’రూపవాణి వారి ఆనాటి అమూల్యమైన రచనలు నేటితరానికి అందించేందుకు నవతరంగం పునఃప్రచురణగావిస్తున్న విషయం గతంలో కొన్నిసార్లు ప్రస్తావించడం జరిగింది. తరం మారినా మన సినిమా ప్రమాణాలు మారాలని కోరుకునే సినిమా ప్రేమికుల అభిరుచులు అప్పుడూ,ఇప్పుడూ మారలేదనడానికి ఈ రచనలే నిదర్శనం. ఎందరో ప్రముఖులు వ్రాసిన ఈ రచనలను ప్రచురించే అనుమతి ఇచ్చిన S V శ్రీనివాస్ గారికి ధన్యవాదములు.అచ్చులో ఉన్న ఈ వ్యాసాలను డిజిటైజ్ చెయ్యడంలో పాలుపంచుకుంటున్న నవతరంగం రచయితలందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ కార్యక్రమంలో భాగంగా చందూగారిద్వారా నవతరంగప్రవేశం చేస్తున్న ఈ వ్యాసాలను వారానికొక్కటి చొప్పున ప్రచురిస్తున్నాం. చదివి ఆనందించండి. ’
తెరపైకి వచ్చే తెలుగు చిత్రాలే చాలా అరుదు. తెలుగులోకం ఎప్పటికప్పుడు నోళ్ళు తెరచుకొని ఎదురుచూస్తుంటుంది తెలుగు చిత్రాలకోసం. ఏదైనా చిత్రం వస్తుందని పత్రికల్లో ప్రకటన చూడగనే చిత్రశాలల కెగబడి, నిరాశతో ఇంటిముఖం పట్టడం ఈ రోజుల్లో పరిపాటైపోయింది
అభ్యుదయాన్నిగోరే వ్యక్తిగూడ ప్రస్తుత చిత్రాల్లో చూపబడే చౌకబారు హాస్యాన్ని గాని, నిస్సారమైన కథావస్తువునుగాని ఏవగించుకోక మానడు. గృహప్రవేశంలో ‘కర్టెన్ ఎత్తకయ్యా’ అని సి.యస్. ఆర్. చే అనిపించే హాస్యధోరణిగాని, ‘ రత్నమాల ‘ యొక్క కథావస్తువునుగాని పరిశీలిస్తే ప్రేక్షకుడు ఎప్పుడు హాలునుండి బయటపడదామా అనే ఆతురత పడ్డం తప్ప వాటిలో ఆనందిచగల్గింది గాని, నేర్చుకోవలసింది గాని ఏముంది?
వైజ్ఞానికంగాను, నైతికంగాను నేటిసమాజం పతనావస్థలో శిథిలమైఉంది. చిత్రాలద్వారా సమాజాన్ని చక్కదిద్ది రూపులొత్తవలసిన అవసరం ఎంతేని ఉంది. ఆబాధ్యత చిత్ర నిర్మాతలపై ఉందని వేరే చెప్పనవసరం లేదు.
సరైన పెట్టుబడి లేకనైనా కానీయండి, పెట్టుబడి పెట్టినవారు దాన్ని మరల చేజిక్కించుకోవాలనే కోరికతో నైనా కానీయండి ప్రస్తుత తెలుగు సినిమాల నిర్మాణం అధోగతిపాలైంది. ప్రదర్శనానికి వచ్చే చిత్రాల్లో నూటికి తొంభైతొమ్మిదిపై జెప్పినటువంటి పుక్కిటి పురాణాలో నిస్సారమైన కాశీమజిలీ కథలుగానో ఉండి ప్రేక్షకుల్ని విసుగుపుట్టిస్తున్నయి. వచ్చిన ఒకటి రెండు సాంఘికచిత్రల్లో చౌకబారు హాస్యాల్ని చొప్పించి ప్రేక్షకుల హృదయాల్ని చిల్లులు బొడవడం జరుగుతోంది.
ప్రపంచం సహజంగా ముందుకుపోవడం దాని నైజం, కాని నవీననిర్మాణ చిత్రాల్ని గత చిత్రజగత్తును పోల్చి చూచినట్లయితే ఇప్పటి చిత్రనిర్మాతలు యే ఒక్కరో ఇద్దరో తప్ప – నైజానికి ఎదురీత ఈదుతున్నారని చెప్పక తప్పదు. చిత్రజగత్తునే తద్వారా మానవ సమాజాన్నే బహిరంగంగా ఖూనీ చేస్తున్నారన్న మాట. ఉదాహరణకు గత చిత్రాల్ని సమీక్ష చేసినట్లయితే, ‘మాల పిల్ల ‘ ‘రైతుబిడ్డ ‘ ‘వందేమాతరం’ ‘దేవత ‘ మొదలైన చక్కని చిత్రాలు కండ్ల ఎదుట కనిపిస్తవి – పుట్టుకచే నిమ్నోన్నతులను నిర్ణయించే మూఢకుల తత్వాన్ని వెన్నుపోటు పొడిచాడు ‘మాలపిల్ల ‘ దర్శకుడు. క్రూర జమిందారీ ఇనుప పాదాలక్రింద పడి నలిగే బక్కరైతును చక్కగా చిత్రించి ప్రేక్షకలోకాని కందిచాడు “రైతుబిడ్డ” దర్శకుడు – సంఘంలో పారంపర్యంగా వస్తున్న కుటుంబ దుస్సంఘటనల్ని తేటతెల్లంజేచి చక్కదిద్దుకునేందుకుగా విజ్ఞానాన్ని ప్రభోదించాడు “వందేమాతరం” దర్శకుడు – నానాటికి విజృంభిస్తున్న వ్యభిచారం, త్రాగుడు మొదలైన దురలవాట్లతో కుళ్ళుకంపు గొడ్తున్న సమాజాన్ని కడిగి బట్టబయలు జేశాడు “దేవత” దర్శకుడు.
ఇలాంటిచిత్రాలను చూచి నైతికంగా లాభం పొందిన తెలుగు ప్రేక్షకుడు నవీనంగా నిర్మితమౌతున్న చిత్రాల్నిచూచి ఏడుస్తాడు, కడుపుమండి దర్శకుల్ని కారుకూతలు కూస్తాడని పాఠకులే గ్రహిస్తారని తలుస్తా.
ఇప్పటి చిత్రకారులిది గమనించి చిత్రాన్ని తీసేప్పుడు దాన్ని వ్యాపార సరళిలో చూడక, అట్టడుగున బడిపోయిన సమాజాన్ని గుర్తించి ఒక ప్రజోపయోగకరమైన ఆయుధంగా తెలుసుకోవాలి. అప్పుడే మానవసమాజాన్ని వెనక్కుగాక ముందుకు తెసుకొనిపోగల్గుతం. దీనికి అడ్డంకిగా ఆర్థిక పరిస్థితిని అడ్డుచూప ప్రయత్నిస్తే చిత్రనిర్మాత లీ సమస్యను ప్రజానీకానికి వదిలి సినిమారంగం నుండి తప్పుకోడం శ్రేయోదాయకంగా కనిపిస్తుంది. ఆర్థికంగా సమాజాన్ని Indirectగా కొద్దో గొప్పో బలపరచినవారౌతారు. చేతులుముడుచుకొని కూర్చోదలిస్తే కాదు కార్యశూరులు కావాలని నిర్మాతలు తలచేట్టయితే ప్రజోపకరమైన చిత్రనిర్మాణానికి ప్రజాప్రభుత్వంపై ఒత్తిడితీసుకురావడం ఉత్తమమార్గం. ప్రజలు పత్రికలు ఎప్పుడూ సిద్ధంగావుంటై ఆ కార్యంలో తోడ్పాటుకు. ప్రజోపయోగమైన కార్యాన్ని కాలదన్నటానికి ప్రభుత్వానికి దమ్ములుంటయ్యేమో చూద్దాం!
రచయిత: “ముక్కామల”
ప్రచురణ: రూపవాణి, మార్చి 1948
శివాజీ says:
చాల బావుంది..
అలాగే ప్రకామ్యలో మూవీ గైడ్ డౌన్లోడ్స్ ఎర్రర్ చూపిస్తోంది. సోల్యుసన్….? కుదరకపోతే నా మెయిల్ కి పంపించండి
sivajikcvag@gmail.com i need movieguide
రామేశబాబు says:
ఎంత విచిత్రం! అప్పటికే అంటే 1948 లోనే ఎంత బాధ పడ్డారు? ఇప్పుడైతే ఆత్మహత్య స్థాయిని దాటి హత్యలు చేసుండే వారేమో ఆ వ్యాసకర్త. ఎంత బాధను చూపించారు వ్రాతలలో!
నిజమే కానీ ఎలా అంతంత పెట్టుబడులు పెట్టి మళ్ళీ సామాజిక బాధ్యత అంటే ఎలా, పాపం వాళ్ళూ బ్రతకాలిగా?
ఇలా వ్రాతలలో తిట్టుకొని వాళ్ళ పాపానికి వాళ్ళను వదిలేసి మళ్ళీ మనమ్ మామూలుగానే వచ్చిన ప్రతి సినిమా చూసేద్దాము. రోజులిలా గడవాల్సిందే, అంతకంటే మనం మాత్రం ఏమి చెయ్యగలం?