Menu

నవ్వుల నాగేష్ ఇకలేరు.

ఏడవడానికి కారణం కావాలేమో కానీ నవ్వడానికి సందర్భం అవసరం లేదు. నవ్వడం యోగం, నవ్వించడం రాజయోగం. నవ్వే జీవులు చాలా వుంటాయి కానీ నవ్వించే రారాజులు కొంతమందే ఉంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తి హాస్య నటుడు నాగేష్. ఇహ నవ్వించింది చాలని అనుకున్నారో ఏమో అందర్నీ దుఃఖసాగరంలో నెట్టేసి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు.

ఓ సారి ప్రముఖ నటుడు “నడిగర తిలకం” శివాజీ గణేషన్ని “మహానటులు మీరు చేయలేని పాత్రలున్నాయా? మీరు జెలసీ పడే నటులున్నరా?” అని ఎవరో అడిగారట. నేను మహానటుణ్ణి కాను. నన్నలా సంబోధించద్దని ఆయన కోరారట. అదేమిటని తిరిగి ప్రశ్నిస్తే “అన్ని రసాలూ పండించగలిగిన వాడే నటుడు. అన్ని రసాల్లో నూటికి నూరు మార్కులొచ్చినా, హాస్యం లో మాత్రం గుండు సున్నాయే. హాస్యం పండించలేని వాడు పరిపూర్ణ నటుడు కాలేడు. అందుకే నాకు హాస్యం పండించే వాళ్ళంటే జెలసీ! ముఖ్యంగా ఈ నాగేష్ లాంటి నటుల్ని చూస్తే మరింత అసూయ కలుగుతుంది” అంటూ పక్కనే ఉన్న నాగేష్ ని చూపిస్తూ చెప్పారట. అందరు నటులూ హాస్యం చేయలేరేమో కానీ, హాస్య నటులు మాత్రం అన్నీ చేయగలరు. వాళ్ళు నవ్వకుండా ప్రేక్షకుల్ని నవ్వించగలగడం, ఏడిపించగలగడం ఒక్క హాస్య నటులకే చెల్లు. అందుకే వాళ్ళు పరిపూర్ణ నటులు. అలాంటి పరిపూర్ణ నటుడు నాగేష్ “హాస్యాన్ని” గుర్తుగా మిగిల్చి మనందరికీ దూరంగా వెళిపోయారు.

స్వతహాగా కన్నడిగుడయినా, నటనకి భాషాభేదం లేదని నిరూపిస్తూ తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ, ఇలా అన్ని సినిమాల్లోనూ సుమారు వెయ్యి చిత్రాలు పైగా నటించారు. హాస్యానికి కావల్సింది టైమింగ్ కానీ రూపం కాదు అన్నది నిరూపించిన ఏకైక హాస్య నటుడు. ఒకప్పటి ప్రముఖ తమిళ నటుడు మేజర్ సౌందర్ రాజన్ చాలా చిత్రాల్లో నటించినా, ఓ నాలుగు చిత్రాలకి దర్శకత్వం కూడా వహించారు. అందులో ఒకటి “సర్వర్ సుందరం”. ఇది తమిళం నుండి తెలుగులోకి డబ్ చేసారు. ఈ సర్వర్ సుందరం సినిమాకి హీరో నాగేష్. అతని సరసన హీరోయిన్ గా కె.ఆర్.విజయ నటించింది. ఈ సర్వర్ సుందరం సినిమాతో నటుడిగా నాగేష్ కి మంచి పేరొచ్చింది. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకీ పరిచయం ఆయ్యాడు. మన కంటూ రేలంగీ, రమణా రెడ్డీ, పద్మనాభం, రాజబాబు ఇలా చాలా మంది హాస్య నటులున్నా తన హాస్యమూ, శైలీ వేరు అన్నట్లు తనదైన ఒక ముద్ర వేసుకున్నాడు. కె. బాల చందర్ అభిమాన నటుల్లో ముఖ్యుడు నాగేష్. కె బాల చందర్ దర్శకత్వం వహించిన “అపూర్వ రాగంగళ్” చిత్రంతో నాగేష్ కి తమిళంలో మంచి పేరొచ్చింది. దీన్నే దాసరి నారాయణ రావు “తూర్పు పడమర” గా తెలుగులో తీసారు. ఇందులోనూ నాగేష్ అదే పాత్ర నటించాడు. ఆ సినిమాలో హీరోయిన్ శ్రీవిద్య ని అభిమానించే వ్యక్తి పాత్రలో జీవించాడు. ఆ సినిమాలో నాగేష్ తన గతాన్ని చెబుతాడు. అతని భార్య అతన్ని వదిలేసి పారిపోతుంది. “నువ్వెంత అందగాడివో నీకే తెలుసు.” అంటూ అతని భార్య తనని హేళన చేసినట్లుగా ఎంతో బాధగా చెబుతాడు. ఆ సన్నివేశంలో నాగేష్ నటన చూస్తే జాలీ, దుఃఖమూ వస్తాయి. అలాగే వేటగాడు సినిమాలో రామారావు సహచరుడిగా అతని హాస్యం గుర్తొస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది.

ఈ మధ్య కాలంలో వచ్చిన “బృందావనం” సినిమాలో అతని హాస్యం టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. “నాగేష్ గారితో కామిడీ సీన్లు నటించడం చాలా కష్టం. ఆయన టైమింగ్ తో మనది కలపడం అంత సులభం కాదంటూ” బృందావనం సినిమా విడుదల సందర్భంలో ప్రముఖ హాస్య నటుడు రాజేంద్ర ప్రసాద్ అప్పట్లో చాలా సార్లు చెప్పారు. కమల హాసన్ అభిమాన నటుడు నాగేష్. ఆయన్ని ప్రతీ సినిమాలోనూ తీసుకోమని నిర్మాతలకి సిఫార్సు చేసేవాడు. ఇంద్రుడు-చంద్రుడు సినిమాలో రాజకీయ నాయకుడి పాత్రలో అతన్ని చూస్తే నవ్వాగదు. తనదంటూ ఒక ప్రత్యేకమైన బాణీలో డైలాగు చెప్పేవాడు. ఆ చెప్పడంలోనే మనకి నవ్వు రప్పించేది. సురేష్ ప్రొడక్షన్స్ బానర్ లో రామానాయుడు “మొరటోడు” అనే సినిమా తీసాడు. దానికి దర్శకుడు నాగేష్. అందులో జయసుధ, సత్యనారాయణ ముఖ్య పాత్రధారులు. ఆ సినిమా అంతగా విజయవంతం కాలేదు. నాగేష్ దర్శకత్వం వహించిన ఏకైక తెలుగు సినిమా అదొక్కటే!

ఇంద్రుడు-చంద్రుడులో సినిమా చివర క్లైమాక్స్లో కమలహాసన్ రాయుడు వేషం వేసుకొని “అర్జంటు పనుంది. ఇంటిదగ్గర మా ఆవిడ వెయిట్ చేస్తోంది. అయిదు నిమిషాల్లో పని ముగించుకొని వచ్చేస్తానని” చెప్పి అక్కడనుండి పారిపోతాడు. మరలా అయిదునిమిషాల తరువాత రాయుడు అక్కడికి వస్తే “రాయుడూ…నిన్ను చూస్తే..అయిదు నిమిషాల్లో..ఎలా పని ముగించుకొచ్చావయ్యా..?” అంటూ ద్వందార్థాలతో అతను చూపించిన నటన తలచుకుంటేనే నవ్వొస్తుంది.

నటుడు తెరపై ఎంతసేపు కనిపించాడన్నది కాదు ప్రశ్న, ఎంతలా ప్రేక్షకుల హృదయాల్ని రంజింపచేశాడన్నది ముఖ్యం. తెరపై రెండు సెకన్లు కనిపించినా గంటల కొద్దీ నవ్వు రప్పించగల నటుల్లో నాగేష్ ప్రధముడు. సున్నిత మైన హాస్యాన్ని పండించడంలో దిట్ట. వెకిలి హాస్యం అన్నదే అతనికి తెలీదు. అందుకే అతని పుట్టించిన నవ్వు ఎప్పటికీ గుర్తుండిపోతూనే ఉంటుంది. తెలుగు సినిమాకి లభించిన సున్నితమైన హాస్య నటుల్లో నాగేష్ పేరు చిరస్తాయిగా నిలిచిపోతుంది. నాగేష్ ఆత్మకి శాంతి కలగాలనీ నవతరంగం తరపున అందరం ప్రార్థించుదాం.

–సాయి బ్రహ్మానందం గోర్తి

11 Comments
  1. K. Rohiniprasad January 31, 2009 /
  2. K. Rohiniprasad January 31, 2009 /
  3. parimalam February 1, 2009 /
  4. reader February 1, 2009 /
  5. Saty SKJ February 1, 2009 /
  6. రామేశబాబు February 1, 2009 /
  7. shree February 2, 2009 /
  8. raghuraamireDDi February 2, 2009 /
  9. రఘురామిరెడ్డి February 2, 2009 /