బాలీవుడ్-2008

bolly2008-lead

కొత్త సంవత్సరం వచ్చి ఇన్నాళ్ళౌతుంది, ఇప్పటిదాకా ఎవరూ నవతరంగంలో 2008 లో తాము చూసిన సినిమాల రౌండప్ రాసినట్లు లేరు. అందుకే నేనే మొదలుపెడుతున్నా :) బాలీవుడ్-08 నా వ్యాసాంశం.

ఈ ఏడాది నేనే మారానో లేక బాలీవుడ్ లోనే వైవిధ్యం ఎక్కువైందో నాకు తెలీదు కానీ, నాకు మాత్రం బాలీవుడ్ నచ్చింది. భిన్న రకాలైన కథా వస్తువులతో సినిమాలొచ్చాయి. మన సినిమాలు ప్రపంచమంతా చూసేంత క్లాసిక్ గా ఉండాలి అన్న దృష్టితో చూస్తే బహుశా నేననే ’బాలీవుడ్ నచ్చింది’ అన్న వాక్యానికి అర్థం ఉండదేమో. కానీ, మన కథల్లోనే మూసల్లోంచి బయటపడే ప్రయత్నాలు చాలా మందే చేశారు. అందులో కొన్ని విదేశీ చిత్రాల ’ప్రేరణ’ తో తీసినవే అయినా కూడా సినిమాల్లోని వైవిధ్యం పరంగా చూస్తే బాలీవుడ్ ప్రేక్షకులకి ఈ సంవత్సరం ఉగాది పచ్చడి వంటిదనే చెప్పాలి. ’ప్రేరణలు’ ప్రేక్షకులకి నచ్చాయి. రీమేక్ సినిమాలను కూడా ఆదరించారు. ఇక్కడ నేను నేను చూసిన సినిమాలలో నచ్చిన వాటి గురించే ప్రస్తావిస్తున్నానని గమనించగలరు. అలాగే నేను చూసిన వరుసలో రాస్తున్నాను తప్పితే, దేన్నీ ’రేట్’ చేయడం లేదని మనవి చేసుకుంటున్నాను.

మొదటగా ’యూ, మీ ఔర్ హమ్’ – అజయ్ దేవగన్ దర్శకుడిగా తొలి ప్రయత్నం. ఈ సినిమా ’51 డేట్స్’ నుండి ప్రేరణ పొందిందని తెలిసిన సంగతే. గత ఏడాదే ఓ తెలుగు సినిమా కూడా వచ్చింది ఈ సినిమా ఆధారంగా -శివాజీ, భూమిక జంటగా. పేరు గుర్తురావట్లేదిప్పుడు. ఈ సినిమా ఆల్జీమర్స్ బారిన పడ్డ ఓ యువతి, ఆమె కుటుంబం కథ. నామటుకైతే ఈ సినిమా నన్ను చాలా కదిలించింది. ఇందులో కూడా అతి నాటకీయత లేకపోలేదు కానీ, అసలు కథను చాలా సున్నితంగా హాండిల్ చేసినట్లు అనిపించింది. అజయ్ దేవగన్ కు దర్శకుడిగా నేను above average మార్కులు వేస్తాను. రీమేక్ అని తెలియగానే సగం ఉత్సాహం నీరుగారిపోతుంది కానీ అయినప్పటికీ ఈ సినిమా నాకు నచ్చిందనే అంటాను.

ఈ సంవత్సరం బాలీవుడ్లో ముంబై కథలు బానే వచ్చాయి. ముంబై ప్రజల జీవితం చుట్టూ అల్లిన ఈ కథల్లో ఒకదానికొకటి సంబంధం లేనంత వైవిధ్యం ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ, అదే సమయంలో అన్నింటినీ కలిపే దారం ఒకటుంది – అదే సామాన్యుడు. ’అమీర్’ సినిమా ఇలాంటివాటిలో ఒకటి. కొత్త దర్శకుడు (రాజ్ కుమార్ గుప్తా), కొత్త హీరో (రాజీవ్ ఖండేల్వాల్), చిన్న బడ్జెట్. ఈ సినిమా చిన్న చిత్రాలకి కొత్త ఊపిరిచ్చింది అనడంలో నాకు సందేహంలేదు. థ్రిల్లర్ గా తీసారు. చూస్తున్నంతసేపూ ఆసక్తికరంగా ఉండింది. తరువాతి సినిమా ’ముంబై మెరీ జాన్’. 2006 ముంబై లోకల్ ట్రైన్ పేలుళ్ళ ఆధారంగా తీసిన సినిమా. ఆ పేలుళ్ళ వల్ల ఓ ఐదుగురు సామాన్యుల జీవితాలెలా రూపాంతరం చెందాయో అన్నది ఈ చిత్ర కథాంశం. దానితో పాటే వివిధ సామాజిక కోణాలని స్పృశిస్తూ, అక్కడక్కడా సున్నితంగానైనా సూటిగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇది కాస్త అటూ ఇటూ అయి ఉంటే డాక్యుమెంటరీ అయిపోయి ఉండేది. ఆ లెక్కన కమర్షియల్ సినిమాగా దీన్ని మలచడంలో దర్శకుడు సఫలీకృతులయ్యారనే నా అభిప్రాయం. ’The wednesday’ ఇలాంటిదే మరో ముంబై సినిమా. తన జీవితాన్ని ప్రతి సారీ అతలాకుతలం చేసే పనుల వల్ల కడుపు మండిన సామాన్యుడు ఏమి చేస్తాడా? అన్న ఊహతో తీసిన చిత్రం ఇది. అయితే, ఇలా నిజజీవితంలో జరగడం ఎంతవరకూ కుదురుతుంది అన్న విషయం పక్కన పెడితే కథా వైవిధ్యం పరంగా ఈ సినిమా జనాదరణ పొందింది.

ఇటీవలి కాలంలో వినయ్ పాథక్ కు ఒక విధమైన ఫాలోయింగ్ వచ్చిందనుకుంటా. అతని సినిమా అనగానే ప్రేక్షకుల్లో కొన్ని ఆంచనాలు నెలకొంటున్నాయి. అలాంటి ఆంచనాలను నిలబెడుతూనే ’దస్విదానియా’ వచ్చింది. ఇది ప్రధానంగా జాపనీస్ సినిమా ’ఇకిరు’, హాలీవుడ్ సినిమాలు ’బకెట్ లిస్ట్’ ’మై లైఫ్ విదవుట్ మీ’ వంటి సినిమాల ప్రేరణలో తీసినది. ఒక సినిమా మనం ఒకపక్క అరే, బాగుందే అనుకుంటున్నప్పుడు, ఈ సినిమాలో మనం వేరే సినిమాలో చూసిన దృశ్యాలు కనబడ్డప్పుడు కలిగే నిరాశ ఈ సినిమాలో కలుగుతుంది కానీ, ఈ సినిమా చూసేవారిని బాగా అకట్టుకుంది. పాథక్ మరో సినిమా ’ఓ మై గాడ్!’ (ఈ సినిమా గురించి నవతరంగం లో వచ్చిన రెండు వ్యాసాలు – ఇక్కడ మరియు ఇక్కడ). కేవలం పందొమ్మిది రోజుల్లో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా దస్విదానియా వచ్చిన కొన్నాళ్ళలోనే వచ్చింది. ముగింపొక్కటి తప్పితే ఈ సినిమా బానే కుదిరింది. దేవుడు ఒక వ్యక్తికి సాయం చేయాలని కోరుకోడం, ఆ వ్యక్తి ప్రతిసారీ ఆ సాయాన్ని స్వీకరించకపోవడం, దేవుడే ’ఓ మై గాడ్!’ అనుకునే పరిస్థితి రావడం ఈ సినిమా ఇతివృత్తం. పాథక్-సౌరభ్ శుక్లాల మధ్య కామెడీ బాగా కుదిరింది.

శ్యాం బెనెగల్ ’వెల్కం టు సజ్జన్‍పూర్’ ఈ సంవత్సరంలో నేను చూసిన మంచి సినిమాల్లో ఒకటి. ఈ సినిమాలో రెండు-రెండున్నర గంటలు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూనే సందేశాన్నివ్వడం నాకు బాగా నచ్చింది. కథా పరంగా కూడా బాగుంది. హాస్యం పాళ్ళు ఏమాత్రం తక్కువకాదు. శ్యాం బెనెగల్ ఇలాంటి సినిమా తీస్తారని నేను ఊహించలేద్, నిజానికి. It was a pleasant surprise. షోనా ఊర్వశి తీసిన ’సాస్ బహూ ఔర్ సెన్సెక్స్’ మరో మంచి సినిమా. చక్కని కథ, కావాల్సినంత హాస్యం, ఒక మోతాదులో సందేశం కలిపి ఉన్న చిత్రం. ఈ సంవత్సరం వచ్చిన అతి ఒరిజినల్ చిత్రాల్లో ఇదొకటిగా నేను భావిస్తాను. చాలారోజులకి ఫరూక్ షేక్ కనిపించడం ఈ సినిమా ప్రత్యేకత. ’రాక్ ఆన్’ గురించి ప్రస్తావన లేకపోతే ఈ జాబితా అసంపూర్ణమే. అంతటా తానై ఫర్హాన్ అఖ్తర్ (నటుడు, గాయకుడు, నిర్మాత) ఈ సినిమాని నడిపించాడు. ఈ ఏడాది పెద్ద హిట్లలో రాక్ ఆన్ ఒకటి అయి ఉండొచ్చు (నాకంత ఆర్థిక వ్యవహారాలు తెలియవు లెండి!)

’ఒయె లక్కీ, లక్కీ ఒయె’ మరో చెప్పుకోదగ్గ సినిమా. ఇది ఒక యదార్థ గాథ ఆధారంగా తీసిన సినిమా అని PFC లో చదివాను. ఆద్యంతం సినిమా ఆసక్తికరంగా ఉండింది. ఇలా అంతా నిజంగా ఎలా జరుగుతుంది? దొంగతనం చేయడం ఇంత తేలికా? అని అనిపిస్తూనే ఉండింది కానీ, PFC లో అసలు కథ చదివాక ఆశ్చర్యానికి అంతులేదు. అది పక్కన పెడితే సినిమాలో ఉన్న సామాజిక కోణం కూడా నాకు నచ్చింది. ఇలాంటి సినిమాలు తరుచూ వస్తూ ఉంటే బాగుంటుంది. నా మటుకు నాకైతే ’సారీ భాయ్’ కూడా బాగా ఎంటర్‍టైనింగ్ గా అనిపించింది. అయితే, ’ద్రోణ’ విపరీతంగా నిరాశపరిచింది. సరిగ్గా తీసుంటే, ఆ సినిమా ప్రచారంలో అన్నట్లు అది భారతీయ లార్డ్ ఆఫ్ ది రింగ్స్, హ్యారీ పాటర్ వంటి సినిమా అని చెప్పుకునే స్థాయికి చేరే ఉండేదేమో. ఈ సినిమా ప్రధాన లోపం గోల్డీ బెల్ దర్శకత్వమే అని ఇప్పటికీ నా నమ్మకం.

మొత్తానికైతే గతేడాది బాలీవుడ్ చిత్రాలు నాకు మన సినిమాలు మూసలో ఉండవిక అన్న ఆశ పుట్టించాయి. అది నిలుస్తుందో లేదో ఈ సంవత్సరం చెప్పాలి.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

సౌమ్య

రచయిత:

4 Comments to “బాలీవుడ్-2008”

  • సూపర్,
    మీరు మొదలుపెట్టారుగా, ఇక మరింత మంది తమ 2008 రౌండప్ రాస్తారేమో చూద్దాం.
    నాకూ రాయాలనే ఉంది. కానీ నాకీమధ్యనే తెలిసిన జీవిత సత్యం ఏంటంటే “మనమనుకున్నవన్నీ చెయ్యలేము”. :-)

  • మీ వ్యాసం బావుంది, కానీ 2008 లొ మీరు చెప్పినంత మంచి సినిమాలు రాలెదు!
    ఏంత సెపు HOLLYWOOD నుంచి COPY+PASTE చేసినవీ!

    >>మొదటగా ’యూ, మీ ఔర్ హమ్’ – అజయ్ దేవగన్ దర్శకుడిగా తొలి ప్రయత్నం. ఈ సినిమా ’51 డేట్స్’ నుండి ప్రేరణ పొందిందని >>తెలిసిన సంగతే. గత ఏడాదే ఓ తెలుగు సినిమా కూడా వచ్చింది ఈ సినిమా ఆధారంగా -శివాజీ, భూమిక జంటగా. పేరు >>గుర్తురావట్లేదిప్పుడు
    ఆ యొక్క దరిద్రపు చిత్రం పేరు — సత్య భామ.

  • Last year meeda takkuve kani ee sari ee movies success ayyayi which was not the case earlier…

  • sowmya miru start chesaru..
    mitrulu marinta deep ga rayaka potharaaaaa.

    mi prayathnaniki abhinanadanalu

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories