Menu

డోంజోకో (1957)

అకీరా కురోసావా దర్శకత్వం వహించిన చిత్రం ఇది.

కథ విషయానికి వస్తే: ఒక మురికివాడలో ఒక యజమానురాలు తన పాడుబడిన గదిని అద్దెకు ఇస్తుంటుంది. అందులో కూలి పని చేసుకొనే తాగుబోతులు, జూదగాళ్ళు, వ్యభిచారిణి, దొంగ, జీవితంలో అన్ని కోల్పోయినవారు కొందరు ఉంటారు. కొత్తవారు వస్తూ పోతుంటారు.దొంగకు (తొషిరో మిఫునె) దొంగతనాలు చేయడానికి, విడిపించడానికి యజమాని అండదండలు ఉంటాయి. యజమానురాలు తన భర్త ముసలివాడు కావడంతో దొంగతో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. దొంగకు ఆమె అంటే ఇష్టం లేకపోయినా అవసరం ఉంటుంది. దొంగకు ఆ గదిలో ఒక ప్రత్యేకమయిన చిన్న గది ఉంటుంది. మిగిలిన వాళ్ళు డబ్బులున్నపుడు కల్లు తాగుతూ, జూదమాడుతు గతాన్ని గురించి చెప్పుకుంటూ ఉంటారు.

యజమానురాలికి ఒక చెల్లెలు ఉంటుంది. పేరు ఒకాయో, చాలా మంచిది, అందరికీ ఆమె అంటే ఇష్టం. ఒకాయో ఒక ముసలాయనను ఆ గదికి తీసుకొచ్చి అతడు కొద్ది రోజులు అక్కడే ఉంటాడు అని చెప్తుంది.  ఆ ముసలాయన తన మంచితనంతో, మాటలతో కొద్దిసేపట్లో అందరినీ ఆకట్టుకుంటాడు. అలాంటి దుర్భర జీవితాన్ని వదిలి మంచి జీవితాన్ని గడపడానికి అవకాశాలున్నాయని చెప్తాడు. దొంగ తన చెల్లిని ప్రేమిస్తున్నాడని తెలిసిన యజమానురాలు అతడితో తన భర్తను చంపమని, తర్వాత తామిరువురు పెళ్ళి చేసుకోవచ్చు అని చెప్పి వెళ్ళిపోతుంది. చాటున అది విన్న ముసలాయన ఆమె కేవలం దొంగను జైలుకు పంపించాలనే అలా చెప్పిందని వివరిస్తాడు. దొంగతనం మాని కష్టపడి పని చేసుకోమని చెప్తాడు.

దొంగకు మొదటినుండి ఒకాయోఅంటే ప్రేమ ఉంటుంది. కానీ ఒకాయోకు ఇతడు దొంగ అని నచ్చడు. ముసలాయన మాటలతో తాను చేస్తున్న తప్పు తెలుసుకొని దొంగ ఆ జీవితానికి స్వస్తి చెప్పి ఒకాయోను పెళ్ళి చేసుకుంటానని అంటాడు. ముసలాయన దొంగ మాటల్లోని నిజాయితీని ఒకాయో చెప్పి, తన అక్క, బావ పెట్టే బాధలు తప్పించుకోవడానికి దొంగను పెళ్ళి చేసుకొని ఎక్కడికయినా వెళ్ళి హాయిగా బ్రతకమంటాడు. ఆమె అందుకు వప్పుకొంటుంది.  కొద్ది సేపటికి యజమానురాలు ఆమె భర్త కలసి ఒకాయోని కొట్టడం మొదలుపెడితే అందరూ అడ్డుకుంటారు. దొంగ చేయి చేసుకోవడంతో యజమాని మరణిస్తాడు.

దొంగకు ఏమి చేయాలో తోచక  యజమానురాలే తనను యజమానిని చంపమందని చెప్తాడు. అది చూసిన ఒకాయో తన అక్క, దొంగ కలసి తనను కూడా చంపడానికి కుట్ర పన్నారు అనుకుంటుంది.  ఇవన్నీ చూసిన ముసలాయన అక్కడ నుండి వెళ్ళిపోతాడు. చివరగా  ఆ గదిలో తమతో పాటే చాలా రోజులు ఉన్న ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసినా, అందరూ తాగుతూ పాటలు పాడుకుంటూ కాలం గడుపుతారు.

***********************

కొందరికి ఒక కథాంశం పైన సినిమా తీయాలని చాలా కోరిక ఉన్నా అవకాశం రాక తీయలేకపోయి ఉండవచ్చు. కొద్ది కాలానికి బాగా పేరు తెచ్చుకున్న తర్వాత ఆ కోరిక తీర్చుకుంటారేమో. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే Rashômon , Seven Samurai, తీసిన తర్వాత ఈ సినిమా వచ్చిందన్న విషయం, ఇందులో కూడా తోషిరో మిఫునే ఉండడం తెలుసుకొని కాస్త ఎక్కువ ఆశతోనే ఈ సినిమా చూసాను. కానీ ఈ సినిమా ఆ స్థాయిలో లేదు.  అప్పటికే గొప్ప గొప్ప విజయాలు సొంతం చేసుకొని ఉన్నా ఇలాంటి సినిమా తీయడానికిగల కారణం బహుశా అకీరా కురోసావాకు ఇది డ్రీం ప్రాజెక్ట్ ఏమో!! తొషిరో మిఫునె మొహమాటం కొద్దీ అకీరా కురోసావాను కాదనలేక దొంగ పాత్ర చేసాడేమో అనిపిస్తుంది, అంత చిన్న మరియు ప్రాధాన్యత లేని  పాత్రలో చూస్తే.

నచ్చని విషయం:

చివరలో ‘ ఏదో జరుగుతుంది, సుఖాంతమయినా దుఃఖాంతమయినా ‘ అనుకున్నా కానీ, దాదాపు ఒక కొలిక్కి తీసుకొస్తున్నట్టే ఆశ పెట్టి మళ్ళీ అసంపూర్తిగా వదిలేసాడు. బహుశా ‘ కొందరి జీవితాలు ఇంతే ‘ అని చెప్పడానికే కావచ్చు.

నచ్చిన అంశాలు:

  • ప్రారంభంలో ఒక్కొక్కటి దాదాపు 30 నిమిషాల నిడివి గల రెండు సీన్లు ఎంతో ఆకట్టుకున్నాయి. (12 యాంగ్రీ మెన్ సినిమా మొత్తం ఒకే గదిలో జరిగినా అలా అనిపించలేదు.) అత్యంత దయనీయ స్థితిలో బ్రతుకుతున్న వారి జీవితాలను ఒకే గదిలో చూపుతూ ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేయడం అకీరా కురోసావాకే చెల్లింది
  • వృద్దుడి పాత్ర – ఈ ఒక్క పాత్ర కోసం ఈ సినిమా చూడవచ్చు. ఎవ్వరూ పట్టించుకోని చేతిపనివాడి భార్య తో ‘ఏమీ భయపడకు, నువ్వు కొద్ది సేపట్లో చనిపోతావు ‘ అంటూ ధైర్యం చెప్పే సీన్ ఎంతో నచ్చింది.
  • కేవలం ఆ గది, గది బయట మాత్రమే దాదాపు మొత్తం కథ జరగడం (దీనినే స్క్రిప్ట్ అంటారు అనుకుంటా తెలుగు దర్శకులారా!)

మీరు అకీరా కురోసావా అభిమాని అయితే తప్పక చూడవలసిన చిత్రం. అకీరా కురోసావా పరిచయ చిత్రంగా మాత్రం దీనిని ఎవరికీ సూచించకండి!

–జీడిపప్పు

4 Comments
  1. shree January 2, 2009 /