Menu

ఓరి నా దేవ్‌డా.. (Oh my God)!!

ఈ సినిమాకి ఒక పేపర్లో రేటింగ్ అయిదు ఇచ్చారు, మరొక పేపర్లో ఒకటిన్నర.ఇదొక్కటే కారణం ఈ సినిమా చూడటానికి. సినిమా చూసిన తరువాత ఆ రెండు తీర్పులు సమంజసమే అనిపించింది. అది ఎందుకో చెప్పేముందు మీకొక చిన్న పరీక్ష:

 1. ఒక సాధారణ పంజాబు మధ్యతరగతి అమ్మాయి లండన్లో వున్న తన చిన్ననాటి ప్రియుడికోసం తన నగ్న ఫొటో తీసుకుని స్టూడియోలో ప్రింట్లు వేయించి, స్కాన్ చేసి మైల్‌లో పంపించింది. దీని గురించి మీరేమంటారు
   • అ) రామ రామ…! ఆ) ఓహో.. అంటే మంచి ప్రోగ్రసివ్ అమ్మాయన్నమాట
 2. అదే అమ్మాయి తెల్లవారగానే ఒక సైకిలుపైన పరుపు చుట్టి తీసుకెళ్ళి దట్టమైన చెరకు తోటల్లో ఆ పరుపును పరిచి తన ప్రియుడితో శృంగారానికి సిద్ధమౌతుంది. ఇప్పుడేమంటారు?
   • అ) హవ్వ హవ్వ.. ఛీ ఛీ ఆ) దాందేముంది… వున్నారు అట్లాంటి అమ్మాయిలు
 3. మరో అమ్మాయి. స్కూలుకెళ్ళే ముందు తన బాయ్‌ఫ్రెండ్‌తో హోటల్‌రూములో అసభ్య శ్రంగారం చేష్టలన్నీ చేస్తుంది. ఆ అబ్బాయి దాన్ని సెల్‌ఫోనులో చిత్రీకరించి ఎం.ఎం.ఎస్ రూపంలో దేశమంతా పాకిస్తాడు. ఏమనిపిస్తోంది?
   • అ) దారుణం. అయితే మాత్రం సినిమాలో అలాంటి విషయాలు చెప్తారా..!! ఆ) అందులో చెప్పకూడనిదేముంది? ఢిల్లీలో ఇలాంటి విషయం జరిగింది కదా?
 4. అదే అమ్మాయి సదరు ఎం.ఎం.ఎస్ ప్రచారంతో ‘మరో దారి’లేక ఒక కమర్షియల్ సెక్స్ వర్కర్‌గా మారి తనకి ఫోన్ చేసిన కస్టమరుతో ఫోనులోనే (మాటల్తోనే) శృంగారం సాగిస్తుంది. నమ్ముతారా?
   • అ) ఛీ ఈ సినిమా తీసినోణ్ణి ఈ రివ్యూ రాసినోణ్ణి కాళ్ళు విరగకోట్టాలి ఆ) అలా మాట్లాడే అమ్మాయిల నెంబరులు పేపర్లో వస్తుంటాయి. మీరు చూడలేదా?
 5. ఇక అసలు ప్రశ్న. ఇందులో మదటి రెండు ప్రశ్నలలో అమ్మాయి పారు, తరువాతి రెండు ప్రశ్నలలో అమ్మయి చంద్రముఖి. వీరిద్దరి మధ్యలో ప్రేమకోసం తపించే దేవదాసు కథ ఇది. ఇప్పుడేమంటారు?
   • అ) ఇది ఘోరం. శరత్ దేవదాసుకి, అక్కినేని నాగేశ్వరరావుకి జరిగిన అవమానం. ఈసినిమాని నిషేదించాలి. ఆ) అయితే ఇది దేవదాసు 2010 అన్నమాట.

పై అయిదు ప్రశ్నలలో ఏ నాలిగింటికి మీ సమాధానం ఆ) అయినా ఈ సినిమాకి మీ రేటింగ్ అయిదు. ఏ నాలుగింటికి అ) సమాధానం ఇచ్చినా మీ రేటింగ్ ఒకటిన్నర.

***

అప్పుడెప్పుడో వాడుక భాష ప్రయోగంపై చందస్సు కవులు విరుచుకుపడ్డారట, మొన్న శ్రీ శ్రీ కవిత్వం రాస్తే ఎందరో మహా కవులు బుగ్గలు నొక్కుకున్నారట, నిన్నటికి నిన్న దిగంబర కవిత్వం చదివి చాలామంది గుండెలు బాదుకున్నారట. ఇప్పుడు దేవ్‌డి అనే సినిమా వచ్చింది. మీరు బుగ్గ నొక్కుకున్నా, గుండెలు బాదుకున్నా ఇది నేటి యువత నిర్లక్ష్య వైఖరికి, అశీలత్వానికి కొంచెం అశ్లీలమైన నిలువుటద్దం. ఈ రకమైన సినిమాతో అనురాగ్ మూస చిత్రాల స్క్రిప్ట్‌లను తగలబెట్టేసాడు, రెగ్యులర్ సినిమాటోగ్రఫీ నడ్డి విరగ కొట్టాడు..!! ఈ సినిమా తీయడానికి ధైర్యం చేసిన అనురాగ్ కాశ్యప్ నిజంగా అభినందనీయుడు.

చెప్పే విధానంలో మార్పు తప్పితే మూలకథ (క్లైమాక్స్ తప్ప) శరత్ దేవదాసు కథే. అయినా రెండింటికీ తూర్పూ పడమరల వ్యత్యాసం వుంది. (శరత్ దేవదాసు బెంగాల్‌వాడైతే, అనురాగ్ దేవ్‌డి పంజాబుకు చెందినవాడు.. ఇక్కడ కూడా తూర్పూ పడమరలే..!!) ఆ దేవదాసు మందు తాగి దిగజారితే, ఇక్కడ దేవదాసు (అంతకు ముందే మందు తాగేవాడు కాబట్టి?) డ్రగ్స్ మీద పడతాడు. అక్కడ చంద్రముఖి పూర్వ వృత్తాతం తెలియదు.. ఇక్కడ అదొక ముఖ్య కథాభాగం. ఇంతకన్నా ఈ సినిమా కథ గురించి కొత్తగా చెప్పేదేమి లేదు.

దేవదాసు నవల ఎన్ని సినిమాలైందో లెక్కపెట్టటం కష్టమే. నేరుగా అదే కథతో వచ్చిన సినిమాలలో మనకి బాగా తెలిసిన అక్కినేని దేవదాసు, దిలీప్ కుమార్ దేవదాసు, కృష్ణ దేవదాసు, షారుక్ దేవదాసు.. కొంచెం ఆధునిక సొబగులద్ది నాగార్జున మజ్ఞు, అక్కినేని దేవదాసు మళ్ళీ పుట్టాడు.. ఇక ఈ కథ “స్ఫూర్తి”తో వచ్చిన సినిమాలు చాలానేవున్నాయి. అలాంటి కథని మరో కోణంలో చూపించే ప్రయత్నం దేవ్‌డి తో అనురాగ్ కాస్యప్ చెయ్యగలిగాడంటే అది నిశ్చయంగా శరత్ గొప్పతనమే అనిపిస్తుంది నాకు.

సినిమా రంగంలో అడుగుపెట్టే ప్రతినటుడు షారుఖ్ ఖాన్ కాలేరు. ఆ సంగతి తెలుసుకోలేని సన్నీలు, బాబీలు అరుపులు, ఫైటులు, పాటలు అనే గోలలతో నేనూ హీరోనే అనిపించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. షారుఖ్ ఖాన్ చెయ్యలేని సినిమాలు చాలా వున్నాయి. అలాంటి సినిమాలు చెయ్యటానికే నేను పుట్టాను అనుకునే నటులు అలాంటి సినిమాలకి సూపర్ హీరోలనిపించుకుంటారు. అభయ్ డియోల్ అలాంటి నటుడు. గతంలో వచ్చిన అభయ్ సినిమాలేవీ నిరాశ పరచలేదు.. ఇందులో కూడా సినిమా నచ్చని వాళ్ళకి కూడా అభయ్ నటన నచ్చి తీరుతుంది. కొత్త హీరోయిన్లు ఇద్దరూ చాలా బాగా చేసారు. మిగిలిన పాత్రలలో నటులు కూడా పరిధిలోనే నటించి, పాత్రలే తప్ప నటులు గుర్తుకురానంత గొప్పగా చేశారు.

సంగీతం రొటీనుకి భిన్నంగా వుంది. కథ ప్రధానంగా పంజాబు, డిల్లీ చుట్టూ తిరుగుతుంది కాబట్టి పాటలు అక్కడి సంగీతాన్నే ఎక్కువగా ధ్వనిస్తాయి. ప్రత్యేకించి “మాహీ రే..”, “ఎమోషనల్ అత్యాచార్..” గుర్తుండిపోతాయి. కెమెరా పనితనం సినిమా చూసేటప్పుడు తెలియదుకాని, ఇంటికొచ్చాక ఆ ఫ్రేములు అలాగే కళ్ళముందు కదిలి ఎంత గొప్ప పనితనం వుందో గుర్తుచేస్తాయి. అనురాగ్ కాశ్యప్ సినిమా అంటే అదొక ప్రత్యేకం అనే మాట మళ్ళీ నిరూపించాడు దర్శకుడు.

***

ఈ సినిమాకి అడల్ట్ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సారు. అయితే పెద్దలకు మాత్రమే అనుకోని మీరు మీ ఆవిడో, మీరు మీ గర్ల్ ఫ్రెండో “కలిసి” వెళ్ళాలంటే ఒక్కసారి పైన ఇచ్చిన పరిక్ష మీ పార్ట్నర్‌కి ఇచ్చి చూడండి. అప్పటికీ మీరు సిద్ధపడితే మరో హెచ్చరిక – తెలుగులో తర్జుమా చేస్తే ఇక్కడ వ్రాయలేని పదాలు ఈ సినిమాలో విరివిగా వాడబడ్డాయి. అందులో కొన్ని నాలుగక్షరాలవి, ఎనిమిదక్షరాలవి, పన్నెండు అక్షరాలవి.. అంతెందుకు పేరగ్రాఫులకి పేరగ్రాఫులే వున్నాయి. అయినా ఫర్లేదా..? అయితే ఈ సినిమా మీకోసమే. అయిదు నక్షత్రాల రేటింగు.

పోనీ ఒక్కళ్ళే వెళ్ళి చూద్దామనుకుంటున్నారా? వెళ్ళండి – మల్టీప్లెక్స్‌లో తప్ప మరెక్కడా ఈ సినిమా కనపడే అవకాశంలేదు. అక్కడ మీ పక్కన ఒక జీన్స్ ప్యాంటు, స్లీవ్ లెస్ – లో నెక్ డ్రస్ అమ్మాయి సిగిరెట్ హడావిడిగా పడేసి వచ్చి కూర్చుంటుంది. ఆ అమ్మాయితో జబ్బలు రాసుకుంటూ శృంగార సంభాషణలు వినటానికి మీరు సిద్ధమేనా? లేదా? అయితే ఈ సినిమా మీకోసంకాదు. ఒకటిన్నర నక్షత్రాల రేటింగు.

మీరు ఏ విభాగంలోకి వచ్చినా ఈ సినిమా చూస్తే మాత్రం “ఓరి నా దేవ్‌డా” అనాల్సిందే – అది ఆశ్చర్యంతో నైనా, అసహనంతో అయినా..!!

చిత్రం: దేవ్.డి (Dev.D – hindi)
జెనెర్: రొమాంటిక్ డ్రామా
నిర్మాణం: UTV
నటీనటులు: అభయ్ డియోల్, మాహి గిల్, కల్కి కోచిలిన్
దర్శకత్వం: అనురాగ్ కాశ్యప్
కాన్సెప్ట్: అభయ్ డియోల్, అనురాగ్ కాశ్యప్
సంగీతం: అమిత్ త్రివేది
విడుదల తేది: 06. ఫిబ్రవరి 2009

—అరిపిరాల సత్యప్రసాద్

23 Comments
 1. వెంకటాచలపతి February 9, 2009 /
 2. ravi February 9, 2009 /
  • sasank February 9, 2009 /
 3. anuraag February 9, 2009 /
 4. శంకర్ February 9, 2009 /
 5. శరత్ 'కాలం' February 9, 2009 /
  • wowchiru February 9, 2009 /
 6. rayraj February 9, 2009 /
  • shree February 10, 2009 /
   • చందు February 11, 2009 /
   • rayraj February 11, 2009 /
 7. shree February 10, 2009 /
  • rayraj February 10, 2009 /
   • Chaitanya February 11, 2009 /
   • rayraj February 11, 2009 /
   • Chaitanya February 12, 2009 /
 8. sujata February 10, 2009 /
 9. అరిపిరాల February 11, 2009 /
  • Chaitanya February 12, 2009 /