Menu

తెలుగు ఎనారై గాళ్ళు వేష్ట్ రా మామా!

ఈమధ్యకాలం లో చాలా మంది ఎన్నారై ల గురించి తెగ బాధ పడుతున్నారు.. వీళ్ళదగ్గర డబ్బులు చెట్లకు కాస్తున్నా.. ఖర్ఛుపెట్టట్లేదు బాబోయ్ అని.. ఇంకా పూరి తన సినిమా లో ఎనిమిది డాలర్లు ఖర్ఛు పెట్టి సినిమా చూడని ఎన్నారై లని తిట్టిపోశాడు. బాగానే వున్నాయండి మీ అభిప్రాయాలు. నిజమే.. మా దగ్గర డాలర్లు చెట్లకే కాస్తున్నాయి అనుకుందాము..మా పళ్ళు మేమే తినాలా.. లేక దారినపోయే మీరంతా రాళ్ళు రప్పలు వేసి మా పళ్ళు కొట్టుకెళతారా!!

ఇక మేమెందుకు సినిమాలు చూడాలి అన్నది మా ఇష్టమా లేక మీరు అదే పనిగా తీస్తున్న మూస సినిమాలు ఎగబడి చూడాలా.. పో. ఎదో పూరి సినిమా కదా వెళ్దాము అనుకుందాము. ఇక మా పాట్లు భగవంతుడికే తెలియాలి. ఈ సంగతి పూరి కి తెలిసినా అది తన సినిమాలో చెప్పె ధైర్యం ఆయనకు లేదు. అది ముట్టుకుంటే ఆయన్నే కాలుస్తుంది. అదేమిటో మీకు చెప్పాలనే ఈ ప్రయత్నం.

ఈ మధ్య అన్ని సినిమాలు ఇండియా లోను అమెరికా లోను ఒకే రోజు రిలీజు అవుతున్నాయి.. మంచిదే.. వెబ్ సైటు చూస్తాము. ఫలానా సినిమా ఫలానా రోజు నుంచి ఫలానా టైము అని.. ఫలానారేటు అని..ఓకే మాష్టారు.. పదండి చూద్దాము చికాగో డెస్ ప్లేయన్స్ ధియేటర్లో.. మన తెలుగు సినిమా.
అది డెస్ ప్లేయన్స్ డౌన్టౌన్లో ఓ చిన్న ధియేటర్.. రెండే వెండితెరలు.. చాలా పాత ధియేటర్. రోడ్డు మీద క్యూ కట్టాలి. మన తెలుగువాడు కౌంటర్లొ కూర్ఛుని అతి కష్టం గా ఒకొక్క టికెట్టు ఇస్తాడు. మనిషికి 5 నిమిషాలు అంటే చాలా తక్కువే అనుకుంటా. వెబ్ సైటు లో రేటు 7 డాలర్లు గదా అని 10 నోటు ఇస్తే వెనక్కి విసిరేసి 15 డాలర్లు టికెట్టు అంటాడు. అసలే ఓ గంట డ్రైవ్ చేసుకుని వెళ్ళిన వాళ్ళము వెనక్కి తిరిగి వెళ్ళాలా లేక మనఖర్మ లేదా వాడి ఖర్మ అనుకొని 20 నోటిస్తే చిల్లర లేదంటాడు. బాసు అక్కడ 5 నోట్లు వున్నాయి గదా అంటే మీ కిచ్చేస్తే తర్వాత వచ్చే వాళ్ళకి ఎలా అంటాడు. అంటే ముందు వచ్చిన మా కంటే వస్తాడో రాడో తెలీయని వాడికి మర్యాదలు. 5 వదులుకొనో లేక 5 సర్దుకునొ టికెట్ తీసుకుని లోపలికి వెళ్దాము.

ఆన్ లైన్లో రిజర్వేషన్ చేసుకోవచ్చు. కానీ వచ్చిన చిక్కేమిటంటే.. మనం కన్ఫర్మేషన్ ప్రింటు చేసి తీసుకెళితే దాన్ని ఆయన ఎగాదిగా అరగంట చూసి టికెట్ ఇస్తాడు. దానికి లాబీలో క్యూ కట్టాలి. సామాన్యంగా ఈ క్యూ చాలా పెద్దది వుంటుంది. నాకు ఇప్పటికి ఆన్ లైన్లో రిజర్వేషన్ సుఖం అర్దంకాదు. లాస్ట్ మినిట్ టికెట్ రేట్ షాక్ వుండదు. నేను ఎప్పుడు ఆన్ లైన్లో రిజర్వేషన్ లో టికెట్ తీసుకున్నా లోపలికి వెళ్ళేటప్పటి కి ఫస్ట్ రో లొనే సీట్లు దొరికేవి. దాంతో బ్రతుకుజీవుడా అని రిజర్వేషన్ మానేసాను. టికెట్టు దొరకని పరిస్థితి రాదు లెండి. ఎక్స్ ట్రా సీట్లు వేయచ్చు.

లోపల అతి చిన్న ఇరుకు లాబీ. గట్టిగా 50 మంది నిలబడితే ఒకరిని ఒకరు హత్తుకోవాలి. టాయ్ లెట్ సువాసన ముక్కులు బద్దలు కొడుతుంది. సారీ. మనం తెలుగు సినిమా కి వచ్చాము కదా. ఔకాత్ నహీ భూల్నా.. సర్దుకుపోవాలి సార్..ఆ పక్కనే సమోసా. డాలరు కి ఒక్కటి. చిల్లర ప్రాబ్లం వుండదు. లోపల సినిమా నడుస్తున్నట్లుంది. అవును మాష్టారు. మ్యాటనీ ఓ గంట లేటు. సర్దుకుపోవాలి.

ఏదో బాతాఖానీ తో ఓ గంట గడిస్తే చాలు..అదో మ్యాటనీ అయిపోయింది. ఇక లోపలికి వెళ్ళితే పాత సీట్లు..ఒకే క్లాస్.. ఫర్లేదు.. ఇండియా లో చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుచేసుకోవచ్చు. అప్పటికే ముందు వెళ్ళిన మహాశయులు.. రుమాళ్ళు, తాడులో, లేక పోతే ఆ చివర ఒక్కళ్ళు ఈ చివర ఒక్కళ్ళు కూర్చుని మా వాళ్ళు వస్తున్నారండి. సీట్లు లేవు అంటారు.. ఎందుకంటే మనకు సీట్ నెంబర్లు వుండవు. ఈలోగా సినిమా స్టార్ట్ అయిపోయింది. గురూ జరుగు అని జనాల ఘోష.. సర్దుకోరా భాయి.. నువ్వు అక్కడ కుర్చో నేనిక్కడ కూర్చుంటాను. నోయాడ్స్..నో కమింగ్ మూవీస్.. సరాసరి సినిమా మొదలు. ఈలోగా ఓ అమ్మడు గొడవ. చలికాలం ఐతే బాబ్జీ (మొగుడు నే లెండి) చాలా కూల్ గా వుంది. హీట్ పెంచమని..ఎండా కాలం ఐతే  బాసూ.. కూలింగ్ పెంచమని చెప్పు అని. బాబ్జీ వెళ్ళి తిరిగి వచ్చాడు.. హనీ పొద్దున్న నుంచి అన్నీ ఫుల్ ఆన్ ట. కాసేపు బేర్ చేస్తే అన్ని మర్చిపోతావుట.
హతవిధీ..  ఈ సినిమా చాలా సార్లు చూసినట్లుందే. ఓ ఇంతకు ముందు నాగార్జున హీరో.. ఇప్పుడు వెంకటేష్.. పర్లేదు గురూ.. హీరోయిన్ మారింది గదా.. పాటలు కూడా అర్దంకాకుండా ఏదో కొత్తబాష లో పాడారు. చల్నేదో బాల్ కిషన్..

అమ్మయ్య..ఇంటర్వెల్..మళ్ళీ సేమ్ లాబీ.. టాయ్ లెట్ కి చాంతాడులా క్యూ. ఎందుకంటే అక్కడ ముగ్గురు కి మాత్రమే ప్రొవిజన్ వుంది. డోన్ట్ వర్రీ.. మీరంతా పని పూర్తి చేసేవరకు సినిమా మొదలు కాదు.. మరో మాట.. తెచ్చిన సమోసాలు అన్ని సేల్ అవ్వాల్సిందే..తర్వాత షొ లేట్ అయినా పర్లేదు.అంతా మనోళ్ళే గదా.. సర్దుకుపోతారు..

సినిమాలో డైరక్టరు రకరకాల ట్విష్ట్ ల తో.. అర్దం పర్దం లే కుండా..హీరో గారు ఇమేజ్ కోసం మర్చిపోయాను.. అభిమానుల కోసం.. ఒంటి చేత్తో వంద మందిని గిరగిరా తిప్పుతూ తంతూంటే.. హీరోయిన్ బట్టలు వేసుకుందో లేదో అర్దం కాకుండా..హీరో తో పిచ్చి గంతులు వేస్తూంటే. ఏనాటి పాపం ఈ నాటిదో అని బాధ పడుతూ.. చివరి నిముషంలో నైనా ఏదైనా మంచి ట్విష్ట్ ఇవ్వక పోతాడా అని ఎదురు చూస్తూంటే సినిమా అయిపోయింది. వణుక్కుంటూ బయటకు వచ్చి పడ్డాము – చలికాలం లో చలి భరించలేక.. ఎండా కాలం లో చెమటకి షర్ట్ తడిసిపోయి. మళ్ళీ గంట డ్రైవ్ చేసుకుంటూ.. ఇంటికి వచ్చిపడ్డాము. 2 గంటలు డ్రైవ్ + 3 గంటలు సినిమా + 2 గంటలు ఎదురు చూపులు.. మొత్తం 7 గంటలు.. ఓ తెలుగు సినిమా చూడ్డానికి.. ఇంత అవసరమా మాష్టారు.

ఓ నెల తిరిగితే అఫీషియల్ డివిడి వస్తుంది..$10 .. కాపీ చేసి ఇచ్చేవాడి కైతే $1..పైరసీ గురించి పట్టిచ్చుకోకపోతే రెండో రోజున కెమేరా ప్రింట్ $1.. ఇంట్లో ప్రోజక్టర్ లో వేసుకుని హైడె ఫినిషన్ స్క్రీన్ మీద చూసుకొక, ఇన్ని ఫెసిలిటీస్ వున్నప్పుడు.. అంత కష్టపడి.. ఎవడో ఏదో అన్నాడని సినిమా హాలు కెళ్ళి కొట్టించుకొవాలా మహాశయా..అయినా మొదటిరోజున తెలుగు సినిమా చూడకపోతే మునిగే కొంపలు ఏమన్నా వున్నాయా.. లేక పోతే మళయాళం సినిమా లోలా సీన్లు కట్ చేస్తారని భయపడాలా.

ఇదే హిందీ సినిమా అనుకోండి.. అమెరికన్ ధియేటర్లో రిలీజు అవుతుంది. రేట్లు, టైము ఫిక్స్ డ్. సమోసాలు అమ్మడు. వెళ్ళండి.. చూడండి.. బయటకు నవ్వుతూ రండి.

ఛ తెలుగు ఎనారై గాళ్ళు వేష్ట్ రా మామా మరీ నాసి గాళ్ళు.. ప్రతీదీ లెక్కలేస్తారు.

–వెంకట్ ఉప్పలూరి

24 Comments
 1. వీబీ January 30, 2009 /
 2. అబ్రకదబ్ర January 30, 2009 /
 3. వికటకవి January 30, 2009 /
 4. Sarath January 30, 2009 /
 5. Venkat January 30, 2009 /
 6. sreenivas pappu January 30, 2009 /
 7. shriedhar January 30, 2009 /
 8. shree January 30, 2009 /
 9. మురళి January 30, 2009 /
 10. sharma January 30, 2009 /
 11. sujata January 30, 2009 /
 12. bala January 30, 2009 /
 13. కొత్తపాళీ January 30, 2009 /
  • అబ్రకదబ్ర January 30, 2009 /
 14. శ్రీ January 30, 2009 /
  • Telugu Cine abhimaani February 3, 2009 /
 15. Saty SKJ January 30, 2009 /
  • Saty SKJ January 30, 2009 /
 16. Scarlet January 31, 2009 /
 17. రామేశబాబు February 1, 2009 /
 18. Telugu Cine abhimaani February 3, 2009 /
 19. భమిడిపాటి ఫణిబాబు February 6, 2009 /
 20. sandhya February 28, 2009 /