Menu

ష్…ఇది చాలా మంచి ఊరు-సినిమా సమీక్ష

లేత వయసుల ప్రేమలు-వాటిని సమర్ధించే మతిలేని మాటలు, నాలుగు సుమోలు ఒక్కుదుటన ఇరవై అడుగులు పైకి లేచి ఒక దానితో ఒకటి ఢీ కొట్టుకుని పచ్చడైపోయినా-సుమోల్లో ఉన్న జనాలంతా హాయిగా దిగడం, కధకి ఏకోశానా సంబంధంలేని సన్నివేశాలను, వెకిలి హాస్యాలను – చూసి విసిగి పోయారా? అయితే ‘ష్’ చూడండి!

‘హైదరాబాద్ బ్లూస్’ నగేష్ కుకునూరి, ‘ఆనంద్’ శేఖర్ కమ్ముల, ‘గమ్యం’ క్రిష్ — వీరంతా యన్నారైలు. సినిమా మీద పిచ్చి ప్రేమతో వెనక్కొచ్చి మనకు మంచి చిత్రాలను అందించాలని ప్రయత్నిస్తున్న నవయువ దర్శకులు. హరిచరణ ప్రసాద్ వీరి సరసన సగర్వంగా చేర్చదగ్గ దర్శకుడు!

ఒక నంది అవార్ద్, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డ్ లను గెలుచుకున్న ‘కమ్లీ’ చిత్రం హరిచరణ ప్రసాద్, సుకన్య – ‘అపూర్వ చిత్ర’ బేనర్ మీద కథకు ప్రాధాన్యతనిస్తూ నిర్మించిన మొదటి చిత్రం. ‘ష్…’ ఇది చాలా మంచి ఊరు నిర్మాతలుగా వారి ద్వితీయ ప్రయత్నం!

ఒక అందమైన యువతి, బంగారు కలలు కనే అమ్మాయి – ఇద్దరబ్బాయిల అక్రుత్యానికి బలైపోతుంది. చేసిన నేరాన్ని తండ్రుల సహకారంతో కప్పెట్టి, అందరూ కలిసి అమ్మాయి చెడ్డదని ప్రచారం చేస్తారు. అయితే ఆ చనిపోయిన అమ్మాయి, తన మీద వేసిన మచ్చను ఎలా తొలగించుకుంటుంది అన్న కథాంశాన్ని చెప్పడానికి అవసరమైన పాత్రలతో, సన్నివేశాలతో మాత్రమే అల్లిన సినిమా ‘ష్’.

ఒక కుర్ర డాక్టరు ఆనంద్, భార్య సునీత , కూతురు అప్పు లతో ఒక పల్లెటూర్లో అడుగు పెట్టి, ఊరి పెద్ద చూపించిన ఇంట్లో కాపురానికి దిగడంతో సినిమా మొదలౌతుంది.

దేవుడి మీద, అతీంద్రియ శక్తుల మీద నమ్మకంలేని డాక్టర్ – తనకు తారసపడే వరుస అనుభవాలను ఎలా అర్థం చేసుకోవాలో, దేనికి అన్వయించుకోవాలో తేల్చుకోలేక సతమతమౌతాడు. అతడికి జరగ బోయే విషయాలు ముందే తెలుస్తుంటాయి. కలత నిద్రలో కనిపించే దృశ్యాలు అతన్ని కలవర పరుస్తాయి. అతడి ప్రవర్తనను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక, సునీత భర్తకు బ్రైన్ స్కానింగ్ కూడా చేయిస్తుంది. న్యూరోసర్జన్ అంతా సవ్యంగానే ఉందని చెబుతాడు.

డాక్టర్ కూతురు అప్పూకూడా ఇంట్లో ఎవరికీ తెలియని, పరిచయం లేని సీత తో మాట్లాడుతూ ఉంటుంది!

ముక్కలు ముక్కలుగా కనిపించిన దృశ్యాలను ఎలా కలుపుకుని పజిల్ ని ఛేదించాడు? చనిపోయిన అమ్మాయి మీద పడ్డ మచ్చ ఎలా తొలగి పోయింది అన్నది తెర మీద చూడాల్సిందే!

ఈ చిత్రంలో రెండు పాటలున్నాయి. సాహిత్యపరంగా, సంగీత పరంగా ఉన్నతంగా ఉన్నాయి. సందర్భానికి అతికినట్లు ఉండడం ఈ పాటల్లో మరో సొగసు!

‘ఎవరో… ఎవరో’ పాట ధియేటర్ నుంచీ బయటకొచ్చినా, మన చుట్టూ అల్లుకుని తిరుగుతూంటుంది. చిత్రీకరణ చాలా ఆహ్లాదకరంగా ఉంది. ‘ఊహల పల్లకీలో’ పాట వినడానికి బాగున్నా, చిత్రీకరణలో కెమెరా కదలికలు ఎక్కువయినట్లు అనిపించింది.

ఏ సినిమాకైనా సినిమాటోగ్రఫీ శరీరమైతే, నేపధ్య సంగీతం ఆత్మ లాంటిది. మిస్టరీ సినిమాలు ప్రేక్షకుడికిచ్చే అనుభూతి సాంద్రత ఈ రెండు కళల మేలవింపు మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది

‘ష్…’లో మురళీమోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది, శ్రీవసంత్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. పైన చెప్పినట్లు పాటలకందించిన బాణీలు చాలా బాగున్నాయి. . సినిమాటోగ్రాఫర్ , సంగీత దర్శకులకు కూడా ఇది తొలి చిత్రం. అభినందనలు అందుకునే స్థాయిలో ఉన్న వీరి ప్రతిభ ముందు ముందు మరిన్ని మెరుగులు దిద్దుకుంటుందని ఆశిస్తున్నాను.

కథకు సంబంధం వున్న సన్నివేశాల సమాహారాన్నే సినిమాగా సమర్పించడం – ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విశేషం! ప్రేమ సినిమాలొకవైపు, యాక్శన్ సినిమాలు ఇంకో వైపు – రెంటినీ భిన్న పాళ్ళలో కలుపుకున్న మూడో రకం సినిమాలింకొక వైపు ప్రేక్షకుల మీద ముప్పేట దాడి కొనసాగిస్తున్న రోజుల్లో విభిన్న కథాంశంతో ఈ సినిమా నిర్మించిన నిర్మాతల ధైర్యాన్ని అభినందించాలి. నిర్మాతే దర్శకుడైతే చాలా విషయాల్లో రాజీ పడాల్సిన అవసరం పడదు.

భర్త, కూతురు ప్రవర్తనలను అర్థం చేసుకోలేక సతమతమయ్యే సునీత పాత్రకు మిధున న్యాయం చేసారు.

ఆనంద్ గా షఫీ ఫరవాలేదనిపించాడు.

సీతగా మాధవీలత సరిపోయింది. మాధవీలత నటించిన మొదటి సినిమా ఇది. దీని తర్వాత ‘నచ్చావులే’ సినిమాలో హీరోయిన్ గా నటించిందీమె!

‘అనుభవం కానిదంతా అసత్య’మనుకోవద్దనే పాత్రకు రూపాదేవి సరిపోయారు.

అప్పుగా వేసిన పాప నటన ప్రశంసనీయంగా ఉంది.

అక్కడక్కడ చిన్నచిన్న లోపాలు కనిపించినా, అవి కథనాన్ని, సినిమా ప్రయోజన్నాన్ని దెబ్బతీయలేదు. ఒక ఔత్సాహిక దర్శకుని తొలి ప్రయత్నాన్ని సమాదరించి ప్రోత్సహిస్తే, ముందు ముందు వీరింకా మంచి మంచి సినిమాలను మనకందిస్తారని ఆశించడం అత్యాశ కాదేమో!

– శ్రీచక్ర

17 Comments
 1. మురళి January 25, 2009 /
 2. కొత్తపాళీ January 25, 2009 /
 3. హనుమంత రావు January 25, 2009 /
 4. సచిన్ January 25, 2009 /
 5. చందు January 25, 2009 /
 6. రామేశబాబు January 25, 2009 /
  • శ్రీచక్ర January 29, 2009 /
   • రామేశబాబు February 2, 2009 /
 7. చండీదాస్ January 25, 2009 /
 8. గోపీచంద్ January 26, 2009 /
 9. sivaji January 26, 2009 /
  • sathish January 30, 2009 /
 10. Hari Charana Prasad January 27, 2009 /
 11. mohanrazz January 28, 2009 /
 12. Hari Charana Prasad January 29, 2009 /
 13. చందు January 29, 2009 /