Menu

‘ఏనాటిదో ఈ అనుబంధం-బి.నాగిరెడ్డి

‘ఏనాటిదో ఈ అనుబంధం’ -బి.నాగిరెడ్డి (చక్రపాణియం నుంచి)

పి.పుల్లయ్య గారి దర్శకత్వంలో ‘ధర్మపత్ని’ చిత్రాన్ని నిర్మిస్తున్న రోజులవి.ఆ చిత్రానికి సంభాషణలు రాయడానికి ఒక రచయితను పిలిపించారు.ఐతే ఆ రచయిత రాసిన సంభాషణలు దర్శకుడికి అంత సంతృప్తికరంగా అనిపించక ‘చందమామ’ రామారావుగారు తెనాలి నుంచి చక్రపాణిగారిని రప్పించారు.మళ్ళీ,సంభాషణలు రాయించడానికి. ‘ధర్మపత్ని’ చిత్రానికి చక్రపాణిగారు సంభాషణలు సంతృప్తికరంగా ఉండటంతో వాహినీ వారి ‘స్వర్గసీమ’చిత్రానికి కూడా ఆయనచేతనే సంభాషణలు రాయించడం జరిగింది.అప్పటినుంచి అంటే 1943 నుంచి మా సంస్థకీ చక్రపాణిగారికీ అలా అనుబంధం ఏర్పడింది.

చక్రపాణిగారి అసలు పేరు ఎ.వి.సుబ్బారావు.ఆయనకు తెలుగు,తమిళం,హిందీ,బెంగాలీ భాషలు క్షుణ్ణంగా తెలుసు.అసలు ఆయన బెంగాలీ భాష నేర్చుకోవడమే చాలా విచిత్రంగా జరిగింది.అదెలాగంటే,ఆయన టి.బి చికిత్శ నిమిత్తం మదనపల్లెలోని ‘ఆరోగ్యవరం’హాస్పిటల్ లో చేరారు.అక్కడ ఆయన పక్కబెడ్ లొని పేషెంట్ ఒక బెంగాలీ వ్యక్తి చికిత్స నిమిత్తం మూడుమాసాలపాటు ఆ ఆసుపత్రిలో వున్న చక్రపాణిగారు ఆ వ్యక్తితో పరిచయం పెంచుకుని,ఆయన వద్దే బెంగాలీ భాష మాట్లాడడం,రాయడం,చదవడం నేర్చుకున్నారు.ఆ తర్వాత సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటర్జీ గారి నవలలను తెలుగుభాషలోకి అనువదించే స్థాయికి చేరుకున్నారు.ఏదైనా నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు,ఎట్టి పరిస్థితులలోనైనా ఎలాంటివారైనా నేర్చుకోగలరు అనడానికి చక్రపాణిగారుఒక నిదర్శనం.ఆయనలో గల ఈ సామర్ధ్యమే ఆయనపై నాకు అపరిమితమైన అభిమానం కలగడానికి దోహదం చేసింది.

ఒకసారి ఆయన తాను అనువదించిన నవలల మొదటి సంఫుటం పూర్తయిన సందర్భంగా,రెండవసంపుటిని విడుదల చేసే ఉద్దేశంతో నా వద్దకు వచ్చారు. బి.యన్.కె.ప్రెస్ ఆరంభించిన కొత్తల్లో ‘యువ పబ్లికేషన్స్’ద్వారా తన పుస్తకాలను విడుదల చెయ్యమని ఆయన నన్ను కోరారు.ఆ సమయం లోనే మా స్నేహం మరింత బలపడింది. ఇటు స్టూడియో అటు పబ్లికేషన్ కి సంబంధించిన పనులతో సతమతమవుతున్న చక్రపాణిగార్ని మద్రాసులోనే కాపురం పెట్టమని సలహా ఇచ్చాను.ఆయన తల్లిలేని తన ఇద్దరుకొడుకులతోనూ మద్రాసుకు మకాం మార్చారు.పెద్దకొడుకు తిరుపతిరావు (మేము ముద్దుగా అతడ్ని‘తిరు’అని పిలిచేవాళ్ళం)రెండవ కొడుకు సుధాకర్(ప్రస్తుతం హైద్రాబాదులో ఉంటున్నాడు)వాళ్ళిద్దరినీ చదువు నిమిత్తం రాయపేటలోని‘ చిల్డ్రన్ గార్డన్ స్కూలులో చేర్చాము.తమ స్కూల్లో పిల్లలకి సీటు ఇచ్చిన ఆ స్కూలు నిర్వాహకులు శర్మగారు అక్కడ హాస్టలు వసతి లేదన్నారు.

ఈ విషయాన్ని నా భార్యకు చెప్పి ‘తల్లిలేని ఈ ఇద్దరు పిల్లలకి నువ్వే తల్లిగా ఉండాలి’అన్నాను.అందుకు ఆమె మారు మాట చెప్పకుండా తన సమ్మతిని తెలియజేసింది.అప్పటినుంచీఆ ఇద్దరు పిల్లలూ మాతోపాటే ఉండేవారు.మా పిల్లలతో పాటు వాళ్ళూ నా భార్యని ‘అమ్మా’అని పిలిచేవాళ్ళు.వారికేదన్నా అవసరమొచ్చి చక్రపాణిగారిని అడిగితే‘వెళ్ళి అమ్మనడగండి’ అని పంపేసేవారు ఆయన.ఆయనకు నా చిన్నకొడుకు బాబ్జీ(నిర్మాత.బి.వెంకట్రామరెడ్డి),నా కుమార్తె శారద అంటే చాలాఅభిమానం.పిల్లలమధ్య ఆయనా ఒక చిన్న పిల్లవాడిలా ప్రవర్తించేవారు.అలా క్రమక్రమంగా ఆయన మా కుటుంబసభ్యులలో ఒకరయ్యారు.
ఆయన మాఇంటి మేడ మీద ఒక గదిలో ఉండేవారు.నాగిరెడ్డి-చక్రపాణి అంటే ఇద్దరూ అన్నదమ్ములేమోనని అందరూ అనుకునే స్థాయికి మా ఇద్దరి మధ్య స్నేహం వర్ధిల్లింది.

ఆయన పిల్లలూ మాపిల్లలూ ఒకేచోట పడుకోవడం వల్ల ఇంట్లో స్థలం చాలక నేను వరండాలో పడుకోవలసి వచ్చింది. పనిమీద బయటికెళ్ళి-రాత్రి ఎనిమిదిగంటలలోపు నేను ఇంటికి తిరిగిరాకపోయేసరికి చక్రపాణి గారు విలవిలలాడిపోయేవారు.వచ్చిన తర్వాత వెంటనే ఆలస్యానికి తగిన కారణం ఆయనకి చెప్పితీరాల్సిందే.లేకపోతే వూరుకునేవారు కాదు.అలా నన్ను కంటికి రెప్పలా కాపాడేవారు.నాగురించి ఎవరైనా(అది మా పిల్లలే అయినా సరే) పొరబాటుగా మాట్లాడితే సహించేవారు కాదు.ఐతే,తను మాత్రం నన్ను అప్పుడప్పుడు మందలించేవారు. ఆ మందలింపు కూడా ఒక గురువు తన ప్రియశిష్యుడిని మందలించేతీరులో వుండేది.

ఈ స్నేహమే దినదినాభివృద్ధి చెంది కాలక్రమేణా భాగస్వామ్యానికి పునాది వేసింది. నేను స్టుడియో ప్రారంభిద్దామని ‘ప్లాన్’చేసినప్పుడుఅందులో తనూ ఒక భాగం పంచుకున్నాడు.ఆ విధంగా‘ విజయా ప్రొడక్షన్స్’ను స్థాపించి,సంస్థ తొలి చిత్రంగా‘షావుకారు’నిర్మించాం.ఆ చిత్రానికి కధ రాసింది‘చక్రపాణిగారే!ఆచిత్రం టైటిల్స్ లో మొదటిసారిగా ‘నాగిరెడ్డి-చక్రపాణి’అని చూపించాం.అప్పుడు ప్రారంభమైన ఆ జంట పేర్లు ఆయన బ్రతికి ఉన్నంతకాలమూ మా చిత్రాలన్నింటిలోనూ ‘టైటిల్స్’లో కనిపించింది. కధ…సంభాషణలు..దర్శకత్వం..ఇలా మా చిత్రాల నిర్మాణబాధ్యతంతా ఆయనే వహించేవారు.చిత్రం పంపిణీ బాధ్యత మాత్రం నేను నిర్వహించేవాడిని.అతని పనిలో నేను గాని,నా పనిలో అతనుగాని జోక్యం కలిగించుకునేవారం కాదు.పని విషయములో మాత్రం ఆయన చాలా కఠినంగా వ్యవహరించేవారు.

ఉదాహరణకి‘మిస్సమ్మ’చిత్రం తొలి షెడ్యూలులో భానుమతి నటించారు.రెండవ షెడ్యూలు చిత్రీకరణ ప్రారంభానికి ముందు,కధ ప్రకారం భానుమతి క్రైస్తవకుటుంబానికి చెందిన అమ్మాయి.ఎన్.టి.రామారావు హిందువు.ఉద్యోగం కోసం ఇద్దరూ భార్యాభర్తలుగా నాటకం అడే దృశ్యాలు చిత్రీకరించాల్సిన సమయంలో-భానుమతికీ చక్రపాణిగారికీ అభిప్రాయభేదాలు వచ్చాయి.వెంటనే భానుమతిని పిల్చి,అంతవరకూ ‘షూట్’ చేసిన నెగటివ్ ని ఆమె కళ్ళముందే కాల్చేసి ఆమెకు ఇవ్వాల్సిన పారితోషికం అణాపైసల్తో సహా లెక్కకట్టి ఇచ్చి పంపేసారు.ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు పోషిస్తున్న సావిత్రిని కధానాయికగా ఎన్నుకుని‘మిస్సమ్మ’చిత్రాన్ని పూర్తి చేశారు.అలాంటి గుండెధైర్యం వున్న వ్యక్తి ఆయన.అలాగే‘రామ్ ఔర్ శ్యామ్’(తెలుగులో రాముడు-భీముడు)హిందీ చిత్రంలో కధానాయికగా పాత్రకిఅప్పట్లోనెంబర్ వన్ స్థానంలో వున్న హీరోయిన్ ని ఎన్నుకున్నారు. ఐతే చిత్రీకరణ సమయములో అమెతో మా యూనిట్ కి విభేదాలు వచ్చి అప్పట్లో అది తీవ్రమైన సంచలనాన్ని సృష్టించింది.ఫలితంగా ఆ చిత్రంలో వహీదా రెహమాన్ కధానాయికగా నటించాల్సి వచ్చింది. ఆనాడు ఎదురైన సమస్యను నేను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించడానికి అనంతనారాయణన్,అడ్వొకేట్ ఎస్.సి.రాఘవాచారి, ఎ.ఎల్.శ్రీనివాసన్ మొదలైనవారు ఎంతో సహకరించారు.ఐతే,అన్నింటినీ మించి నాకు అండదండగా నిల్చి ధైర్యాన్ని నూరిపోసింది చక్రపాణి గారే! ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలున్నాయ్!

ఈనాడు పన్నెండు భాషల్లో ప్రచురింపబడుతున్న ‘చందమామ’పేరుప్రఖ్యాతులు అందరికీ తెలిసినవే!ఆరేళ్ళ పిల్లల దగ్గర్నుండి ఎనభైయ్యేళ్ళ వృద్ధులవరకూ-పెద్దలు చదివే పిల్లల పత్రికగా కొనియాడబడుతున్నఆపత్రిక పేరు ప్రఖ్యాతులకు మూలపురుషుడు చక్రపాణి గారే! ప్రతి కధకూ ఒక ప్రయోజనం వుండాలి.పఠితలు తమతమ వ్యక్తిత్వాన్నిపెంపొందించుకోవడానికి దోహదం చేసేలా వుండాలి.మనోవికాసంతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా వుండాలి అనేవారు.ఆ సిద్దాంతంతోనేనేటి యువతరానికి మన సంప్రదాయాల్ని,పురాణేతిహాసాల్ని తెలియజెప్పాలనే ఉద్దేశంతో రామాయణం,భారతం,భాగవత కధల్ని పాత్రల్ని అందమైన బొమ్మలతోప్రచురించేవారు.నూటనాలుగు డిగ్రీలజ్వరంతో బాధపడుతున్నా సరే,చక్రపాణిగారి ఆమోదం లెనిదే‘చందమామ’లో ఒక్క వాక్యం కూడా ప్రచురించబడేది కాదు.ఆపత్రికతోఆయనకున్న అనుబంధం అలాంటిది.

పేరుకి పిల్లల పత్రికేఅయినా,అందులో పెద్దవాళ్ళకి కూడా ఉపదేశాలువుండాలి.అయితే,ఆ ఉపదేశాలు ఏ ‘ఇజా’నికి లోబడి వుండకూడదు అనేది ఆయన సిద్ధాంతం,ఇతరులు రాసిపంపిన కధల్ని కూడాదిద్ది తిరగరాయమనేవారు ఆయన.ఒక్కోసారి ఆయనే రాసే వారుకూడా!

చిత్రనిర్మాణంలోనూ,పత్రికా నిర్వహణలోనూ ఆయన చేసిన సేవలు అమూల్యం. ఉదయం పూట స్టూడియో వ్యవహారాలు,మధ్యాహ్నం రెండు గంటలసేపు పత్రికానిర్వహణ కార్యక్రమాలు,ఆ తర్వాత రాత్రి ఏడుగంటలవరకూ స్టూడియో..ఆపైన మళ్ళీ పత్రికాఫీసులో పని..ఇది చక్రపాణిగారి తీరికలేని దినచర్య.ఆయన విజయానికి ముఖ్య కారణం-ఆయనకున్న లౌకికజ్ఞానం,చిత్రనిర్మాణంలో ఆయనొక ప్రేక్షకుడు.‘చందమామ’ప్రచురణలో ఆయన ఒక పాఠకుడు.చిన్న పిల్లలకు ఏవి నచ్చుతాయి?ఏవి నచ్చవు?-అనేవి చక్కగా విశ్లేషించగలడాయన.

అలాగే చిత్రాల విషయంలో ప్రేక్షకులకు ఏది నచ్చుతుంది?ఏది నచ్చదు?అనేది చక్కగాపరిశీలించి చెప్పగలగడం ఆయన ప్రత్యేకత. ఇంతటి వివేచనాశక్తి,దూరదృష్టి గల మేము నిర్మించిన చిత్రాల్లో ఘోరపరాజయం పొందిన చిత్రం‘చంద్రహారం’. ‘పాతాళభైరవి’ఆఖండ విజయం సాధించిన తర్వాత ఆ ఉత్సాహంతోదాన్ని మించిన మరో అద్భుతమైన చిత్రాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో నిర్మించిన చిత్రం ‘చంద్రహారం’.ఎన్.టి.రామారావు,ఎస్.వి.రంగారావు,శ్రీరంజని,సావిత్రి వంటి భారీ తారాగణంతో నిర్మించిన ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని అనుకున్నాము.దానికి తగ్గట్టే భారీ ఎత్తున ‘పబ్లిసిటీ’చేశాం.ఆంధ్రదేశమంతటా చిత్రం విడుదలైంది.నెల్లూరులో మా మామగారి ధియేటర్ ‘శేషమహల్’లో విడుదలైంది.‘చంద్రహారం’చిత్రానికి భారీ ఎత్తున ఆదరణ లభిస్తుందనే ఆశతో నేను,చక్రపాణి సాయంత్రం ఆటకి థియేటర్ కెళ్ళాం.చిత్రం ప్రారంభమైంది.విరామసమయములో మమ్మల్ని చిత్రనిర్మాతలుగా గుర్తుపట్టినకొందరు విధ్యార్ధులు‘విరామం తర్వాతైనా చిత్రంలో కధ ఉంటుందా!హీరో ఇకనైనా నిద్రలేస్తాడా?అని అడిగారు.దాంతో.అంతవరకూ ఆ చిత్రం పట్ల మాకున్న నమ్మకం కాస్తా గాల్లో కలిసి పోయింది. మా మామగారింటికి కూడా వెళ్ళకుండా ధియేటర్ నుండి నేరుగా కారులో మద్రాసుకి బయల్దేరాం.నెల్లూరు నుంచి మద్రాసులో టి.నగర్ మా ఇంటికొచ్చేవరకూ మేమిద్దరం ఒక్కమాట మాట్లాడితే ఒట్టు.ఇల్లు చేరాక కారు దిగుతూ‘గంట ఎంతైంది?’అని అడిగాను చక్రపాణి గారిని ‘రెండున్నర’అన్నారు అయన.అలాగే వెళ్ళి పడుకొని మర్నాడు ఉదయం లేచి ఆ చిత్రం గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టాం.‘చంద్రహారం’సినిమా పూర్తయిన తర్వాత మద్రాసులో‘ప్రొజక్షన్’వేస్తే చూసినవాళ్ళంతా‘సూపర్ హిట్’ అన్నారే!మరి,ఎందుకింత ఘోరంగా పరాజయం పొందింది అని విశ్లేషించుకున్నాం.చిత్రం గురించి,అందులోని లోటుపాట్లు గురించి ప్రేక్షకుల దృష్టిలోఆలోచించాం.ఒక నిర్ణయానికి వచ్చాం.ఆ నిర్ణయాన్ని మా తదుపరి చిత్రాల నిర్మాణంలో అమలు జరిపాము. ఫలితంగాఎన్నోవిజయాలు చవిచూశాం.చక్రపాణిగారు ఒక కధని,చిత్రకధగా తయారుచేసి,దాన్ని మా పిల్లలకి చదవడానికి ఇచ్చేవారు.పిల్లల అభిప్రాయాల్ని తప్పనిసరిగా వినేవారు.వాటిలో ఆచరణయోగ్యమని అనిపించినవాటిని చిత్రంలో ఉపయోగించేవారు.వయోబేధం లేకుండా అందరి అభిప్రాయాలను ఆయన గౌరవించేవారు. చిత్రంలో సంభాషణలు పాత్రపరంగా నిర్దుష్టంగా వుండాలనేవారాయాన.ఇలా ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలించేవారు.

ఆంధ్రదేశంలొ ప్రబలమైన కులాలు రెండు.ఒకటి రెడ్డి,రెండుకమ్మ.మాలాగే(నేను రెడ్డికులానికి చెందినవాడ్ని,చక్రపాణి కమ్మకుటుంబానికి చెందినవారు),ఈ రెండు కులాల మధ్య సఖ్యత ఏర్పడాలన్న సదుద్దేశంతో చక్రపాణిగారు ఎన్.టి.రామారావు,అక్కినేని నాగేశ్వరరావులను, రెడ్డి-కమ్మ కులాలకు ప్రతినిధులుగా రెండు పాత్రలు సృష్టించి వారితో ’కాలం మారింది-మనుషులు మారాలి’అనే చిత్రనిర్మాణానికి సన్నాహాలు చేశారు.ఐతే,ఆ చిత్రనిర్మాణం ప్రారంభం కాకముందే చక్రపాణి గారుఅకాలమృత్యువు వాతబడ్డారు.ఆయన లేకుండా చిత్రాన్ని నిర్మించే ధైర్యం నా మనసుకి రాలేదు.ఎందరినో తీర్చిదిద్ది,మరెందరినో పెద్దవారిని చేసినా ఆయన మాత్రం ఎప్పుడూ సామాన్యంగా,నిరాడంబరంగా కనిపించేవారు.ఈనాటి యువతరంఅటువంటివారి వ్యక్తిత్వం,ప్రతిభా విశేషాలను-ప్రేరణగా తీసుకుని,ముందడుగు వేయాలని నా ఆకాంక్ష.నైతికవిలువలు పడిపోతున్న ఈ రోజుల్లో పెద్దల ఆదర్శాల అడుగుజాడల్లో నడుస్తూ,ఉత్తమ సంప్రదాయాలు నెలకొనడానికి ప్రతిఒక్కరూ కృషి చేయకపోతే రేపటి సమాజం దారుణమైన పరిణామాలకు గురి కావలిసి వస్తుంది.మా స్నేహాన్ని విడదీయగల శక్తి ఆ మృత్యువుకి మాత్రమే వున్నది. ఆయన భౌతికంగా నానుంచి వేరైనది మా విజయా హాస్పిటల్ లోనే!చక్రపాణిగారి కుటుంబసభ్యులు (కీ.శే.తిరుపతిరావు కుటుంబం) మాకుటుంబంతో కలసిమెలసి వుండడం,ఆయన నాతో సన్నిహితంగా మెలిగినంత సంతృప్తిని కలగజేస్తోంది.

ఈనాడు నాగురించి ప్రజలకు ఈమాత్రమైనా తెలిసి వుండడానికి కారణం చక్రపాణి గారే!నాకు మంచి మిత్రుడుగా,సోదరుడుగా,మార్గదర్శిగా ,గురువుగా వుండి చిరస్మరణీయుడయ్యారు చక్రపాణి గారు.

విజయచిత్ర,అక్టోబరు1994
చివరి సంచికనుండి

3 Comments
  1. gauripathy January 19, 2009 /
  2. చందు January 21, 2009 /