Menu

చక్రపాణీయం

చక్రపాణీయం-ఒక పరిచయం

నూతనసంవత్శరం లో నవతరంగం పాఠకులకు ఒక అపురూపమైన కానుకను అందిస్తున్నాము.బహుముఖప్రజ్ఞాశాలి ‘చక్కన్న’గా అందరికీ చిరపరచితులైన దివంగతచక్రపాణి గారి ఆప్తులు,సన్నిహితులు,అభిమానులు,ఇలా ఎందరో తమతమ జ్ఞాపకాల దొంతరలను అపురూపంగా అందించిన ’చక్రపాణీయం’ నుంచి వ్యాసాలు ఇకపై నవతరంగంలో.

చక్రపాణీయం’ శ్రీచక్రపాణి స్మృతిసంపుటిని చక్రపాణి-కొలసాని ఫౌండేషన్,4-22-27,ఐతానగరం, తెనాలి522 201వారు మార్చి,1997న ప్రచురించారు. సుప్రసిద్ధ పత్రికాసంపాదకుడు,అనువాదకుడు, స్క్ర్రీన్ ప్లే రచయిత,చలనచిత్రనిర్మాత,దర్శకుడు,విమర్శకుడు,మహామేధావి చక్రపాణి స్మృతిసంపుటి కి సంపాదకత్వం వహించినవారు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య, పిహెచ్.డి. వారు ఈ గ్రంధప్రారంభం లోనే The Great గురించి చెప్తూ ఇలా పేర్కొన్నారు.

Three things are necessary to make everyman great, every nation great

 • Conviction of the powers of the goodness.
 • Absense of jealousy and suspicion
 • Helping all who are trying to be and do good.

చక్రపాణీయం నుంచి ఎంపికచేసిన కొన్ని వ్యాసాలను నవతరంగం పాఠకులకు అందిస్తున్నాము. చక్రపాణి గారిపట్ల మా అభిమానాన్ని ఇలా వ్యాసాల ప్రచురణరూపములో ప్రకటించుకుంటామన్న మా అభ్యర్ధనను సహృదయంతో మన్నించిన పెద్దలు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారి రుణం తీర్చలేనిది. మేము కోరిన వెంటనే చక్రపాణీయం పుస్తకాన్ని పంపిన సుజాత(మనసులో మాట)గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

*********************************

ఇది చక్రపాణీయం
 • ఒక సామాన్యరైతు కుటుంబంలో,ఒక చిన్న గ్రామం లో జన్మించి తగినంతపాఠశాల విద్య సంపాదించలేకపోయినా స్వయంవిద్య,స్వయం కృషి చేత నాలుగైదు భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు.
 • కష్టపడితే ఫలితం ఉంటుంది అనే ప్రాధమిక సూత్రాన్ని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి చక్రపాణి గారు.
 • తనదైన ఒకప్రత్యేకపు తెలుగునుడికారంతో శరత్ బాబు బెంగాలీనవలను అనువాదం చేసి శరత్ ను తెలుగునవలారచయితే అనేట్లు,తను బెంగాలీ కుటుంబాలతో ఉన్నట్లు భ్రమింపజేశారు.ఆయన కలకత్తా చూడలేదు.
 • యువ,సంచారి,ఆంధ్రజ్యోతి,చందమామ మొ.మాసపత్రికలు ఉన్నతప్రమాణాలతో ప్రచురించి తెలుగుదేశములో పఠనాసక్తిని పెంచారు.
 • చందమామ ఈ రోజు పన్నెండుభారతీయభాషల్లో అపూర్వమైన రీతిలో ప్రచురించబడటానికి చక్రపాణి గారు వేసిన బలమైన పునాదులే కారణం.
 • యువ ప్రచురణల ద్వారా చౌకధరలకు ఉత్తమసాహిత్యాన్ని అందించి ప్రజానీకం లో సాహిత్య విలువలను పెంచారు.
 • పత్రికలలో ఎన్నో కధలు రాసారు,ధర్మపత్ని,స్వర్గసీమ,షావుకారు,మిస్సమ్మ,పెళ్ళిచేసిచూడు మొ.చిత్రాలకు కధలు రాసారు.వారు సృష్టించిన ప్రతిపాత్ర్ర,కలం నుండి వెలువడిన ప్రతీమాట తెలుగువారి నిత్య జీవితం నుండి వచ్చినవే.వ్యంగ్యం,హాస్యం ఆయనకు ఎంతో ఇష్టం.
 • జాతక కధలలో బోధిసత్వుని అంశ ఆయనది.ఏది చెప్పినా బోధించినట్లు ఉండదు.చిన్న మామూలు గ్రామీణ పలుకుల్లోనే అతి సూక్షంగా చెప్పటం మాత్రమే, గ్రహించడం ఇవతలి వారి వంతు,ఇది వారి ధోరణి.
 • “నీవిచ్చిన ధనరుణాన్ని తీర్చినా,దయారుణాన్ని ఎలా తీర్చగలను అని గుండె లోతులను తెరిచిన భావశబలత వారిది.
 • చక్రపాణి గ్రహణశక్తి అపారం.ఏ కొత్తరంగంలో ప్రవేశపెట్టినా అంకితభావం తో కృషి చేసి దాని పారమ్యం చూసారు.
 • ఆయనకు అరమరికలు,దాపరికాలు తెలియవు.చెప్పదలుచుకుంది కుండ బద్దలు కొట్టినట్లు చెబుతారు.ఇతర్లు ఏమనుకుంటారనే భావం వారికి ఏకోశానా లేదు.
 • ఏమాత్రం భేషజాలు లేని అమృతహృదయుడాయన.అనూహ్యమైన మనస్తత్వంగల విలక్షణమైన మనీషి చక్రపాణి గారు.
 • కనకనేప్రెస్ ఇంటర్వ్యూలు,పత్రిక ప్రకటనలు,సన్మానాలు,సత్కారాలు,అభిమాన సంఘాలు వారికి గిట్టవు.వారిదో వింత ప్రవృత్తి.
 • తనలో రుగ్మతలు,బాధలూ,క్లేశాలు ఎన్నో ఉన్నా అన్నీ తనలోనే దాచుకుని లోకానికి చల్లని ప్రశాంతమైన చిరునవ్వులను ప్రసాదించిన స్తితప్రజ్ఞుడు చక్రపాణి.
 • తనతో పని చేసేవారికి  ఏమాత్రం యిబ్బంది కలిగినా వారింటికి వెళ్ళి పలకరించి,భుజం తట్టి,అవసరమైన సాయం అడక్కుండానేవెంటనే చేసే దయార్ద్ర  హృదయం వారిది.
 • అలాగే క్రమశిక్షణ విషయం లో వారిది వజ్రాఘాతం.ఉత్తర్వులు ఉల్లంఘిస్తే ఎంత గొప్పవాడినైనా స్పేర్ చేసే సమస్య లేదు.
 • ఆయనతో మాట్లాడుతూ ఉంటే పదేళ్ళబాలుడు డెబ్బయ్ ఏళ్ళ వృద్ధుడూ కనిపించేవారు.వారిని అర్ధం చేసుకోవడం కొద్ది మందికే సాధ్యం.
 • చిత్ర నిర్మాణంలో చక్రపాణి గారిదొక ప్రత్యేకమైన బాణి.అందు వారికి పరిచయం లేని శాఖ లేదు.
 • “మనం చేసేది జనం చూడాలి”అనే తత్వం కాదు,”జనం కోరేది మనం చేయాలి”అనే ధోరణి వారిది.
 • “మెసేజ్ ఇవ్వటానికి టెలీగ్రామ్ ఇస్తే పోలా”అంటూ సినిమాలు హాయిగా చూడ్డానికి వీలుగా ఉండాలనే తత్వం వారిది.
 • తన చిత్రం విడుదలయిన వారానికే పరాజయం పొందితే”నూర్రోజులు ఆడిన చిత్రం” అంటూ పోస్టర్ వేసి,క్రింద చిన్న అక్షరాలతో”తొంభయ్ మూడు రోజుల క్రింద విడుదలై యుంటే” అని పరాజయాన్ని ఆనందంగా అంగీకరించిన చమత్కారి చక్రపాణి.
 • ఒక సారి ఆయన విజయరహస్యమేమిటని పాత్రికేయుడు అడిగితే,”విజయమా పాడా !నేనెక్కువ చదువుకున్న వాడిని కాదు,చదివిన వాళ్ళు చెప్పేది జీర్ణించుకోగలను,మంచిని చెడు నుంచి విడదీసుకోగలను.సర్వసామాన్యమైన నాకు నచ్చేవి,నాపాఠకులకు,నాప్రేక్షకులకు నచ్చుతుందనే నా నమ్మకం.వాళ్ళు నాలాంటి సామాన్యులే గదా”అన్నారు.అదే వారి విజయరహస్యం.
 • పత్రిక సర్క్యులేషన్ ఒకసారి తగ్గితే మరలా పెరిగే అవకాశం లేదనే వారు.
 • ఏపని చేసినా చిత్తశుద్ధితో చేయాలనేది వారి ఆకాంక్ష.
 • చక్రపాణి పోయాక వారి విజయానికేతనం వెలవెల పొయింది.క్రమంగా క్రిందకు దిగిపోయింది.
 • అంతటి సునిశిత మేధాశక్తి, కార్యదీక్ష,సూక్ష్మ గ్రాహ్యత,మనస్తత్వం కల వ్యక్తి ఈతరంలో ఉన్నారా అనేది సందేహమే.
 • “కింగ్ సైజ్ సిగిరెట్టులా షొగ్గా పొడుగ్గా,ఆప్తమిత్రుల అభిప్రాయభేదంలా సక్కగా,నాజూగ్గా ఉండే విజయరధసారది చక్రపాణి” మరిలేరు
 • సాహిత్యం,పత్రిక,సినిమారంగాలలో దుర్నీక్షభాస్కరునిగా ప్రకాశించిన ధృవతారగా నిలిచిపోయిన చక్రపాణి గారిని మరలా చూడం.
 • చెప్పదలుచుకుంది ఠకీమని చెపి ముక్కు సూటిగా నడిచేవారు కనిపించటం  మహాఅరుదు.
 • కానీ,పత్రిక,సినిమారంగాలలో వారు పెట్టిన ఒరవడి,నిలబెట్టిన విలువలు,సాధించిన విజయాలు వారందంచిన సంస్కృతి విజయపరంపర,తరతరాలుగా ఉంటాయి.
 • సాధించే విజయాల మధ్య మహత్తులు జిత్తులు లేవని,కేవలం కష్టించి పనిచెయ్యడమేనని ఒక మహత్తర జీవితసత్యాన్ని ముందు తరాలకు అందించిన మహనీయుడాయన.
 • వారు కారణజన్ములు,చిరస్మరణీయులు,అన్నిటినీ మించి మహామనిషి.
 • వారికిదే మా శ్రద్ధాంజలి

–సంపాదకుడు

****************************

ఇలా ప్రారంభమయ్యింది నా జీవితం

నాకు బి.ఎన్.రెడ్డిగారితో వ్యక్తిగతమైన పరిచయం ఏర్పడక ముందు నేను మద్రాసులొ ఉన్నానని తెలిసి,మిత్రులు కె.వి.రెడ్డిగారి ద్వారా స్వర్గసీమ చిత్రం ఇతివృత్తం చెప్పి నన్ను వ్రాయమన్నారు.నాకు చిత్రకధ ఎలా వ్రాయాలో తెలియదన్నాను. ‘అదంతా మేము చూసుకుంటాం,నువ్వు వ్రాయి’ అన్నారు.

ఇది 1943 జులైలో జరిగింది.1944 జనవరిలో కధ పూర్తి చేసి నేను వెళ్ళిపోతానన్నాను.‘తెనాలి వెళ్ళి ఏం చేస్తావు?పుస్తకాలు వెయ్యటమే కదా,ఇక్కడే లాడ్జ్ లో ఉండొచ్చు.బి.యన్.కె ప్రెస్ లో పుస్తకాలు వేసుకోవచ్చు’అన్నారు.నేను మద్రాసులో ఉండిపొయాను.1944లో నాగిరెడ్డి గారితో పరిచయం బలపడింది.ఆయన అప్పుడు బి.యన్.కె.ప్రెస్ చూస్తుండేవారు.నాగిరెడ్డికి పత్రిక నడపాలన్న ఉత్సాహం ఎంతో ఉండేది.ఆరోజుల్లో బి.యన్,గుప్తా గారు నడుపుతున్న ఆంధ్రజ్యోతి వారపత్రిక ఆగిపొయింది.అది నాగిరెడ్డి సోదరులు తీసుకున్నారు.1945 జులైలో నా సంపాదకత్వం క్రింద ‘ఆంధ్రజ్యోతి’మాసపత్రికగా ప్రారంభమయ్యింది.1945 జులైలో‘చందమామ’మొదలుపెట్టాం.1949 జులై లో నిర్మాతగా సినీ రంగం లో నేను ప్రవేశించడం జరిగింది.

నేను పత్రికా రంగంలో అడుగుపెట్టినప్పుడు,నాకు పత్రికానుభవం ఏమాత్రం లేదు,ఐనా ‘ఆంధ్రజ్యోతి’ప్రముఖరచయితల సహకారంతో ప్రధమశ్రేణి మాసపత్రికగా రూపొందింది.అలాగే సినీరంగం లోకూడా ప్రొడ్యూసర్ గా నాకు ఏవిధమైన అనుభవం లేదు.ఐతే బి.యన్.రెడ్డి.కె.వి.రెడ్డి-యల్.వి.ప్రసాద్ గార్ల వంటి ప్రముఖ దర్శకనిర్మాతల సలహాలద్వారా,వారితో చర్చలద్వారా కొన్ని విషయాలు తెలుసుకోగలిగాను.

-చక్రపాణి

(బి.ఎన్.రెడ్డి అభినందన సంచిక నుండి)

ఈ వ్యాసాలను దగ్గరుండ టైప్ చేయించి నవతరంగంలో ప్రచురించేలా చేస్తున్న రాజేంద్ర కుమార్ గారికి ధన్యవాదాలు

13 Comments
 1. Sowmya January 10, 2009 /
 2. చందు January 10, 2009 /
 3. అతిధి January 11, 2009 /
 4. నెటిజన్ January 12, 2009 /
 5. విజయవర్ధన్ January 12, 2009 /
 6. నెటిజన్ January 15, 2009 /
 7. నెటిజన్ January 15, 2009 /
 8. vinay April 14, 2009 /