Menu

మరో మంచి దర్శకుడు – హరి చరణ్

“విశ్వనాథ్ గారు సినిమాలు తీయడం ఎందుకు మానుకున్నారంటే వారు తీసిన సినిమాలకి వ్యాపర పరంగా లాభసాటి లేదు. మంచి సినిమాలు రావడం లేదూ అని బాధ పడేకన్న ఎవరైనా ఒక చిన్న మంచి ప్రయత్నం చేస్తే దానికి మీరు చేయూత నివ్వండి. సినిమాకి వెళ్ళి చూడండి. బాగోలేదని ఎవరో చెప్పారని చూడ్డం మానేస్తే చిన్న సినిమాలు తీసేవాళ్ళుండరు. ఎవరైనా మంచి ప్రయత్నం చేస్తే మీవంతు సహకారం అందిచండి. వారికి మరింత ప్రోత్సాహం ఇవ్వండి…” చాల కాలం క్రితం అమెరికాకి విచ్చేసినప్పుడు ఓ చిన్న సందర్భంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారన్న వాక్యాలవి. కె. విశ్వనాథ్ గారెందుకు సినిమాలు తీయడంలేదని ఎవరో అడిగిన ప్రశ్నకి ఎంతో ఆవేశంతో పై మాటలన్నారు. అందులో ఆవేశం కన్నా ఆవేదనుంది. వాస్తవముంది.

నిన్ననే “ష్ – ఇది చాలా మంచి వూరు” సినిమా చూసాక పై వాక్యాలే గుర్తుకొచ్చాయి. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన హరిచరణ్ ప్రసాదు నాకు మంచి మిత్రుడు. సినిమా అంటే పరితపించేవాడు. అందునా మంచి తెలుగు సినిమాకోసం ప్రతీ క్షణమూ ఆశపడేవాడు. మరో మిత్రుడి ద్వారా నాకు “వనజ” ప్రివ్యూ కెళ్ళినప్పుడు పరిచయం అయ్యారు.. నాకు సినిమాలంటే ఆసక్తుందనీ, నేనూ సినిమాలకి సంబంధించిన కోర్సు చేసానని చెప్పగానే, ఎంతో సంతోషించీ, మనం విడిగా కలిసి మాట్లాడుకోవాలంటూ తన సెల్ నంబరు నాకిచ్చి, నాదీ ఆయన తీసుకున్నారు. అప్పుడే తెలిసింది ఆయనే కమ్లి సినిమా నిర్మాతనీ. ఆ సందర్భంలోనే తన రెండవ ప్రయత్నంగా మరో థ్రిల్లర్ సినిమా తీస్తున్నాననీ చెప్పారు. సినిమాకొచ్చిన హాడావిడిలో అక్కడంత సేపు మాట్లాడడం కుదర్లేదు. మర్నాడు కాల్ చేద్దాములే అనుకున్నాను కానే చేయడానికి సంకోచించాను. ఎందుకంటే గతంలో ఇలాగే కొంత మంది పేరొందిన దర్శకుల్ని కలిసినప్పుడు నాకు కొన్ని చేదు అనుభవాలెదురయ్యాయి.

ప్రత్యక్షంగా కలిసినప్పుడు ఎంతో ఆసక్తి గా మాట్లాడిన దర్శకులూ, నిర్మాతలూ తరువాత సంప్రదించే ప్రయత్నం చేస్తే మొహం చాటేసారు. ఎంతో ఉత్సాహంతో ఫోన్ చేస్తే కనీసం జవాబు కూడా ఇవ్వలేదు. ఈమెయిలు చేస్తే పత్తా లేదు. అందుకని హరిచరణ్ణి కాల్ చేయడానికి ఎందుకో ముందడుగు వేయలేదు. కానీ ఆ రోజు రాత్రి ఆయనే కాల్ చేసి దాదాపు రెండు గంటల సేపు మాట్లాడారు. ఎంతో కాలం నుండీ పరిచయమున్న వ్యక్తిలా పలకరించారు. అదే సందర్భంలో ఆయన “ష్” సినిమా స్క్రిప్టు గురించి చెప్పారు. నేనేదయినా చేయగలిగితే తప్పక తీసుకుంటానని చెప్పారు. స్క్రిప్టు పంపుతానని చదివి అందులో ఏమైనా మార్పులవసరముంటే చెప్పమన్నారు. సరే అన్నాను కానీ, స్క్రిప్టు పంపుతారన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే సినిమా వాళ్ళు, వాళ్ళ ప్రోజక్టులన్నీ గుంభనగానే ఉంచుకుంటారు. ఫోన్ సంభాషణ ముగిసిన అరగంట తరువాత ఈమెయిల్ చూస్తే ఆయన స్క్రిప్టు పంపారు. మాట్లాడిన కొద్ది సేపటికే మయిలు పంపేసరికి ఆశ్చర్యం కలిగింది. చదివి నాకు తోచినవి చెప్పాను. నచ్చినవి తీసుకున్నారు. కొన్ని చోట్ల విమర్శిస్తే, ఎందుకు బాగాలేదో నేను సమంజసంగా చెప్పే వరకూ నన్ను వదిలిపెట్ట లేదు. నే చెప్పిందంతా విని ఆయన ఎందుకలా రాసారో చెప్పారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే సాధారణంగా సినిమా దర్శకులు విమర్శలు స్వీకరించరు. పైగా వాళ్ళ స్క్రిప్టు పట్టుమని రెండురోజులు కూడా కాని ఓ కొత్త వ్యక్తి చేతిలో చచ్చినా పెట్టరు. ఇదే విషయం నేను హరి చరణ్ తో అంటే “స్నేహమూ, వ్యాపారమూ నమ్మకం మీదే నడుస్తాయి. మీరూ నాలాగే సినిమా అంటే పరితపిస్తారు. అది నాకు మీ మాటల్లో కనిపించింది. నన్ను మీరు నమ్మాలంటే నేను ముందు మిమ్మల్ని నమ్మాలి. ఆ నమ్మకంతోనే మీకు స్క్రిప్టు ఇచ్చానని” చెప్పారు. ఆశ్చర్యం వేసింది. ఆనందం కలిగింది. నాకు తోచిన సలహాలు చెప్పాను. అప్పటికే స్క్రిప్టు వర్కు తొంభై శాతం అయిపోయింది. నేను అంతగా సహాయ పడలేకపోయాను. ముందుగా సినిమాకి “అలజడి” అని పేరు పెట్టుకున్నారు. స్క్రిప్టు చదివాక ఆ పేరు అంతగా నప్పలేదనిపించింది నాకు. థ్రిల్లర్ గా అనిపించాలంటే కొత్తగా పేరుంటే బాగుంటుందనిపించింది. ఆ సినిమాలో ఓ చిన్న పాప కి చనిపోయిన వారితో మాట్లాడే శక్తుంటుంది. అది ఆ చిన్నమ్మాయి తండ్రి ( హీరో ) మెల్లగా గుర్తిస్తాడు. ఆ పిల్ల అర్థరాత్రి తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఓ రాత్రి అలా సంభాషిస్తుంటే “అప్పూ” అని తండ్రరుస్తాడు. ఆ పాప “ష్..” అని గొడవ చేయద్దంటుంది. ఇది చూసాక “ష్” పేరు బాగుంటుందని చెప్పాను. హరిచరణ్ కి బాగా నచ్చింది. ఆ తరువాత ఆయన సినిమా తీయడానికి ఇండియా వెళిపోయారు. ఓ నెల్లాళ్ళ తరువాత నాకో ఈమెయిల్ చేసారు. అది “ష్” సినిమా పేరు అని నిర్ధారించామనీ, క్రెడిట్స్ లో నా పేరు వేస్తానని చెప్పారు. నాకు ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగింది. సాధారణంగా సినిమా దర్శకులు ఇతరుల చెప్పిన సలహాలూ, హాస్య సంభాషణలూ వారి సృజనే అన్నట్లు చెబుతారు. అలాంటిది కేవలం సినిమా టైటిల్ చెప్పినందుకే నాకు క్రెడిట్ ఇవ్వాలని అనుకున్న హరిచరణ్ లాంటి వ్యక్తులుంటారా అనిపించింది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే సినిమా తీయడంలో నిష్టే కాదు, నిబద్ధతా, నిజాయితీ కూడా వుండాలి. అవి హరిచరణ్ లో నాకు కనిపించాయి. నిన్న సినిమా చూస్తే అందులో నా పేరు కూడా కృతజ్ఞతలతో అంటూ వేస్తే హరిచరణ్ లాంటి మంచి దర్శకుడు నా మిత్రుడని చెప్పుకోడానికి సంతోషం వేసింది. చిన్న చిన్న వాటికి కూడా ఎంతో విలువ నిచ్చే మంచి దర్శకుడు కనిపించాడు. హాలీ వుడ్ లో సినిమా తీసే ముందు అందులో ఉన్న ముఖ్య నటులకీ, సాంకేతిక వర్గానికీ స్క్రిప్టు ప్రతి ఖచ్చితంగా ఇస్తారు. అదే బాటలో హరిచరణ్ కూడా నడిచారని ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళు చెబితే తెలుగు సినిమాకి మంచి రోజులొచ్చాయని ఆనందించాను. ఓ మంచి దర్శకుడు దొరికాడని సంబర పడ్డాను.

“ష్” సినిమా అందరూ తప్పకుండా చూడండి. స్క్రిప్టు ఎలా వుందో అందులో ఒక్కటీ తు.చ తప్పకుండా తెరకెక్కించాడు దర్శకుడు. అలాగే సినిమాలో ఎక్కడా అనవసర సంభాషణలు కానీ, సన్నివేశాలు కానీ కనిపించవు. కథ చక చకా సాగిపోతుంది. అలాగే కథలో ఇమడని హాస్య పాత్రలూ లేవు. ఓ సీరియస్ సినిమా ఎలా వుండాలో అలాగే ఉంటుంది. సినిమాలో మొత్తం రెండు పాటలున్నాయి. “ఎవరో ఎవరో” పాటలో మంచి మెలడీ కనిపిస్తుంది. నటీ నటుల వరకూ వస్తే షఫీ చాలా నిరాశ పరిచాడు. షఫీ నటన గురించి ఎంతో అనుకొని సినిమాకి వెళితే ఉన్న ఉత్సాహం గాలి తీసేసాడనిపించింది. కానీ హీరోయిన్ గా వేసిన మిధున అనే అమ్మాయి ఈ సినిమాకి సర్ప్రైజ్ పాకేజ్. మొత్తం సినిమానీ తన భుజాలమీద మోసింది. ఉన్నంత సేపూ చాలా బాగా నటించింది. మొదటి సినిమా అయినా దర్శకుడు నటీ నటుల నుంచి మంచి నటన్ని రాబట్టుకున్నాడు. కథలో అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు దొర్లినా మొత్తం సినిమాలో అవి కనిపించవు. ఎంతో ఉత్కంఠతో సినిమా నడుస్తుంది. సంగీతం కొన్ని చోట్ల బాగున్నా చాలా సందర్భాల్లో రిపిటీషన్ గా వినిపించింది. అతి తక్కువ బడ్జట్లో ఓ పద్ధతి ప్రకారం ఈ సినిమా తీసిన హరిచరణ్ ప్రసాద్ అభినందనీయుడు. “ష్” చూసాక అతని దర్శకత్వంలో మరిన్ని మంచి సినిమాలొస్తాయన్న ఆశకంటే నమ్మకమే ఎక్కువగా కలుగుతుంది. “ష్” సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా! ఆశ్లీల సంభాషణలూ, సన్నివేశాలు ఉండవు. వెకిలి హాస్యమూ, జుగుప్సా కరమైన శృంగారమూ ఇలాంటివి అస్సలుండవు. హాయిగా అందరూ చూడచ్చు.

మంచి సినిమాలు రావాలంటే ఎంతో తపనతో చిన్న సినిమాలు తీసే దర్శకుల్ని మనమందరం ప్రోత్సహించాలి. అది స్పూర్తిగా తీసుకొని వాళ్ళు మరిన్ని మంచి సినిమాలు తీస్తారు. అతి తక్కువ బడ్జట్లో ఓ పద్ధతి ప్రకారం ఈ సినిమా తీసిన హరిచరణ్ ప్రసాద్ అభినందనీయుడు. “ష్” చూసాక అతని దర్శకత్వంలో మరిన్ని మంచి సినిమాలొస్తాయన్న ఆశకంటే నమ్మకమే ఎక్కువగా కలుగుతుంది. సినిమా చూసాక మీరూ నాతో తప్పకుండా ఏకీభవిస్తారు.

–సాయి బ్రహ్మానందం గోర్తి

31 Comments
 1. raghu January 28, 2009 /
 2. Hari Charana Prasad January 28, 2009 /
  • శంకర్ January 28, 2009 /
 3. chandramouli January 28, 2009 /
  • Sai Brahmanandam January 29, 2009 /
 4. చందు January 29, 2009 /
 5. అబ్రకదబ్ర January 29, 2009 /
  • Sai Brahmanandam January 29, 2009 /
 6. saif ali gorey January 29, 2009 /
 7. చండీదాస్ January 29, 2009 /
  • Sai Brahmanandam January 29, 2009 /
   • చండీదాస్ January 29, 2009 /
 8. హనుమంత రావు January 29, 2009 /
 9. Hari Charana Prasad January 29, 2009 /
 10. madhu January 29, 2009 /
 11. venkat B January 29, 2009 /
 12. venkat B January 29, 2009 /
 13. Venkat January 29, 2009 /
  • చండీదాస్ January 29, 2009 /
 14. చండీదాస్ January 29, 2009 /
 15. candi raani January 29, 2009 /
  • చండీదాస్ January 30, 2009 /
 16. Hari Charana Prasad January 30, 2009 /
  • shree January 30, 2009 /
 17. pandu January 30, 2009 /
 18. చండీ దాస్ January 31, 2009 /
 19. pappu January 31, 2009 /