోసం దేశం లోనే ప్రప్రధమ సినిమా సహకార సంస్థ “చిత్రలేఖ” ని స్థాపించి కేరళ రాష్ట్ర చలనచిత్ర చైతన్యానికి మార్గదర్శకులు గా నిలిచారు.

ఆయన 9 పూర్తిస్థాయి చలనచిత్రాలూ మరియూ పాతిక పైగా లఘు చిత్రాలకు స్క్రిప్ట్ మరియూ దర్శకత్వ భాధ్యతలు నిర్వహించారు. ఆయన దర్శకత్వం వహించిన ప్రతి చిత్రమూ జాతీయ అవార్డులను గెలుపొందింది. తన మొదటి చిత్రం “స్వయంవరం” ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు (Cameraman), ఉత్తమ నటి విభాగాలలో జాతీయ స్థాయి అవార్డులను గెలుపొందింది. అప్పటి నుండీ ఈయన నాలుగు సార్లు ఉత్తమ దర్శకుని గా, మూడు సార్లు ఉత్తమ స్క్రిప్ట్ రచయితగా జాతీయ అవార్డును గెలుపొందారు. కేన్స్, బెర్లిన్, వెనిస్ వంటి అన్ని ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలోనూ ఆయన చిత్రాలు ప్రదర్శింపబడ్డాయి. అదూర్ గారి మూడవ చలన చిత్రమైన “ఏళిప్పథయం” అనే చిత్రానికి గానూ ఎంతోమంది ఎదురు చూసే బ్రిటీష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ వారి “Most original and imaginative film of 1982” అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ చలనచిత్ర విమర్శకుల బహుమతి (International film critics Prize FIPRESCI ) వరుసగా ఆయన ఐదు చిత్రాలను వరించింది అవి ముఖాముఖం, అనంతరం, మథిలుకల్, విథేయన్ మరియూ కథాపురుషన్.

భారతీయ చలన చిత్ర రంగానికి అదూర్ చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1984 లో పద్మశ్రీ తోనూ 2006 లో పద్మ విభూషణ్ తోనూ ఘనంగా సత్కరించింది. ఆయన రచించిన సినిమా వ్యాసాల సంపుటి “The world of cinema” 1984 వ సంవత్సరం లో, చలన చిత్రాల పై వచ్చిన జాతీయ స్థాయి ఉత్తమ పుస్తకం అనే అవార్డు గెలుచుకుంది. చలన చిత్ర రంగంలో ఎందరికో దిశానిర్దేశం గావించిన ఆదూర్ ప్రతిబ తన స్వ రాష్ట్రమైన కేరళ లో మెరుగైన చలన చిత్ర సంస్కృతి అలవడటానికి ఎంతగానో తోడ్పడింది. ఇంతే గాక వెనిస్, హవాయి, సింగపూర్, సోచి, న్యూఢిల్లీ, బ్రజెల్స్, అలెక్సాండ్రియా లాంటి ఎన్నో ప్రదేశాల లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో జ్యూరీ సభ్యునిగా ఆదూర్ విధులు నిర్వర్తించారు.

1999 లో ప్యారిస్ నందు జరిగిన French cinematheque లో వీరి అన్ని చలన చిత్రాల సంపూర్ణ పునఃశ్చరణ జరిగింది. ఇటువంటివే మరికొన్ని లింకన్‌సెంటర్, న్యూయార్క్ (1994), La Rochelle, పెసారియో, మ్యాడ్రిడ్, Fri bourg నగరాలలో కూడా జరిగాయి. ఇంకా హెల్సింకీ, డెన్వర్, మ్యూనిచ్, Nantes, అలెక్సాండ్రియా, Figuera De Foz, మనీలా, హ్యూస్టన్ వంటి నగరాలలో జరిగిన చలన చిత్రోత్సవాలలో కూడా ఆదూర్ ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు అందుకున్నారు.

అంతటి విశిష్ట దర్శకులు అదూర్ గోపాలకృష్ణన్ గారితో సి.యస్. వెంకిటేశ్వరన్ గారు 2001 లో నిర్వహించిన ముఖాముఖి కి తెలుగు అనువాదం పూర్తి పాఠం అతి త్వరలో….

—వేణు శ్రీకాంత్

One Response