Menu

Groundhog Day

కొద్ది కాలం క్రితం IMDB Top 250 పైన యుద్దం ప్రకటించి ఒక్కొక్క సినిమా సంగతి చూడడం మొదలు పెట్టినపుడు ఆ జాబితాలో Groundhog Day సినిమాను  చూసాను. అప్పటివరకు ఈ సినిమా పేరు వినలేదు,  ఈ సినిమా గురించి ఎక్కడా చదవలేదు, పైగా సినిమాలో కథానాయకుడు బిల్ మర్రే!! ” బిల్ మర్రే సినిమాలు అంటే  మామూలు కామెడీతో కాసేపు నవ్వుకొని మరచిపోయేవి, పొరపాటున ప్రేక్షకులు ఎక్కువ రేటింగ్ ఇచ్చారేమో”నని అనుమానంతో  సినిమా చూడడం మొదలు పెట్టాను.

కథాంశం:
ఫిల్ ఒక టీవీలో వాతావరణం గురించి చెప్తుంటాడు. స్వార్థపరుడు, ఇతరుల పట్ల గౌరవం ఉండదు, ఇతరులకు సహాయం చెయ్యడు. వ్యక్తిగతంగా ఎవరూ ఇతడిని ఇష్టపడరు.  ఫిల్ తనతో పాటు పని చేసే రీటా, కెమెరామెన్ ల్యారీలతో కలసి Groundhog Day అనే ఉత్సవం గురించి ఒక కార్యక్రమం రూపొందించడానికి ఒక వూరికి వెళ్తాడు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 2న జరిగే ఆ కార్యక్రమం చేయడం ఇష్టం లేని ఫిల్ రీటాను, ల్యారీని చిన్నచూపు చూస్తూ అనాసక్తిగా  ఉత్సవానికి సంబంధించిన డాక్యుమెంటరీ ముగిస్తాడు.  తిరిగి వెళ్ళేటపుడు మంచు తుఫానులో మొదలవడంతో ముగ్గురూ ఆ వూళ్ళోనే బస చేస్తారు.

మరుసటిరోజు ఫిల్ నిద్ర లేచిన తర్వాత ముందురోజు జరిగినవే మళ్ళీ జరుగుతుంటాయి. అదే మనిషి అదే స్థలంలో కనిపిస్తూ అవే మాటలు మాటాడుతుంటాడు. ఫిల్ ఎప్పటిలాగే చిరాకుగా వెళ్ళిపోతాడు. ఉత్సవం జరిగే చోటుకు వెళ్ళినపుడు అక్కడ రీటా, ల్యారీలు కార్యక్రమం రూపొందించడానికి ఫిల్ కోసం ఎదురు చూస్తుంటారు. క్రితం రోజు ఉత్సవంలో జరిగినవే మళ్ళీ జరుతుంటాయి. తాను భ్రమపడుతున్నానేమో అనుకొని ఫిల్ కార్యక్రమం రూపొందించడం పూర్తి చేసి బయలుదేరుతాడు, మళ్ళీ అందరూ మంచు తుఫానులో చిక్కుకొని వెనక్కు వస్తారు.

మరుసటి రోజు ఫిల్ నిద్ర లేచినప్పటికి ఫిబ్రవరి 2 లోనే ఉంటాడు. ఇలా కొద్ది రోజులు జరిగిన తర్వాత తనకు మాత్రమే ఏమి జరిగిందో తెలుస్తున్నదని, మిగతావాళ్ళకు తెలియడం లేదని గ్రహించి తనకు ఉన్న కోరికలను తీర్చుకుంటాడు. రూల్సుకు వ్యతిరేకంగా కారు నడిపి యాక్సిడెంట్ చేసి అరెస్టు అవుతాడు, మరుసటి రోజు ఫిల్ కళ్ళు తెరిచి తాను అదే హోటల్ గదిలో ఉన్నట్టు, ఆ రోజు ఫిబ్రవరి 2 అని గ్రహిస్తాడు.

ఫిల్ తనకు రీటా అంటే ఉన్న ప్రేమను ఆమెకు చెప్పినపుడు ఆమె కాదంటుంది. ఆమె ఇష్టాలను తెలుసుకొని కొద్ది రోజుల్లో ఆమె మనసు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తాడు. రీటా (దృష్టిలో) కేవలం ఒక్కరోజులో ఫిల్‌లో వచ్చిన మార్పుకు ఆశ్చర్యపడుతుంది. ఒకరోజు ఫిల్ జరిగినది అంతా రీటాకు చెప్పి అది నిజమని నిరూపిస్తాడు. అపుడు రీటా కొన్ని మంచిపనులు చేయమని ఫిల్‌కు చెబుతుంది. రీటా కోసం ఫిల్  ఇతరులకు సహాయం చేయడం మొదలు పెడతాడు. క్రితం రోజు తాను వెళ్తున్నపుడు చెట్టు పైనుండి పడిపోయిన పిల్లవాడిని మరుసటిరోజు కాపాడుతాడు. తనకు ఎదురుపడిన వారిని స్నేహపూర్వకంగా పలకరిస్తాడు.

తాను ఆ వూరికి వచ్చిన మొదటిరోజు ఎంతోమందికి సహాయం చేయగలిగి ఉండీ చేయలేకపోవాడానికి కారణం తన వ్యక్తిత్వం, స్వార్థం అని గ్రహించి అవన్నీ వదిలి అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ, సహాయం చేస్తూ అందరి మన్ననలు పొంది రీటా మనసు గెలుచుకుంటాడు. చివరికి… (చూస్తే బాగుంటుంది 🙂 )

===============

సినిమా చూసిన తర్వాత “ఇది టాప్ 250 లో మాత్రమే కాదు, టాప్ 50 జాబితా రూపొందిస్తే అందులో తప్పక ఉండవలసినది” అనిపించింది.  నేను సినిమాలు చూస్తూ చప్పట్లు కొట్టిన సన్నివేశాలు చాలా తక్కువ, అందులో ఎక్కువ ఈ సినిమాలోనే ఉన్నాయి. మన దైనందిన జీవితంలో ఎంతోమంది కొత్తవారిని, తెలిసినవాళ్ళను కలుస్తుంటాము. వీలున్నా స్నేహపూర్వకంగా మాట్లాడము. సహాయం చేసే అవకాశం ఉన్నా సహాయం చెయ్యము. ఒకవేళ నిన్నటిరోజు మళ్ళీ పునరావృతం అయితే ఇంకొంచెం సంతోషాన్ని మరొకరితో పంచుకోగలమా? నిన్న జరిగినవన్నీ యథాతథంగా ఈ రోజు పునరావృతం అవుతాయని తెలిస్తే నిన్న చేయలేని మంచిపని ఒకటయినా ఈ రోజు చెయ్యగలిగే మనసు మనకు ఉందా? వంటి అంశాలతో చాలా విలువయిన సందేశాన్ని హాస్యభరితమయిన సన్నివేశాలతో దర్శకుడు అందించాడు.

స్వార్థపరుడిగా, మారుతున్న వ్యక్తిగా, మారిన మంచి వ్యక్తిగా బిల్ మర్రే చాలా బాగా నటించాడు. కేవలం ఒక సన్నివేశాన్ని చిత్రీకరించడానికే ఎన్నో టేకులు కావాలి. అలాంటిది మొదటి రోజు జరిగిన సన్నివేశాల ఆధారంగా కేవలం కథానాయకుడి పాత్ర తప్ప ఇంకేమీ మారకుండా అదే ప్రాంతంలో, అవే సంభాషణలతో, అదే వాతావరణంలో విభిన్న సన్నివేశాలను పలుమార్లు చిత్రీకరించడానికి ఎంత కష్టపడి ఉంటారో ఆలోచిస్తే ‘ఔరా’ అనిపిస్తుంది.

It’s a Wonderful Life సినిమా ఒక మంచిమనిషి లేకుంటే కొందరి జీవితాలు ఎంత దుర్భరంగా ఉండేవో చూపుతూ జీవితం ఎంత విలువయినదో చాటి చెబుతుంది. ఈ సినిమా ఎవరూ ఇష్టపడని వ్యక్తి తనను తాను ప్రశ్నించుకుని మారితే నలుగురికి ఏ విధంగా సహాయపడగలడో, చిన్న చిన్న విషయాలలో దాగిఉన్న సంతోషాన్ని కనుగొని నలుగురితో ఎలా పంచుకొనగలడో చూపుతుంది. రెండూ దేనికవే సాటి.

ఎవరయినా సకుటుంబసమేతంగా చూడడానికి ఒక మంచి సినిమా సూచించమంటే ఈ సినిమాను సూచిస్తాను!

–జీడిపప్పు

8 Comments
  1. Madhura vaani January 6, 2009 /
  2. sasank January 6, 2009 /
  3. krishna January 6, 2009 /
  4. krishna January 6, 2009 /
  5. satyam January 6, 2009 /
  6. చందు January 7, 2009 /
  7. కొత్తపాళీ December 29, 2009 /