అక్కినేనిపై ఆచార్య ఆత్రేయ

atreya-lead

అడుగు మోపే స్ధలమిచ్చేసరికి అలా పెరిగిపోయాడు వామనుడు, నాగేశ్వరరావుకు అడుగు మోపే అవకాశం ఎవరిస్తే ఏం ఎలా పెరిగాడు,ఏం సాధించాడు అనేదే కధానాయకుడి కధ.

ఎలా పెరిగాడు?

జీరో లాంటి వేషంతో ప్రవేశించి,హీరో దాకా పెరిగాడు.

ఏం సాధించాడు?

లక్షలు(వివరాలు ఉన్ కమ్ టాక్స్ వాళ్ళకూ,ఆయనకూ తెలుసూ)సంపాదించాడు. మద్రాసులో ఒక ఇల్లు కొన్నాడు.అమ్మాడు. మరొక ఇల్లు కట్టాడు. అమ్మాడు. హైదరాబాద్ లో ఒక ఇల్లు కొన్నాడు. ఇంకొక ఇల్లు కడుతున్నాడు. పొడి చేస్తాం, దంచేస్తాం అనే ఒక పరిశ్రమ,మరికొన్ని పరిశ్రమలూ పెట్టాడు. పిల్లల భవిష్యత్తుకు కావల్సిన ఏర్పాట్లన్ని చేసాడు. మంచి కార్లున్నాయి కాబట్టి తిరుగుతాడేమో అనుకుంటే మంచి సంసారం ఉండబట్టే తిరగటం లేదు. తానట్టే చదువు కోలేదు కనుక ఇతరులైనా చుదువుకోనీ అని గుడివాడలో తన పేరిట ఒక కాలేజీ పెడతామంటే సరేనని విరాళమిచ్చాడు. త్వరలోనే ఇలాంటివి మరికొన్ని చేస్తాడంటున్నారు…. చేస్తాడు.

ఇదయ్యా కథ…

“ఇదంతా మాకు తెలిసిందే కదయ్యా” అంటారు.

అవును.

మీకు తెలియనిది చెప్పమంటారా? చెప్తాను.

నాగేశ్వరరావు అందగాడు కాదు…దేశంలో కొందరమ్మాయలు నా మీద విరుచుకు పడ్డా సరే..అన్నపూర్ణమ్మగారు నన్ను క్షమిస్తారు కనుక అందగాడు కాడు.
నాగేశ్వరరావుకు మంచి కళ్ళు లేవు.

కంఠం అంత కన్నా లేదు.

ఒడ్డూ పొడుగూ విగ్రహం లేదు

బాషా పాండిత్యం లేదు.

ఇంతెందుకు నటుడికి కావిలిసిన లక్షణాలు అసలు లేవు

అయినా-

హీరో అయ్యాడు…ఇప్పటికీ హీరోగా ఉన్నాడు..ఇంకా ఉంటాడు

ఇదయ్యా కథ…

“ఇదీ మాకు తెలిసిందే కదయ్యా?” …అంటారు.

మీకేమిటి నాగేశ్వరరావుకే తెలుసు.కనుక మీకూ..ఆయనకూ తెలియందొకటి చెప్తాను.

నెల్లూరులో ‘మాయాలోకం’ విడుదలైంది చూశాను. అందులో ఆ కుర్రాడి పేరు నాగేశ్వరరావు అని నాకు తెలియదు కానీ ఈ కుర్రాడెవరో ఫరవాలేదు-కంఠమూ, బిగుసుకు పోవటమూ-ఈ రెండూ సర్ధుకుంటే పనికొస్తాడు,అని నేననుకున్నాను. పక్క నెవరితోనో అన్నాను కూడా ఇప్పడు పెద్ద వాళ్ళయిన వాళ్ళందర్ని గురించి ఒకప్పుడిలా అనుకున్నామని చాలా మంది చెప్పడం సహజం. నేను ఆ జాబితాలో చేరను. ఎందుచేతంటే నేనప్పుడు నాటకాలలో ఉన్నాను.ప్రతిభను వెతకటం,గుర్తించటం నా వృత్తిగా ఉండేది.పైన నేను ఉదహరించిన రెండులోపాలూ ఆయన ఏ మాత్రం సర్ధుకున్నాడో మీరే నిర్ణయించాలి. కానీ,నేననుకున్నట్లు మాత్రం పనికొచ్చాడు.పై కొచ్చాడు.

“ఎలా పైకొచ్చాడయ్యా?” అంటారు.

అవును అక్కినేని ఎలా పైకొచ్చారో తరువాత…(పార్ట్-2 లో)

ఆచార్య ఆత్రేయ స్వయంగా “కృషీ వలుడు..ఇంతింతై వటుడింతయై..”అనే టైటిల్ తో సినిమా రంగం అనే పత్రికలో (1970 పిబ్రవరి సంచికలో) అక్కినేని నాగేశ్వరరావు గురించి ఆయన సినీ జీవితం రజితోత్సవం సందర్బంగా రాసినది.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

2 Comments to “అక్కినేనిపై ఆచార్య ఆత్రేయ”

  • అద్భుతం ఆత్రేయ గారూ అనటం సూర్యునికి దివిటీ చూపడమే కదా! ఐనా సరే అద్భుతం మీ శైలి, పాండిత్యం.

  • నమస్కారాలు. ఒక వ్యాసంలో ANR గారు.. నన్ను అందరూ అందగాడు, అందగాడు అంటారు. కాని నేను నమ్మను. ఎందుకంటే నావా గుంట కళ్లు, పీక్కుపోయిన బుగ్గలు, కీచు గొంతు, అస్థిపంజరం లాంటి విగ్రహం…. (కొంచం అటు ఇటుగా) అని రాసారు సరదాగా.
    మీ వ్యాసం బాగుంది. రెండో పార్టు కోసం ఎదురు చూస్తూ… అలాగా మీ అమూల్య అనుభవాలు జ్ఞాపకాలు కూడా ఆశిస్తున్నాము.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories