Menu

ఆర్సన్ వెల్స్ – చివరి భాగం

(మొదటి భాగం తరువాయి)

1915 మే 6న అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం కెనోషా పట్టణంలో ఓ ధనిక కుటుంబంలో జన్మించిన ఆర్సన్ వెల్స్ సంగీతకారిణి అయిన తల్లిద్వారా చిన్నతనంలొనే పియానో, వాయులీనం వంటి వాయిద్యాలను ఉపయోగించటం నేర్చుకున్నాడు. అతనికి ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. ఎనిమిదేళ్ల ప్రాయంలో తల్లి, పదమూడేళ్లప్పుడు తండ్రి కాలం చేశారు. చిన్నప్పటినుండీ వెల్స్ దృష్టి చదువు కన్నా కళల మిద ఎక్కువ ఉండేది. టీనేజ్‌లో కొచ్చేటప్పటికే అతను ఐరోపాని రెండు సార్లు చుట్టిరావటమే కాకుండా, షేక్‌స్పియర్ విరచిత ‘హేమ్లెట్’ నాటకంలో ఓ పాత్ర ధరించటం ద్వారా నాటక రంగ ప్రవేశం కూడా చేశాడు. అతని తొలి నాటక ప్రదర్శన జరిగింది ఐర్లాండ్ దేశం డబ్లిన్ నగరంలో, 1931లో.

ఐర్లాండ్‌లోనే ఏడాది పాటు నాటక ప్రదర్శనలిచ్చిన పిదప స్పెయిన్, మొరాకో వంటి దేశాల్లో ‘రోమియో జూలియట్’ వంటి షేక్‌స్పియర్ నాటక ప్రదర్శనలిస్తూ కొన్నాళ్ల పాటు పర్యటించి, 1933లో అమెరికాకి తిరిగొచ్చాడు. చికాగో, న్యూయార్క్ వంటి నగరాల్లో నాటకాలకి దర్శకత్వం వహిస్తూ, వాటిలో ప్రధాన పాత్రలో పోషిస్తూ కొంత కాలం గడిపాడు. ఇదే సమయంలో స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ‘ది హార్ట్స్ ఆఫ్ ఏజ్’ (The Hearts of Age) అనే లఘు చిత్రాన్ని కూడా నిర్మించాడు. ఒక రకంగా ఇదే వెల్స్ మొదటి సినిమా. 1935 ప్రాంతంలో వెల్స్ రూపొందించిన నాటకం ‘పానిక్’ (Panic) విజయవంతం కావటంతో దాన్ని రేడియో నాటకంగా కూడా మలిచాడు. అలా ఆర్సన్ వెల్స్ రేడియో రంగప్రవేశం జరిగింది. వయసుకి మించిన గంభీరతని సొంతం చేసుకున్న అతని స్వరం అనతికాలంలోనే రేడియో ప్రయోక్తగా వెల్స్‌కి గుర్తింపు తెచ్చి పెట్టింది. 1937 – 38 మధ్య కాలంలో రేడియో కార్యక్రమాలతో ఆర్సన్ వెల్స్ ఎంత బిజీగా ఉండేవాడంటే, ఒక్కో కార్యక్రమానికీ మధ్య ఉన్న కొద్దిపాటి సమయంలో ఒక స్టుడియో నుండి మరో స్టుడియోకి పరుగుదీయటానికి అతనికి కష్టమైపోయేది. దానికి తోడు న్యూ యార్క్ నగరంలోని ట్రాఫిక్ రద్దీ అతని పని మరింత కష్టం చేసేది. దీనికి విరుగుడుగా వెల్స్ ఓ చిన్న చిట్కా కనిపెట్టాడు. అదేమంటే, ఒక అంబులెన్స్‌ని అద్దెకి తీసుకుని దాని సైరెన్లు మోగించుకుంటూ స్టుడియోల మధ్య సంచారం చెయ్యటం!

1937లో వెల్స్ మెర్కురీ థియేటర్ నాటక సమాజం స్థాపించి మొదటి ప్రయత్నంగా షేక్‌స్పియర్ ‘జూలియస్ సీజర్’ని ఆధునికీకరించి ప్రదర్శించాడు. 1937 నవంబర్ 11న తొలిసారి ప్రదర్శితమైన ఈ నాటకం విమర్శకుల ప్రశంసలు పొందటమే కాకుండా కొన్ని వివాదాలకూ కేంద్రమయింది. మరుసటేడాది మరో నాలుగు నాటకాలు రూపొందించి ప్రదర్శించిన తర్వాత మెర్క్యురీ థియేటర్ రేడియో రంగ ప్రవేశం చేసింది – కొలంబియా బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ (సిబిఎస్) లో వారంవారం ప్రసారమయ్యే ‘ఫస్ట్ పర్సన్ సింగ్యులర్’ (First Person Singular) అనే కార్యక్రమంతో. ప్రసిద్ధి చెందిన రచనలను రేడియోకి తగ్గట్లు మలచి డ్రామాలుగా ప్రసారం చేసే ఈ కార్యక్రమం విభిన్న పోకడలతో, అద్భుతమైన సౌండ్ ఎఫెక్ట్స్‌తో అప్పటిదాకా చెలామణిలో ఉన్న రేడియో డ్రామాలకు అర్ధాన్ని తిరగరాసింది. ఈ పరంపరలో ప్రసారమైన మొదటి డ్రామా, బ్రామ్ స్టోకర్ విరచిత హారర్ నవల ‘డ్రాకులా’. దాన్ని వెన్నంటి ‘ట్రెజర్ ఐలాండ్’, ‘ఎ టేల్ ఆఫ్ టు సిటీస్’, ‘ది 39 స్టెప్స్’ వంటి కళాఖండాలూ రేడియో రూపం సంతరించుకున్నాయి మెర్క్యురీ థియేటర్ ద్వారా. ఆ క్రమంలో వచ్చిందే – 1938 అక్టోబర్ 30న ప్రసారమైన ‘వార్ ఆఫ్ ది వ(ర)ల్డ్స్’. అది సృష్టించిన సంచలనం గురించి మొదటి భాగంలో చదివారు కాబట్టి ఇప్పుడు వదిలేద్దాం.

అయితే ‘ఫేమ్’ అనేది వెల్స్‌కి వార్ ఆఫ్ ది వ(ర)ల్డ్స్ తో కొత్తగా వచ్చి పడిందేమీ కాదు. అంతకు ముందే స్టేజి, రేడియో రంగాల్లో విభిన్న ప్రయోగాలతో దూసుకొస్తున్న యువకెరటంగా వెల్స్ అమెరికావ్యాప్తంగా పేరుగాంచాడు. 1938 మే 9న – వెల్స్ 23వ పుట్టిన రోజు జరుపుకున్న మూడో రోజు – అతని ముఖం టైమ్ మ్యాగజైన్ ముఖపత్రాన్నలంకరించింది. కాకపోతే, వార్ ఆఫ్ ది వ(ర)ల్డ్స్ అతన్ని రాత్రికి రాత్రే ‘రైజింగ్ స్టార్’ స్థాయి నుండి ధృవ తారగా మార్చేసింది. దేశదేశాల్లో, అమెరికా ప్రజానీకాన్ని గంటసేపు వెధవల్ని చేసిన ఈ కుర్రాడి గురించి తెలుసుకోవాలనే ఉబలాటం వ్యక్తమయింది. ముఖ్యంగా – అతను తర్వాత ఏమి చేయబోతున్నాడనేది అందర్నీ తొలిచిన ప్రశ్న. అంత గొప్ప ‘షాకింగ్’ ప్రదర్శన తర్వాత దాన్ని మించే ప్రదర్శనతో రావాలంటే వేరేవాళ్లు ఏమి చేస్తారో కానీ, వెల్స్ మాత్రం ఇక్కడా తన విలక్షణత చాటుకున్నాడు – ఎవరూ ఊహించని రీతిలో హాలీవుడ్‌లో అడుగుపెట్టటం ద్వారా.

అప్పటిదాకా వెల్స్‌కి సినిమా రంగం అంటే అంతో ఇంతో చిన్నచూపే ఉండేది. నాటక రంగంలో ఉన్నంత సృజనాత్మకత సినీ రంగంలో ఉండదని అతని అభిప్రాయం. అందుకే అతని దృష్టి సినిమాలమీదికి పోలేదు. అయితే నాటి ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఆర్‌కెఓ (RKO Pictures) నుండి వచ్చిన ఆఫర్ అతన్ని పునరాలోచించుకునేలా చేసింది. ఆర్సన్ వెల్స్ మూడేళ్లలో మూడు సినిమాలు తమ సంస్థకై నిర్మించేటట్లూ, దానికి గాను ఏడాదికి లక్ష డాలర్ల జీతం (అప్పట్లో అమెరికా అధ్యక్షుడి ఏడాది జీతం కన్నా ఎక్కువిది), అతనికి ఇష్టమొచ్చిన కధ, నటీ నటులతో సినిమా, మరియు సినిమా నిర్మాణంపై పూర్తిగా అతని నియంత్రణ – ఇదీ ఆర్కేవో అతనికిచ్చిన ఆఫర్. సినీ రంగంలో ఎటువంటి అనుభవమూ లేని ఓ ఇరవై మూడేళ్ల కుర్రాడికి హాలీవుడ్‌లో తొట్టతొలి అవకాశమే ఇంత బ్రహ్మాండంగా ఉంటే వదులుకోవటానికి వెల్స్ పిచ్చివాడేమీ కాదు.

1939 ద్వితీయార్ధంలో వెల్స్ తన మెర్క్యురీ థియేటర్ సభ్యులతో కలిసి క్యాలిఫోర్నియాలో అడుగు పెట్టాడు. అతని రాకని హాలీవుడ్ నీరాజనాలతో స్వాగతించింది. తొలి ప్రయత్నంగా జోసెఫ్ కాన్రాడ్ నవల ‘హార్ట్ ఆఫ్ డార్క్‌నెస్’, మరో ఒకట్రెండు నవలలూ అనుకున్నా, చివరికి అతని దృష్టి ‘ది లైఫ్ ఆఫ్ డ్యూమాస్’ (The Life of Dumas) పై పడింది. ఆ కధని క్యాలిఫోర్నియాకే చెందిన సుప్రసిద్ధ మీడియా మొఘల్ విలియమ్ రాండాల్ఫ్ హర్స్ట్ జీవిత కధతో ముడివేస్తూ వెల్స్ తిరగరాశాడు. చిత్తు ప్రతికి మొదట్లో ‘అమెరికన్’ అనే పేరు అనుకున్నారు కానీ స్క్రిప్టు మొత్తం పూర్తయేనాటికి దానికి ‘సిటిజెన్ కేన్’ అనే పేరు స్థిరపడింది.

సిటిజెన్ కేన్ నిర్మాణం, విడుదల ముందూ తర్వాతా అది సృష్టించిన సంచలనం – రాసుకుంటూ పోతే అదో పెద్ద గ్రంధం. దాని గురించి నవతరంగంలో ఇప్పటికే మూడు వివరమైన వ్యాసాలొచ్చాయి. వాటిని తప్పకుండా చదవండి. మొదటిది ఇక్కడ, రెండోది ఇక్కడ, మరియు మూడోది ఇక్కడ.

మొదటి సినిమాతోనే వెల్స్ హాలీవుడ్‌ని తన వేళ్ల మీద ఆడించాడు, దేశంలో అత్యంత పలుకుబడిగల మీడియా ప్రముఖుడితో ముఖాముఖి తలపడ్డాడు – మొత్తానికి ప్రపంచ సినిమా చరిత్రలో కలకాలం నిలిచిపోయే కళాఖండాన్ని సృష్టించాడు. కానీ సిటిజెన్ కేన్ నిర్మాణం వల్ల అతనికి అప్పటికప్పుడు ఒరిగింది మాత్రం – ఆర్ధిక పతనం, సాటి సినీ జీవుల నుండి తిరస్కారం. వీటిని లెక్కజేయకుండా వెల్స్ తన రెండవ సినిమా – ‘ది మాగ్నిఫిసెంట్ ఆంబర్సన్స్’ (The Magnificent Ambersons) – ప్రారంభించాడు. అయితే ‘కేన్’ అనుభవంతో ఆర్కేవో స్టుడియో వెల్స్‌తో తన ఒప్పందాన్ని తిరగరాసింది. దాంతో రెండవ, మూడవ సినిమాలని వెల్స్ పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోయాడు. స్టుడియో అపరిమిత పర్యవేక్షణలో రూపొందిన ‘ఆంబర్సన్స్’ 1942లో విడుదలై పరాజయం పాలయింది. అది విడుదల కాకముందే వెల్స్ మూడో సినిమా ‘జర్నీ ఇన్‌టు ఫియర్’ (Journey Into Fear) మొదలై 1943లో విడుదలయింది. ఇది కూడా పరాజయం పొందింది. ఈ మూడో చిత్రానికి చాలా వరకూ వెల్స్ డమ్మీగానే మిగిలిపోయాడు. దీనికి అధిక శాతం దర్శకత్వం నార్మన్ ఫాస్టర్ నెరిపాడు. ఈ మూడు సినిమాలూ కలిపి ఆర్కేవో స్టుడియోకి పది లక్షల డాలర్లకి పైగా నష్టం తీసుకొచ్చాయి – ఇది 1942 నాటి మాట. అదే ఏడాది జులై ఒకటిన ఆర్కేవో వెల్స్‌ని బయటికి గెంటేసింది. అప్పటికి వెల్స్ మూడో సినిమా ఇంకా విడుదలే కాలేదు. అతనికి మరో అవకాశం ఇవ్వటానికి మరే హాలీవుడ్ స్టుడియో కూడా ముందుకు రాలేదు. హాలీవుడ్ దర్శకుడిగా ఉత్థాన పతనాలు రెండూ చవిచూసేనాటికి ఆర్సన్ వెల్స్ వయసు – ఇరవై ఏడు సంవత్సరాలు!

తర్వాతి మూడు దశకాల్లో వెల్స్ హాలీవుడ్‌తో యుద్ధమే చేశాడు – సినిమాలు సరైన పద్ధతిలో తీయటానికి – అంటే, తనదైన పద్ధతిలో. అప్పుడో అవకాశం, ఇప్పుడో అవకాశం వచ్చేవి. వాటినుపయోగించుకుని అద్భుత దృశ్య కావ్యాలే తీశాడు, కానీ వాటిలో ఎక్కువ పరాజయం పాలైనవే. ‘ది లేడీ ఫ్రమ్ షాంఘై’ (The Lady from Shanghai), ‘మాక్‌బెత్’ (Macbeth), ‘ఒథెల్లో’ (Othello), ‘టచ్ ఆఫ్ ఈవిల్’ (Touch of Evil) వాటిలో చెప్పుకోదగ్గవి. ఈ కాలంలో వెల్స్ దర్శకుడిగా కన్నా నటుగా ఎక్కువ గుర్తింపు పొందాడని చెప్పాలి – ‘జేన్ ఐర్’ (Jane Eyre), ‘ది థర్డ్ మాన్’ (The Third Man), ‘మాబీ డిక్’ (Moby Dick) వంటివి వెల్స్ ప్రధాన పాత్రల్లో కనపడ్డ చిత్రాల్లో కొన్ని.

ఆర్సన్ వెల్స్ వ్యక్తిగత జీవితానికొస్తే – మొదటి భార్య వర్జీనీయా నుండి విడిపోయాక కొంత కాలం మెక్సికన్ నటి డొలోరెస్ డెల్ రియో తో కలిసి ఉన్నాడు. తర్వాత నాటి ప్రసిద్ధ హాలీవుడ్ నటి రీటా హేవర్త్ ని పెళ్లాడి కొన్నేళ్లకి ఆమెతోనూ విడిపోయాడు. ముచ్చటగా మూడోసారి పౌలా మోరి అనే ఆవిడని పెళ్లాడాడు. ముగ్గురు భార్యల ద్వారా అతనికి క్రిస్టఫర్, రెబెకా, బీట్రిస్ అనే ముగ్గురు కుమార్తెలు కలిగారు.

సినీ రంగంలో పరిచయం ఉండి, వెల్స్ గురించి తెలిసి ఉన్నవారిలో అతనో మేధావి అని ఒప్పుకోని వారుండరు. అతనో అహంభావి అనే వాళ్లూ ఎందరో. అయితే కొందరి దృష్టిలో అది ఆత్మవిశ్వాసం. వెల్స్ దృష్టిలో మాత్రం ‘అహంభావి’ అనేది తనంటే భయంతో హాలీవుడ్ తనకిచ్చిన ముద్దు పేరు. హాలీవుడ్‌పై నిరసనతో 1950 తర్వాత ఎక్కువ కాలం వెల్స్ ఐరోపాలో సినిమాలు తీస్తూ గడిపాడు. వాటిలో పూర్తి కానివే అధికం. అతని చివరి సినిమా కూడా విడుదల కాకుండానే ఆగిపోయింది. 1985 అక్టోబర్ 9 సాయంత్రం ‘ది మేజిక్ షో’ (The Magic Show) సినిమా స్క్రిప్టు సవరించే పనిలో మునిగుండగా గుండె నొప్పితో కూలిపోయి అదే రోజు కన్ను మూశాడు ఆర్సన్ వెల్స్.

వెల్స్ గురించి, అతని మాటల్లోనే: ‘I started at the top and successfully worked my way down’. బ్రతికుండగా చిన్న చూపు చూసిన హాలీవుడ్ కూడా మరణానంతరం అతని ప్రతిభని గుర్తించక తప్పలేదు. నేడు హాలీవుడ్ విమర్శకుల దృష్టిలో, వెల్స్ రూపొందించిన సాధారణ చిత్రాలు కూడా పలువురు ఇతర దర్శకుల గొప్ప చిత్రాల కన్నా మిన్న అనే అభిప్రాయముంది. రేడియో, సినిమా – రెండు ప్రభావశీల మాధ్యమాల్లోనూ నభూతో అనిపించే కళాఖండాలు సృష్టించేనాటికి అతని వయసు కేవలం పాతికేళ్లు. బోయ్ వండరా, మజాకా!

–అబ్రకదబ్ర

5 Comments
  1. venkat B January 29, 2009 /
  2. మేడేపల్లి శేషు January 30, 2009 /
  3. విజయవర్ధన్ January 30, 2009 /