Menu

వాత్సల్య నిధి చక్రపాణి -యన్.టి.రామారావు

1949వ సంవత్శరం నుంచీ నాకూ విజయాసంస్థకూ ఒక అనుబంధం ఏర్పడింది.నా సొంత ఇంటికంటె వాహినీ స్టుడియో చొరవ,నా కుటుంబసభ్యులకంటె కూడా,శ్రీనాగిరెడ్డి-చక్రపాణి గార్లతో ఆప్యాయత,ఆనాడుచిత్ర నిర్మాణం అంటే ఒక మహత్తరకార్యంగా భావించేవాళ్ళము.అంత భావనలో కూడా ఆ చక్రపాణి గారు చటుక్కున ఇచ్చే సూచనలు వింటూ వుంటే ఏమిటిలా మాట్లాడతారు అనిపించేది.ఏదో తేలని సమస్యతో సతమతమవుతూ,అతి ముఖ్యమైన సన్నివేశాన్ని ఎలా మలచాలో తెలియక మా పెద్ద దర్శకులందరూ తికమకపడుతూ ఉంటే‘ఏంది ఇది ఇట్టా చేస్తే పోలా’అని తేలిగ్గా,సూక్ష్మంగా,విజ్ఞతతో ఆ చిక్కుల్ని విడదీసేవారు.అందుకనే నేను చిత్రనిర్మాణం మొదలుపెట్టి,దర్శకుడినైన తర్వాత కూడా ఆయనను ఆత్మీయుడైన వ్యక్తిగా కంటె ఒకనిఘంటువుగా గౌరవించేవాడిని.

సామాన్యంగా ఆయనను అర్ధంచేసుకోవడం ఎవరికైనా కష్టమే,కట్టెవిరిచినట్టుగా మాట్లాడటం,తనకు తోచినదేదో సూటిగా,నిర్మొహమాటంగా చెప్పడం ఆయనలోనిప్రత్యేకలక్షణాలు.ప్రత్యేకంగా వారిని కోరినా,కోరకపోయినా,తనవాళ్ళు అనుకున్నవాళ్ళకు ఏ విషయములోనైనాగాని, సలహాలు,సూచనలు ఇవ్వడం, వాళ్ళెప్పుడూ బాగుండాలనుకోవడం ఆయన ప్రత్యేకత.చక్రపాణిగారికి కొన్ని నమ్మకాలుండేవి.ఎవరు ఏమన్నా సరే,ఆ నమ్మకాలను ఆయన దూరం చేసుకోలేదు.

నేను చిత్ర్రాల్లో ఏవైనా విషాద దృశ్యాలలో నటిస్తున్నానని తెలిస్తే ‘ఆ ఏమిటి రామారావ్ నువ్వు ఏడిస్తే ఎవరు చూస్తారు ఏదైనా మగతనంగా,నలుగురూ సాధించలేని కార్యమేదో సాధించగల పాత్రయితే జనానికి నచ్చుతుంది,నువ్వు ఏడిస్తే ఏం నచ్చుతుంది!నువ్వు ఎప్పుడూ కళ్ళకు గ్లిసరిన్ పెట్టక’అనేవారు. నేనేదైనా ఆయనకు నచ్చని పని తలపెడితే‘రామారావు వితండం మనిషి,మీరైనా వెళ్ళి చెప్పండి’అని కబురు పంపేటంతటి పితృవాత్సల్యంగల వ్యక్తి. నేనూ,నాకుటుంబం ఎప్పుడూ క్షేమంగా వుండాలనీ,నేనెప్పుడూ నవ్వుతూ కనిపించాలని కోరుకునే మహనీయుడు ఆయన.

చలనచిత్రనిర్మాతగా,రచయితగా నిర్మాణం మీద,చిత్ర రచన మీద వారికి వున్న భావనలు వేరు.చిత్రాల ద్వారా మన సమాజాన్ని మరమ్మత్తు చెయ్యాలి అన్న నమ్మకం ఆయనకు ఉండేది కాదు.హాస్యరసంతో సరదాగా సినిమా నడిచిపొవాలన్న ధోరణి ఆయనది.మన చుట్టూ నిత్యం కనిపించేటటువంటి సామాన్య ప్రకృతి కలిగినటువంటి పాత్రలను వాటి మనస్తత్వాలను,హృద్యంగా,ఆహ్లాదకరంగా సృష్టించడం వారి పాత్ర కల్పనల ప్రత్యేకత.షావుకారు లోని రంగడు, రామిశెట్టి, పెళ్ళిచేసి చూడు లోని వియ్యన్న,భీమన్న,మిస్సమ్మలోని మిస్సమ్మ, దొంగబిచ్చగాడు రేలంగి, గుండమ్మ కధలోని నాపాత్ర,శ్రీమతి ఛాయాదేవి ధరించిన పాత్ర ఇత్యాది పలు పాత్రలు వారి సృష్టికి కొన్ని నిదర్శనాలు.

సామాన్య సంఘటనలలోంచి,మనుషుల్ని గిలిగింతలు పెట్టి మధురానుభూతికి తీసుకువెళ్ళే వాస్తవికతను చూపడం కోసం ఆయన కృషి చేసేవారు.గుండెల్ని బాదుకుని ఏడ్చే ఏడుపులమీదగాని,సినిమా పరిభాషలోని మెలోడ్రామా మీదగాని ఆయనకు నమ్మకం వుండేదికాదు.సినిశితమైన హాస్యం వారికి ప్రీతికరమైనటువంటిది.ఎంతో తీవ్రమైన సంఘటనల్లోనైనా హాస్య ప్రధానమైన చెణుకు లేకుండా వారి కల్పన వుండేదికాదు.

దీనికంతటికీ కారణం వారి జీవితానుభవం,బహుభాషా సాంగత్యం,పరిశీలనా దృక్పధం అని నేను అనుకుంటాను.వంగభాషలో వారికి వున్న పరిచయం పేర్కొనదగ్గది.శరత్ బాబును తెలుగువారికి చిరస్మరణీయుడుగా చేసిన ఘనత శ్రీచక్రపాణిగారిదే.ఆ భాషాప్రభావం కూడా వారి మీద ఎంతగానో వుందని నేను అనుకునేవాడిని. తన సొంత రచనలలో కూడా అతి సున్నితమైన పాత్రలను ఎంతో బలంగా,మన మనసుల మీద చెరగని విధంగా చిత్ర్రీకరించగలిగారంటే, దానికి కారణం ఆ ప్రభావమేననుకుంటాను.

ఆయనకు ఇంకొక గట్టినమ్మకం వుండేది.చిత్రాలు పిల్లలకు బాగా నచ్చితే,పెద్దవాళ్ళకూ తప్పకుండా నచ్చుతాయని,ఆయన విశ్వాసం.గుండమ్మకధ మొదటిసెట్టు పని పూర్తి కాగానే,నాగిరెడ్డిగారి కుటుంబాలు, తక్కిన తెలిసినవారి కుటుంబాల్లోని పిల్లలందరినీ దాదాపు150 మందిని పిలిపించి, ఆ సెట్టు పని చూపించారు.నేను సగం నిక్కరుతో తెరమీద కనిపించేసరికి,పిల్లలంతా వింతగా చూసి ఒకటే కేరింతలు కొట్టారు. అది చూడగానే ఆయన ఆచిత్ర పర్యవసానం ఆనాడే చెప్పారు. ‘రామారావ్ నీ పాత్ర బ్రహ్మాండం,మన గుండమ్మకధ బ్రహ్మాండం’అన్నారు.అదే చిత్రాన్ని విడుదలకు ముందు పెద్దలందర్నీ పిలిచి చూపించారు. అనుభవజ్ఞులందరూ‘ఏదో పోతుంది’అన్నారు.‘మీ నాన్నగారు ఎలా వుందన్నారు’అని నన్ను ప్రశ్నించారు చక్రపాణి గారు.ఆయన ఇంకోసారి చూడాలంటున్నారు అన్నాను నేను.

‘ఇది,మనకు సరైన జడ్జిమెంటు,సినిమా పరిభాష ఏమీ తెలియని వాళ్ళు చెప్పేదే సరైన నిర్ణయంగాని,చిత్రవిజయానికి అవి ఉండాలి,ఇవి ఉండాలి,ఈపాళ్ళు వుండాలి అనంటారు చూడు దాంట్లో నాకు నమ్మకం లేదు.నేను చెబుతున్నాను విను ఈ సినిమా బ్రహ్మాండంగా పోతుంది’అన్నారు.అలాగే ఆచిత్రం రజతోత్శవం చేసుకుంది.తన శిల్పకల్పన మీద అంతనమ్మకం వారికి.ఎవరేం చెప్పినా అ ఆత్మవిశ్వాసాన్ని వదిలేవారు కారు.ఆ నమ్మకాల పర్యవసానమే విజయావారు నిర్మించిన చిత్రాల రూపకల్పన.ఆచిత్రాల విజయం చక్రపాణిగారి నమ్మకాల విజయం అని నానమ్మకం. ఆయన అభిప్రాయాలు కొంత కటువుగా ఉన్నట్లనిపించినా, తర్వాత తర్వాత ఆయన నిర్ణయాలు ఆచరణలో సరైనవేనని ఎవరైనా అనకతప్పదు.తలచూకుంటూ వుంటే ఇలా ఎన్నో జ్ఞాపకాలు వస్తుంటాయి. నాగిరెడ్డిగారు,చక్రపాణిగారు ఎవరెవరు ఏకులంవారైనా,వారి అన్యోన్యత,సోదరభావం,మైత్రీభావం చిరస్మరణీయం!కలకాలం ప్రతివారు, వింతగా,ఆదర్శంగా చెప్పుకునే మధురస్వప్నం!వారి చెలిమి చూస్తే మేము నిర్మించబోతున్న దానవీరశూరకర్ణ చిత్రంలోని,కర్ణసుయోధనుల చెలిమిని గురించి,నేను వూహించి రాయించిన పాట నాకు గుర్తుకొస్తుంది.

కులమత భేదం లేనిదీ
తరతమ భావం రానిదీ
ఆత్మార్పణమే కోరునదీ
ప్రతిఫలమన్నది ఎరుగనిదీ
స్నేహమిదీ
స్నేహమిదీ

శ్రీచక్రపాణిగారు లేని లోటు పొజ్యులు నాగిరెడ్డి గారికి ఎవరూ తీర్చలేని లోటు.ఇక నాకు అనుక్షణం తన బిడ్డగా చూసుకుంటూ నా క్షేమాన్నీ, నాకుటుంబ శ్రేయస్సునూ ఆకాంక్షించే పితృతుల్యులైన ఒక మహనీయున్ని కోల్పోయాను.నేను ఎక్కడ వున్నానై తెలిసినా ఆత్మీయతతో వచ్చి ఆప్యాయతతో నోరారా పలకరించే వాత్సల్యనిధిని పోగొట్టుకున్నాను.వారి పవిత్రాత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని,నేను మనసారా కోరుకుంటున్నాను.

ఎన్.టి.రామారావు గారు తెనాలిలో ఒక థియేటరు నిర్మించదలచి స్థలంకొన్నారు.తెనాలిలో ఎందుకు నిర్మిస్తున్నారు అని ఒక మిత్రుడు అడిగితే ‘తెనాలి మా తండ్రి చక్రపాణి గారి వూరు.అందుకు నిర్మించదలిచాను అన్నారు.చక్రపాణి గారిని ఎన్.టి.ఆర్ పితృసమానులుగా గౌరవించేవారు.

—చక్రపాణీయం నుండి

9 Comments
  1. raja January 25, 2009 /
  2. రానారె January 26, 2009 /
  3. sreenivas pappu January 26, 2009 /
  4. venkat B January 27, 2009 /
  5. చక్రవర్తి January 27, 2009 /
      • చక్రవర్తి January 28, 2009 /
  6. bhaskaram January 29, 2009 /