Menu

అదూర్ గోపాల కృష్ణన్-ఒక పరిచయం

అదూర్ గోపాలకష్ణన్ అంతర్ముఖుడయిన ఓ గొప్ప భావుకుడు. ఆయన చిత్రాల్లో తెరలుతెరలుగా ఆయనదే అయిన జీవన చిత్రం కనిపిస్తూ ఉంటుంది. ఆయన సాధారణంగా తన చిత్రాలకి తానే కథ,కథనాన్ని సమకూర్చుకుంటాడు. కాని ఆయన నిర్మించిన ’మదిలుకల్’, ’విధేయన్’, ’నాలు పెన్నుంగల్’ చిత్రాలు వేరేవాళ్ల రచనల ఆధారంగా నిర్మించబడ్డాయి. సాధారణంగా ఒక చిత్ర నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత మరే ఆలోచననీ తనలోకి చొరబడనీయకుండా కథ నుంచి మొదలుకొని మొదటి ప్రింట్ సిద్ధమయ్యేంతవరకూ అన్నీ తానే అయి నిర్మాణం చేపట్టే అదూర్ తన చిత్రాల మధ్య కనీసం రెండు మూడేళ్ళ వ్యవధి తీసుకుంటాడు. అలా ’విధేయన్’ తర్వాత రెండేళ్లకి అదూర్ నిర్మించిన ’కథాపురుషన్’ 1997 జనవరి త్రివేండ్రంలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోని ఇండియన్ పనోరమా లో ప్రదర్శించారు. ఈ చిత్రం అప్పటికే దేశ విదేశాల్లో మన్ననలు పొందించి. అంతకుముందు పాల్ జక్కారియా రాసిన నవలిక ఆధారంగా అదూర్ నిర్మించిన ’విధేయన్’ పెద్ద వివాదాన్నే లేవనెత్తింది. “తన నవలను చిత్రీకరించడంలో అదూర్ విపరీతంగా ప్రపర్చించాడని, తన కథకి చిత్రంలో హిందుత్వాన్ని జోడించి మొత్తంగా నవలకి సినిమాలో యదార్థ రూపం ఇవ్వలేకపోయాడని” పాల్ జక్కారియా విమర్శించాడు. ఈ వివాదం పెద్ద ఎత్తున చెలరేగడంతో అదూర్ పెద్ద సందిగ్దంలో పడిపోయాడు. “సాహిత్య పఠనం వ్యక్తిగత అనుభవమయినపుడు సినిమా సామూహిక అనుభవమవుతుంది. నవలనో నాటకాన్నో చలనచిత్రంగా మలచినపుడు అది ఖచ్చితంగా మూల రచనలాగా ఉండాలనుకోవడం కూడదు” అని అదూర్ గోపాల్ కృష్ణన్ అంటారు. ’విధేయన్’ వివాదంతో తీవ్రంగా ఘర్షణకు లోనయిన అదూర్ మళ్ళీ తనను తాను నిభాయించుకుని ’కథా పురుషన్’ నిర్మించారు. తను తీసిన పది చిత్రాల్లో అధికంగా స్వీయ చరిత్రాత్మక చిత్రంగా ’కథా పురుషన్’ ని గోపాలకృష్ణన్ వర్ణించాడు. జపాన్ టెలివిజన్ నెట్ వర్క్ ఎన్.హెచ్ కోసం నిర్మించిన ఈ చిత్రం భారతీయ హక్కులు అదూర్ వే. జపాన్ బయట ఆ చిత్రానికి లభించే ఆదాయంలో సగం అదూర్ వాటాగా నిర్ణయించుకున్నారు. ఈ చిత్రం 1940 నుండి 1980 వరకూ దశాబ్దాల వారీగా చరిత్రని నిక్షిప్తం చేసింది. అట్లని ఇది కేవలం నాయకుడి జీవిత చరిత్ర మాత్రమే కాదు. వ్యక్తిగత జీవితాలపైన సామాజిక రాజకీయాల ప్రభావం ఎట్లా ఉంటుందన్నది ఈ చిత్రం మౌళికాంశం. 1940 వ దశాబ్దంలో ప్రధాన అంశం స్వాతంత్ర్యం కాదు గాంధీ మరణ ప్రభావం, 50వ దశకం మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వ ప్రభావం కాదు భూసంస్కరణల బిల్లు ప్రజలపైన చూపించిన ప్రభావం, తర్వాతి దశాబ్దం నక్సలైటు ప్రభావం, ఆ తర్వాత 70వ దశకం ఎమర్జెన్సీ సామాన్య ప్రజానీకంపై చూపించిన ప్రభావం, అలా కథాపురుషన్ మొత్తం పొరలు పొరలుగా తెరలు తెరలుగా 1940 నుంచి 1980 వరకు చరిత్రని జీవితాన్ని కలగలిపి నడిపిస్తుంది. ఆయా కాలాల ప్రభావాన్ని,మార్పుల్ని వాతావరణ పరిస్థుతులతో సహా కథాపురుషన్ లో అదూర్ ఆవిష్కరించారు.

అదూర్ ’ముఖాముఖం’ కూడా పెద్ద వివాదాంగానే నిలిచిపోయింది. అది కేరళ కమ్యూనిస్టు వ్యతిరేక చిత్రంగానూ, అదూర్ కమ్యూనిస్టు వ్యతిరేకి గానూ విమర్శలు ఎదుర్కొన్నాడు. ’కథా పురుషన్’ కూడా మరో వివాదం పెంచేదిగా ఉంది. ఎందుకంటే ఈ చిత్ర నాయకుడు కుంజుణ్ణి స్వల్పంగా ’నత్తి’తో తీశారు.అది మరో పెద్ద మార్క్సిస్టు నాయకుణ్ణి పోలి ఉంది మరి.

మలయాళీ చిత్ర సీమలో నవ్య సినిమాల పరంగా ప్రముఖుడయి అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన అదూర్ 1941 లో పుట్టారు. పూనే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో స్క్రిప్ట్ రైటింగ్, దర్శకత్వ శాఖల్లో డిప్లొమా పొందారు. ఆయన కేరళ ఫిలిం సొసైటీ ఉద్యమానికి ఊపిరిగా ఉన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా చిత్ర నిర్మాణం కోసం ’చిత్రలేఖ ఫిలిం కో ఆపరేటివ్’ ని స్థాపించి 1972లో ’స్వయంవరం’ నిర్మించాడు. అదూర్ గ్రామంలో కథాకళి నాటికలు పోషించే కుటుంబంలో జన్మించిన గోపాలకృష్ణన్ నిర్మించిన ’స్వయంవరం’ జాతీయస్థాయిలో ఉత్తమచిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటి బహుమతుల్ని అందుకుంది. ఈ చిత్రంలో నటనకి తెలుగు నటి శారదకి ఊర్వశి అవార్డు లభించింది. అలాగే ఈ సినిమా నాలుగు రాష్ట్ర స్థాయి బహుమతులు కూడా అందుకుంది.

1977లో అదూర్ నిర్మించిన ’కొడియాట్టం’ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు, ఐదు రాష్ట్ర అవార్డులు వచ్చాయి. ఇందులో నటించిన గోపికి భరత్ అవార్డు లభించింది. 1982 లో అదూర్ నిర్మించిన చిత్రం ’ఎలిపత్తాయం’ కు బ్రిటీష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ వారు అత్యుత్తమ వాస్తవిక చిత్రంగా అవార్డునిచ్చారు. ఈ అవార్డును సత్యజిత్ రే తర్వాత అందుకున్న రెండవ భారతీయ చలనచిత్రకారుడు అదూర్.

1984 లో గోపాల్ కృష్ణన్ చిత్రం ’ముఖాముఖం’ కొంత చర్చను లేవదీసింది. ఒక కమ్యూనిస్టు కార్యకర్త జీవితాన్ని చిత్రీకరించిన ’ముఖాముఖం’ గెలుపోటముల సంక్షోభాన్ని ఆవిష్కరించింది. 1987 లో అదూర్ నిర్మించిన ’అనంతరం’ కూడా దేశ విదేశాల్లో ప్రశంసలను అందుకుంది.

ఆ తర్వాత అదూర్ ’మథిలుకల్’ చిత్రాన్ని ప్రఖ్యాత మలయాళీ రచయిత వైక్కం మహ్మద్ బషీర్ రచించిన నవల అధారంగా చేశారు. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో బషీర్ అనుభవించిన జైలు జీవితాన్ని ఈ చిత్రం ఆవిష్కరించింది. ఈ చిత్రం ఇద్దరి మధ్య కలిగే మాహాధ్బుతమయిన దగ్గరతనాన్ని అత్యంత బాధాకరమయిన వియోగాన్ని చెబుతుంది. ప్రాధమిక విద్యస్థాయిలోనే చదువును ఆపేసిన బషీర్ స్వాతంత్ర్య పోరాటంలోకి దూకి ఉగ్రవాదిగా ముద్రపడి దేశం పట్టిపోతాడు. ఏడేళ్ళు తిరిగి తిరిగి ఊరు చేరిన బషీర్ ను పోలీసులు అరెస్టు చేస్తారు.బషీర్ జైలులో రచయితగా ఎదుగుతాడు. స్వాతంత్ర్యం వచ్చిన పర్యవసానంగా అందరినీ వదిలేసిన ప్రభుత్వం బషీర్ ని మాత్రం వదలదు. ఆవేదనలో ఉన్న బషీర్ కు జైలు గోడకు అవతలి పక్కన గల మహిళా జైలులోని నారాయణితో మాట కలుస్తుంది. గోడకి చెరోపక్క ఉన్న వారి మధ్య స్నేహం పెరుగుతుంది.ఇద్దరూ ఆసుపత్రిలో కలుద్దామని నిర్ణయించుకుంటారు. కాని అదే రోజు బషీర్ ను ప్రభుత్వం విడుదల చేస్తుంది. తెల్లారి కలవాల్సిన నారాయణిని కలవలేక బషీర్ స్వేచ్ఛకు అర్థాన్ని వెతుక్కుంటాడు. ముథులికల్ లో బషీర్ పాత్రని మమ్ముట్టి గొప్పగా పోషించి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నాడు.

ఆ తర్వాత అదూర్ దర్శకత్వంలో ’విథేయన్’, ’కథాపురుషన్’ వచ్చాయి. ఈ మధ్యనే అదూర్ నిర్మించిన నాలు పెన్నుంగల్ కూడా పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడింది. అదూర్ పూర్తినిడివి సినిమాలతో పాటు 25 కి పైగా డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్ లు నిర్మించాడు. ఆయన మంచి రచయిత కూడా. 1965-82 ల మధ్య ఆయన రాసిన సినిమా వ్యాసాల సంకలనానికి జాతీయ బహుమతి లభించింది.

వీటికి తోడు అనేక జాతీయ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అదూర్ పాల్గొని అవార్డులు గెలుచుకున్నారు.

రచయితగా మొదలై చలనచిత్రకారుడిగా ఎదిగిన భారతీయ నవ్య సినిమా దర్శకుల్లో ముందు వరసలో నిలుచున్నాడాయన. నిర్మించిన చిత్రాల సంఖ్య తక్కువే అయినా ’దృశ్యకారుడిగా’ పేరు గాంచాడు అదూర్ గోపాల్ కృష్ణన్.

5 Comments
  1. K. Rohiniprasad February 3, 2009 /
  2. shree February 3, 2009 /
  3. venkat B February 3, 2009 /
  4. పూర్ణ February 3, 2009 /
  5. శంకర్ February 3, 2009 /