Menu

గాడ్‌ఫాదర్ – తెరవెనుక కథ

ప్రపంచ సినీ చరిత్రను తిరగరాసిన గాడ్‌ఫాదర్ సినిమా నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. మాఫియా ఆధారంగా తీయబడిన ఈ సినిమా చిత్రీకరణ మొదలవడానికి నిజమయిన మాఫియా ఎన్నో ఆటంకాలు కలిగించింది. అమెరికాలోని పలు నగరాల్లో ఇటాలియన్లు నిరసన ప్రదర్శనలు జరిపారు. నిర్మాతకు బెదిరింపులు వచ్చాయి. అప్పటి ప్రముఖ మాఫియా బాస్ ఈ సినిమాను ఆపడానికి తన బలాన్ని బలగాన్ని ఉపయోగించాడు. నిర్మాత చివరకు మాఫియా చెప్పిన ఆంక్షలకు తలవంచవలసి వచ్చింది. ఒక వైపు న్యూయార్క్ వీధుల్లో మాఫియా గ్యాంగ్‌ల మధ్య పోరు జరుగుతుంటే మరో వైపు గాడ్‌ఫాదర్ షూటింగ్ జరిగేది.  తెరపైన మాఫియాను తన కనుసన్నల్లో ఉంచుకున్న గాడ్‌ఫాదర్ తెరకెక్కడానికి మాఫియా కనుసన్నల్లో మెలగాల్సి వచ్చింది. ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించిన కొన్ని విశేషాలు:

నవల
1965 నాటికి మరియో పూజో రాసిన నవలలు ఘోర పరాజయం పొందాయి. అందులో ఒక నవల ద ఫార్చునేట్ పిలిగ్రిం. ఆ నవలలో ఒకానొక పాత్ర మాఫియా డాన్‌కు సంబంధించినది. నవల ఎక్కువ ఆదరణ పొందనప్పటికీ పాఠకులను ఆ మాఫియా డాన్ పాత్ర ఆకట్టుకోవడంతో ఆ పాత్ర ఆధారంగా మరొక నవల రాయడానికి మరియో పూజో పూనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో మాఫియాను అణిచివేయడానికి FBI తీవ్రప్రయత్నాలు చేస్తుండడం, ప్రజల్లో మాఫియా గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరగడం ‘ గాడ్‌ఫాదర్ ‘ నవల రచనకు మరింత ఊపునిచ్చాయి.

మరియో పూజోకు మాఫియా కార్యకలాపాలు, కుటుంబ వ్యవహారాల గురించి తెలియకపోవడంతో  మాఫియాకు స్వర్గధామంగా ఉన్న లాస్ వేగాస్‌కు వెళ్ళాడు. అక్కడ కెసినోలలో మాఫియా వ్యక్తులతో జూదం ఆడుతూ,  పరిచయం పెంచుకొని వారినుండి తన నవలకు కావలసిన సమాచారాన్ని సేకరించడం మొదలుపెట్టాడు. రెండేళ్ళ తర్వాత 1969లో ‘ది గాడ్‌ఫాదర్ ‘ నవల విడుదలయింది.  ఈ నవల హక్కులను పారామౌంట్ పిక్చర్స్ కొనుగోలు చేసింది కానీ అప్పటికే తీసిన ఒక మాఫియా చిత్రం తెచ్చిన నష్టం వల్ల ఈ నవలను తెరకెక్కించడానికి వెనువెంటనే ప్రయత్నాలు మొదలుపెట్టలేదు. మరో ఏడాదిలో నవల ఘనవిజయం సాధించడంతో సినిమా తీయడానికి స్టూడియో అధినేతలు ఒప్పుకున్నారు.

నవలకున్న పాపులారిటీవల్ల తక్కువ బడ్జెట్‌తో సినిమా నిర్మించి  ఎక్కువ లాభాన్ని ఆర్జించాలని 2-3 మిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించి పెద్దగా పేరు పొందని నటీనట, సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేయడం మొదలు పెట్టారు. నిర్మాతగా అల్ రడ్డీని, యువ దర్శకుడయిన ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పాలాను ఎన్నుకున్నారు. 1970లో అధికారికంగా చిత్రనిర్మాణం గురించి ప్రకటన వెలువడింది. సరిగ్గా అపుడు మొదలయ్యాయి హాలీవుడ్ ఎన్నడూ ఎదుర్కొనని కష్టాలు.

వివాదాలు
ఇటాలియన్ అమెరికన్ సివిల్ రైట్స్ లీగ్ అధ్యక్షుడిగా  నిజజీవితంలో మాఫియా బాస్ అయిన జో కొలొంబో చలామణీ అవుతూ తన కార్యకలాపాలను కొనసాగించేవాడు. గాడ్‌ఫాదర్ సినిమా వల్ల మాఫియా గురించిన నిజానిజాలు ప్రజలకు తెలిసి తమ ప్రతిష్ట దెబ్బతింటుందని భావించి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కాకుండా అడ్డుకోవడం మొదలుపెట్టాడు.

చిత్రీకరణ స్టూడియోలో లేదా న్యూయార్క్ తప్ప మరేదయినా నగరంలో జరిపించడం ద్వారా ఖర్చు తగ్గించుకొని వివాదాలకు దూరంగా ఉండాలని పారామవుంట్ అధినేతలు ప్రతిపాదించగా కొప్పాలా అందుకు ఒప్పుకొనలేదు. ‘లిటిల్ ఇటలీ’ గా పిలువబడే న్యూయార్క్ లోని ఇటాలియన్లు నివశించే ప్రాంతంలోనే తీయాలని కొప్పాలా పట్టుబట్టాడు.

అమెరికాలో మాఫియా అన్నదే లేదని, అది కేవలం ఇటలీలో ఉన్నదని, అందుకు విరుద్ధంగా ఇటాలియన్ అమెరికన్లను మాఫియా మనుషులుగా చూపించరాదంటూ న్యూయార్క్ లోని ఇటాలియన్ అమెరికన్లు నిరసన ప్రదర్శనలు జరపడం ప్రారంభించారు.  . 3000 మైళ్ళ దూరంలో ఉన్న హాలీవుడ్‌లో కూడా మాఫియా తన ప్రభావాన్ని చూపసాగింది. నిర్మాత అయిన అల్ రడ్డీ ప్రాణాంతక బెదిరింపులు ఎదుర్కొన్నాడు.  బెదిరింపులను లెక్క చేయని అల్ రడ్డీ న్యూయార్కుకు వచ్చాడు.

న్యూయార్క్ లో పారామౌంట్ స్టూడియో యాజమాన్య సంస్థ అయిన గల్ఫ్ అండ్ వెస్టర్న్ కంపెనీలో తమ ఆఫీసు ఏర్పరుచుకొని షూటింగ్ సన్నాహాలు మొదలు పెట్టారు. ఇది తెలిసిన మాఫియా సభ్యులు గల్ఫ్ అండ్  వెస్టర్న్ భవనాన్ని బాంబు పెట్టి పేల్చి వేస్తామని బెదిరింపులు పంపారు.  అప్పటివరకు తమ దుకాణాల దగ్గర, ఇళ్ళ దగ్గర షూటింగ్ జరుపుకోవడానికి ఒప్పుకున్న లిటిల్ ఇటలీ స్థానికులను మాఫియా బెదిరించి బలవంతపు వసూళ్ళు చేయడంతో భయపడి తమ ప్రాంతంలో షూటింగ్ జరగడానికి ఒప్పుకోలేదు. మాఫియా బాస్ అయిన జో కొలొంబో కనుసన్నల్లో మెలిగే కార్మిక సంఘాలు ఏవీ షూటింగుకు సహకరించలేదు. విధిలేని పరిస్థితుల్లో జో కొలొంబోను కలుసుకోవడానికి అల్ రడ్డీ ఒప్పుకున్నాడు. కేవలం కొద్దిమంది మాఫియా వ్యక్తులు ఉంటారనుకున్న అల్ రడ్డీ సుమారు 600 మంది మాఫియా వ్యక్తుల ముందు ఈ సినిమా ఇటాలియన్ అమెరికన్లను కించపరిచేది కాదని వివరణ ఇచ్చాడు. చివరికి సినిమాలో ఎక్కడా ‘ మాఫియా ‘ అనే పదం వుండకూడదు అన్న నిబంధనతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది.

కొసమెరుపు: అప్పటికే పూర్తి అయిన గాడ్‌ఫాదర్ స్క్రిప్ట్ లో కేవలం ఒకే ఒక్కచోట ‘మాఫియా’ అన్న పదం ఉండేది.

చిత్రీకరణ
పూర్తిగా మాఫియా నాయకుల ఆధీనంలో ఉన్న న్యూయార్క్ లోని లిటిల్ ఇటలీలో దుకాణాలు, ఇళ్ళు, బార్లలో షూటింగ్ జరిపినందుకు వాటి యజమానులకు  డబ్బు చెల్లించాలని నిబంధ పెట్టారు. అది మొత్తం మాఫియాకే వెళ్ళేది. ఇంతలో పత్రికల్లో ‘మాఫియాతో చేతులు కలిపిన హాలీవుడ్’ అని పతాక శీర్షికల్లో రావడంతో పారామౌంట్ స్టూడియో యాజమాన్య సంస్థ అయిన గల్ఫ్ అండ్ వెస్టర్న్ షేర్లు గణనీయంగా పడిపోయాయి. మాఫియాతో సయోధ్య కుదిర్చుకున్న అల్ రడ్డీని నిర్మాతగా తొలగించారు. లిటిల్ ఇటలీలో మాఫియాను ఒప్పించి చిత్రీకరణ జరిపించగల ఏకైక వ్యక్తి అల్ రడ్డీ అంటూ దర్శకుడు కొప్పాలా స్టూడియో అధినేతలకు నచ్చజెప్పి అల్ రడ్డీని మళ్ళీ బరిలోకి తీసుకొచ్చాడు.

షూటింగ్ మూడు రోజులు సవ్యంగా సాగింది.  పారామౌంట్ అధినేతలు ఆ మూడురోజులు తీసిన సీన్లు తెప్పించుకొని చూసి నిరాశచెందారు. గాడ్‌ఫాదర్‌ను పరిచయం చేసే సీన్ చూసి మాఫియా డాన్ ఇలా ఇతరులకు మంచిచేయడమేమిటని, ఇలాంటివి ప్రేక్షకులకు నచ్చవని పెదవి విరిచారు.

స్టూడియో అధిపతులకు మొదటినుండి నచ్చని అంశాలు రెండు. ఒకటి: ముఖ్యపాత్రలో అల్ పచినోను ఎంపిక చేయడం.  అల్ పచినో పొట్టివాడు కనుక ఈ పాత్రకు తీసుకోవద్దు అన్నారు. పైగా అల్ పచినో గురించి ఎవరికీ తెలియదు, అల్ పచినో నటించిన సినిమాలేవీ అప్పటికి విజయం సాధించలేదు. దర్శకుడు కొప్పాలా మాత్రం ఇందుకు ఒప్పుకొనలేదు. తాను మైఖేల్ పాత్ర గురించి చదువుతున్నపుడే అల్ పచినో తన కళ్ళముందు కదాలాడాడని, ఆ పాత్రకు అల్ పచినోను తీసుకోకపోతే దర్శకత్వం నుండి తప్పుకుంటానని ఖచ్చితంగా చెప్పాడు.

రెండవ అంశం: విటో కోర్లియోన్ పాత్రకు మార్లాన్ బ్రాండోను తీసుకోవడం. ఒకప్పటి హాలీవుడ్ యువరాజు అయిన బ్రాండో 1970 నాటికి పరాజయాల బాటలో ఉన్నాడు. బ్రాండో నటించిన చిత్రాలేవీ విజయం సాధించలేదు. వీటికి తోడు బ్రాండో వ్యక్తిగతంగా పలు సమస్యలతో సతమతవుతు, షూటింగులకు సరిగా వచ్చేవాడు కాదు. అప్పటికే బ్రాండోతో తాము పడ్డ పాట్లవల్ల స్టూడియో అధినేతలు గాడ్‌ఫాదర్ పాత్రకు బ్రాండోను కాదన్నారు. కొప్పాలా బ్రతిమాలుకొనగా బ్రాండో కూడా స్క్రీన్ టెస్ట్ తీసుకోవాలని, ఎటువంటి ఇబ్బందులు కలుగచేయనని ఒప్పందం పైన సంతకం చేయాలని షరతు పెట్టారు. కొప్పాలా అన్నీటికి ఒప్పుకొని బ్రాండోను ఒప్పించాడు.  (బ్రాండో ఎంపిక గురించి ఈ వీడియో చూడండి)

సినిమా షూటింగ్ జరుగుతున్నపుడు మాఫియా బాస్‌లు, వారి అనుచరులు వచ్చి ఆసక్తిగా చూసేవారు. తమను కించపరిచే విధంగా లేకపోవడంతో సంతోషించి పూర్తి సహకారం అందించేవారు. కొందరు తమ అనుచరులను సినిమాలో ఎక్‌స్ట్రాలుగా సినిమాలో చూపించమనేవారు. గాడ్‌ఫాదర్ ప్రధాన అనుచరుడయిన లూకా బ్రాసీ పాత్ర పోషించిన వ్యక్తి నిజజీవితంలో ఒక మాఫియా బాస్‌కు అంగరక్షకుడు. మాఫియా జీవితానికి స్వస్తి చెప్పి మరేదయినా వృత్తి చూసుకోవాలనుకొని తన బాస్ సిఫార్సుతో ఈ సినిమాలో స్థానం సంపాదించాడు.

విడుదల
ఎన్నో సమస్యలను ఎదుర్కొని చివరకు పూర్తి అయిన గాడ్‌ఫాదర్ విడుదలయి అమెరికా అంతటా సంచలనం సృష్టించింది. ఈ సినిమా ప్రీమియర్‌కు తమను ఆహ్వానించలేదని మాఫియా ఆగ్రహించడంతో వారికోసం ప్రత్యేక షో వేయవలసి వచ్చింది. ఈ సినిమా మాఫియా సభ్యులకు ఎంత నచ్చినదంటే, ఆ థియేటర్లోని ప్రొజెక్టర్ ఆపరేటర్‌కు 1000 డాలర్లు బహుమతిని మాఫియా సభ్యులు ఇచ్చారు. బయట వచ్చిన మాఫియా సభ్యులు పరస్పర కౌగిలింతలతో, గౌరవసూచకమయిన చేతిని ముద్దాడడంతో తమ ఆనందాన్ని చాటుకున్నారు. గాడ్‌ఫాదర్ సినిమా తమను ఉన్నతులుగా చూపించిందని మురిసిపోయారు. కొన్నాళ్ళకు గాడ్‌ఫాదర్ థీం మ్యూజిక్ మాఫియా సామ్రాజ్యానికి జాతీయ గీతం అయింది!!

ఈ వ్యాసానికి ఆధారమయిన డాక్యుమెంటరీ:  http://www.youtube.com/watch?v=10y660MxKsk

–జీడిపప్పు

13 Comments
 1. ప్రపుల్ల January 9, 2009 /
 2. ceenu January 9, 2009 /
 3. shree January 9, 2009 /
 4. Satya SKJ January 9, 2009 /
  • చందు January 16, 2009 /
 5. నిషిగంధ January 9, 2009 /
  • చందు January 16, 2009 /
  • చందు January 16, 2009 /
 6. Srinivas January 15, 2009 /