Menu

సుజాత

స్త్రీ పాత్రలకి ప్రముఖ స్థానమూ, సామాజిక అన్వయమూ కల్పించడం బిమల్ రాయ్ నిర్మించిన చిత్రాల్లోని మౌళిక లక్షణం. అందుకే ఆయనని మహిళా చిత్రాల దర్శకుడిగా అభినందిస్తారు. ఆయన సినిమాల్లో ఆకలి, శ్రమ, నిజాయితీ, అంటరాని తనమూ, నిరుద్యోగమూ వంటి అనేక సామాజిక అంశాలు ప్రధాన ఇతివృత్తాలయ్యాయి. ఆయన చిత్రాలు సుజాత, నౌకరీ, పరక్, పరిణీత, లాంటివి విశేష మన్ననలు పొందాయి. ఆయన నిర్మించిన ‘దో భీగా జమీన్’ లాంటి ఆఫ్ బీట్ చిత్రాలు దేశ విదేశాల్లో విమర్శకుల మన్ననల్ని అందుకున్నాయి. బిమల్ రాయ్ చిత్రాల్లో మంచి సంగీతమూ, నృత్యాలూ, సున్నితమైన నాటకీయతా మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఆయన కథను నడిపించే తీరు, పాత్రల రూపకల్పన హృద్యంగా ఉండి సజీవంగా కనిపిస్తాయి.
 
బిమల్ రాయ్ 1959 లో నిర్మించిన ‘సుజాత’ చిత్రాన్ని ఆ కాలపు ప్రగతిశీలమయిన చిత్రంగానే పరిగణించవచ్చు. అంటరానితనాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని నిర్మించిన ఈ చిత్రంలో స్త్రీ సమస్యకు తోడు అంటరానితనమూ తోడయినపుడు ఆ స్త్రీ పడే ఆవేదనా, అనుభవించే దుఃఖమూ హృద్యంగా ఆవిష్కరించబడింది. సుజాత పాత్రలో నూతన్ గొప్పగా సరిపోయింది. ఇంకా ‘సునో మేరీ బంధూరే’, ‘జల్తెహై జిస్కేలియే’ లాంటీ పాటలు సుజాత చిత్రానికి వన్నె తెచ్చాయి. ఈ చిత్రంలో మనుషుల కులాల కతీతంగా వారి రక్తం ఎక్కడయినా ఎరుపే అని సూచిస్తాడు. సుజాత తర్వాతే అనేక భారతీయ సినిమాల్లో ఈ రక్త సంబంధాల్ని ఇతివృత్తాలుగా స్వీకరించారు. అప్పటికి అది ఒక గొప్ప ప్రతీక. ఇక సుజాత చిత్ర కథాంశం విషయానికి వస్తే ఓ రైల్వే కూలీ చిన్నారి కూతురు అనాధగా మిగుల్తుంది. రైల్వేలో పనిచేసే ఇంజనీరు ఉపేంద్రనాధ్ చౌదరీ, ఆయన భార్య చారు ఆ చిన్నారి సుజాతను చేరదీస్తారు. ఓ ప్రక్క సుజాత అంటరానిదేమోనన్న భావం తొలుస్తున్నప్పటికీ ఆ అమ్మాయికి ఏ లోటూ రానీయకుండా పెంచుతారు. తమ కూతురు రమకు తోడుగా సుజాతను చూసినప్పటికీ ఆమె కులం వారికి పెద్ద అడ్డుగానే మిగిలిపోతుంది. సుజాతకు నీడనిచ్చి పెంచడాన్ని అందరూ హర్షించరు. తమలాంటి బ్రాహ్మణ కుటుంబంలో సుజాతకు స్థానం కల్పించడం సరైంది కదని కూడా ఉపేంద్రనాధ్‌కి చెబుతారు. ముఖ్యంగా ధనవంతురాలయిన వారి కుటుంబ మిత్రులు గిరిబాల సుజాతను ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా ఇంటినుంచి పంపించివేయకుంటే తీవ్రమయిన పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తుంది. కాని ఆ భార్యాభర్తలు వినరు. సుజాత క్రమంగా పెరిగి పెద్దదై రమకి మంచి స్నేహితురాలిగా మారుతుంది. కాని ఎంత మామూలుగా ఉన్నప్పటికీ రమని తమ కూతురని, సుజాత తమ కూతురులాంటిదని అన్నప్పుడల్లా సుజాత తన గతాన్ని తలుచుకొని బాధపడుతుంది.
 
 చౌదరీ కుటుంబం గిరిబాలతో నివసించడానికి ఉపక్రమించినప్పుడు పరిస్థితి మరింత విషమిస్తుంది. గిరిబాల మనుమడు అధిర్‌కు రమకు పెళ్లి చేయాలని గిరిబాల ఉపేంద్రనాధ్ లు భావిస్తారు. కాని అధిర్ మాత్రం సుజాతవైపే మొగ్గు చూపిస్తాడు. సుజాత అందం, నడవడి, మర్యాదలను అధిర్ ఇష్టపడతాడు. అది తెలిసి రెండు కుటుంబాలు గందరగోళంలో పడిపోతాయి. ఇంట్లోవాళ్లంతా ధియేటర్‌కి వెళ్లినప్పుడు ఒంటరిగా మిగిలిన అధిర్ సుజాత జంట తమ అభీష్టాన్ని తెలియజేసుకుంటారు. అధిర్ విషయాన్ని నాన్నమ్మ గిరిబాలకు చెప్పగా ఆమె కోపోధ్రిక్తురాలవుతుంది. చారు సుజాతకు ఆమె స్థానాన్ని చూపిస్తుంది. అంతే కాదు ఆమె ఆమె కులానికి చెందిన యువకుడ్ని వెదికి పెళ్లి చేసేందుకు కూడా ప్రయత్నిస్తుంది. కాని అవేవి ఫలించవు. చారు మెట్ల మీదనుంచి కిందపడి తీవ్రంగా గాయపడుతుంది. అందరి రక్తం పరీక్షిస్తారు. అయితే అందరిలోకి చారుకి సుజాత రక్తమే సరిపోతుంది. అంటరానిదానిగా భావించే సుజాత రక్తమే చారును కాపాడుతుంది. మన సమాజంలో అంటరానితనమన్నది సామాజిక దురాచారమే తప్ప వాస్తవానికి మనుషుల మధ్య తేడాలేమీ ఉండవని చిత్రం ప్రభోదిస్తుంది. సుజాత సామాజిక దురాచారాన్ని ఇతివృత్తంగా తీసుకున్నప్పటికీ చిత్రీకరణ కథా కథనం కళాత్మకంగానూ, లిరికల్‌గానూ సాగి హాయిని గొలుపుతుంది. బిమల్ రాయ్ చిత్రీకరణకు తోడు నూతన్ నటన సుజాతకు ఎంతో వన్నె తెచ్చింది. బిమల్ రాయ్ ‘సుజాత’ నాటినుంచి నేటిదాకా మరిచిపోలేని మరపురాని పాత్రే.

కథ : సుబోద్ ఘోష్
సంగీతం : ఎస్.డి.బర్మన్
స్క్రిప్టు : నటేందు ఘోష్
దర్శకత్వం : బిమల్ రాయ్
నటీనటులు : నూటన్ (సుజాత) , సునీల్ దత్ (అధీర్)., మొ…

2 Comments
  1. Pradeep January 29, 2009 /
  2. jyothi January 31, 2009 /