Menu

2008 ఇంగ్లీషు సినిమాలు-1

2008 హాలీవుడ్  చాలా మంచి సినిమాలొచ్చాయి. గతంలో అంతా మంచి సినిమాలంటే ఏ టర్కీ సినిమాలో, ఇరానియన్, కొరియన్ లేదా జపనీస్ సినిమాలో వెతుక్కోవాల్సి వచ్చేది. మన బాలీవుడ్ కి లాగే హాలీవుడ్లో కూడా 2008 చాలా మంచి సినిమాలొచ్చాయి.వాటన్నిటి గురించి త్వరలోనే ఒక్కొకటిగా సమీక్షిస్తూ వెళ్లాలని ఉంది. కానీ ప్రస్తుతానికి వాటిల్లో కొన్నింటినైనా పరిచయం చేయాలన్నదే ఈ టపా ఉద్దేశం.

ఈ సంవత్సరం ఎప్పటిలానే సూపర్ హీరోల సీక్వెల్స్ (డార్క్ నైట్, హెల్ బాయ్), జేమ్స్ బాండ్ ఫ్రాంచైజ్ సినిమాలతో పాటు ఐరన్ మాన్ అనే మరో సూపర్ హీరో సినిమా, కార్టూన్ కారెక్టర్లు, యానిమేషన్ సినిమాలు హాలీవుడ్ ని ముంచెత్తినా ఈ సంవత్సరం చివరి భాగంలో ఎన్నో కళాత్మకమైన సినిమాలు హాలీవుడ్ లో విడుదలయ్యాయి. వీటిల్లో కొన్ని 2009 లో విడుదలవనున్నాయి.

ఈ సంవత్సరం నాకు బాగా నచ్చిన హాలీవుడ్ సినిమాలు:

The Wrestler

చిన్నప్పుడు స్టార్ టివి కొత్తల్లో వచ్చిన రోజుల్లో WWF చూడకుండా చాలామంది నిద్రపోయేవాళ్ళు కాదు. ఆ కార్యక్రమం రాత్రి ఎప్పుడో వచ్చినా మేలుకొని ఉండి చూసేవాళ్ళని చాలా మందిని చూసాను. వయసులో ఉండగా అలాంటి WWF పోటిలో పాల్గొని కాస్త వయసైపోయిన ఒక wrestler జీవితాన్ని కాసేపు అతని వెంటే ఉంటూ చూడాలనుకుంటున్నారా? అయితే The Wrestler చూడాల్సిందే. కాకపోతే కాస్త గుండె ధైర్యం కావాలి.

ఈ సినిమా 2008 లో వచ్చిన అత్యుత్తమ సినిమాల్లో ఒకటి. కావాలంటే Rotten Tomatoes లో ఈ సినిమా రేటింగ్ చూడండి (98% fresh). ఈ సినిమా చూడ్డానికి ఇదొక్కటే కారణం కాదు.

మీరు Mickey Rourke పేరు విన్నారా? ఈయన హాలీవుడ్ నటుడు. ఈ మధ్య కాలంలో Sin City అనే సినిమాలో నటించాడు. ఈయన పేరు మీరు ఇది వరకు వినకపోతే ఇక ముందు బాగానే వింటారు. మొన్ననే ఉత్తమ నటుడుగా గోల్డన్ గ్లోబ్ అవార్డు అందుకున్నాడు. త్వరలోనే ఆస్కార్ కూడా అందుకుంటాడనే నమ్మకం వుంది. ఈయన నటించిన చిత్రమే The Wrestler.

ఈయన నటన కోసం కాకపోయినా ఈ సినిమా చూడ్డానికి మరో కారణం చెప్తాను. Darren Aronofsky పేరు విన్నారా? Pi మరియు Requiem for a dream అనే రెండు అత్యద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడీయన. The Wrestler ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమా.

తప్పక చూడాల్సిన సినిమా.

Revolutionary Road

ఈ సినిమా కోసం ఎంత ఎదురు చూసానంటే కళ్ళు నిజంగానే కాయలు కాచేలా ఎదురు చూశాను. నాకైతే 2008లో Most awaited film of the year ఇదే.ఎందుకు నేనీ సినిమా కోసం అంత ఎదురుచూశానంటే గత సంవత్సరం నేను Richard Yates అనే అమెరికన్ రచయిత పుస్తకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చదివేశాక వాటిల్లో బాగా నచ్చిన The Revolutionary Road అనే పుస్తకాన్ని సినిమాగా తీస్తున్నారని తెలియడంతో పాటు ఈ సినిమాకి American Beauty దర్శకుడు Sam Mendes దర్శకత్వం వహిస్తున్నాడని తెలిసింది.

వీటన్నిటితో పాటు రివల్యూషనరీ రోడ్ లాంటి కష్టమైన నవలను సినిమాగా రూపొందించడమంటే మాటలు కాదు. అసలు ఫస్ట్ సీన్ ఎలా ఉంటుందో, ఈ సీన్ ఎలా తీస్తారో అని కలలుకంటూ చవరికి ఒకరోజు సినిమా చూసే అవకాశం దొరికింది.

సినిమాలో Kate Winslet, Leonardo Dicaprio అధ్భుతమైన నటన ప్రదర్శించారు. సినిమా కూడా చాలా చాలా బావుంది. కానీ నవల తో పోలిస్తే సినిమా కాస్త పేలవంగా ఉంటుంది.కొన్ని విషయాల్లో (ఉదా: సినిమాలో పిల్లల పాత్రలు) మరి కొంత జాగ్రత్త తీసుకునుంటే బావుండనిపించింది.

2008 లో వచ్చిన సినిమాల్లో ఇది Must Watch అనే చెప్తాను. కానీ దానికంటే ముందు ఈ సినిమాకి ఆధారమైన నవల మాత్రం మీ must Read లిస్టులో చేరుకోండి. (ఇండియాలో ఈ పుస్తకం కోసం ఎక్కడెక్కడో గాలించాను. ఒక వెబ్ సైట్ లో 1600 రూలకు దొరుకుతుంది. ఇక పెద్ద పెద్ద షాపుల్లో కూడా దొరకటం లేదు. బహుశా ఈ సినిమాకో ఈ సినిమాలో నటీ నటులకో ఆస్కార్ నామినేషన్ వస్తే పుస్తకానికీ క్రేజ్ లభించి అందరికీ అందుబాటులోకి వస్తుందేమోనని ఆశ)

Frozen River

అమెరికా లోని ఒక కుటుంబం కథ ఇది. క్రిస్టమస్ దగ్గరకొస్తుంటుంది. ఆ కుటుంబానికి ఆధారమైన భర్త ఇంట్లోని డబ్బులన్నీ దొంగలించి ఎటో పారిపోతాడు. తనకున్న చిన్న ఉద్యోగంతో ఎలాగో కుటుంబాన్ని నడిపించే ప్రయత్నం చేస్తుంది భార్య. ఇలాంటి పరిస్థుతుల్లో ఆమెకి మరో యువతి పరిచయం అవుతుంది. ఇద్దరూ కలిసి కెనడా నుంచి illegal immigrants ని తీసుకొచ్చి డబ్బు సంపాదిస్తుంటారు. ఈ మహిళలిద్దరి కథ ఇది.

ఇండిపెండెంట్ సినిమా. Sundance చలనచిత్రోత్సవం విజేత. హాలీవిడ్ సినిమాలకి లాగ భారీ నిర్మాణ విలువలు లేవు. ఉన్నదల్లా ఆసక్తి గొలిపే కథనం, మంచి నటన. మంచి సినిమా తప్పక చూడొచ్చు

Two Lovers

జేమ్స్ గ్రే ఈ చిత్రానికి దర్శకుడు. Joaquin Phoenix, Vinessa Shaw, Gwyneth Paltro సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

తన ప్రియురాలితో విడీపోయిన లియోనార్డ్ మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. ఈ విషయం తెలిసినా అతని తల్లిదండ్రులు చాలా దిగులుగా ఉంటారు. ఈ లోగా తన తండ్రి నడుపుతున్న వ్యాపారాన్ని కొనబోయే ఒక కుటుంబంలోని  అమ్మాయి అతనికి పరిచయం అవుతుంది. రెండు కుటుంబాలు కూడా వీళ్ళిద్దరూ ఒకటైతే అటు తమ వ్యాపారానికీ ఇటు కుటుంబ పరంగా సంబంధానికీ బావుంటుందనీ తమలో తామే అభిప్రాయపడతారు. వీరిద్దరికీ బాగానే కుదుర్తుంది కూడా. అంతా బావుంటే కథేముంది. ఈ మధ్యల్లో అతని పక్కింట్లోకి ఒకమ్మాయి చేరుతుంది. మొదటి చూపులోనే మనసు పారేసుకుంటాడు. ఆమె కూడా ఇతనితో బాగానే ఉంటుంది కానీ ప్రేమలో పడదు. పక్కింటి అమ్మాయిది మరో కథ. ఆవిడ పెళ్ళయిన మరో వ్యక్తితో ప్రేమలో ఉంటుంది. అతని గురించి లియోనార్డ్ దగ్గర సలహాలు తీసుకుంటుంటుంది. ఇలా మన శోభన్ బాబు లాగా లియోనార్డ్ ఇద్దరమ్మాయిల మధ్య నలిగిపోతాడు. చివరికి ఎవరికి ఎవరితో పెళ్ళయింది అనేది ముగింపు.

ఈ సినిమా కథ కాస్త మన తెలుగు/హిందీ/తమిళ సినిమాల్లాగే ఉన్నా నటీనటులు ప్రదర్శన మరియు దర్శకత్వం చాలా చాలా బావున్నాయి. చెప్పడం కాదు కానీ తప్పకుండా చూడాల్సిన సినిమా. అంటే హాలీవుడ్ లో ఇలాంటి రొమాంటిక్ కామెడీస్ చాలానే వస్తుంటాయి. కానీ దర్శకుడు ఈ సినిమాని మలచిన తీరు చాలా బావుంటుంది. చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రేమ కథల్లో మునిగి తేలే మన పరిశ్రమవాళ్ళు ఈ సినిమాని చూసి చాలానే నేర్చుకోవచ్చు. సినిమా రంగులు, సింప్లిసిటీ కాస్తా వుడీ ఆలెన్ సినిమాలను తలపిస్తాయి.

ఈ సినిమాకి ఇన్సిరేషన్ ఏంటో తెలుసా? దోస్తోవ్‍స్కీ రచించిన White Nights అనే కథ.
ఇన్ని కారణాలు చెప్పినా ఈ సినిమా చూడకూడదనుకున్నావారికి మరో కారణం చెప్పాలి. ఈ సినిమాలో నటించిన Phoenix కి నటుడిగా ఇదే ఆఖరు సినిమా అట. ఇక పై నటించనని ఈ మధ్యనే ప్రకటించాడీయన. అంతే కాదు ఇకపై పాటలు మాత్రమే పాడుతాడట. ఈయన్న్ని తెరపై చివరై సారిగా చూసేందుకైనా ఈ సినిమా చూడొచ్చు.

The Dark Knight

సూపర్ హీరో సినిమాలకు కొత్త రూపమిచ్చి, మళ్ళీ ఆ జాతానికి (genre) కి ప్రాణం పోసిన డార్క్ నైట్  గురించి ఇప్పటికే అందరికీ తెలిసుంటంది. కాదు లేదు అంటే నవతరంగంలో వచ్చిన ఈ సమీక్షలు చదవండి.

హెల్ బాయ్ -2

హెల్ బాయ్ ఈ సంవత్సరంలో నేను బాగా ఎంజాయ్ చేసిన సినిమాల్లో ఒకటి. ఎందుకో హెల్ బాయ్ నాకు తెగనచ్చేసాడు. ఇది చూసాకే నేను మొదటి హెల్ బాయ్ కూడా చూసాను. రెండిట్లో మొదటిదే బెస్ట్ కానీ రెండోది కూడా బావుంటుంది. ఫాంటసీ ని సూపర్ హీరో కథతో కలిపి వెరైటీ గా ఉంటుంది. కానీ నేను రికమెండ్ చేస్తే చూసిన వాళ్ళకి మరీ అంతగా నచ్చలేదు కాబట్టి మీక్కూడా సినిమా చూశాక నచ్చకపోతే నన్ను నిందించకండి 🙂

Che 1&2

ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. ముఖ్యంగా Che అంటే మీకిష్టమున్నా లేకపోయినా మీరు ఈ సినిమా చూడొచ్చు. ఇందులో Che ని ఒక హీరోగా పోస్టర్ బాయ్ గా గ్లోరిఫై చెయ్యలేదు. అలాగే అతను చేసిందంతా తప్పని ఎండకట్టనూ లేదు.  కాకపోతే మోటార్ సైకిల్ డైరీస్ చూసి Che అభిమానులైపోయిన వారు ఈ సినిమా కూడా అలానే ఉంటుందని అంచనాలు లేకుండా ఉండడం మేలు. ఎందుకు చెప్తున్నానో సినిమా చూస్తే మీకు అర్థమవుతుందనుకుంటాను. అలాగే Che పాత్రలో Benicio Del Toro అద్భుతమైన నటన ప్రదర్శించాడు.

అన్నింటికంటే ముఖ్యంగా సినీ ఔత్సాహికులు ఈ సినిమా తప్పక చూడాలన్నదానికి ఈ సినిమా(లు) రెడ్ కెమెరా తో షూట్ చేసారన్న ఒక్క విషయం చాలు.

రెడ్ కెమెరా ఏంటో తెలియని వారికోసం రెడ్ కెమెరా ఉపయోగించిన/ఉపయోగిస్తున్న వారి అనుభవాలతో కూడిన ఒక వ్యాసం త్వరలోనే ప్రచురించే ఆలోచన ఉంది.

–ఇంకా ఉన్నాయి

2 Comments
  1. శంకర్ January 21, 2009 /
  2. Sowmya January 21, 2009 /