Menu

చాందిని చౌక్ టు చైనా (ఛ..ఛా..టు..ఛీ)

గత సంవత్సరం అక్షయ్ కుమార్ నటించిన చిత్రాలన్నీ హిట్టయ్యాయి. అదే వూపులో ప్రతిష్టాత్మకమైన వార్నర్ బ్రదర్స్ తీసిన చిత్రమవటంతో “చా చౌ టు చై” ఎన్నే ఆశలు రేకెత్తించింది. చైనా గోడ స్థాయిలో వున్న అంచనాలకి కనీసం చాందినీ చౌక్ గల్లీ స్థాయికి కూడా చేరలేకపోయింది ఈ చిత్రం. గతంలో అక్షయ్ కుమార్ మంచి యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో కామెడీ చేస్తూ (భూల్ భులయ్యా, హే బేబి వగైరా) అందరినీ అలరించాడు. ఈ రెండిటినీ కలుపుతూ ఒక కామెడీ యాక్షన్ మూవీ చెయ్యాలని ప్రయత్నం జరిగినట్టు అనిపిస్తోంది. ఆ కలపటంలో కూడా హిందీ చైనీస్ కలపటంతో మరింత దెబ్బతిన్నది. చైనా సినిమాలనగానే గురొచ్చే స్థాయిలో ఫైట్లు లేక పోగా మరీ నాసిరకం చైనా సినిమాల్లోలా ఎగరడం లాంటివి ఎక్కువయ్యాయి. ఇంత వివరణ ఎందుకు గాని మచ్చుకి రెండు సీన్లు ఇవిగో:

అక్షయ్ ఒక్కడే వుంటాడు. ఒక పాతిక మందిదాకా చైనా ఫైటర్లు. స్లో మోషన్‌లో పరుగెత్తడమేంటి… అమాంతంగా రెండు చేతులతోటి ఇద్దరిని పైకెత్తి గిర గిర ఫానులా తిరుగుతాడు. ఆ గాలికి మిగిలిన ఇరవై మూడు మంది ఎగిరిపోతారు.

మరొకటి:

విలన్ చెంచాగాడొకడు హీరో స్నేహితుడి వెనక చేరి కత్తి పెట్టి బెదిరిస్తుంటాడు. హీరోగారు కాలెత్తి స్నేహితుడి మీద పెట్టి.. గట్టిగా వూపిరి పీల్చి తన శక్తినంతా కాలి గుండా పంపిస్తాడు. ఆ పవర్‌కి స్నేహితుడి వెనకాల వుండే చంచాగాడు గాల్లో ఎగిరిపోతాడు.

అంతేనా..!! ఇందులో మన జేమ్స్ బాండ్ లాగ ఎన్నో వింత వస్తువులున్నాయి – గొడుగు కం బుల్లెట్‌ప్రూఫ్ కం పారాచూట్: అదికూడా ఒక్కరిని కాదు ఏకంగా ఇద్దర్ని ఒక పాట అయిపోయెవరకు గాల్లో తిప్పగలిగిన గొడుగు. డాన్సింగ్ పట్టీలు: ఇవి కాళ్ళకి కట్టుకోని బటన్ నొక్కితే మీకు వచ్చినా రాకపోయినా డాన్స్ వేసేస్తారు అది భాంగ్రా అయినా డిస్కో అయినా..

ఇంకా టోపీ కత్తి, ముద్దు పెట్టి చంపటానికి లిప్స్టిక్ విషం ఇలాగన్న మాట.ఆ రకంగా చిన్న పిల్లలకి ఈ సినిమా ఫర్లేదనిపించచ్చు. కొన్ని చోట్ల చేసిన వెకిలి కామెడీ ఇది పూర్తి పిల్లల చిత్రం కూడా కాకుండా చేసింది.

ఇంత చెప్పినా కథ ఏమిటనే సాహసికులకోసం:

అనగననగా డిల్లీలో చాందినీ చౌక్ అనే ప్రాంతంలో అనాధ సిద్దు (అక్షయ్), దాదా (మిథున్ చక్రవర్తి) హోటల్లో పిండి పిసకటం కూరలు తరగటం లాంటి పనులు చేస్తుంటాడు. అదృష్టం తనని వరించాలని సిద్దూ చేసే ప్రయత్నాలన్నీ వికటిస్తుంటాయి. దాదా ఇలా జరిగిన ప్రతిసారి సిద్దుని గాల్లోకి లేపి లేపి కొడతాడు. సిద్దూ టాం అండ్ జెర్రీ లాగా ఒక ముప్పై ఇరవై కిలోమీటర్లు పైకి ఎగిరి పడుతుంటాడు. (మరి ముందు ముందు చైనాలో ఫైట్లు చెయ్యాలంటే ఇలాగే ఎగరాలి కదా). అక్కడ చైనాలో ఒక వూరి ప్రజలు తమని హోజో (గోర్డన్ ల్యూ) నుంచి కాపాడటానికి చారిత్రాత్మక యోధుడు లే షాంగ్ మళ్ళీ పుట్టాడని, అతను ఫలాన ఫలాన అడ్రస్‌లో వుంటాడని తెలుసుకుంటారు. ఇంకేముంది వాళ్ళు రావటం, సిద్దూ స్నేహితుడు (రణ్వీర్ షెరోయ్) చేసే మోసం చెయ్యటం వల్ల మనవాడు చైనా చేరుకుంటాడు.

అక్కడ డబలాక్షన్ హీరోయిన్‌లు సకి, మ్యావ్ మ్యావ్ (దీపిక)లతో కొంచెం తికమక పడటం, విలన్ చేతిలో భంగ పడటం అ తరువాత జరిగే సంఘటనలో తండ్రి లాంటి దాదా హోజో చేతిలో మరణించడం అన్నీ చక చకా జరిగిపోతాయి. సిద్దూ పగ తీర్చుకోవడానికి యాదృశ్చికంగా ఒక గురువు కూడా దొరుకుతాడు. ఆ గురువు ఎవరు? అతని సహాయంతో ఒక్క పాటలో ఎలా కుంఫూ నేర్చుకున్నాడు? ఈ ఇద్దరు హీరోయిన్లెవరు? లాంటి రొటీన్ ప్రశ్నలకే కాక చాందినీ చౌక్‌లో సిద్దూ నేర్చుకున్న విద్యలు క్లైమాక్స్ ఫైట్‌కి ఎలా వుపయోగ పడ్డాయనేది చెప్తే బాగుండదు. (చూస్తే కూడా బాగుండదు కాని…). ఈ కథ వింటే కుంగ్ ఫూ పాండా, కుంగ్ ఫూ హసిల్, కిల్ బిల్, ద మమ్మీ: టూంబ్ ఆఫ్ ద డ్రాగన్ ఎంప్రర్ గుర్తుకొస్తే డైరెక్టర్ నిఖిల్ అద్వానీ నే బాధ్యుడు. (చివరి రెండు సినిమాలకి పనిచేసిన స్టంట్ మాస్టరే ఈ చిత్రానికి పనిచేసాడు)

నటన పరంగా మిథున్, రణ్వీర్ దొరికిన పాత్రలకి న్యాయం చేశారు.అక్షయ్,దీపిక ఫర్వాలేదనిపించారు. (చైనా అమ్మాయిగా దీపికని ఎందుకు పెట్టారో అర్థంకాదు. అంత పెద్ద కళ్ళున్న అమ్మాయి చైనాలో పుడితే ఎదో డిఫెక్ట్ అనుకుంటారు). మిగిలినవారు (అంతా చైనీయులే) నటించారోలేదో చెప్పటం చాలా కష్టం.

దర్శకత్వ ప్రతిభలు, కెమరా పనితనాలు గొప్పగా కనిపించిన దాఖలాలు ఏవి లేవు.పాటలలో టైటిల్ సాంగ్ (చాందిని చౌక్ టు చైన) మాత్రమే కొంచెం గుర్తుంటుంది.ప్రఖ్యాత చైనా గోడ పైన తీసిన సీన్లు చూడదగ్గవి. ఇలాంటి అండర్ డాగ్ సినిమాలు చాలానే వచ్చాయి. చాలా వరకు విజయం సాధించాయి కూడా. అయినా ఇలాంటి చిత్రం తీయటం పూర్తిగా దర్శకుడి వైఫల్యమే అనిపిస్తుంది. రెండున్నర గంటల్లో కనీసం రెండు సార్లు చప్పట్లు కొట్టించుకోలేకపోయాడు. అక్షయ్ కుమార్ వేసిన జోకులు ఒక్కటీ నవ్వించకపోగ, యాక్షన్ సీన్లు మరీ సాదా సీదాగా వుండి నిరాశ పరిచాయి. మొత్తమ్మీద కామెడీ చెయ్యటంలో యాక్షన్ మిస్సైంది.యాక్షన్ చెయ్యటంలో కామెడీ మిస్సైంది. వెరసి ఈ సినిమా “న చాందిని చౌక్‌కా న చైనా కా” (రెంటికి చెడిన రేవడ) అయ్యింది.

ఎంతటి దారుణమైన సినిమాలకైనా శుభంకార్డు కనపడి వూరడిస్తుంది. ఈ సినిమా కి అదీ లేదు.. టు బీ కంటిన్యూడ్ అట… ఈ సారి ఆఫ్రికాలో… !!! హత విధీ..!!

బ్యానర్: వార్నర్ బ్రదర్స్
నటీ నటులు: అక్షయ్ కుమార్, మిథున్ చక్రవర్తి, దీపిక పడుకోనే, రణ్‌వీర్
షెరోయ్, గోర్డొన్ లూ, రోగర్ యూయాన్ తదితరులు
దర్శకత్వం: నిఖిల్ అద్వాని
సంగీతం: శంకర్-ఎహసాన్-లాయ్, కైలాష్-పరేష్-నరేష్, బప్పాలహరి-బప్పిలహరి, బొహేమియా
విదుదల తేది: 16 జనవరి 2009

—అరిపిరాల సత్యప్రసాద్

3 Comments
  1. శంకర్ January 17, 2009 /
  2. రామేశబాబు January 19, 2009 /