Menu

Outsourced

ఒక విదేశీయుడు భారతదేశానికి వచ్చిన అంశం ఆధారంగా సినిమా తీయబడింది. అందులో ఏమేమి ఉంటాయో ఊహించుకోండి! ఏముంది, ఎక్కడ చూసినా కిటకిటలాడే జనాభా, కాలుష్యం, మురికివాడల్లో దయనీయస్థితిలో జీవించే ప్రజానీకం, అవకాశం వస్తే ఆ విదేశీయుడిని మోసం చేసేవారు, భారతదేశములో సగటు మనిషి ఎదుర్కుంటున్న కష్టాలు.. ఇవి నా మనసులో వచ్చిన ఆలోచనలు. ఇలాంటి ఆలోచనలు రావడానికి కారణం ఏమిటంటారా? ఇప్పటివరకు చూసిన So Called చిత్రరాజములే.

ఇప్పటివరకు ప్రపంచ ఖ్యాతిగాంచిన (ముఖ్యముగా గత రెండు దశాబ్దాల్లో) దర్శకులు భారతదేశం గురించి తీసిన సినిమాల్లో పధాన కథాంశాలు కొన్ని చూస్తే –  మురికివాడలు లేని సినిమాలు ఎన్ని ఉన్నాయి? సాంఘిక దురాచారాలు లేని సినిమాలు ఉన్నయా? అణగదొక్కబడిన ఒక వర్గం గురించో, ఒక ప్రాంతం గురించో తరచు “అవార్డు” సినిమాలు తీస్తుంటారు. భారతదేశంలో జరిగే కథ ఆధారంగా సినిమా తీయడానికి ఒక అమెరికన్ నిర్మాత ఒక భారత దర్శకుడు లేదా రచయిత దగ్గరకు వస్తే, మురికివాడలు – దురాచారాలు – సమస్యలు లేకుండా కథ వ్రాయగలరు అంటే నేను నమ్మను.

ఇవన్నీ నిజాలే, భారత దేశములో ఉన్నాయి, కాదనను. కానీ ఇవన్నీ నాణేనికి ఒక్క వైపు మాత్రమే అని గ్రహించాలి. మరి ఆ రెండో వైపు ఏమిటి అంటారా? మొదటివైపునవి కానివన్నీ రెండో వైపునవే!! మరి ఈ రెండో వైపు గురించి చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. కారణం? మొదటి వైపు ఉన్నవాటిని చూపినపుడే, ఉదాహరణకు మురికివాడల్లో దుర్భరజీవితాన్ని చూపించి గుండెలు పిండితేనే నాలుగు డబ్బులు పిండవచ్చు, అందరూ “అబ్బా ఎంత గొప్పగా తీసారు”  అనుకుంటారు.

ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే, కొన్నాళ్ళ క్రితం ఎప్పటినుండో ఎదురుచూస్తున్న “రెండో వైపు” తరహా సినిమా ఒకటి చూసే అదృష్టం కలిగింది. ఆ సినిమా పేరే Outsourced. ఇదేదో భారతదేశాన్ని represent చేసే సినిమా అని నేను భావించడం లేదు కానీ, నాకు తెలిసిన మరో కోణంలో తీయబడింది.

కథాంశం
సియాటిల్‌లో ఒక కంపెనీలో కస్టమర్ సర్వీస్ టీం లీడర్ గా పని చేసే టాడ్, కస్టమర్ సర్వీస్ మొత్తం ఇండియాకు అవుట్‌సోర్స్ చేయబడడంతో దాదాపు ఉద్యోగం కోల్పోవలసిన పరిస్థితి ఎదుర్కుంటాడు. విధిలేక ఇండియా వెళ్ళి అక్కడివాళ్ళకు ట్రెయినింగ్ ఇవ్వడానికి వప్పుకొని ఇండియాకు వస్తాడు.

వీలయినంత తొందరగా ఇండియాలో ట్రెయినింగ్ ఇవ్వడం పూర్తి చేసి తన బాస్ చెప్పిన ఉత్పాదకత (productivity) సాధించాలని, తర్వాత తిరిగి అమెరికా వెళ్ళాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఇండియా బ్రాంచి మేనేజరు అయిన పురోహిత్, కాల్ సెంటర్‌లో పని చేసే ఆషా తమ సహకారాన్ని అందిస్తారు. భిన్న సంస్కృతిని తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా తన పద్దతులను మార్చుకొని ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచి అనుకున్న productivity సాధిస్తాడు. మనుషుల్లోని ఆత్మీయతను గుర్తించి తాను ఇన్నాళ్ళు ఏమి కోల్పోయాడో గ్రహిస్తాడు. ఈ క్రమంలో ఆషా- టాడ్‌లు సన్నిహితులవుతారు.  అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి అనుకుంటుండగా అమెరికా నుండి టాడ్ బాస్ వచ్చి కంపెనీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని చెప్తాడు.

చివరకు టాడ్ ఏమి చేస్తాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవలసిందే!

నటీనటులు
కొత్త దేశం లో, కొత్త సంస్కృతిలో అనుభవాలను ఎదుర్కుంటూ, ఇతరులను నొప్పించకుండా అర్థం చేసుకొనే ఒక సగటు అమెరికన్‌గా టాడ్ పాత్రలో Josh Hamilton అద్భుతంగా  నటించాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన సినిమాలింకేమయినా ఉన్నాయేమో నని చూడగా నిరాశ ఎదురయింది. పురోహిత్‌గా ఆసిఫ్ నటన బాగుంది. ఇక హీరోయిన్ గా నటించిన ఆయేషా గురించి కాస్త చెప్పాలి. మామూలుగా ‘అమ్మాయి సన్నగా నవ్వితే మతి తప్పి మంచాన పడతారు ‘ అన్నది కొందరు హీరోయిన్లకు వర్తిస్తుంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ సన్నగా నవ్వితే మతితప్పడమేమో కానీ, ఖచ్చితంగా కోమాలోకి  వెళ్తాము (అక్కడక్కడ భయానక క్లోజప్ షాట్లున్నాయి!) . ఇంత మంచి సినిమాలో ఏదయినా లోపం ఉందా అంటే అది కేవలం హీరోయిన్ ఎంపిక మాత్రమే. అందంగా లేకుంటే ఏమీ నష్టంలేదు కానీ, భయపెడితే భరించడం కష్టమే!!!

ఇతర విశేషాలు
ఈ సినిమా చూసిన వెంటనే నేను చేసిన మొదటి పని ఇంత మంచి కథను అందించిన ఈ  సినిమా రచయిత ఎవరు అని వెతకడం. రచయితలు ఇద్దరూ అమెరికన్స్ అని తెలుసుకొని ఆశ్చర్యపోయాను.  ఎక్కడా కించపరచడం, వెకిలి హాస్యం లేకుండా చిన్న చిన్న అంశాలను సైతం ఉన్నతంగా చూపించగలిగారు. ఇంత మంచి సినిమా తీసినప్పటికీ తగిన పబ్లిసిటీ ఇవ్వకపోవడం పెద్ద లోపం. ఈ సినిమా చూసిన అందరూ అన్నారు “ఇంత మంచి సినిమా ఎందుకు, ఎలా ఇన్నాళ్ళు మిస్ అయ్యాము??” అని.

సైడ్ లైట్స్
సినిమాలో బాగా నచ్చిన సన్నివేశాలు –

 • ట్రైన్‌లో సీటు కోసం చూస్తున్న టాడ్ కు పిల్లవాడు సీట్ ఇచ్చి వెంటనే …..
 • పురోహిత్ పెళ్ళి గోల, కాబోయే భార్య (ఫోటో) పైన ప్రేమ
 • అమెరికా నుండి ఒక కస్టమర్ ఫోన్ చేసి అవుట్‌సోర్సింగ్ పైన తన ఆగ్రహం వెలుబుచ్చుతుంటే ఆషా సమాధానమివ్వడం
 • టాడ్ ఉంటున్న ఇంటి యజమానురాలు టాడ్‌ను కొడుకులా భావించి బాగోగులు చూసుకోవడం
 • రోజూ మిగిలిపోయిన ఆహారాన్ని గోడ అవతల ఉన్న వ్యక్తికి ఇవ్వడం – ఆ వ్యక్తి టాడ్‌ను తన ఇంటికి పిలుచుకెళ్ళడం.

పైన చెప్పిన “నాణేనికి రెండో వైపు” లేదా ఒక Feel Good సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా  చక్కని అవకాశం.

–జీడిపప్పు

13 Comments
 1. శంకర్ January 18, 2009 /
 2. అబ్రకదబ్ర January 18, 2009 /
  • అబ్రకదబ్ర January 19, 2009 /
   • చందు January 19, 2009 /
  • చందు January 19, 2009 /
 3. saif ali gorey January 19, 2009 /
 4. రామేశబాబు January 19, 2009 /
 5. Rajiv January 20, 2009 /
 6. చందు February 5, 2009 /
 7. చందు February 5, 2009 /