Menu

సినిమాలలో స్త్రీ పాత్రలు – రంగనాయకమ్మ

[ఈ వ్యాసం చదివేముందు ఒక ముందుమాట. ఇది రంగనాయకమ్మగారు 1973 లో రాసినది. కాబట్టి ఇది చదువుతూ, ఆ కాలంనాటి సినిమాలనే ఊహించుకోండి. ఇలాంటిదే కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన “సినిమా కథ” అనే వ్యంగ్యరచన ఒకటి విష్ణుభొట్ల లక్ష్మన్న గారు ఇదివరకు నవతరంగంలో పోస్టు చేశారు. అది కూడా చదవండి. ఒక కాలంలో మన తెలుగు సినిమాలు ఎలా ఉండేవో ఈ రెండు రచనలూ చదివితే తెలుస్తుంది. – సేకరణ: మేడేపల్లి శేషు, కొత్త ఢిల్లీ]

సినిమాల్ని నాలుగు రకాలుగా విభజించవచ్చును: 1. పౌరాణికాలు 2. చారిత్రకాలు 3. జానపదాలు 4. సాంఘికాలు.

పౌరాణికాలలోనూ, చారిత్రకాలలోనూ కథంతా నిర్ణయమైపోయి ఉంటుంది. పాత్రల స్వభావాలూ, దుస్తులూ, మాటలూ అన్నీ నిర్ణయమైపోయి ఉంటాయి.

సీతతో క్యాబరే డ్యాన్సు చేయించడం కుదరదు. కృష్ణదేవరాయలకు “సూట్” వెయ్యడమూ కుదరదు.

సతీసావిత్రి భర్త పోయాక, ఇంకో పెళ్లి చేసుకుంటే, మనకి చాలా కోపం వచ్చేస్తుంది – సినిమా తీసినవాళ్ల మీద. సుమతి భర్త వేశ్య దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఆవిడ చాలా వినయంగా, భక్తిగా – “మీ ఆనందమే నా ఆనందం నాథా! తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాను.” అనాలిగానీ, భర్త కోరిక వినగానే మండిపడిందంటే ఆ పాత్రని ఖూనీ చేశారని గోలపెట్టేస్తాం.

అలెగ్జాండరు, అశోకుడు, అక్బరూ ప్రజల్ని మహాచక్కగా పరిపాలించారు అని చెప్పాలిగానీ, “తెగ యుద్దాలుచేసి ప్రజల్ని చావగొట్టారు” అని చెప్తే చరిత్ర మేష్టార్లకి చాలా కోపాలోస్తాయి.

ఈవిధంగా పురాణకథలూ, చరిత్ర కథలూ, ఒక్కముక్కన్నా మార్చడానికి వీల్లేనంత పకడ్బందీగా నిర్ణయమైపోయి ఉంటాయి. ఉన్న కథనే ఎంత అందంగా చూపించారు అని ఆలోచించాలిగానీ, వేటిలో స్త్రీపాత్ర గానీ, ఏ పాత్రనిగానీ కొత్త స్వభావంతో చిత్రించడానికి వీలుండదు.

ఇలాగే జానపద సినిమాల్ని కూడా వొదిలెయ్యాలి. వాటిలో ఏ పాత్రా నేలని అంటుకుని ఉండదు. చీమలు ఎగురుతాయి, పాములు మాట్లాడతాయి, మనుషులు దేవుళ్ళ దగ్గరకో, రాక్షసుల దగ్గరకో వెళ్లి వొస్తూ ఉంటారు. స్త్రీ పాత్రలూ, పురుష పాత్రలూ, దేవకన్యలూ, చిలుకలూ, కాకులూ అన్నీ ‘కామన్ సెన్స్’ ని (లోకజ్ఞానాన్ని) ధిక్కరించి తమాషా వ్యవహారాలు చేస్తూ ఉంటాయి.

ఈ ‘కల్పన’ ని మనం నిజంగానే ఆనందిస్తాం గానీ, విమర్శించం (చాలాసార్లు దీన్ని నిజంగానే నమ్ముతాం కూడా – సైన్సు జ్ఞానం తగినంతగా లేక).

ఎటొచ్చీ మనం సాంఘికమైన కథలు చెప్పే సినిమాలోనే మంచిచెడ్డలు వెతుక్కోవాల్సి వుంటుంది (సాంఘికాలంటే ఈనాటి సంఘానికి సంబంధించిన విషయాలు).

మళ్ళీ ఈరకం సినిమాల్లో రెండు రకాలు –

1. కుటుంబ చిత్రాలు

2. బజారు చిత్రాలు

బజారు చిత్రాల‘కి ఈ పేరు పెట్టడం తప్పు కాదనుకుంటాను. వీటినే ‘క్రైం చిత్రాలు’ అంటారు.

వీటిలో చట్టవిరుద్ధమైన నేరాలు చేసే “పెద్ద” మనుషుల్ని పోలీసులు జైల్లో పడెయ్యడమో, విదేశీ గూఢచారుల్ని మన డిటెక్టివ్ లు పట్టి బంధించడమో, విలన్ మీద హీరో పది తరాల్నాటి పగ తీర్చుకోవడమోలాంటి కథలు వుంటాయి. ఇలాంటి సినిమాలలో స్త్రీ పాత్రలుగానీ వుంటే, అవి సి.ఐ.డి. కి అసిస్టెంట్లుగానో, దొంగలకు ప్రియురాలుగానో, క్లబ్బులో డాన్సర్లుగానో వుంటాయి. ఈ పాత్రల చిత్రణ బాగుందా లేదా అని ఆలోచించడం పిచ్చిపని.

ఈ పాత్రల చిత్రణ గురించి తలలు బద్దలు కొట్టుకోవడంకన్నా, ఆ దొంగలెక్కే గుర్రాల పరుగులూ, డిటెక్టివ్ లు పేల్చే తుపాకీల మోతలూ విని ఆనందించి రావడం కొంతన్నా ఆరోగ్యం కాబట్టి ఈ ‘బజారు’ చిత్రాల గురించి వొదిలేద్దాం.

ఇక ‘కుటుంబ చిత్రాల‘ సంగతి. వీటిలో కథలు ఏ కుటుంబాలకి, ఏ సంఘాలకి సంబంధించినవోగానీ, మన ఇళ్ళూ, మన కష్టసుఖాలూ, మన సమస్యలకు పరిష్కారాలూ ఏమీ వుండవు వీటిలో. భయంకరమైన అబద్దాలతోటీ, సిగ్గుచేటు సమస్యలతోటీ తయారుచేస్తారీ కథల్ని.

సాధారణంగా ఈరకం చిత్రాల్లో వుండే స్త్రీపాత్రలు – హీరో ప్రియురాలూ (లేకపొతే భార్యా), హీరో తల్లి, హీరో చెల్లెలు, హీరో వదినగారూ వగైరాలు.

‘సినిమా’ అన్నదాంట్లో (అది ఏ రకం సినిమా అయినా) – కథ అనేది ఎప్పుడూ హీరోని గొప్పచేసే పద్ధతిలోనే నడుస్తూ వుంటుంది – అతను ముప్ఫై ఏళ్ల వయసులో మెట్రిక్ పాసైనా సరే.

హీరో ప్రియురాలైతే – ఆమె పనంతా హీరోని ప్రేమించినట్టు పాటలు పాడుతూ, గంతులు వేస్తూ వుండటమే (ఇంత వ్యాయామం చేస్తోన్నా మన హీరోయిన్లు దినదిన ప్రవర్థమానమవుతూనే వుంటారు – ఎంచేతోగానీ).

కొంతకాలం కిందటి సినిమాల్లో హీరో, హీరోయిన్లు వుగ్గులు తాగే వయసుల్నుంచీ ప్రేమించుకుంటూ వుండేవారు. కొన్ని సినిమాల్లో అయితే కిందటి జన్మలనుంచీ కూడా. కాని ఇప్పుడు కథలు కొంచెం మారాయి. ఇప్పటి కథలో హీరో, హీరోయిన్లు బాగా పెద్దవాళ్ళయ్యాకే, ఏ పిక్నిక్ లోనో, హీరోయిన్ కారో, హీరో స్కూటరో చెడిపోయి సహాయం అవసరమయ్యే సమయాల్లోనో ఆ ఇద్దరూ కలుస్తారు. కలిశాక, మొదట పశువుల్లా పోట్లాడుకుని, జీవితాంతం మొహమొహాలు చూసుకోలేని తిట్లు తిట్టుకుని, మరుక్షణంలోనే విచిత్రంగా గాఢంగా ప్రేమించుకుని మనల్ని ఫూల్స్ చేసేస్తారు. రెండు ప్రేమపాటలు అయ్యాక ఇద్దరిదీ ఒక కులం కాదని తెలుస్తుంది. లేకపొతే కట్నం సమస్యో, హీరోకి కారులేని సమస్యో వొస్తుంది. లేకపొతే, హీరో నాన్న వూసిపోక పొరుగూరు వెళ్లి ఓ లక్షాధికారికి మాటిచ్చేసి, కొడుకు పెళ్ళికి లగ్నాలు పెట్టేసుకుని బాజాలతో సహా వొచ్చేస్తాడు. అదీగాకపోతే, హీరో పి.యు.సి. చదువుకి ఎవరో మురిసిపోయి అమెరికా పంపించేస్తారు. హీరోయిన్ పూర్వం పాడిన పాటలన్నీ బాణీలు మార్చి విచారంగా పాడుకుంటూ వుంటుంది. క్లయిమాక్స్ సీన్సులో మళ్ళీ హీరో వొచ్చినప్పుడు, హీరోయిన్ ఏ మూలనుంచో పరుగెత్తుకొచ్చి, హీరోమీద పడి బావురుమంటుంది. అదీ ప్రియురాలి పాత్ర. అంతే ఈ పాత్ర పని.

హీరో తల్లి అయితే, భర్త మధ్యా, కొడుకు మధ్యా నలిగిపోతూ ఉంటుంది. ప్రతీ సీనులోనూ, ఎవరి పాయింటు కరెక్టో, ఎవర్ని తను సమర్థించాలో ఆలోచించి, అలా చేసే సత్తా ఆవిడకి ఉండదు.

“తప్పు బాబూ! నాన్నగారి మాటకు ఎదురు చెప్పకు బాబూ!” అని యిటు తిరిగి కాస్సేపు కొడుకుని ప్రాధేయపడి ఏడుస్తుంది. ఆ కొడుకు కూడా తండ్రి ముందు పీనుగుమల్లె పడివుండాలని బోధిస్తుంది.

ఆ కొడుకు “క్షమించమ్మా…” అని సినిమాటిగ్గా క్షమాపణ కోరతాడు. తను చేసేది రైటైతే క్షమాపణ కోరడాలెందుకో!.

ఇక ఆ తల్లి, భర్తగారి వైపు తిరిగి “మీరన్నా నా మాట వినండీ!” అని అటు తిరిగి ఆయనకు చెప్పబోతుంది – జీవితంలో ఎన్నడూ ఆయన తన మాటని ఖాతరు చెయ్యడనే జ్ఞానం లేకుండా.

“నా మాట వినండీ” అని భార్య అన్నందుకు ఆ పురుషుడికి పెద్ద అవమానమైపోయి “ఏడిశావులే! నీ మాట వినాలా నేను? నువ్వు లోపలికి ఫో ముందు. వాడు బయటికి పోతాడు.” అని ఇద్దరికీ తలోదారీ చూపించి సమస్యని చిటికెలో తేల్చేస్తాడు. ఈ భార్య లోపలికి పోవటంతో మనకి న్యూసెన్స్ తప్పుతుంది.

సాధారణంగా ఈ తల్లి పాత్ర ఎప్పుడూ ఇలాగే వుంటుంది. ఇంతకన్నా వ్యక్తిత్వాలూ, శక్తి సామర్ధ్యాలూ ఆ పాత్రకి వుండవు. భర్త దగ్గిర కాస్సేపూ, కొడుకు దగ్గిర కాస్సేపూ ఏడుస్తూ, వుత్త పనికిమాలిన మనిషిలా పడివుండటమే తన కర్తవ్యంగా భావిస్తూ వుంటుంది ఈ పాత్ర.

ఇక హీరో ‘చెల్లెలు‘ పాత్ర అయితే, సినిమా మొదలుపెట్టిన దగ్గిరనుంచీ ఈ చెల్లెలు పెళ్ళో పెళ్ళో అని వొకటే గోల! అన్నగారిమీద తెగ పాటలు పాడి, వాణ్ని వుబ్బేసి, చీరలు కొనిపించుకుని, నగలు చేయించుకుని, చివరకు ఇల్లూ, వాకిలీ అమ్మించేసి పెళ్లి చేయించుకుంటుంది. అంతేగానీ, ‘నువ్విన్ని కష్టాలుపడి నాకీ నగలూ, చీరలూ తేవడం ఏమిటి? నువ్వింత బికారివై నాకు పెళ్లి చెయ్యడం ఏమిటి? పెళ్ళీ వొద్దు, గిళ్ళీ వొద్దు. ఏదో ఒక పనిచేసుకుని నా బతుకు నేను బతుకుతాను’ అని మాత్రం బొందిలో ప్రాణం వుండగా అనదు. అన్న ఎంత బీదవాడైనా సరే, అతని దగ్గిర వున్న చిల్లరడబ్బులతో సహా, వదినగారి పుస్తెలతో సహా, దోచుకోవడమే ఈ చెల్లెలి పాత్ర.

ఇక హీరో వదినగారైతే – మరిదిని వుయ్యాల్లో చంటాణ్ని ముద్దిచేసినట్టు ముద్దుచేస్తూ వుంటుంది. తన పిల్లల్ని చిన్నచిన్న వాళ్ళని కూడా నిర్లక్ష్యంచేసి “వొదినా! నువ్వు దేవతవి!” అని ఆ మరిది పచ్చి అబద్దాలాడుతోంటే నమ్మేసి, ఎప్పుడూ ఆ మరిది తిండీ, ఆ మరిది చదువూ, ఆ మరిది పెళ్ళీ, ఆ మరిది సౌఖ్యాలూ అంటూ ఎప్పుడూ ఆ మరిది పిచ్చితో మనం సినిమాలోంచి బైట పడేటప్పటికి మనందరికీ పిచ్చెత్తించేస్తుంది.

మనలాగే కాస్త ఇంగితజ్ఞానం గల ఆ మరిది భార్య ఈ జిడ్డు వ్యవహారం భరించలేక “నా మొగుడి సంగతి నీకెందుకూ? నీ పనేదో నువ్వు చూసుకో” అనేస్తుంది (ఈ పాత్రని చాలా చెడ్డపాత్రగా సినిమాలో చెపుతారనుకోండి). తోటికోడలు ఈసడింపుకి మన “వొదినగారు” ఘోరావమానం పాలైనట్లు (అవమానాలన్నీ తనకి తనే చేసుకున్నాననే సంగతి తెలుసుకోక) కుమిలిపోతూ, తిండీ తిప్పలూ మానేసి “దేవుడిగది” అనే ఆవకాయ జాడీలూ, కారం జాడీలూ, వడియాలూ వగైరా వుండే ఒక ఇరుకు చీకటికొట్టులో పడివుండి, ఆ సాయంత్రానికి జ్వరం తెచ్చుకుంటుంది. (ఈ వొదినగారి దుఃఖం చూస్తే మనకు కూడా కొంచెం కొంచెం జాలి ప్రారంభమవుతుందనుకోండి. ఆ జాలి మరీ ఎక్కువైతే కళ్ళ నీళ్లు కూడా వచ్చేస్తాయి). వొదినగారి జబ్బు ఎంతవరకూ పెరుగుతుందంటే తోటికోడలు వొచ్చి ఈమె కాళ్ళమీద పడి “నన్ను క్షమించు అక్కా! నోటిదురుసు మనిషిని నేను. నువ్వు జబ్బుపడ్డప్పటినుంచీ మీ మరిదిగారు నాతో మాట్లాడడంలేదు. పచ్చి మంచినీళ్ళైనా తాగటంలేదు. నా కాపురం సరిచెయ్యి అక్కా!” అని భోరున ఏడ్చేవరకూ, మళ్ళీ వదినా మరుదుల ‘తల్లీ-బిడ్డల ప్రేమ’ యథాప్రకారం కొనసాగేలా పరిస్థితులు చక్కబడితేనేగానీ మన వదినగారి జబ్బు మళ్ళదు. ఇదీ వదినగారి పాత్ర.

ఈ రకం కథలో హీరో భార్య కొంచెం ‘పెంకి మనిషి’ గా కాస్సేపైనా వుంటుందిగానీ మిగతా రకం కథలో అయితే హీరో భార్యకి నోట్లో నాలికే వుండదు. ఆవిడ ఎప్పుడూ మణుగులకొద్దీ శాంతమూ, కడవలకొద్దీ కన్నీరూ మోస్తూ వుంటుంది.

ఈ రకంగా – సినిమాలోని స్త్రీ పాత్రలో కాస్తో కూస్తో అభ్యుదయ ప్రవర్తనగానీ, ఆత్మాభిమానంగానీ, మచ్చుకన్నా వుండవు. వీటికి చీమూ, నెత్తురూ వుండవంటే ఆశ్చర్యపడనక్కరలేదు. ఇక ఈ పాత్రలో ఆదర్శాల గురించి ఊహించనేలేము. ఖరీదుగల చీరలు ఫ్యాషనుగా కట్టడాలూ, రకరకాల జుట్టుముళ్ళూ మాత్రం బాగా చూడవచ్చు ఈ పాత్రల ద్వారా.

“మనుషులు మారాలి” లోనూ, “దేవదాసు” లోనూ స్త్రీపాత్రలు గొప్పవి. సినిమా కథలు సాహిత్యపు విలువలమీదా, నూతనత్వం మీదా ఆధారపడక పోతే వాటిలో ఏ పాత్ర చిత్రణ అయినా ప్రేక్షకులకు చెప్పేదేమీ వుండదు.

–రంగనాయకమ్మ

[1973 జూన్ లో రేడియోలో ప్రసారమైంది]

[ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇప్పుడు డా. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం), హైదరాబాదు వారి 1986 సంవత్సరపు డిగ్రీ మొదటి సంవత్సరం ‘తెలుగు మౌలిక అంశాలు’ సిలబసులో పాఠ్యాంశంగా చేర్చబడింది. వ్యాసం చివర్లో విద్యార్థులకు ఒక ప్రశ్న ఇవ్వబడింది. “ఈ వ్యాసం రంగనాయకమ్మగారు 1973 లో రాసినది. అప్పటికీ, ఇప్పటికీ సినిమాల్లో స్త్రీపాత్రల చిత్రణలో ఏమైనా మార్పులు వచ్చాయా, చర్చించండి” అని. ఆసక్తి ఉంటే ఇది చదివిన పాఠకులు ఈ విషయం చర్చించవచ్చు. వ్యాఖ్యల రూపంలో వివరంగా రాసే అవకాశం లేకపొతే, విడిగా ఒక వ్యాసం రాసి పోస్టుచేస్తే బాగుంటుంది ]

ఈ వ్యాసం నవతరంగంలో ప్రచురించడానికి అనుమతినిచ్చిన రంగనాయకమ్మ గారికి ధన్యవాదాలు.

16 Comments
 1. chavakiran January 7, 2009 /
 2. Sowmya January 7, 2009 /
 3. మేడేపల్లి శేషు January 7, 2009 /
 4. Naresh January 7, 2009 /
 5. నియంత January 7, 2009 /
  • mahesh January 26, 2009 /
 6. JAYA January 8, 2009 /
 7. రవి January 9, 2009 /
 8. మేడేపల్లి శేషు January 9, 2009 /
 9. mahesh January 26, 2009 /
 10. satyam July 6, 2009 /
 11. అవినాష్ May 16, 2012 /