‘వినాయకుడు’ సినిమాలో ‘బిచ్’ అనే పదం వాడారు…ఏం అది బూతు కాదా? బిచ్ అంటే అర్ధం తెలుసా..లం..(సెన్సార్) అంటూ నిన్న పోసాని ఓ టీవీ ఇంటర్వూలో వివరించారు. అలాగే “ఇంగ్లీష్ లో బిచ్ అంటే దాన్నెవరూ క్వచ్చిన్ చేయరు…పైగా అదేదో పోష్ డైలాగ్ క్రింద, ఆ సినిమా తీసినోడి క్రియేటివిటీని ఆకాశానికెత్తేస్తారు…పద్దతిగా,తప్పును తప్పు అని బూతుల్లేకుండా పద్దతిగా నేను చెబితే మాత్రం వల్గారిటి అంటారు!” అంటూ రకరకాలుగా మాట్లాడారు. ఇదంతా మీ ‘మెంటల్ కృష్ణ’ సినిమాలో బూతులు,వల్గారిటి ఎక్కువుగా ఉన్నాయి కదా అని ఓ ఛానెల్ వారు పొరపాటున అడిగిన పాపానికి చిత్ర దర్శక,రచయత,నటుడు పోసాని అలా తీవ్రంగా స్పందించారు. అలా తన మెంటల్ కృష్ణని వెనకేసుకొచ్చారు. అలాంటి అధ్బుతమైన సినిమా రివ్యూ మీరు చదవబోయేది.
రివ్యూ చేయాలా?
నిజానికి ఈ సినిమా చూసిన తర్వాత నవనాడులు స్ధంబించిపోవటం అనే వాక్యంకి అర్ధం పూర్తి స్ధాయిలో అవగతమైంది. మరో ప్రక్క కొత్త సంవత్సరం పూట ఈ సినిమాకి ఎందుకొచ్చానురా అని ఏడ్వాలనిపించింది. దాంతో ఇటువంటి సినిమా రివ్యూ చేయటం శుధ్ధ దండగనిపించింది. అయితే మరో సారి ఆలోచిస్తే…తప్పని సరిగా ఇది లైబ్రరీల్లో పెట్టుకోవాల్సిన సినిమా అర్ధమైంది. ఎందుకంటే..సినిమా ఎలా చేయకూడదు? అన్నదానికి ఇది ఒక పాఠ్య గ్రంధం కాబట్టి.
పాయింట్ ఏంటి?
పెళ్ళయిన రాత్రే తన భార్యకో లవర్ ఉన్నాడని, అతన్ని,ఆమెనీ డబ్బుకోసం పెద్దలు విడతీసారని తెల్సుకుని వాళ్ళని కలపాలనుకుని నానా వేషాలు వేసిన ఓ తింగర త్యాగమూర్తి కథ ఇది.
కథగా…
సత్య(సత్యకృష్ణన్) ఓ పాలబ్బాయిని ప్రేమిస్తుంది.(ఆ కుర్రాడుని చూస్తే ప్రేమ గుడ్డిది అన్న నానుడి నిజమేననిపిస్తుంది) పెద్దలును సైతం ఒప్పించి ఆ ప్రపోజల్ ని పీటలు మీదకు తీసుకొస్తుంది. అయితే కరెక్టుగా పెళ్ళి సమయంలో ఆ పెళ్ళికొడుకు మిస్సవుతాడు. పెళ్ళి ఆగిపోతుందనుకునే ఆ పరిస్ధితిలో తమ ఫ్యామిలీ ప్రెండ్ పుత్రరత్నం అయిన ముద్దు కృష్ణ(పోసాని)ఆదుకుని పెళ్ళి చేసుకుంటాడు. పోన్లో ఏదో పెళ్ళి అయిందిలే అనుకున్న ఆమె సంతోషం ఎంతో సేపు నిలవదు. శోభనం రాత్రే అతను ఓ నైటీ వేసుకుని శాడిస్టులా బిహేవ్ చేస్తూ తన విశ్వరూపం చూపెడతాడు. నువ్వు ఇంతకు ముందు వేరే వాడితో తిరిగిన దానివి కదా అని టార్చర్ పెడతాడు. మరో ప్రక్క తాను నపుంసకుడిని అని అసలు విషయం చెబుతాడు. అంతటితో ఆగుతాడా అంటే తనకో భాయ్ ప్రెండ్ బాబి(రఘుబాబు) ఉన్నాడని వెళ్ళి అతని ప్రక్కలో దూరుతాడు. రఘుబాబు కూడా నైటి వేసుకుని అతనితో అసహ్యంగా బిహేవ్ చేస్తూంటాడు. అలా ఆమెకు మనశ్శాంతికి(అఫ్ కోర్స్ మనక్కూడా)దూరం చేస్తాడు. ఇంకోసారి అయితే ఆమెను నొక్కుతూ..ఇదేంటి నీ శరీరం ఇంత లూజ్ గా ఉందని అంటాడు. అప్పుడామె నన్నెవరూ ఒత్తలేదు..నా ఒంట్లో పార్ట్ లు మెత్తపడటానికి అంటుంది (ఏం ఖర్మరా నాయినా). అలా తారాస్ధాయికి తన పిచ్చితో వెళతాడు. అప్పుడా ఇల్లాలు ఏం చేసింది. అసలు ముధ్దు కృష్ణ మెంటల్ కృష్ణలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అనేది తెరపై చూడాల్సిందే (పగ వాళ్ళకు కూడా ఇంత పెద్ద శిక్ష వేయిటం అనవసరం).
మరి క్లైమాక్స్ ఏంటో!!(ఇప్పటికీ సినిమా చూద్దాం అనుకున్న వాళ్ళు దయచేసి ఈ లైన్స్ వదిలేయండి)
అలా సత్యకు పోసాని పెట్టే టార్చర్ పెరిగి పెరిగి క్లైమాక్స్ కి వస్తుంది. ఓ రోజు మీడియాను పిలిచి సత్యతో నీ భాయ్ ప్రెండ్ తో ఇప్పటికీ నువ్వు తిరుగుతున్నావు అని నిరూపిస్తాను అంటాడు. మీడియా కదిలి వస్తుంది. అప్పుడు అసలు విషయం రివిల్ అవుతుంది. సత్యని లవర్ ఆ రోజు మిస్సవటానికి కారణం బయిటపడుతుంది.
అధ్బుతమైన ట్విస్టు
అదేంటంటే సత్య తల్లి తండ్రులు..పోసాని తల్లి తండ్రులు కలసి సత్య లవర్ మన అంతస్ధుకు సరితూగడని తప్పించి తెలివిగా పోసానికి అంటగడతారు. అయితే మన పోసానికి అన్ని విషయాలు ముందే తెలుస్తాయి. కానీ వెంటనే వారిద్దరీనీ కలుపుదామంటే అతని తెలివైన బుర్రకో అనుమానం వస్తుంది. తను పెళ్ళి చేసినా ఇప్పుడు తనతో పెళ్ళి అయింది కాబట్టి తను సంసారం చేసాడని ఆ ప్రేమికుడు డౌట్ పడవచ్చు. కాబట్టి ఓ ఆడకూతరు బాగు కోసం తను మగవాడు కాదు…నపుంసకుడు అనిపించుకున్నా ఫరవాలేదని డిసైడ్ అవుతాడు. అందుకే అలా అందరి దృష్ఠిలో నపుంసకుడని ఎస్టాభ్లిష్ చేసుకుంటాడన్నమాట. కామన్ గానే అన్ని క్యారెక్టర్స్ కలిసి ఎంత త్యాగ హృదయం అని చివరలో అంతా పొగడేస్తారు.
ఎనాలిసిస్
చెయ్యటానికి ఏమీ లేదు. కథ అయితే దాసరి స్వయంవరం సినిమా నుంచి ఎత్తుకొచ్చింది. మరో ప్రక్క నానాపటేకర్ అగ్నిసాక్షిలో సన్నివేసాలు కొన్ని లిఫ్ట్ చేసారు( అందుకేనేమో నిర్మాత పోసాన్ని నానాపటేకర్ తో పోలుస్తున్నారు). ఇక సినిమా నిండా బూతులు,చెప్పటానికి వీల్లేని వల్గారిటీ,అసహ్యం పుట్టించే సన్నివేశాలు కోకొల్లలు. మిగతా టెక్నికల్ విషయాల గురించి చెప్పుకోవాలంటే ఓ పాత జోక్ గుర్తు కొస్తోంది. మీ సినిమా ఎలా ఉంది అంటే ఆ నిర్మాత మాది టెన్ వీక్స్ సినిమా అండీ అంటాడు. దానికి అతను కరెక్టే..పది విభాగాలూ వీకే అని సైలైంట్ గా వెళ్ళిపోతాడు. అదే జోక్ దీనికీ వర్తిస్తుంది కానీ ఒక కరెక్షన్..ట్వంటీ ఫోర్ (క్రాప్ట్స్ )వీకే.
ఇక ఈ సినిమా చూసిన వారికి ఒకే ఒక అనుమానం వస్తుంది. నిజంగా సత్యని ప్రేమించిన వాడిది నిజమైన ప్రేమ అయితే ఆమెకు పెళ్ళయినా మనసే ముఖ్యమనుకుంటాడుకదా(తరతరాలుగా వస్తున్న సినిమా రూల్ ఇదేకదా).అలాగే అంత చదువుకున్న సత్య ఎందుకలా (ఆధునిక మహిళ కదా) టార్చర్ పెడుతున్నా తిరగబడకుండా ఓర్చుకుంటుంది.. ఇలా డౌట్ లు వస్తాయి.అయినా రామోజీరావు గారబ్బాయి సుమన్ మీద డైలాగులు వేయటానికి సినిమా తీయటం అవసరమా అని కూడా అనిపిస్తుంది.(ఎందుకంటే ఎమ్మెస్ నారాయణ పాత్రకి సుమన్ అనే పేరు పెట్టి డైలాగులు వేస్తూంటాడు). ఇక నాగబాబు పాత్ర చివరలో ఎందుకొస్తుంది(అభిమానంతోనా లేక పోస్టర్ వాల్యూ కోసమా). నన్ను ఇన్వాల్స్ చేయకండంటూ ఢీ కామెడీని బ్రహ్మానందం చేత ఎందుకు రిపీట్ చేయించటం..నవ్వు ఎక్కడయినా వస్తుందా. ఇక ఈ సినిమాలో ఒకే ఒక ప్లస్ పాయింట్ ఒకే పాట ఉండటం. మరో రకంగా ఇది మైనస్ కూడా (పాటలు ఎక్కువుంటే బయిటకు వెళ్ళిపోవచ్చుకదా.)
కాబట్టి అవకాశమున్నంతవరకూ ఈ సినిమాని ఎవాయిడ్ చేయిటం ఉత్తమం. అంతగా తప్పని పరిస్ధితుల్లో ఆబ్లిగేషన్ తో సినిమాకి వెళ్ళితే మీ జేబులోనో,పర్స్ లోనో మీ ఎడ్రస్ ..ఫోన్ నెంబర్ వ్రాసి పెట్టుకెళ్ళండి. చూసి మతి చెడి తప్పిపోయినా మళ్ళీ మీ ఇంటికి చేరుస్తారు. (నాకు పర్శనల్ గా కోలుకోవటానికి ఒక రోజు పట్టింది). అయినా ఈ సినిమా చూసి ఎన్నో విషయాలు తెల్సుకున్నామని పెళ్ళాలని టార్చర్ పెట్టేయవచ్చు అనుకుని విజిల్ వేసుకుంటూ ఆవేశపడి బయిలుదేరితే మాత్రం అంతే సంగతలు.కోలుకోవటానికి అనంత కాలం పట్టవచ్చు..ఎందుకంటే అందరూ సత్యలా భరించరుకదా…
నటీనటులు : పోసాని కృష్ణ మురళి,సత్యకృష్ణన్,నాగబాబు,బ్రహ్మానందం,ఈటీవీ ప్రభాకర్,గిరిబాబు,రఘుబాబు,రంగనాధ్,గౌతంరాజ్,శివాజీరాజా తదితరులు.
ఆర్ట్: బాబ్జి
కెమెరా: గాదిరాజు శ్రీనివాస్
ఎడిటింగ్ :మోహన్-రామారావు
సంగీతం :వందేమాతరం
నిర్మాత: మోహన్ వడ్డపట్న
కథ,స్క్రీన్ ప్లే,రచన,దర్శకత్వం : పోసాని కృష్ణ మురళి
ప్రేక్షకులు: పోస్టర్స్ చూసి మోసపోయిన నాలాంటి అమాయికులు
రిలీజ్ డేట్: ఒకటి జనవరి 2009.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
సినిమా సంగతీ,దాని…రివ్యూ సంగతీ యమధర్మరాజుకొదిలేసి,
మీరు ఆరోగ్యంగా ఉన్నారు,కోలుకుని మరలా మామూలు మనిషయ్యారన్నది మాకావాల్సింది,
హమ్మయ్య ఎంత ప్రమాదం తప్పింది నవతరంగానికి !!!:)
kanna says:
ఈ సినిమా అలా ఉండటంలో పెద్ద విశేషమేమీ లేదు కాని, మీరు రాసిన మొదటి పేరాలో ఆంగ్ల పదమైన బిచ్ అనటం అభ్యంతరకరం కాదు అన్నట్టుగా ఉంది. ఒకటే భావాన్నిస్తున్నప్పుడు ఏ భాషలో వాడినప్పటికి తప్పే.
CV says:
ఇలాంటి సినిమాలు రావడం వల్ల లాభం ఏమిటంటే.. దీనితో పాటు విదుదల అయి మామూలుగా అయితే అట్టర్ ఫ్లాప్ అవ్వాల్సిన సినిమాలు కేవలం ఫ్లాప్ అవుతాయి. అలాగే సినీ విమర్శకుల మీద మీద పూరీగారికి గౌరవం పెరిగే అవకాశం ఉంది.
బాగా రాసారు.
కె.మహేష్ కుమార్ says:
ఈ సినిమా చూడటమే ఒక సాహసమైతే, మళ్ళీ సినిమా గురించి ఆలోచించిమరీ రివ్యూ రాయడం …ఇహ చెప్పలేని హ్యాట్సాఫ్ టు మీ సినిమా పిచ్చికి.
ceenu says:
కధలో పాత్రల భావొద్వేగాలకు అనుగుణంగా సంధర్బం డిమండ్ నిబట్టి బిచ్,లంకొ,లాంటి మాటలు మన పూర్వికులు కూడా వాడారు.డిమాండ్ లేకుంటే ఇలాగే @ సూర్యప్రకాశ్ గారు….. మీరుదూకుడుతగ్గించాలి మాకు ‘నవతరానికి ‘మీరుచాలా అవసరం. మాప్రాణాలు కాపాడిన మీరు త్వరగా కోలుకోవాలి.
Arun says:
Review కోసం మీరు చేసిన సాహసం (సినిమా చూడ్డం) ఆచంద్రార్కస్థాయి నిలిచిపోతుంది. ఎలాగూ ఒక సారి చూసారు కాబట్టి ఇంకొక్కసారి చూసి గిన్నిస్ బుక్ కి apply చేయండి (insurence వగైరా ఉంటేనే సుమా!). నాగబాబు కూడా “నటించిన” ఈ కళాఖండాన్ని చూడ్డం నావల్లైతే కాదు.
ఇక ఈ సినిమాలో ఒకే ఒక ప్లస్ పాయింట్ ఒకే పాట ఉండటం. మరో రకంగా ఇది మైనస్ కూడా (పాటలు ఎక్కువుంటే బయిటకు వెళ్ళిపోవచ్చుకదా.
ఇది చదివాక అపరిచితుడు అనుభవం గుర్తొచ్చింది. వెంకటరమణ థియేటర్ (తణుకు) లో DTS లేకపోయినా ఆ feel కోసం ఓ గొప్ప technique కనుక్కున్నరు. అదేంటంటే volume ని 350.586% పెంచడం. రండక రండక పాట భరించ లేక బయటకి పారిపోతే అక్కడ నాలాంటివాళ్ళే ఓ పాతిక మంది బతుకు జీవుడా అంటూ కనిపించారు.
నవీన్ గార్ల says:
తెలుగు సినిమా పోయిన సంవత్సరం జనవరి 1 విడుదలైన ‘ఆపదమొక్కులవాడు’ అనే భీభత్సమైన ఖళాఖండంతో మొదలెట్టింది (దీన్ని తీసింది కూడా మన పోసాని మెం. కృష్ణానే) , ఇప్పుడు ఈ ‘మెంటల్ కృష్ణ’ మళ్ళీ జనవరి 1 విడుదలై తెలుగు సినిమాను తఱింపజేసింది… ఇహ ఈ సంవత్సరం మొత్తం విడుదలైయ్యే సినిమాలను అవి చూసే ప్రేక్షకులనూ దేవుడే కాపాడాలి. తెలుగు సినిమా మీద దర్శకులందరూ కక్షకట్టినట్టు ఉన్నారు
అరిపిరాల says:
ఎంతటి త్యాగం.. ఎంతటి త్యాగం.. అబ్బే మెంటల్ కృష్ణది కాదండీ.. సూర్యప్రకాష్‌గారిది. ఇంతటి మహోత్తర చిత్రాన్ని చూసి మాలాంటి వారిని కొత్త సంవత్సరం మొదటి పిచ్చోడి (మెంటల్ కృష్ణ) బారిన పడకుండా కాపాడారు. టీవీ ఇంటర్వ్యూలో మెంటల్ కృష్ణ… సారీ కృష్ణ మురళి ఆవేశం చూసి నిజంగానే మంచి సినిమా తీశాడనుకున్నా… హతోస్మి.
(సినిమా ప్రభావం వల్లేమో) విదుదల తేదీ ఒక సంవత్సరం వెనక్కి జరిపారు సరి చెయ్యండి.
విష్ణువర్థన్ రెడ్డి says:
ముందుగా మీ ధైర్యనికి మా ధన్యవాదములు………
ఇటువంటి సినిమాలు చూసి “నవతరంగం” కొసం మరియు మాలాంటి వారి కొసం మీ లైఫ్ ని త్యగం చేయవద్దు….
అస్సలు ఈ సినిమా చూడాలి అని ఎలా అనిపించిందండీ బాబు…?
ఇంతకి “శశిరేఖాపరిణయం” ఎలావుంది….?
నేను “శశిరేఖాపరిణయం” రివ్యూ చేద్దామని చూసాను కాని ఇక్కడ ఈ సినిమా విడుదల కాలేదు….మీరు త్వరలొ చేస్తె చూసి అనందిస్తాం……..
krishna rao jallipalli says:
మీ రివ్యు ప్రకారం .. మనకి ఎవరైన శత్రువులు ఉంటే వాళ్ళకి ఈ సినిమా చూపిస్తే కొడుకులు జన్మలో మన జోలికి రారనుకుంటా.
sv says:
పోసాని లాంటి వాళ్ళు తమ పిచ్చిని, ఫ్రస్టేషన్ను, పర్వర్షన్ ను జనాలపై రుద్దడానికి డబ్బులు ఖర్చు పెట్టె నిర్మాతలు ఉందటం మన దౌర్భాగ్యం. కాస్త పాలిషెడ్ గా పిల్లల స్థాయిలొనె ప్రెమను కనుగొన్న తేజ లాంటి మహా దర్శకులు ఉండటం మన తెలుగు సినిమా చేసుకున్న మరో దురద్రుష్టం
కె.మహేష్ కుమార్ says:
పోసానికృష్ణ మురళి తన తొలి ప్రయత్నంగా ఒక ఫ్యామిలీ సినిమా (శ్రావణమాసం అనుకుంటా) తీసాడు. కానీ ఆ సినిమాని మన ప్రేక్షకులు నిర్ధ్వందంగా తిరస్కరించారు. అప్పట్నించీ ఈ అతిని నమ్ముకుని ఒక హిట్టు(ధుర్యోదన)కూడా కొట్టాడు. ఇక అదే తన స్టైల్ అనుకుని కొనసాగుతున్నట్లుంది.
గీతాచార్య says:
అయ్యా జ్యోస్యుల గారు,
మీరీ మధ్య సినిమాల మీద సినిమాలు చూసి కల్లెక్కడ పాడు చేసుకుంటారేమో అని మన (మనసు + న… అనగా మనసు లేని) పోసాని ఈ సినిమా తీశాడు. మీరు తప్పక చూస్తారనే నమ్మకం తో.
మీరు టారో చూడ లేదా ఆ రోజు?
రీవ్యూకే భయమేస్తే… సినిమా చూస్తే? అన్న గారి antics భరించటం కన్నా బాబీ (మహేష్) రెండో సారి చూడటం నయం.
pappu says:
మొన్న ఉగ్రవాదుల బారినుండి ముంబాయి ప్రజల్ని కాపాడిన కమేండోల లెక్క ఉన్నావె తమ్మీ..రివ్వ్యూ లేకపోతె జోస్యం చెప్పుకు బతకొచ్చు ఇంత రిస్క్ చెయ్యొద్దు నాయనా.ఆ ఇంటివారు,ఈ NT వారూ నీ అరోగ్యం కుదుటపడాలని ప్రార్థిస్తున్నారు.
Ramesh says:
మీ రివ్యూ ని బట్టి అర్ఠమయ్యేదేమంటే ఈ ” మెంటల్ క్రిష్ణ ” మెంటల్ హాస్పిటల్ డాక్టర్ల గిరాకి పెంచేలా ఉన్నాడు.
మీ హెచ్చరిక కి కృతజ్ఞతలు.
parimalam says:
ఇంత రిస్క్ తీసుకుని ” మెంటల్ క్రిష్ణ ”బారినుండి ప్రజల్ని కాపాడిన మీకు కృతజ్ఞతలు.
Satya Shyam KJ says:
Toolywood లొ ఇన్ని రోజులకి మంచి సినిమాలు తీస్తున్నారు అన్న సంతొషం …. అడవి కాచిన వెన్నెలె!
౨౦౦౯ మొట్టమొదట విడుదల ఇంత… క్రూరంగా విధి వక్రించిన విధంగా ఉంది!
జోస్యుల గారికి నవతరంగం సభ్యులు ఎంతొ రుణపడి ఉన్నారు౧
అబ్రకదబ్ర says:
@విష్ణువర్ధన్ రెడ్డి:
>> ఇంతకి “శశిరేఖాపరిణయం” ఎలావుంది….?
నిన్ననే చూశానీ సినిమా. ఫరవాలేదు. జెనీలియా మాత్రం ఛంపేసింది. అంత దారుణమైన నటన ఈ మధ్యకాలంలో చూడలేదు.
నాగన్న says:
అయితే, నిజాయితీగా మెంటల్ అని పేరు పెట్టుకున్నారు అన్నమాట!! ఎంత సేపూ ప్రేమించుకోవడం-ఇంటర్వల్-పెళ్ళి చేసుకోవడం-శుభం సినిమా కాకుండా వెరైటీ మెంటల్ సినిమా తీసినందుకు ఒకసారి చూస్తాను.
sriram velamuri says:
ammo,veedevaqmdamdi babo