Menu

తడి ఆరని జ్ఞాపకం ‘లిటిల్ ఏంజెల్’

అదేంటో గాని బి. నర్సింగరావు గారి ‘హరివిల్లు’ చిత్రాన్ని గుర్తు చేసుకుంటూంటే…ఓ అధ్బుత మైన శ్రీలంక చిత్రం గాఢంగా మనస్సులో మెదిలింది. అయితే ఈ సినిమానే ప్రత్యేకంగా ఎందుకు మెదిలిందో నేను చెప్పను…చదివిన తర్వాత మీకే అర్ధమవుతుంది. “Punchi Suranganavi” (లిటిల్ ఏంజిల్) టైటిల్ తో 2002 లో వచ్చిన ఈ సినిమా దర్శకుడు Somaratne Dissanayake కి అనేక అవార్డులు రివార్డులు సంపాదించి పెట్టి అనేక ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడింది. ఈ చిత్రంలో కథ సంపత్ అనే ఓ పదేళ్ళ సింహళ పిల్లాడుకీ సత్య అనే తమిళ చిన్నారికి మధ్య విరసిల్లిన స్నేహ బంధం చుట్టూ తిర్గుతుంది. అయితే ఇది పేరుకు పిల్లల సినిమానే గానీ అండర్ కరెంట్ గా చాలా పెద్ద సమస్యలను స్పృశిస్తుంది. జాతులు వేరైనా జనం ఒక్కటే..వారి ఆలోచనలు,ఎమోషన్స్ అన్నీ కలిసి ఉండటానికే ప్రేరేపిస్తాయి అన్న భావాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. ఎన్నాళ్ళగానో ఆరని చిచ్చులా రగులుతున్న తమిళ,శ్రీలంక ప్రాంతాల,జాతులు సమస్యను ఏకరవు పెడుతుంది. అందుకేనేమో చూసి నాలుగేళ్ళకు పైగానే అయినా నాకింకా తడి ఆరని జ్ఞాపకంలా మిగిలిపోయింది.

ప్రధాన పాత్ర పదేళ్ళ సంపత్ సింహళ దేశంలో ఓ ఉన్నత కుటుంబానికి చెందిన వాడు. అతని చిన్నప్పుడే తల్లి వేరే వాళ్ళని చూసుకుని వెళ్ళిపోతుంది.దాంతో ఆ భాధ,కసి లాంటి దేదో మనస్సులో పెట్టుకుని ఒంటరిగా మిగిలిపోతాడు. దానికితగినట్లుగానే ఆ పిల్లాడి తండ్రి సైతం సంపత్ ని పట్టించుకోడు. వీటిన్నటితో ఆ పిల్లాడి మాటలు రావు.మాట్లాడడు.ఎప్పుడన్నా అతను మాట్లాడదామనుకున్నా గొంతు సహకరించదు.దాంతో ఎవరు తోనూ కలవడు. స్కూలుకు పోడు. అలా వాడు ఆ చిన్న వయస్సులోనే అందమైన బాల్యాన్ని అనుభవించకుండా ఓ విధమైన ప్రేమ రాహిత్యానికి గురైయి..మానసికంగా దెబ్బతింటాడు.

ఇలాంటి స్ధితిలో వాడికి తెలిసిందల్లా కోపం వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో వస్తువులను విసిరేయటం,పగల కొట్టడం. ఇక అయితే పాపం ప్రతీదీ డబ్బుతో పరిష్కార మవుతుందనుకుని నమ్మే ఆ తండ్రి అన్ని సదుపాయాలు చేస్తాడు. వాడి సంరక్షణకు ఆయాలను,నర్సులను పెడతాడు కానీ ఏదీ వర్కవుట్ కాదు. వాళ్ళు రెండో రోజే పారిపోతూంటారు. ఖరీదైన బొమ్మలు తెచ్చిపెడతాడు. తండ్రిగా తాను ఇవ్వవలిసిన ప్రేమ తప్ప మిగిలినవన్నీ అధ్బుతంగా అందిస్తూంటాడు.అప్పుడప్పుడూ సైక్రాటిస్ట్ కి తన కొడుకు ప్రవర్తనలో మార్పు కోసం చూపెడుతూంటాడు.అయినా ఫలితం ఉండదు. అలా పూర్తిగా డీలా పడిపోయి..అదే జీవితమనుకుంటున్న ఆ పిల్లాడి జీవితంలోకి వసంతంలా సత్య అనే ఎనిమిది సంవత్సరాల తమిళ పిల్ల పనిపిల్లలా ప్రవేసిస్తుంది. ఆమె తండ్రి వేలు చాలాకాలంగా సంపత్ ఇంట్లోనే ఉండి అన్ని పనులూ చేస్తూంటాడు. ఆ పిల్ల తమిళ గ్రామీణ ప్రాంతం నుంచి రావటంతో చక్కగా అక్కడి జానపదాలు అవీ పాడుతూ ఉషారుగా ఉంటుంది.

సంపత్ ఆ పాపలోని స్వచ్చతకు,అమాయికత్వానికి,చిలిపిగా చేస్టలకు ఆకర్షితుడౌతాడు. కొద్దిరోజుల్లోనే వాళ్ళిద్దరూ క్లోజ్ ప్రెండ్స్ అవుతారు. దాంతో మొల్లిమెల్లిగా గొంతు విప్పుతాడు (ఆ సీన్స్ అద్భుతం..వివరించాలని ఉంది గానీ చూసేవాళ్ళు ఆ ధ్రిల్ మిస్సవుతారు) .అలా సంపత్ తమిళంలోని చిన్న చిన్న పదాలు సైతం నేర్చుకుంటాడు. ఇదిలా ఉంటే తన కొడుకు ఓ పనిపిల్ల తో అంత స్నేహం గా ఉండటం ఆ రిచ్ తండ్రికి నచ్చదు. వారి స్నేహాన్ని తుంచేయాలనుకుంటాడు. ఈ సిట్యువేషన్ మొత్తం గమినిస్తున్న డాక్టర్ మాత్రం అదే మంచి ట్రీట్ మెంట్ అని ఆ తండ్రిని నచ్చచెప్పుతాడు. ఆ పాప వచ్చిన తర్వాతే ఆ పిల్లాడు బాగయ్యాడని ఆపుతాడు. అలా సంపత్ నార్మల్ చైల్డ్ గా మారతాడు. అంతేగాక డాక్టర్ సలహాతో ఇంటివద్దే ప్రెవేట్ ట్యూటర్స్ సాయింతో చదువు ప్రారంభిస్తాడు. సత్య కూడా అతనితో పాటు జాయిన్ ఆడుతూ పాడుతూ చదువుకుంటుంది. ఇదంతా గ్రహించిన సంపత్ తండ్రికూడా ఆ పిల్లను బాగా చూసుకుంటూంటాడు. అయితే విధి అనుకోని దెబ్బ తీస్తుంది.

చెప్పటం మరిచాను… ఈ కధంతా 1983 లో జరుగుతూంటుంది. ఆ సమయంలో శ్రీలంక వారికి తమిళులకు మధ్య చాలా గొడవలు జరిగాయి. రోడ్డుపై ఎక్కడ తమిళ వాళ్ళు కనపడితే అక్కడే సింహళం వారు చంపుతూంటారు. తమిళ నాడు నుంచి వచ్చి శ్రీలంకలో సెటిలయిన వాళ్ళ ఇల్లు తగలపెట్టేస్తూంటారు. దాంతో తమిళులు చాలామంది మూటా ముల్లూ సర్దుకుని తమ స్వస్ధలం కి తరలి వెళ్ళిపోతూంటారు. అలా వెళ్ళని వేలు ని ఓ రోజు వాళ్ళు చంపేస్తారు. చిన్నారి సత్య తప్పించుకుంటుంది. ఆ తర్వాత కొద్దిరోజులకు విషయం తెల్సుకున్న సత్య తల్లి వచ్చి తనతో తమ పల్లెకు తీసుకువెళ్తానంటుంది. సంపత్ తండ్రి వారిని తమ బంగ్లాలో ఉండమని బ్రతిమిలాడతాడు. కాని జాతి విద్వేషం ముందు ఇవన్నీ నిలబడవు.పాప శెలవంటూ..తిరిగి తన స్వస్ధలానికి వెళ్ళిపోతుంది. సంపత్ తిరిగి తన పాత పరిస్ధితికి వెళ్ళిపోతాడు. ఇదీ లిటిల్ ఏంజిల్ కథ సంక్షిప్తంగా…

ఇక ఇప్పుడు హరివిల్లు నాకు గుర్తున్నంతవరకూ…

సినిమా ప్రారంభం ..రాత్రివేళ వర్షం పడుతూంటే..ఆ చప్పుడికి పక్క మీద నుంచి లేచిన రవి(సాయి శుభాకర్) వరండాలోకి వచ్చి వానలో తడుస్తూ ఆనందంతో గంతలు వేస్తాడు. తెల్లారి తల్లి లలిత(హరిత) అతణ్ణి నిద్రలేపటానికి వచ్చి దుప్పటి తొలగిస్తే అతని ముక్కులోంచి కారిన రక్తం కనిపిస్తుంది. అలా ఆ పిల్లాడికి కాన్సర్ వచ్చిందని ఎస్టాభ్లిష్ చేస్తారు. తర్వాత రవి జీవితంలోకి తెలంగాణ(కరెక్టేనా?) పనిపిల్ల(నిత్య) ప్రవేశిస్తుంది. ఆ పిల్ల తెలంగాణ జానపదాలు పాడుతూంటుంది. (సినిమా చివరలో కూడా రారా..రారా..రాజా,లేరా..లేరా నిద్దుర లేరా అనే పాట పాడుతుంది).అయితే రవి ఎప్పుడూ ఇంట్లోనే పెయింటింగ్స్ వేసుకుంటూ గడుపుతూంటాడు. అతని స్కూల్ ప్రెండ్స్ ,లేదా ప్రక్కింటి ప్రెండ్స్ ఎవరూ రారు. అంటే ఈ రోగం రాకముందరి ప్రెండ్సంతా ఏమయ్యారో తెలియదు. ఎప్పుడూ ఒంటరి తనం అనుభవిస్తూంటాడు. అప్పుడు సైక్రాటిస్టు మందాకిని అవసరం పడుతుంది. ఆమె సైతం రవికి ఆనందం ఇచ్చే అంశాలపై దృష్టి ఎక్కడా సారించినట్లు కనపడదు.ఏవేవో సలహాలు చెప్తుంది. ఇక గౌరి వచ్చిన తర్వాతే రవి జీవితంలోనూ వసంతం ప్రవేశిస్తుంది.ఆమెని చూడగానే వాడి ముఖంలో ఆనందం. గౌరి,రవిల మధ్య స్నేహం మానసిక అనుబంధానికి దారితీస్తుంది. ఇద్దరూ గోల్కెండ్ కి వెళ్తారు. అలా కథ కొనసాగి…ఇక ఆఖర్లో చావు బ్రతుకుల మధ్య కోమాలో ఉన్న రవి కళ్ళు తెరిపించటానికి గౌరీనే కరెక్టని డాక్టర్ భావిస్తుంది. అదే రవి తల్లితండ్రులకు చెప్తుంది. ఆ పాప వచ్చి పాట పాడుతుంది. కిటీకీ వద్ద సీతాకోక చిలుక గాలిలోకి ఎగురుతుంది.

ఇప్పుడర్ధమయి ఉంటుంది మీకు…నాకెందుకు ఆ లిటిల్ ఏంజిల్ గుర్తుకు వచ్చిందో..

ఇక ఇదంతా రాసింది..ఎవరినీ విమర్శించటానికి కాదని మనివి..నా గుర్తులు..గుర్తుకొచ్చి అంతే…అలాగే ఎట్ ద సేమ్ టైమ్ లిటిల్ ఏంజెల్ అనే మినీ అధ్బుతాన్ని పరిచయం చేద్దామని అంతే..

సినిమా ప్రేమికులుకు…నూతన సంవత్సర శుభాకాంక్షలు.

4 Comments
  1. విజయవర్ధన్ January 4, 2009 /
  2. Surya January 4, 2009 /
  3. Dreamer January 5, 2009 /