Menu

అల్ పచినో ఆణిముత్యాలు

అల్ పచినో పేరు తెలియని హాలీవుడ్ సినిమాలు చూసిన ప్రేక్షకులు ఉండరు. కొన్ని పోల్స్ లో హాలీవుడ్ ఆధునిక శకంలో అత్యుత్తమ నటుడిగా ఎన్నుకోబడ్డాడు. అల్ పచినో పేరు చెప్పగానే మనకు మొదట గుర్తు వచ్చేది గాడ్‌ఫాదర్. ఆ తర్వాత Scarface.  ఈ సినిమాల్లో ఆద్యంతం దాదాపు ఒకే తరహా నటన కనిపిస్తుంది. నటనలో వైవిధ్యం తక్కువ. అల్ పచినో అంటే కేవలం గంభీరమయిన లేదా మాఫియా తరహా పాత్రలే అనుకొనేవాడిని కొద్ది కాలం. కానీ ఆ తర్వాత కొన్ని సినిమాలు చూసాక అర్థమయింది ఎంత గొప్ప నటుడో. నాకు బాగా నచ్చిన కొన్ని ఆణిముత్యాలు:

Scent of a Woman
పేద విద్యార్థి అయిన చార్లీ, క్రిస్‌మస్‌కు ఇంటికి వెళ్ళడానికి అవసరమయిన డబ్బుకోసం తనకు తెలిసిన వాళ్ళు లేనపుడు వాళ్ళ ఇంట్లో ఉంటున్న ఫ్రాంక్ అనే అంధుడయిన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌కు సహాయకునిగా ఉండడానికి ఒప్పుకుంటాడు. ఫ్రాంక్ యుద్దంలో కళ్ళు పోగొట్టుకొని తన దుస్థితికి లోలోపల బాధపడుతూ ఆ కోపాన్ని ఇతరుల పైన చూపుతుంటాడు.

కాలేజీలో కొందరు విద్యార్థులు చేసిన తుంటరిపనులను చూసిన చార్లీ వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని ప్రిన్సిపాల్ ఎంత ప్రలోభపెట్టినా అంగీకరించడు. ఇది జరిగిన మరుసటి రోజు చార్లీని తన వెంట న్యూయార్కుకు రావాలని ఫ్రాంక్ చెప్తాడు. కాదనలేక ఫ్రాంక్‌తో చార్లీ  న్యూయార్కుకు వెళ్తాడు. ఫ్రాంక్ చాలా ఖరీదయిన హోటల్‌లో బస చేస్తాడు. తన పట్ల ఫ్రాంక్ ఎంత దురుసుగా, కఠినంగా ప్రవర్తిస్తున్నా చార్లీ కోపగించుకోడు. తాను న్యూయార్కుకు వచ్చింది ఖరీదయిన రెస్టారెంట్లో తిని, లగ్జరీ హోటల్లో బసచేసి, తన అన్నను కలసి, ఒక అందమయిన అమ్మాయితో గడిపి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవడానికి అని ఫ్రాంక్ చెప్తాడు. ఫ్రాంక్ ఆత్మహత్యను చార్లీ ఆపగలుతాడు.
చార్లీలోని మంచితనాన్ని గ్రహించిన ఫ్రాంక్ అతడిని మిత్రుడిలా భావిస్తాడు. కుర్రవాడు అయిన చార్లీ దగ్గర తాను ఎంతో నేర్చుకోవలసింది ఉంది అని తెలుసుకుంటాడు. చివరగా, చార్లీని కాలేజీనుండి తీసివేసే తరుణంలో ఫ్రాంక్ ప్రవేశించి తన మాటలతో అందరి ఆలోచనల్లో మార్పు తెచ్చి చార్లీ కాలేజీలో ఉండేలా చేసి జీవితం పట్ల కొత్త దృక్పథంతో ఇంటిదారి పడతాడు.

ఈ సినిమాలో అల్ పచినో నటనకు ఉత్తమ నటుడు అవార్డు రావడం ఆ అవార్డు చేసుకున్న అదృష్టం అంటే అతిశయోక్తి కాదేమో!! అంధుడిగా తన నటనతో ప్రేక్షకులను నొప్పిస్తాడు, బాధపెడతాడు, ఒక్కోసారి నవ్విస్తాడు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అసహ్యించుకునేలా చేస్తాడు (తన అన్న ఇంట్లో సన్నివేశాలు). ఈ సినిమా గురించి తెలిసిన వాళ్ళకు మొట్ట మొదట గుర్తు వచ్చేది చార్లీ కాలేజ్‌లో ఫ్రాంక్ ఇచ్చే ఉపన్యాసం. కంచు కంఠంతో మంత్రముగ్దుల్ని చేస్తూ మాట్లాడిన ఆ సన్నివేశం ఇక్కడ చూడండి http://www.youtube.com/watch?v=dH4p9BQ3V9o. ఇంతకూ ఈ సినిమాకు ఆ పేరెందుకు అంటారా?? 🙂

Carlito’s Way
జైలు నుండి విడుదలయిన కార్లిటో డ్రగ్స్ వ్యాపారానికి స్వస్తిచెప్పి నిజాయితీగా బ్రతకాలి అని నిశ్చయించుకుంటాడు. ఒక క్లబ్‌లో మేనేజర్‌గా పనిచేస్తూ డబ్బు కూడపెట్టడం మొదలు పెడతాడు. తన పాత గర్ల్ ఫ్రెండ్ అయిన గైల్‌ను తామిరువురు పెళ్ళి చేసుకొని దూరంగా వెళ్ళి హాయిగా జీవించేలా వప్పిస్తాడు. తనను జైలు నుండి బయటకు తీసుకొచ్చిన లాయరు బలవంతం పైన అతడితో కలసి ఒక మాఫియా బాస్‌ను, బాస్ కొడుకును హత్య చేస్తాడు. ఆ వూరు విడిచి వెళ్ళిపోయేందుకు గైల్‌ను రైల్వే స్టేషన్‌కు రమ్మని చెబుతాడు. తాను సంపాదించిన డబ్బు తీసుకుని రైల్వే స్టేషన్‌కు వెళ్ళి అక్కడ మాఫియా సభ్యుల కంటబడకుండా తప్పించుకొన్నా చివరికి వారి కాల్పులకు బలి అయి గైల్‌కు డబ్బు అందజేసి కన్ను మూస్తాడు.

అల్ పచినో సినిమాల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందని “గొప్ప సినిమా” ఇదేనేమో. Scarface లో చేసిన పాత్రకు ఈ సినిమాలో చేసిన పాత్ర పూర్తిగా భిన్నమయినది. గతాన్ని మరచిపోయి మంచి జీవితాన్ని గడపాలని ఆశపడే పాత్రలో అల్ పచినో నటన చాలా బాగుంది. తన ప్రియురాలికోసం పడే తపన, తనకు సహాయం చేసిన లాయరు మాట కాదనలేక అతడు చెప్పినవి చేయడం ఆకట్టుకుంటాయి. రైల్వే స్టేషన్‌లో మాఫియా సభ్యులనుండి తప్పించుకోవడం ఉత్కంఠభరితంగా ఉంటుంది. కొన్ని తప్పులు చేసిన తర్వాత ఎంత ప్రయత్నించినా వాటిని సరిదిద్దుకోలేము, ఫలితం అనుభవిస్తాము అని యువతకు మంచి సందేశాన్ని ఇచ్చే ఈ సినిమా అల్ పచినో అభిమానులు తప్పక చూడాలి.

The Insider
ఇది యథార్థ సంఘటన ఆధారంగా తీయబడిన సినిమా. CBS ఛానెల్ లో ప్రసారమయ్యే 60 Minutes ప్రోగ్రాంలో టొబాకో కంపెనీలు ఎక్కువ నికొటిన్ వాడుతున్న విషయాన్ని  చెప్పడానికి ఆ ప్రోగ్రాం రూపకర్త అయిన అల్ పచినో భరోసా తో  టొబాకో కంపెనీలో పని చేసే సైంటిస్ట్ (రస్సెల్ క్రోవ్) ముందుకు వస్తాడు. అన్ని నిజాలు చెప్తాడు. ఆ క్రమంలో రస్సెల్ క్రోవ్ ఉద్యోగం పోతుంది, భార్య,పిల్లలకు దూరమౌతాడు. టొబాకో కంపెనీలు అన్ని వైపులా ఒత్తిడి తీసుకొస్తాయి. ఆ వొత్తిళ్ళకు CBS ఛానెల్ యాజమాన్యం తలవంచి రస్సెల్ క్రోవ్ ఇంటర్వ్యూను ప్రసారం చేయదు. అపుడు అల్ పచినో ఆ ఇంటర్వ్యూ ప్రసారమయ్యేలా ప్రయత్నిస్తాడు. నిజాలు తెలిసి టొబాకో కంపెనీల పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

ఈ సినిమాలో నాకు ప్రధానంగా నచ్చిన అంశమేమిటంటే, అల్ పచినో ఇందులో హీరో కాదు. రస్సెల్ క్రోవ్ అప్పటికి పెద్ద గుర్తింపు పొందలేదు. అయినా సరే ఆ పాత్రకున్న విలువ వల్ల చేసాడు.  రస్సెల్ క్రోవ్ ప్రధాన పాత్రలో కనిపిస్తూనే ఉంటాడు కానీ అల్ పచినో ఉన్న కొద్దిసేపు ఆ సంగతి మరచిపోతాము.  ఇంటర్వ్యూ ప్రసారం ఆగిపోయినపుడు దానిని ప్రసారం చేయమని CBS యాజమాన్యంతో వాదించే సీన్ చాలా బాగుంటుంది.

–జీడిపప్పు

5 Comments
  1. Chetana February 12, 2009 /
  2. అబ్రకదబ్ర February 12, 2009 /
  3. shree February 12, 2009 /
  4. శ్రీ లక్ష్మి కళ February 12, 2009 /