Menu

ప్రకామ్య-కల నిజమవుతుంది.

ప్రపంచంలోని వివిధ దేశాలలో ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ ఊపందుకుంటోంది.అమెరికా, ఇంగ్లండ్ లాంటి దేశాల్లో ఇండిపెండెంట్ సినిమాలు పెద్ద ఎత్తున నిర్మించబడుతున్నాయి. మిగిలిన వాటితో పోలిస్తే ఇండిపెండెంట్ సినిమాల్లో పనిచేసేవారికి ఎక్కువ స్వాతంత్ర్యం ఉంటుంది. ఈ కారణం చేతనే ఇండిపెండెంట్ సినిమాలు మైన్ స్ట్రీమ్ సినిమాలు స్పృశించని అంశాలు కలిగివుంటాయి. ఇండిపెండెంట్ సినిమా అంటేనే ఎక్కువ బడ్జెట్ లేకుండా తక్కువ ఖర్చుతో తీసే సినిమాలు. ఇలాంటి సినిమాలకు పని చేసేవారు చాలా వరకూ ఉచితంగానో లేదో తక్కువ జీతానికో పని చేస్తారు. సాధారణంగా అప్పుడప్పుడే సినీ పరిశ్రమలో అడుగుపెట్టాలనుకునే వారు ఇండిపెండెంట్ సినిమాని తమ తొలి మెట్టుగా భావిస్తారు.

స్టార్స్, సెట్లు జోలికి పోకుండా మనకి అందుబాటులో ఉన్నవారిని ఉపయోగించుకుని, మన దగ్గర ఉన్న సామాగ్రి తో ఎక్కువ కాంప్రమైజ్ కాకుండా మంచి సినిమా తియ్యడమే ఇండిపెండెంట్ సినిమా లక్ష్యం. అయితే ఇండిపెండెంట్ సినిమాల నిర్మాణానికి ముఖ్యంగా కావల్సింది ఒక నెట్ వర్క్.

ఇప్పటికే చాలా దేశాల్లో ఇలాంటి నెట్ వర్క్ లు ఎన్నో ఉన్నాయి. అందుకు ఒక మంచి ఉదాహరణ : షూటింగ్ పీపుల్. ఇది ఒక వెబ్ సైటు ఆధారిత సోషల్ నెట్ వర్క్.సినిమాలంటే ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ సైట్లో సభ్యత్వం తీసుకోవచ్చు. ఒక సారి సభ్యత్వం తీసుకున్నాక ఈ సైటు లో ఇప్పటికే ఉన్న మిగతా సభ్యులతో జతకట్టొచ్చు. వారు తీయాలనుకున్న సినిమాల్లో ఏమైనా పని దొరుకుతుందేమో తెలుసుకోవచ్చు. మీరే సినిమా తీయాలనుకుంటే మీకు ఫలానా ఫలానా వారు ఈ సినిమాలో పనిచేయడానికి కావాలని ప్రకటనలూ చెయ్యొచ్చు.

అయితే మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇలాంటి నెట్ వర్క్ అసలు లేదనే చెప్పాలి. ఈ లోటు ని పూడ్చే లక్ష్యంగా స్థాపించిందే ప్రకామ్య. ప్రకామ్య గురించి చెప్పేముందు ఒక విషయం చెప్పాలి. ఐదారు నెలల క్రితం నవతరంగానికి అనుబంధంగా ఒక చర్చావేదికను ఏర్పాటు చేసిన సంగతి చాలామందికి తెలుసుండకపోవచ్చు. అది ఇంకా పని చేస్తూనే ఉన్నా కూడా అక్కడికి ఎవరూ వెళ్ళటం లేదన్నది నిజం. నవతరంగంలో అప్పటికే కామెంట్ల ద్వారా చర్చించుకునే అవకాశం ఉన్నప్పటికే మళ్ళీ చర్చావేదిక అంటూ మరొకటి స్థాపించడంలో ఇప్పుడు అర్థం లేదనిపించినా అప్పుడు అలా అనిపించలేదు. ఈ చర్చావేదిక ద్వారా ఐదుగురు నవతరంగం సభ్యులు కలిసి ఒకొరికొకరు సహకరించుకుంటూ ఐదు స్క్రిప్టులు డెవలప్ చెయ్యాలని నిర్ణయించుకుని ఆ చర్చావేదికలో కొంత పని మొదలుపెట్టినప్పటికీ డిస్కసన్ ఫారమ్ ద్వారా ఆ పని చెయ్యలేమని త్వరలోనే తెలుసుకుని ఆ కార్యక్రమాన్ని అంతటితో ఆపేశాం.అక్కడితో చర్చావేదిక మూతబడిపోయింది. అది నవతరంగంలో ఒక ఫెయిల్యూర్ స్టోరీ 🙂 అయితే ఆ రోజు మేము ఒకరితో ఒకరు సహకరించుకుంటూ స్క్రిప్ట్ డెవలప్ చెయ్యాలనే ఐడియా మాత్రం చాలా రోజులుగా నా మదిలో మెదుల్తూ వచ్చింది, ఇలాంటి ఐడియాలున్న వాళ్ళందరినీ ఒక చోటుకు చేర్చడానికి డిస్కషన్ బోర్డ్/ఫోరమ్ కాకుండా మరో రకంగా చేస్తే బావుంటుందనిపించింది. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే ఈ ప్రకామ్య.

ప్రకామ్య గురించి:ఇది elgg అనే ఓపెన్ సోర్స్ సోషల్ నెట్ వర్కింగ్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి నిర్మించబడింది.బహుశా elgg ఉపయోగించి నిర్మించిన తొలి తెలుగు సోషల్ నెట్ వర్క్ సైట్ ఇదేనేమో. నవతరంగంకు వర్డ్ ప్రెస్ ఎలాగో అలాగే ప్రకామ్య కు ఎల్గ్ అన్నమాట. ఎల్గ్ ఉపయోగంతో నిర్మించిన ఒక మినీ ఫేస్ బుక్/ఆర్కుట్ లాంటి సైటే ప్రకామ్య.

ప్రకామ్యలో మీరు ఏం చెయ్యవచ్చు?

ప్రకామ్యలో మిగిలిన సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఉన్న అన్ని సదుపాయాలు ఉన్నాయి.

 • ఇందులో మీ గురించి, మీ ఆసక్తుల గురించి ఇతరులకు తెలియచేయవచ్చు.
 • మీరు సినిమా తీయాలనుకుంటుంటే మీ సినిమాలో పనిచెయ్యడానికి కావలసిన నటీనటులు/సాంకేతిక నిపుణుల గురించి ప్రకటనలు చెయ్యవచ్చు.
 • మీరు ఇది వరకే లఘు చిత్రాలు నిర్మించివుంటే వాటిని ఇక్కడ ప్రదర్శించవచ్చు.
 • సినిమా నిర్మాణం గురించి మీ దగ్గరున్న సాహిత్యాన్ని ఇతరులతో పంచుకోవచ్చు.
 • మీరు నటీనటులవ్వాలకుకుంటుంటే మీ ఫోటోలు/వీడియోలు ప్రకామ్యలో ప్రదర్శించవచ్చు.
 • అన్నిటికంటే ముఖ్యంగా మీలాగే సినిమా తియ్యాలనే ఆసక్తి ఉన్న మరికొంతమందిని ఇక్కడ కలుసుకోవచ్చు.

ఇలా ప్రకామ్య ద్వారా మీరు మీ సినిమా కలను నిజం చేసుకోవచ్చు. కేవలం వెబ్ సైట్లో కలుసుకుని సినిమా తీసేస్తారా అనే అనుమానం నాకు లేదు. అలా అని రాత్రికి రాత్రే లఘు చిత్ర నిర్మాణం మొదలయిపోతుందన్న ఆశ కూడా లేదు. గత సంవత్సరం ఇదే రోజున నవతరంగం మొదలుపెట్టినప్పుడు ఇన్ని వ్యాసాలు వస్తాయని ఊహించలేదు. అలాగే ఇంకో సంవత్సరం రోజుల్లో ప్రకామ్య ద్వారా కలుసుకున్న ఔత్సాహికులు ఇక్కడే తమ సినిమాలను ప్రదర్శించినా ఆశ్చర్యం లేదు.

చివరిగా చెప్పొచ్చేదేమిటంటే ప్రకామ్య ద్వారా ఏం చెయ్యొచ్చని అడిగితే “The possibilites are endless!” అని మాత్రం చెప్పగలను.

మరి ఇంకా ఎందుకు ఆలస్యం ప్రకామ్యలో చేరండి. మీ కల నిజం చేసుకోండి.

మీ సలహాలు, సందేహాలు prakamyam[at]gmail[dot]com కి మైల్ చెయ్యండి.

ప్రకామ్య నిర్మాణంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు. మీరు గతంలో ప్రకామ్యలో రిజిస్టర్ గా చేసుకునివుంటే మన్నించాలి. సైట్ అప్ గ్రేడ్ చెయ్యడంలో ఆ వివరాలన్నీ delete అయ్యాయి. దయచేసి మరోసారి సభ్యులుగా నమోదు చేసుకోవాలని మనవి.

18 Comments
 1. విజయవర్ధన్ January 1, 2009 /
 2. మేడేపల్లి శేషు January 1, 2009 /
 3. surya January 1, 2009 /
 4. saif ali gorey January 1, 2009 /
 5. Uttara January 1, 2009 /
 6. sivaji.k (1st, january 2009) January 1, 2009 /
 7. sivaji.k (1st, january 2009) January 1, 2009 /
 8. shriedhar January 1, 2009 /
 9. shriedhar January 1, 2009 /
 10. shree January 2, 2009 /
 11. మేడేపల్లి శేషు January 2, 2009 /
 12. రెండుచింతల భానుప్రసాద్ January 3, 2009 /
 13. sharma January 6, 2009 /
 14. mahammad January 14, 2009 /
 15. viswanath Goud March 31, 2009 /