Menu

కృష్ణవంశీ మార్కు (శశిరేఖా) పరిణయం

బాలివుడ్ లో ‘రాజశ్రీ’ సంస్థ తీసే సినిమాలకి ‘పెళ్లి వీడియో’ లని పేరు. తెలుగు సినిమాలలో అలాంటి పేరు తెచ్చుకునే దిశగా కృష్ణవంశీ కృషి చేస్తున్నాడనిపించింది ‘శశిరేఖాపరిణయం’ చూశాక. విడుదలైన రెండు వారాలకి ఈ సినిమా చూసే అవకాశం దొరికింది. పాటలను, ముఖ్యం గా పెళ్లి పాటలను చిత్రీకరించడంలో తనదైన శైలిని ఏర్పరుచుకున్న కృష్ణవంశీ ‘పెళ్లి’ నేపధ్యం గా తీసిన సినిమా అనగానే ఎలా ఉంటుందో ఊహించగలిగా. నా అంచనాలకు భిన్నంగా లేనప్పటికీ, పాటలు నిరాశ పరిచాయి. కాకినాడ లో చదువుకుంటున్న అమలాపురం అమ్మాయి శశిరేఖ (జెనిలియా) ని ఆమె పిన్ని బాబాయ్ ఓ అర్ధరాత్రి నిద్రలేపి అమలాపురం ప్రయాణం చేస్తారు. ఇంటిముందు ఉన్నా పందిరి చూసి ఎవరిదో పెళ్లి అనుకున్నశశిరేఖ జరుగుతున్నది తన పెళ్ళే అని తెలుసుకుని షాక్ అవుతుంది. పెళ్లి వద్దని ఇంట్లో వాళ్ళని ఒప్పించలేక ఇంటినుంచి పారిపోతుంది. ప్రయాణంలో ఆమెకి ఆనంద్ (తరుణ్) అనే అబ్బాయి పరిచయం అవుతాడు. హైదరాబాద్ పారిపోదామనుకున్న శశిరేఖ తన నగలు పోగొట్టుకోవడం తో విజయవాడ లో ఆగాల్సి వస్తుంది. ఈ ప్రయాణం లో ఆనంద్ తో ఆమె పరిచయం ప్రేమగా మారుతుంది. ఆనంద్ మరెవరో కాదు, శశిరేఖ తప్పించుకున్న పెళ్లి వరుడు అభిమన్యు అని ప్రేక్షకులకి తెలియడం తో కథ విశ్రాంతి కి వస్తుంది. ఆ నిజం శశిరేఖ కి తెలియడం, వాళ్ళిద్దరి పెళ్లి జరగడం తో ‘శుభం’ కార్డు (కాదు కాదు ‘కృష్ణవంశీ’ కార్డు) పడుతుంది.

మొదటి సగం లో హుషారుగా సాగిన కథ, రెండో సగం లో బోర్ కొట్టడం మొదలెడుతుంది. ఈ సినిమా ని నిలబెట్టిన ఒకే ఒక్క అంశం జెనిలియా నటన. మొత్తం సినిమాని తన భుజాలపై మోసిందీ అమ్మాయి. అక్కడక్కడ ‘బొమ్మరిల్లు’ హాసిని ఛాయలు కనబడ్డా మొత్తం మీద మంచి నటనని ప్రదర్శించింది. కథానాయిక పాత్ర బలమైనది కావడం, కథ మొత్తం ఆ పాత్ర చుట్టూ తిరగడం ఆమెకి కలిసొచ్చిన అంశాలు. తన పెళ్లి గురించి తెలుసుకుని శశిరేఖ షాక్ కి గురయ్యే సీన్, తల్లితో ఫోన్ లో మాట్లాడే సీన్, పెళ్లి పీటల మీద నుంచి తానూ ఎందుకు పారిపోవలసి వచ్చిందో ఆనంద్ కి (తాగిన మైకంలో) వివరించే సీన్ లలో జెనిలియా నటన గుర్తుండిపోతుంది. శశిరేఖ తండ్రిగా ఆహుతి ప్రసాద్ ది రొటీన్ పాత్ర. కథానాయిక తో పోల్చినపుడు నాయకుడి పాత్ర పరిధి తక్కువే. కొన్ని కొన్ని సన్నివేశాలలో తరుణ్ పరిణతి చెందిన నటన ప్రదర్శించాడు. హీరో తండ్రి గా పరుచూరి గోపాలకృష్ణ ది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. మిగిలిన పాత్రల గురించి పెద్దగా చెప్పుకోడానికి ఏమి లేదు.

ప్రతి ఫ్రేమ్ నిండా కిటకిటలాడుతూ ఆర్టిస్టులు, సంప్రదాయం ఉట్టిపడే లోగిళ్ళు, ఆప్యాయతలు, అనురాగాలు, పాతకాలపు ఆభరణాలు, ఫర్నిచర్…అంతా కృష్ణవంశీ మార్కు చిత్రీకరణ. కామెడి ట్రాక్ అంటు ప్రత్యేకంగా ఏమి పెట్టకుండా, సన్నివేశాల నుంచే హాస్యం పిండే ప్రయత్నం కొన్నిసార్లు ఫలించలేదు. పాటలు ఈ సినిమాకి పెద్ద మైనస్. చిత్రీకరణ కూడా సో సో. సంగీతం అందించింది మణి శర్మేనా? అనిపించింది. సినిమాలో మధ్య మధ్యలో వచ్చే నేపధ్య గీతం మాత్రం బయటకు వచ్చాక కాసేపు వెంటాడుతుంది.

కథను నడపడం లోను, పాత్రల రూపకల్పనలోనూ దర్శకుడి (రచయిత కూడా) తడబాట్లు చాలాచోట్ల స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. తనకి పెళ్లి అని తెలియగానే, ‘నాకు అప్పుడే పెళ్ళేమిటి, ఇంకా చదువు పూర్తీ కాలేదు’ అంటుంది శశిరేఖ. ఐతే, క్లైమాక్స్ కి వచ్చేసరికి చదువు విషయం మర్చిపోతుంది. కట్న కానుకలన్న, భార్య భర్తకి ఒదిగి ఉండే సంప్రదాయం అన్నా ఇష్టపడని స్వతంత్ర వ్యక్తిత్వం ఈ అమ్మాయిది. ఐతే చివరిలో అభిమన్యు ‘నాకు జీతం బాగా వస్తుంది, నువ్వు ఉద్యోగం కూడా చేయక్కర్లేదు’ అనగానే అందంగా సిగ్గుపడుతుందే తప్ప తనుకూడా చదువు పూర్తి చేసి తన కాళ్ళ మీద తను నిలబడతాను అనదు. హీరో ఈ అమ్మాయిని కొట్టినపుడు, ఈమె తిరిగి కొట్టడం మాత్రం నాకు బాగా నచ్చింది.

ఇక కథానాయకుడు.. ఓ పెళ్లి వీడియో లో శశిరేఖ ను చూసి ఇష్టపడి, ఆమె వివరాలు తన తండ్రికి పంపి పెళ్లి సెటిల్ చేయమని అడుగుతాడు. కాబోయే మామగారితో కూడా మాట్లాడతాడు. అంతే తప్ప చేసుకోబోయే అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేయడు (ఇతను ఓ వీడియో పంపిస్తాడనుకోండి, అది ఆ అమ్మాయి చూడదు..). తండ్రి కి కట్న కానుకల మీద ఆశ ఉందని తెలిసీ, అది పెళ్ళికి సమస్య కాకుండా జాగ్రత్తలు తీసుకోడు. కథానాయిక తండ్రి పల్లెటూరి వాడు కాబట్టి తన కూతురికి మనసు ఉంటుందని, ఇష్టాలు ఉంటాయని తెలుసుకోలేడు (?). కథానాయకుడి తండ్రిదీ అదే తంతు, తన కొడుకు ఆ అమ్మాయిని తప్ప మరెవర్ని పెళ్లి చేసుకోదని తెలిసీ వియ్యాలవారితో గొడవ పెట్టుకుంటాడు, కట్నం కోసం. పెళ్లి తప్పిపోయక కొడుకు ఏమైపోయాడో కూడా పట్టించుకోకుండా, వియ్యాలవారి మీద కేసులు పెడుతూ ఉంటాడు, బిజీగా. విజయవాడ లో పోలీస్ కమిషనరేట్ ఉన్నప్పటికీ పాత్రలన్నీ విజయవాడ ఎస్పీ అంటూ ఉంటాయి. అలాగే విజయవాడ గొప్పదనం చెప్పే డైలాగు లో కూడా హీరో ‘గోరా ఆయన కూతురు హేమంత లవణం’ అంటాడు. నిజానికి హేమలత లవణం గోరా కోడలు. (అసలు ఈ డైలాగే బలవంతంగా చొప్పించినట్టు ఉంటుంది, ‘చందమామ’ లో ఆయుర్వేదం డైలాగ్ లా..). విజయవాడ లో అభిమన్యు శశిరేఖ కి ఓ ప్యాకెట్ ఇస్తాడు, హైదరాబాద్ వెళ్ళాక చూడమంటూ. అందులో ఏముందో చూసే అవకాశం ప్రేక్షకులకి దొరకలేదు, శశిరేఖ ఆ ప్యాకెట్ సంగతే మర్చిపోయింది.

సంగీతం, పాటల చిత్రీకరణ, వాటి ప్లేస్మెంట్ తో పాటు రెండో సగం చిత్రీకరణ, ఎడిటింగ్ లో లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ‘శశిరేఖా పరిణయం’ ఓ మంచి సినిమా అయి ఉండేది. ఓ పక్క సినిమా ఐపోయాక ఓ పాట పెట్టడం ఏమిటో అర్ధం కాదు. ‘శుభం’ కార్డు కి బదులుగా ‘కృష్ణవంశీ’ అని పడుతుంది. (‘అందుకే వచ్చాం బాబు’ అని వెనుక సీట్ లో ఓ ప్రేక్షకుడి కామెంట్).

-మురళి

26 Comments
 1. శంకర్ January 16, 2009 /
 2. చందు January 16, 2009 /
 3. అబ్రకదబ్ర January 16, 2009 /
 4. Madhuravani January 16, 2009 /
 5. రామేశబాబు January 16, 2009 /
 6. radhika January 17, 2009 /
 7. గోపీచంద్ January 17, 2009 /
 8. chavakiran January 17, 2009 /
 9. విజయ్ నామోజు January 17, 2009 /
 10. sivaji January 18, 2009 /
 11. సుజాత! January 18, 2009 /
 12. వెంకటాచలపతి January 19, 2009 /
 13. సుజాత! January 19, 2009 /
  • అబ్రకదబ్ర January 19, 2009 /
 14. swechasagar January 19, 2009 /
   • మురళి January 21, 2009 /
 15. harish May 28, 2009 /
 16. jeevann June 6, 2009 /
 17. Ramana June 6, 2009 /
 18. murtyds June 7, 2009 /
 19. sanjeev June 7, 2009 /
 20. Praveen June 9, 2009 /