Menu

ఆర్సన్ వెల్స్ – మొదటి భాగం

ప్రపంచాల యుద్ధం

ఆ రోజు 1938 అక్టోబరు 30, ఆదివారం రాత్రి. తెల్లవారితే హాలోవీన్ అనబడే ప్రేతాత్మల పండగ. అది అమెరికా దేశం. చలికాలం అప్పుడే మొదలవుతుంది. అమెరికన్ సమాజం ఇంకా మహామాంద్యపు కోరలనుండి బయటపడలేదు. ఐరోపాలో హిట్లర్ ముప్పు ముంచుకొస్తున్న రోజులవి. ఐరోపాలో యుద్ధమంటూ వస్తే, పులిమీద పుట్రలా, ఆ సెగ తమనూ తాకుతుందని అమెరికన్ల మనసులో ఏమూలో బెదురు. జెర్మన్ల యుద్ధ యంత్రాలపై, తంత్రాలపై రోజుకో కధనం. ఈ నేపధ్యంలో, అతి మామూలుగా మొదలయిందా ఆదివారం సాయంత్రం. ఒక సమాజపు ఆలోచనా సరళిని సమూలంగా మార్చివేసే సంఘటన మరికొద్ది సేపట్లో జరగబోతుందని అప్పుడెవ్వరూ ఊహించలేదు.

టెలివిజన్ ఇంకా అందుబాట్లోకి రాని ఆ రోజుల్లో అమెరికన్లకి కాలక్షేపానికీ, వినోదానికీ, వేడి వేడి వార్తలకీ  రేడియోనే దిక్కు. ఆ రాత్రి యధాప్రకారం ఎన్‌బిసి లో ప్రముఖ కార్యక్రమం ‘ఛేజ్ అండ్ శాన్‌బార్న్ ఘడియ’ (Chase and Sanborn Hour) కార్యక్రమంలో ప్రముఖ వెంట్రిలాక్విస్టు ఛార్లీ మెకార్తీ సమర్పిస్తున్న హాస్యలహరి వింటూ, విరామ సమయంలో వ్యాపార ప్రకటనలు తప్పించుకోటానికి స్టేషన్లు మారుస్తున్న శ్రోతల్లో చాలామంది కొలంబియా బ్రాడ్‌కాస్టింగ్ సిస్టం (సిబిఎస్) స్టేషన్లో వస్తున్న వార్త విని ఉలిక్కిపడ్డారు. దాని సారాంశం: న్యూ జెర్సీ రాష్ట్రంలోని గ్రోవర్స్ మిల్ గ్రామంపై గ్రహాంతరవాసుల దాడి. దాడి గురించి పలువురు ప్రత్యక్ష సాక్షుల కధనాలు వింటూ శ్రోతలు బెంబేలెత్తిపోయారు. మార్స్ నుండి వచ్చిన వింతజీవులు ఒకదాని వెంబడి ఒకటిగా న్యూ జెర్సీ లోని పట్టణాలను, గ్రామాలను ముట్టడిస్తూ ఎదురుపడ్డ మనుషులను లేజర్ తుపాకులతో కాల్చి బూడిద చేస్తున్నట్లు వరుసగా వార్తలు. వారినెదుర్కోవటానికి రంగంలోకి దిగిన సైన్యం కూడా చేతులెత్తేసినట్లు సమాచారం! ఈ వార్తలందిస్తున్న విలేకరులు కూడా గ్రహాంతరవాసుల బారిన పడి మరణించటం, వాళ్ల ఆర్తనాదాలు రేడియోలో వింటూ శ్రోతలు భీతిల్లిపోవటం!! టెలిఫోన్ల ద్వారా ఈ వార్త నిమిషాల్లో అమెరికా తూర్పు తీరమంతా దావానలంలా వ్యాపించింది. గంట గడిచే లోగా దేశమంతా అట్టుడుకిపోయింది. దాడి వార్తని నిర్ధారించుకోటానికి రేడియో స్టేషన్లకి, పోలీస్ స్టేషన్లకి, వార్తా పత్రికల కార్యాలయాలకీ వేలకొద్దీ ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి. దాడి మొదలైన గ్రోవర్స్ మిల్‌కి సమీప ప్రాంతాల్లో అనేకమంది ఇళ్లలోంచి పారిపోయారు. కొందరు సమీపంలోని చర్చ్‌లలో తలదాచుకుని ప్రార్ధనలు జరపసాగారు. యుగాంతం సమీపించిందనుకున్నారు వేదాంతులు. ధైర్యవంతులు కొందరు తుపాలు తీసుకుని సైన్యానికి సహాయ పడతామంటూ బయల్దేరారు. పెన్సిల్వేనియా రాష్ట్ర గవర్నర్ ఈ విపత్తుని కాచుకోటానికి తమ దళాలను న్యూ జెర్శీకి పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాడు.ఇంత గందరగోళంలోనూ తెలివిగా ఆలోచించిన కొందరు ఇది గ్రహాంతరవాసుల దాడి కాదని నమ్మారు. హిట్లర్ ఆదేశాలతో జర్మన్లు తమ దేశంపై మెరుపు దాడి చేశారని వీళ్లు ఊహించారు. మొత్తమ్మీద, న్యూ జెర్సీ వాసుల్లో భయాందోళనలు. వాళ్ల భయాలను పెంచుతూ ఫోన్ లైన్లు కూడామొరాయించటం మొదలెట్టాయి. నిమిషానికో కబురు. వార్తేదో, వదంతేదో అంతుపట్టని స్థితి.

కొన్ని గంటలు ఫాస్ట్ ఫార్వార్డ్ చేస్తే ….

…. అసలు కధ

నిజం తెలిసిన జనాలు – కొందరు నవ్వుకున్నారు, కొందరు తమ తెలివితక్కువతనానికి సిగ్గుపడి గమ్మునున్నారు, ఎందరో ఆగ్రహావేశాలకు లోనయ్యారు. కారణం: వాళ్లందర్నీ అంతలా బెదరగొట్టిన ఆ రేడియో వార్త నిజానికి వార్త కాదు, అచ్చమైన వార్తా ప్రసారంలా రూపొందిన రేడియో నాటకం మాత్రమే. దాని ప్రయోక్త, రేడియో రంగంలో అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటున్న ఆర్సన్ వెల్స్.

ఆర్సన్ వెల్స్

అత్యధిక రేటింగ్ ఉన్న ఎన్‌బిసి వారి శాన్‌బార్న్ ఘడియ ప్రసారమయ్యే సమయంలోనే తను సమర్పించే కార్యక్రమాలు సిబిఎస్ లో ప్రసారమవుతుండటంతో, ఎన్‌బిసి శ్రోతలని ఇటువైపుకి మళ్లించేందుకు వెల్స్ వేసిన పాచిక అది. అప్పటికి నలభయ్యేళ్ల క్రితం, 1898లో, సైన్స్ ఫిక్షన్ సాహిత్య పితామహుడు హెచ్.జి.వెల్స్ (ఆర్సన్ వెల్స్‌కీ హెచ్.జి.వెల్స్‌కీ చుట్టరికమేదీ లేదు) రాసిన వార్ ఆఫ్ ది వ(ర)ల్డ్స్ నవలని రేడియో నాటకంగా మార్చి, అద్భుతమైన సౌండ్ ఎఫెక్ట్స్‌తో, నిజమైన స్థలాల, మనుషుల, సంస్థల పేర్లు వాడుతూ గ్రహాంతరవాసుల దాడి నిజంగా జరిగిందనిపించేలా రూపొందించిన రేడియో కదంబ కార్యక్రమమది. తన నాటకానికి మరింత ఆథెంటిసిటీ ఇవ్వటానికి ఆర్సన్ చేసిన ప్రయోగం – దాన్ని వార్తా ప్రసారంలా రూపొందించటం (ఇప్పట్లో ప్రతి టెలివిజన్ ఛానెల్లోనూ మామూలైపోయిన ‘బకరా’ తరహా కార్యక్రమాలకి స్ఫూర్తి అలనాటి వెల్స్ రేడియో నాటకమే). ఈ కార్యక్రమానికి ముందు కొన్నాళ్లనుండీ దీనికి సంబంధించిన ప్రకటనలు రేడియోలోనూ, వార్తా పత్రికల్లోనూ వస్తూనే ఉన్నా అవి అధికుల దృష్టిలో పడలేదు. కార్యక్రమం మొదట్లో కూడా అది రేడియో నాటకం అన్న సంగతి ప్రకటించినా, అధిక శాతం శ్రోతలు అది వినకపోవటం వల్ల గందరగోళం నెలకొంది. ఏదైతేనేం, ఆర్సన్ వెల్స్ ఊహలకు మించి విజయవంతమైందానాటి కార్యక్రమం. వార్ ఆఫ్ ది వ(ర)ల్డ్స్ ప్రసారంతో అప్పటిదాకా రేడియో నాటకాలకు ఉన్న లక్షణాలను అమాంతం మార్చిపారేశాడు ఆర్సల్ వెల్స్.

దీని తర్వాత ఆర్సన్ వెల్స్ మీదా, అతని మెర్క్యురీ థియేటర్ మీదా నడిచిన కోర్టు కేసులు మరో పెద్ద కధ. దాని సంగతటుంచితే, అప్పటిదాకా అమెరికన్ ప్రజానీకానికి రేడియోలో విన్నదంతా నిజమే అని నమ్మే అలవాటుండేది. ఒక్క దెబ్బలో దాన్ని పటాపంచలు చేసిపారేశాడు ఆర్సన్ వెల్స్. రేడియో ఎంత ప్రభావశీల మాధ్యమమో ఆనాటితో అందరికీ అర్ధమైపోయింది. ఈనాటికీ, ప్రజల మీద మీడియా ప్రభావం గురించి చర్చించే ప్రతి సందర్భంలోనూ 1938నాటి వార్ ఆఫ్ ది వ(ర)ల్డ్స్ ప్రసారం గురించీ, అది రేపిన అలజడి గురించీ ప్రస్తావన వస్తూనే ఉంటుంది.

ఒక అంచనా ప్రకారం ఈ ప్రసారం విన్న శ్రోతల్లో సుమారు పన్నెండు లక్షల మంది పానిక్ అయ్యారు. ఈ అంచనా శాస్త్రీయతపై అనంతర కాలంలో విమర్శలొచ్చాయి. ఆ విమర్శల్లో నిజానిజాలెంతున్నా, వార్ ఆఫ్ ది వ(ర)ల్డ్స్ రేడియో నాటకంతో వెల్స్ పేరు రాత్రికి రాత్రే అమెరికా అంతటా మార్మోగిపోయిందన్నది నిజం. ఒక చిన్న రేడియో ప్రసారంతో ఇంత సంచలనం సృష్టించే నాటికి ఆర్సన్ వెల్స్ వయసు – కేవలం ఇరవై మూడు సంవత్సరాలు. ముఖంలో ఇంకా పసితనపు ఛాయలు పోకుండానే అతను రేపిన సంచలనానికి ముగ్ధులైన విమర్శకులు వెల్స్‌కి పెట్టిన ముద్దు పేరు – బోయ్ జీనియస్. ఈ బోయ్ వండర్ అనంతర కాలంలో స్టేజి, రేడియో, సినిమా మాధ్యమాల్లో సాధించిన విజయాలకి నాటి వార్ ఆఫ్ ది వ(ర)ల్డ్స్ నాంది.

(ఆర్సన్ వెల్స్ జీవిత విశేషాలు, తరువాతి భాగంలో)

–అబ్రకదబ్ర

7 Comments
  1. విజయవర్ధన్ January 6, 2009 /
  2. shree January 6, 2009 /
  3. Kiran January 6, 2009 /
  4. కొత్తపాళీ January 6, 2009 /
  5. అబ్రకదబ్ర January 6, 2009 /