ఒక సినిమాకు ఏం ఆశించి వెళతాం…మిగతా వాళ్ళ సంగతేమో గానీ నేను మాత్రం ఎంతో కొంత ఎంటర్టైన్ మెంట్ (అంటే హాస్యం అని కాదు)ఆశించి వెళ్తాను. ఆ కోణంలో ష్…ఇది చాలా మంచి ఊరు మాత్రం నన్ను విపరీతంగా నిరాశపర్చింది. అన్ని ఎంటర్టైన్ మెంట్ కోసమా చూస్తామా..అంటే… పోనీ..ఈ సినిమాలోంచి నేను కొత్తగా నేర్చుకున్నదేమీ లేదు.
అస్సలు ఏమీ లేవా అని గట్టిగా మొహమాటపెట్టేస్తే..మాత్రం కొన్ని ఉన్నాయని చెప్పాల్సి వస్తుంది. ..అవి ఎవరైనా బొట్టు పెడతానంటే..మొహమాటానికైనా పెట్టించుకోరాదు..ఎందుకంటే ఇందులో హీరో బొట్టు పెట్టించుకోవటం వల్ల భవిష్యత్ లో జరగబోయే సంఘటనలు,దెయ్యాలు కనపడి ఇబ్బంది పడుతూంటాడు. అలాగే తెల్సుకున్న మరో విషయం…చనిపోయిన వారు దెయ్యాలై తాము డైరక్ట్ గా పగ తీర్చుకోలేక ఎవరో ఒకరిని ప్రేరేపిస్తారు. ఇందులో ఒక అమ్మాయి…తను ఘోరంగా మోసపోయి చనిపోయాక..తన గురించి ప్రపంచానికి నిజాలు తెలియచేయటానికి…హీరోని ఇబ్బందిపెడుతుంది. ఇక మూడో విషయం.. అప్పుడప్పుడూ దెయ్యాలకు ..దేముళ్ళు సహాయపడుదురు. దేముడే…హీరో ని మేలుకొలిపి దెయ్యానికి సహాయం చేయమన్నట్లు బిహేవ్ చేస్తాడు.
ఇక కథ రెండు సార్లు నవతరంగంలో చదివిందే అయినా మళ్ళీ గుర్తు చేస్తున్నా…ఓ పల్లెకు చాలా కాలం తర్వాత సర్వీస్ చేద్దామని డాక్టర్ ఆనంద్ (షఫీ) తన భార్య సునీత(మిధున),కూతురుతో వస్తాడు. అక్కడ పూజారి భద్రయ్య మన డాక్టర్ గారికి బొట్టు పెడతాడు.అది పెట్టించుకోగానే అతనికి మేలుకో అనే అక్షరాలు మస్కిష్కంలో కనపడతాయి. ఆ తర్వాత అతను మేలుకున్నప్పటి నుంచి వింత అనుభవాలు ఎదురుతాయి. భవిష్యత్ దర్శనం జరుగుతూంటుంది.పనలో పనిగా ఓ రూపం (గ్రాఫిక్స్ దెయ్యం)కనపడుతూంటుంది. మరో ప్రక్క అతని కూతురు తన చేతిలో ఉన్న బొమ్మతో టైటిల్ ని జస్టిఫై చేయటానికన్నట్లు ష్..అంటూ మాట్లాడుతూంటుంది. ఇలా ఓ ప్రక్క భర్త,కూతురు ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉలిక్కిపడుతూంటే కడుపుతూ ఉన్న ఆ బార్య బెంగపెట్టుకుంటుంది. ఇంతకీ ఆ ఇంటిలో ఏం జరిగింది. ఆనంద్ కి అలా విచిత్రమైన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయనేది మిగతా కథ.
ఇక నాకు ఈ సినిమాలో అస్సలు అర్ధం కాని విషయాలలో మొదటిది..తనని,తన కూతర్నిఅంత ఇబ్బంది పెడుతున్న ఇంటిని గానీ ,ఊరుని గారి ఆ డాక్టర్ ఎందుకు విడిచిపెట్టడు..భార్యకూడా ఎందుకు చెప్పదు. (అతనేమీ సూపర్ హీరో కాదు కదా..సమస్య కోసం ఎదురుచూస్తూండటానికి..రాగానే అన్ని పనులూ మానేసి ఆ పనిమీదుండటానికి)ఇక్కడ అప్రస్తుతం అనుకోకుండా నవోమి వాట్స్ నటించిన ది రింగ్ అనే సినిమా గుర్తు చేసుకుందాం. అందులో నవోమి వాట్స్ కి ఇలాంటి(సరిగ్గా ఇలాంటిదే కాదు)సంఘటనలు ఎదురైతే ఆమె ప్రమాదమని తెలిసినా ఎంక్వైరీకి బయిలుదేరుతుంది. ఎందుకంటే ఆమె ఇన్విస్టిగేటివ్ జర్నలిస్టు కాబట్టి. ఆమె తన కారక్టర్ ని అనుసరించి బిహేవ్ చేస్తుంది కాబట్టి ఈ అనుమానం రాదు.
అలాగే ఈ కథ ఏ కాలంలో జరుగుతోందో నాకు స్పష్టం కాలేదు. ఎందుకంటే ఆ పల్లె,వాతావరణం, అక్కడి మనుషులు 1920 కాలంలో వాళ్ళలా అనిపిస్తూంటారు. కాని కథలో కొన్ని చోట్ల కొత్త పాటలు వినిపిస్తూంటాయి. సిటీ వాతావరణం 2009 లా అనిపిస్తుంది. ఇది పెద్ద డ్రా బ్యాక్ అనిపించింది.(అందుకేనేమో టైమ్,ధీమ్,టోన్,ప్లేస్ సినిమా ప్రారంభంలోనే ఎస్టాబ్లిష్ చేయమంటారు).
ఇక కథలో హీరోకి సమస్య(దెయ్యం మిస్టరీ) ఏమిటో,దానికి కారకులు ఎవరో స్పష్టంగా తెలిసే సరికల్లా స్క్రీన్ టైమ్ పూర్తయింది. దాంతో ఆ సమస్యతో ఎలా ప్రధాన పాత్ర పోరాడుతాడు..సమస్య సృష్టికి కారణమైన వారికి ఎలా బుద్ది చెపుతాడు….అన్న మ్యాటర్ చూద్దామనుకుని కూర్చున్న ప్రేక్షకులకు నిరాశే. (అఫ్ కోర్స్ దర్శకుడు కూడా మిస్టరీ విడటమే ప్రేక్షకుడు ఆశిస్తాడని ఊహించి ఆ కోణంలో కథ నడిపారు).అంటే ఏ ఇంటర్వెల్ కో సమస్య ప్రధాన పాత్రకు తెలిస్తే…అక్కడ నుంచి అతను ఏం స్టెప్స్ తీసుకుంటాడు…ఆ క్రమంలో ఏం ప్రతిబంధకాలు ఎదురవ్వుతాయి అనే దిశలో డ్రామా పుట్టించి కథనం మరింత ఆసక్తిగా నడపవచ్చునని నా(ఇదే కరెక్టు అని నేను అనను)ఉద్దేశం. అప్పుడు ప్రధమార్ధంలో కథ,కథనాలు మరింత స్పీడుగా ఉండేవి.
అలాగే కథలో చనిపోయిన ఆమె ఆత్మ తనకు అణుగుణంగా హీరోని తన సమస్య పరిష్కార దిశగా ప్రేరేపిస్తుంది.విజయం సాధిస్తుంది. అంటే ఆమే ఈ కథకు హీరో. కానీ కథ..హీరో షఫి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పటంతో అతన్ను ఫాలో అవుతూ వచ్చిన వారికి అతను తనకు వచ్చిన సమస్యకు ఎక్కడా ప్రతిస్పందించకుండా..ఆమెనే ఫాలో అవుతూండటంతో షఫి పాత్ర పూర్తి స్ధాయిలో ప్యాసివ్ గా మారింది. అతనిలో ఐడెండిటి చేసుకున్న ప్రేక్షకుడు ఇబ్బందే ఎదురైంది.
అలాగే మరో సారి ది రింగ్ ని గుర్తు చేసుకుంటే ఆ సినిమాలో కూడా నవోమి వాట్స్ కుమారుడు ద్వారా దయ్యం పలుకుతూంటుంది. అయితే అక్కడ కథనం పేరెంట్ హుడ్ ని గుర్తు చేసే దిశలో ఉంటుంది. ఆ సినిమాలో నవోమి వాట్స్ నూతిలో దిగి శవాన్ని (ఇక్కడ హీరో తన ఇంటిలో పాతి పెట్టి ఉన్న శవాన్ని తీయటం)తీసిన తర్వాత అసలు దానికి కారణాలు అన్వేషిస్తుంది. అక్కడ ఆ చనిపోయిన పిల్ల తల్లి తండ్రుల ప్రేమకి దూరమయ్యి చనిపోయిందని,లోకంపై పగ పెంచుకుందని తెలుసుకుంటుంది.
ఆ సంఘటన ద్వారా తన జీవితంలో తాను చేస్తున్న పొరపాటు(తను కూడా పిల్లవాడ్ని పట్టించుకోవటం లేదు..అది మొదట సీన్లలో ఎస్టాభ్లిష్ చేస్తారు) గ్రహిస్తుంది. ఓ గొప్ప పాఠం నేర్చుకుంటుంది. దాంతో ఆ పాత్రలో పరిణితి వస్తుంది.(స్క్రీన్ ప్లే లో క్యారెక్టర్ గ్రోత్ అనేది ఇక్కడ ఫాలో అయ్యారు). అలాంటిదేమన్నా ఈ కథలో ఉందా. అంటే లేదు.
మరో సంగతి అక్కడ ఆ చనిపోయిన ఆత్మ సమస్యలు తెచ్చిపెడుతుంది.దాంతో కథలో కాంఫ్లిక్ట్ పుడుతూంటుంది. చివరకు తాను ప్రాణ ప్రదంగా చూసుకుంటున్న కొడుకు క్కూడా ఆ సమస్య చుట్టుకుంటుంది. దాన్నించి తప్పించుకోవటానికి ఆమె ఓ సొల్యూషన్ కనుక్కుంటుంది. ఆ క్రమంలో మనకి టెన్షన్ క్రియోట్ చేసి అధ్బుతం అనిపిస్తారు. అదే ఇక్కడ పూర్తి స్ధాయిలో మిస్సయింది. అంటే…కథలో మరో లేయిర్ (సబ్ ప్లాట్)ఉంటే బాగుండేదన్నమాట.
అలాగే సినీ ప్రారంభంలో రాళ్ళపల్లి ఆయనంతట ఆయనే షఫి కి బొట్టు పెట్టమనే సన్నివేశం అంతరార్ధం అర్ధంకాలేదు. అంటే బొట్టు మహత్యం ఆయనకు తెలియదా..(ఎందుకంటే ఆ బొట్టు వల్లే కదా ఆయన తన కొడుకు చేసిన హత్యని బయిటపడుతుంది).ఎవరూ తన వేలుతో తన కన్నే పొడుచుకోవాలని చూడరు కదా. అలాగే టైటిల్లో ఇది చాలా మంచి ఊరు అన్నారు…అది చదివి ధియోటర్లోకి దూరిన నాలాంటి వారు ఊరు మొత్తానికి సంభంధించిన కథేమోనని ఫిక్సవుతారు. కానీ సినిమా మొత్తం(మాగ్జిమం)హీరో ఇంట్లో లాగించేసారు.
ఇక చనిపోయిన ఆమె పుర్రెలు,శవం చూపి,ఆ తర్వాత పాట పెట్టడం సమంజసం కాదని మిత్రులంతా అంటున్నమాటే. దానికి నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఇలా త్రవ్వుకుంటూ పోతే చాలా మైనస్ లు ఉన్నాయి. ఇక ప్లస్ లు లేవా అంటే ఇప్పటికే రెండు ఆర్టికల్స్ అదే విషయంపై మిత్రులు రాసేసారు కాబట్టి ప్రస్దావించటం లేదు.
అలాగే ఇంత వివరణాత్మకంగా రాయటానికి కారణం హరిచరణ ప్రసాద్..గారు …మంచి,చెడులు చక్కగా విశ్లేషించండి అని ఓపెన్ ఆఫర్ ఇవ్వటమే. అలాంటి ధైర్యమున్న వ్యక్తులు అరుదు. అందుకు ఆయన్నిఅభినందిస్తున్నాను.
మరో మంచి సినిమా (మంచి స్క్రిప్టు వర్క్)తో ఆయన వస్తే ఆశ్వరదించటానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఈ సారి హిట్ కాదు..సూపర్ హిట్ కొట్టాలని ఆశిస్తూ…
కె.మహేష్ కుమార్ says:
ఈ సినిమానూ హరిచరణ్ ప్రసాద్ గారినీ ఇదివరకటి సమీక్షా,పరిచయం ఆకాశానికెత్తేస్తే, మీరు మళ్ళీ భూమ్మీదకు తీసుకొచ్చి వదిలారు. ఈ రియాలిటీ చెక్ చాలా అవసరంకూడాను. ఈ విశ్లేషణ ఈ సినిమా ద్వారా ఒక మంచిప్రయత్నం చేసిన దర్శకుడికి మరింత కృషిచేసే దిశగా మార్గదర్శకం కాగలదు. నవతరంగం ఆశించేదీ అదే. మీకూ హరిచరణ్ ప్రసాద్ గారికీ ఇద్దరికీ నా అభినందనలు.
Sai Brahmanandam says:
@కె.మహేష్ కుమార్,
నేను రాసింది సినిమా సమీక్ష కాదు. ఒక దర్శకుడి పరిచయం. ఆయన లో కనిపించిన మంచి లక్షణాలు. ఒక సినిమా దర్శకుడి కావల్సిన నిబద్ధతా, నిజాయితీల అనుభవం. అంతే. నేను “ష్” ని ఆకాశానికెత్తేయ లేదు. పొర్పాట్లున్నాయని రాసాను. స్క్రిప్టు నాకు తెలుసు కాబట్టి అవి ఏమిటో రాయలేదు. కాకపోతే ఒక చిన్న ప్రయత్నానికి సినిమా అంటే తపించే మనలాంటి వాళ్ళం ప్రోత్సాహం ఇవ్వాలన్నదే నా అభిప్రాయం. జోస్యుల గారూ మీలాగే అనుకున్నట్లున్నారు. అందుకే “మిగతా రెండూ…” అంటూ నర్మగర్భంగా చెప్పారు.
నా వరకూ ఏ సినిమా పెర్ఫెక్ట్ కాదు. ఆహా, ఓహో అనుకున్న సినిమాల్లో కూడా చచ్చేటన్ని తప్పులూ, తడకలూ ఉన్నాయి. కాకపోతే అవై ప్రధాన కథకి అడ్డంపడలేదంతే! ఈ మధ్యనే వచ్చిన స్లండాగ్ మిలియనీర్ లో కూడా ఉన్నాయి. పాత్రోచితంగా అంటే పాత్రల స్వభావం, ప్రవర్తనా వగైరాలన్నీ అతి చక్కగా ఉండి, నూటికి తొంభై తొమ్మిది శాతం తప్పులంటూ లేని ఒక సహజమైన తెలుగు సినిమా వుంది. వీలయితే చూడండి. మంచి సినిమాకుండాల్సిన లక్షణాలన్నీ ఉన్న సినిమా బాపు గారి “సాక్షి” సినిమా. సినిమాని చదువుగా భావించే వాళ్ళంతా తప్పకుండా చూడాల్సిన సినిమా!
కె.మహేష్ కుమార్ says:
@Sai Brahmanandam, మీరు రాసింది దర్శకుడి పరిచయమే. ఇదివరకూ ఈ సినిమా సమీక్షకూడా నవతరంగంలో వచ్చింది. అందుకే ఆ రెండిటి గురించీ చెప్పాను. “ష్..” ఒక నిబద్ధత కలిగిన ప్రయత్నమని అందరూ అంగీకరించిన విషయమే. కానీ దానిలోని లోటుపాట్లను ఇంత కూలంకషంగా విశ్లేషిస్తే, అది రాబోయే సినిమాకు మరోమెట్టవుతుందనేదే నా భావనకూడా. అందుకే, కేవలం ప్రయత్నాన్ని పొగడటాన్ని ఆకాశానికి ఎత్తెయ్యడంతో పోల్చాను. అంతేతప్ప, మీరు చేసిన పరిచయంలో అతిశయోక్తులున్నాయని కాదు. ఏది ఏమైనా, విమర్శలకు(అడిగి మరీ) తయారుగా ఉండే దర్శకుడు హరిచరణ్ ప్రసాద్ గారి రూపంలో మనకు లభించినట్లే!
అబ్రకదబ్ర says:
ఈ మధ్య కాలంలో నేను చదివిన తెలుగు సినిమా సమీక్షల్లో బాగా నచ్చింది ఇది. నవతరంగానికి వన్నె తెచ్చేది ఇటువంటివే.
హాలీవుడ్ సినిమాల స్క్రీన్-ప్లేల్లో ఓ ఫార్ములా ఉంటుంది. ఇది నాటకాల నుండి వచ్చింది. త్రీ యాక్ట్ స్ట్రక్చర్ (three act structure) అంటారు దాన్ని. సినిమా మొత్తం తొంభై నిమిషాలుందనుకుంటే, దాన్ని మూడు ముక్కలుగా విడగొట్టి – మొదటి అరగంటలో పాత్రల ఎస్టాబ్లిష్‌మెంట్, ప్రధాన పాత్ర (protaganist) కి ఒక సమస్య (conflict) ని కల్పించటం. రెండో అరగంటలో సమస్యకి మరిన్ని చిక్కు ముళ్లు వేయటం. మూడో అరగంటలో ఒక్కో ముడీ విప్పుకుంటూ వచ్చి ప్రధాన పాత్రధారి/రులు ఆ సమస్యనెలా పరిష్కరించారో చూపటం. మీకు తెలిసిన హాలీవుడ్ హిట్ సినిమా దేన్నైనా తీసుకోండి, ఇదే సూత్రం ఉంటుంది.
తెలుగు సినిమాలకొచ్చేసరికి మనదంతా two act యవ్వారం. ఇంటర్వెల్‌కి ముందు, ఇంటర్వెల్ తర్వాత. అంతే. ఒక్కో భాగమూ – మన లెక్కల ప్రకారం – కనీసం గంటంబావు ఉండాలి. ఉన్న కధేమో అతి పల్చన. కాబట్టి, దాన్ని సాగదీయటానికి పాటలు, ఫైట్లు, కామెడీ ట్రాకులతో నెట్టుకు రావాలి. దెబ్బకి, కధ ఇంకా పల్చనైపోద్ది.
హాలీవుడ్ సినిమాల కధలను, సన్నివేశాలను కాపీ కొట్టే బదులు మనవాళ్లు అక్కడి నుండి కధ ఎలా చెప్పాలో అనేదాన్ని నేర్చుకోవచ్చు కదా. కొత్తరకం సినిమాలు తీయాలనే ఉత్సాహంతో వచ్చేవారైనా కొత్త పద్ధతులు ప్రయత్నించొచ్చు కదా. మన సొంత ఫార్ములా ప్రకారమే పోయినా సినిమా హిట్టవుతందని ఎటూ చెప్పలేం. అటువంటప్పుడు, బయట విజయవంతమైన ఫార్ములాగా గుర్తించబడ్డదాన్ని అనుకరిస్తే తప్పేంటి?
విజయవర్ధన్ says:
జోస్యుల గారు, చాలా బాగా వ్రాసారు. జోహార్లు. ఇలాంటి విశ్లేషణలతో మీకు నచ్చిన classic లేదా విదేశీ సినిమాల గురించి కూడా వ్రాయగలరు.
వీబీ says:
సూర్య గారూ,
చాలా మంచి రివ్యూ
.ప్రింట్ ఔట్ తీసుకుని ఆ సినిమా చూస్తూ విశ్లేషించుకో తగ్గ మంచి రివ్యూ.
సినిమాలు తీసేవాళ్ళూ…సూర్య గారి సేవలు మీరెందుకు ఉపయోగించుకోరు?
శివాజీ says:
మంచి రివ్యూ…expectinng another too…sivaji
రామేశబాబు says:
మనలో మంచేదో, చెడేదో మనకు నిజాయితీగా చెప్పేవాడే మనకు నిజమైన మితృడు. సధారణంగా మన కళ్ళకు మనలోని మంచే బాగా కనపడుతుంది. ఎందుకంటే మనతో పని ఉన్నవాళ్ళు, మనకెందుకులే అనుకునే వాళ్ళు, ఓ మాట మంచిగా వేస్తే అలా పడి ఉంటుందిలే అనుకునే వాళ్ళే మన చుట్టూ ఉన్నారన్నది కాదనలేని వాస్తవం.
జోశ్యులవారూ! మీరు హరి చరణ ప్రసాదు గారికి అలాంటివారే.
మీ విశ్లేషణ బాగుంది. చదివిన లేదా చూడబోయే వారికంటే కూడా హరిగారికి చాలా బాగా ఉపయోగపడుతుందని నా విశ్వాశం
Hari Charana Prasad says:
జోస్యుల గారు,
ష్..మీరు చూసి మా(నా)తో మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు థాంక్స్.
ఇందులొ మీరు వ్రాసిన కొన్ని అర్థం కాలేదు అన్న విషయాల గురించి వాటి వెనుక ఉన్న నా ఆలోచనా స్రవంతి (thought process)- ఏమిటో వివరిస్తాను,
సినిమాలొ ఎలా స్పస్టత లొపించిందో వివరిస్తె నా తదుపరి ప్రయత్నాలకు ఉపయొగపడుతుంది.
1. మొదటిది..తనని,తన కూతర్నిఅంత ఇబ్బంది పెడుతున్న ఇంటిని గానీ ,ఊరుని గారి ఆ డాక్టర్ ఎందుకు విడిచిపెట్టడు..భార్యకూడా ఎందుకు చెప్పదు
ఎందుకు విడిచిపెట్టడు – అంటె,
1. ఆనంద్ స్పష్టంగా గుడి దగ్గర, తర్వాత ఇంట్లొ సునీత దగ్గర చెప్తాడు కదా – ‘నేను డాక్టర్ని ఇలాంటివన్ని నమ్మనూ’ అని!
1B. తర్వాత ఉదయాన్నే కల గురించి సునీతకు చెప్పి ‘hallucination’ అని కొట్తిపడేస్తాడు కదా!
2. ఈ కథ ఏ కాలంలో జరుగుతోందో నాకు స్పష్టం కాలేదు – కథ ప్రస్తుత కాలంలొ జరిగింది అని చూపించడానికి తగు జాగ్రత్తలు తీసుకున్నాము.
ఇది చిన్న ఊరులొ జరిగినట్టు చూపాము, పాత్రలు ఎవ్వరు ప్రత్యేకంగ డ్రెస్స్ చేసుకొలేదు, మరి ఎందుకు స్పస్టంగా లేదో..
3. కథలొ సమస్య మీరు కరెక్ట్ గా గుర్తించినట్టుగానే ‘మిస్టెరీ’ – ప్రతి సినిమాలొ లాగా ‘రివెంజ్’ కాదు. మీ అభిప్రాయం మరొక అలొచింపదగ్గ POV.
4. రాళ్ళపల్లి ఆయనంతట ఆయనే షఫి కి బొట్టు పెట్టమనే సన్నివేశం అంతరార్ధం అర్ధంకాలేదు – కనకయ్య(రాళ్ళపల్లి)తెలిస్తే ఎందుకు పెట్టమంటాడు – మంగమ్మ అంటుంది కదా – ‘అందరికి ఆ తాకతుండదు’ అనీ
5. సినిమా మొత్తం(మాగ్జిమం)హీరో ఇంట్లో లాగించేసారు. – కథకు తగినట్టుగా చాలా లొకేషన్లలొ – గుడి, మంగమ్మ గుడి, బస్ స్టాండ్, హొస్పిటల్స్, సినిమా హాలు, మరిన్ని…
6. పాటల గురించి – రెండవ పాట నిజానికి DVD కి(బొనస్ గా) మాత్రమే పరిమితం కావల్సింది, కొన్ని కారణాలవల్ల filim లొ వచ్చింది
మీ అభిప్రాయలకు, timeకు నా థాంక్స్.
@వీ బీ – మీ సలహా పాటించదగ్గది.
సూర్య గారి సమీక్ష, నా POV, రెండు చదివి, సినిమా (చూసి)గురించి లేద సినిమా నిర్మాణం గురించి ప్రశ్నలు, అభిప్రాయాలు ఉంటె తప్పకుండ వ్ర్రాయండి.