Menu

Frost/Nixon

ఫ్రాస్ట్/నిక్సన్-2008 లో నేను చూసిన అత్యుత్తమ సినిమాల్లో ఒకటి. గత సంవత్సరంలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి; ఇలాంటి అంటే ప్రముఖల జీవితాలు లేదా వారి జీవితాల్లోని వివిధ ఘట్టాల ఆధారంగా వచ్చిన సినిమాలు. ఉదాహరణకు జార్జి బుష్ గురించి వచ్చిన ‘W’, చే గువెరా గురించి వచ్చిన రెండు సినిమాలు ’చే-1′ మరియు ’చే-2′, ఇటలీ మాజీ ప్రధాని Giulio Andreotti జీవితం ఆధారంగా వచ్చిన ’Il Divo’ అనే ఇటాలియన్ సినిమా, Harvey Milk జీవితం అధారంగా నిర్మించిన ’Milk’….ఇలా ఇంకా కొన్ని సినిమాలు వచ్చాయి.

అయితే పైన చెప్పిన సినిమాలకీ ’ఫ్రాస్ట్/నిక్సన్’ కి తేడా ఏంటంటే పైన చెప్పిన మిగతా సినిమాలు ఆయా ప్రముఖుల జీవితం ఆధారంగా నిర్మింపబడితే ’ఫ్రాస్ట్/నిక్సన్’ మాత్రం మాజీ అమెరికన్ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ జీవితం మొత్తం కాకుండా ఆయన జీవితంలోని ఒక ముఖ్యఘట్టాన్ని మాత్రమే అధారం చేసుకుని ఈ సినిమా నిర్మించారు. ఆ ముఖ్య ఘట్టం ఏంటంటే అమెరికా మాజీ అధ్యక్షుడు నిక్సన్ బ్రిటిష్ టెలివిజన్ వ్యాఖ్యాత డేవిడ్ ఫ్రాస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలు.

మొదట ఈ సినిమా గురించి ఏమీ తెలియనప్పుడు ఒక రాజకీయ నాయకుడిని ఒక టివి వ్యాఖ్యాత ఇంటర్వ్యూ చేస్తే ఏమంత గొప్ప? అనే అనుమానం వచ్చింది. దాంతో పాటే ఇలాంటి డ్రై సబ్జెక్ట్ ని సినిమాగా తీయడమేంటో అనుకున్నాను. అలా సినిమా అంటే పెద్దగా ఆసక్తి కలగకపోయినా అసలీ ఫ్రాస్ట్/నిక్సన్ ఇంటర్వ్యూల సంగతేంటో తెలుసుకుందామనిపించింది.అప్పుడే నాకు అసలు సంగతి తెలిసింది.

ఇంతకీ ఆ సంగతేంటంటే….

నిక్సన్ గురించి మీకు పెద్దగా తెలియకపోయినా వాటర్ గేట్ స్కాండల్ గురించి తప్పక తెలిసే ఉంటుందనుకుంటాను. ఈ వాటర్ గేట్ స్కాండల్ కారణంగా 1974 లో అమెరికా చరిత్రలో మొదటి సారిగా ఆ దేశపు అధ్యక్షుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 1974 లో రాజీనామా చేసాక దాదాపు మూడేళ్ళు సామాన్య ప్రజానీకానికి దూరంగా జీవిస్తూ వచ్చాడు ఆయన. అప్పటికి అమెరికన్ ప్రజల్లో తనపైన వున్న విపరీతమైన కోపాన్ని కాస్తైనా తగ్గించాలనే ఉద్దేశంతో తన జివిత చరిత్ర రాయడం మొదలుపెట్టాడు నిక్సన్. ఈ సమయంలో నిక్సన్ పబ్లిసిటీ వ్యవహారాలు చూసిపెట్టే Irving Lazar సలహా ప్రకారం పుస్తకం కంటే టివి ఇంటర్వ్యూల ద్వారా తను చెయ్యాలనుకున్న పని త్వరగానూ, ఎఫెక్టివ్ గానూ చెయ్యొచ్చని నిర్ణయించుకున్నాడు నిక్సన్.

అమెరికాలో నిక్సన్ రాజీనామా చేసే సమయానికి బ్రిటన్ లో డేవిడ్ ఫ్రాస్ట్ అనే టివి వ్యాఖ్యాత తన వ్యాఖ్యానం ద్వారా అప్పుడప్పుడే ప్రపంచమంతా మంచి పేరు గడిస్తూ వచ్చాడు. ఇటు బ్రిటన్ లో మంచి టివి వ్యాఖ్యాత గా పేరు పొంది, ఆస్ట్రేలియన్ టెలివిజన్ కి కూడా ఒక కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్న ఫ్రాస్ట్ కి అమెరికాలో మాత్రం అంతకు ముందు తన కార్యక్రమం అతి కొద్ది ఎపిసోడ్స్ తోనే ఆగిపోవడంతో అమెరికాలో తన సత్తా నిరూపించుకోవాలని తహతహలాడుతుంటాడు. ఇదే సమయానికి నిక్సన్ రాజీనామా చేయడం, నిక్సన్ రాష్ట్రపతిగా ఉండగా చేసిన తప్పుడు పనుల గురించి ఎటువంటి విచారణ లేకుండానే తప్పించుకోవడం జరగిపోతాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని నిక్సన్ తో ఇంటర్వ్యూ చేసి ఆయన గురించి ప్రజలకు నిజం తెలియచేసి సెన్సేషనల్ టివి జర్నలిస్ట్ గా పేరు పొందుదామనుకుంటాడు ఫ్రాస్ట్. ఆ ప్రయత్నంలోనే నిక్సన్ పబ్లిసిటీ వ్యవహారాలు చూసే Irving Lazar ని సంప్రదిస్తాడు ఫ్రాస్ట్.

ఇక మిగిలిన కథంతా ఫ్రాస్ట్ నిక్సన్ ల మధ్య జరిగిన ఇంటర్యూలే. ఈ ఇంటర్వ్యూలు 1977 లో మొదటి సారిగా టివి లో ప్రసారమైనప్పుడు ఒక్క అమెరకాలోనే నాలుగు కోట్లమందికి పైగా ప్రేక్షకులు వీక్షించారట.

ఇదంతా ఫ్రాస్ట్/నిక్సన్ ల ఇంటర్వ్యూల గురించి.

ఇక సినిమా సంగతికొస్తే…

ఫ్రాస్ట్/నిక్సన్ సినిమాలో అసలు ఇంటర్వ్యూల కంటే కూడా నిక్సన్ ని ఇంటర్వ్యూ చేయడంలో ఫ్రాస్ట్ పడిన కష్టాలు, ఇంటర్వ్యూ చేస్తుండగా ఫ్రాస్ట్/నిక్సన్ ల మధ్య నడిచిన ’వర్డ్ గేమ్’, నిక్సన్తో చేసిన ఇంటర్వ్యూలు టివి ఛానెళ్ళ వారికి అమ్మడంలో ఫ్రాస్ట్ అనుభవాలు లాంటి ఎన్నో అంశాలతో ఈ సినిమా ఫ్రాస్ట్/నిక్సన్ ఇంటర్వ్యూల కంటే కూడా ’మేకింగ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ’ లా నడుస్తుంది.

ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన ఒక సీన్:

నిక్సన్ రాజీనామా చేసి ఆఫీస్ వదిలివెళ్ళే దృశ్యాలు టివిలో ప్రసారం అవుతూ ఉంటాయి. బ్రిటన్ లో ఒక క్యాంటీన్ లో ఫ్రాస్ట్ ఈ కార్యక్రమాన్ని టివిలో చూస్తుంటాడు. తను చేసిన పనులకు రాజీనామా చేయాల్సి వచ్చినందుకు ఒక వైపు తీవ్రమైన అవమానం బాధ కలగలిపిన బాధ మనసులో ఉన్నా ప్రజలకు అభివాదం చేస్తూ హెలికాప్టర్ ఎక్కబోతూ కెమెరా వైపు అదోలా చూస్తాడు. అదే సమయానికి ఫ్రాస్ట్ టివి చూస్తూ నిక్సన్ తన వైపే చూస్తున్నట్టుగా భావిస్తాడు. నాకు సినిమాల్లో ఇలాంటి కీ సీన్స్ వెతుక్కోవడం చాలా ఇష్టం.

నిక్సన్ పాత్రలో Frank Langella జీవించాడు. అలాగే ఫ్రాస్ట్ పాత్రలో మైఖేల్ షీన్ కూడా. దాదాపు సినిమా మొత్తం వీళ్ళిద్దరి మధ్యనే నడుస్తుంది. నిక్సన్ పాత్రలో నటించిన Frank Langella కి ఇప్పటికే ఉత్తమ నటుడిగా ఎన్నో అవార్డులు వచ్చాయి. అలాగే ఈ మధ్యనే ఉత్తమ నటుడిగా అస్కార్ నామినేషన్ కూడా లభించింది.

ఇదంతా చదివి కూడా మీకు సినిమా గురించి పెద్దగా ఆసక్తి కలగలేదంటే అందులో ఆశ్చర్యం లేదు. ఇద్దరు మనుషులు మాట్లాడుకోవడంలో ఏమంత ఆసక్తి కలిగే అంశాలుంటాయనిపించొచ్చు. కానీ ఎలాగోలా వీలు చూసుకుని ఈ సినిమా చూడండి. నిరాశ చెందరని గ్యారంటీ ఇస్తున్నాను.

ఫైనల్ గా ఈ సినిమా చూడాలని సిద్ధపడిన వాళ్ళకి ఒక గమనిక. ఈ సినిమా చరిత్ర ఆధారంగా నిర్మించినప్పటికీ డాక్యుమెంటరీ లా ఉంటుందని అంచనాలు వెయ్యకండి. అలాగే సినిమా లో చూపించినవాటిలో నిజనిజాల సంగతి కూడా నాకు తెలియదు. ఒక వేళ మీరు చరిత్రనే చూడాలనుకుంటే ఈ మధ్యనే ఫ్రాస్ట్/నిక్సన్ అసలు ఇంటర్వ్యూలు డివిడి గా వచ్చాయి. అవి చూడొచ్చు. నా వరకూ ఈ సినిమా ఒక మంచి థ్రిల్లర్ గా బావుందనిపించింది. చూసిన వాళ్ళు మీకెలా అనిపించిందో చెప్పండి.

4 Comments
  1. రమణ February 6, 2009 /
  2. అబ్రకదబ్ర February 6, 2009 /
  3. ravi February 6, 2009 /