Menu

రహమాన్ తో ముఖాముఖి – పాఠకులకు సంక్రాంతి కానుక

మనమందరమూ మన అంతరాత్మలను అన్వేషించుకోవాలి.అదే విజయానికీ,ఆనందానికీ గల రహస్యం–ఎ.ఆర్.రహమాన్

సాధారణ సంగీత ఔత్శాహికుడి నుంచి,దేశంలోని అత్యంతప్రభావవంతమైన, శక్తివంతులైన సాంస్కృతికమూర్తుల్లో ఒకరిగా ఎదిగిన వ్యక్తి అల్లా రఖా రహమాన్. భారతీయ సంగీత పునరుజ్జీవానికి అసలు సిసలు కధానాయకుడైన రహమాన్ పేరుతో ఎలా తమను జోడించుకునేందుకైనా సగర్వంగా భావించుకునేవారికి కొదవేలేదు.’మొజార్ట్ ఆఫ్ మద్రాస్’ గా విఖ్యాతిగాంచిన రహమాన్ 43వ జన్మదినసందర్భంగా,జీవితం,తత్వం,ప్రేమ,భవిష్యభారతం లాంటి అంశాల గురించి విజే సాయి తో జరిపిన సరదా సంభాషణ నవతరంగానికి ప్రత్యేకం.

మొదటి సన్నివేశం

చెన్నయ్ లోని కోడంబాకం. అక్కడ ఒక చిన్న వీధి,వీధినిండా గుంపులు గుంపులుగా జనం. చాలా మంది చేతుల్లో పుష్పగుఛ్ఛాలు, కొవ్వొత్తులు, కేకులు. అందరూ ఆతృతగా తమహీరో ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తున్నారు. ప్రతి ఒక్కరూ అతనితో తమ పరిచయం గురించి,తమకున్న అభిమానం గురించీ ముచ్చటించుకుంటున్నారు. కాసేపటికి అక్కడికొచ్చిన ఒక నాజూకైన కారులో నుంచి అయిదడుల ఎత్తు,బొద్దుగా ఉండి,నవ్వుతూ,తనను దాదాపు చుట్టుముట్టిన జనసందోహాన్ని పలకరిస్తూ దిగాడు వారి హీరో. వ్యక్తిగత కార్యదర్శులు అభిమానులనుంచి పూలగుత్తులను అందుకుంటూ ఉండగా,అతను నిర్విరామంగా క్లిక్ చేస్తున్న కెమెరాలకు ఒక నవ్వు విసురుతూ ఉన్నారు. ఈలోపు చిరిగిన సాదాసీదా చీరలో అతనితో మాట్లాడేందుకు తనకు అవకాశమొస్తుందా అని ఒక మూలగా నిలుచున్న వృద్ధమహిళను చూసారు. మిగిలిన వారందరినీ వదిలి తనవద్దకు వచ్చిన అతన్ని చూసి ఆ మామ్మ తనబోసినోటంతటితో చిరునవ్వు నవ్వి అతనికో గులాబి ఇచ్చి,చెక్కిట ముద్దాడింది.నువ్వు రావటంటతో నాకు ఎంతో గౌరవం పెరిగింది అని అతనన్నారు.అందరూ అబ్బురపడుతున్నారు.ఆమె ఎవరా అని.

రెండవ సన్నివేశం

విలాసవంతమైన లివింగ్ రూమ్ లో ఒకవైపు పెద్ద సోఫా సెట్,మరొక వైపు రెండు కంప్యూటర్లున్న వర్కింగ్ టేబుల్,ఒక మూలగా యమహ క్లావినోవా ఎలక్ట్రానిక్ పియానో.మరొక టేబులు మీద చిన్నపిల్లల కలరింగ్ బుక్స్,రెండు కీబోర్డులు,టేబుల్టెన్నిస్ టేబుల్ సైజులో రోనాల్డ్ డి 5 అనలగ్ ఎడిటింగ్ కన్సోల్,పైన అద్దాలాటకలో నుంచి తొంగిచూస్తున్న రెండు డజన్ల జాతీయ ఆవార్డులు, ఫిలిమ్ ఫేర్ ఆవార్డులు,జీవన సాఫల్య పురస్కారాలు,ప్రశంసాపత్రాలు ఇలా చాలా చాలా, దుమ్ముకొట్టుకుని, ఆలనాపాలనా లేక గుట్టలా పడి ఉన్నాయి.

మూడవ సన్నివేశం

‘సో సారీ,మిమ్మల్ని వెయిట్ చేయించాను’ అంటూ ఆ పొట్టిమనిషి నవ్వుతూ వచ్చి,ఒకవైపు నుంచి అతని మొబైల్ మోగుతూనే ఉన్నా ’రండి ఇలా కూర్చుని మాట్లాడుకుందా’మన్నారు. అద్దాలతలుపు, దానికి అవతలనుంచి ఒక వందమంది అతను నవ్విన ప్రతిసారీ ఆతృతగా లోనికి చూస్తున్నారు. రహమాన్ సంగీతం తరచూ విడుదలవుతూ ఉండటం సహజమైనా,ఈసారి అతని కార్యాలయం, సిబ్బందీ రహమాన్ పేరు స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు గాను గోల్డెన్ గ్లోబ్ ఆవార్డుకు షార్ట్ లిష్ట్ కావడంతో ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. “ఒక రోజు డానీ అనే అతని దగ్గర్నుంచి మెయిల్ వచ్చింది, నా సంగీతాన్ని అతను చాలా బాగా ఆస్వాదించాడనీ, ఒక ప్రాజక్టు నాతో కలసి పని చెయ్యాలనుకుంటున్నాడనీ ఆమెయిల్ సారాంశం. కాకపోతే అతని గూర్చి నాకేమీ తెలియదు,దానితో అతని గురించి గూగులించగా డానీ బైల్ చాలా పెద్ద సినిమా దర్శకుడనీ,ముఖ్యంగా నా సంగీతం అతను బాగా విన్నాడనీ,దానితో మా యిద్దరి మధ్యా అరమరికలు లేకుండా పోయాయి.అలా స్లమ్ డాగ్ మిలియనీర్ రూపుదిద్దుకుంది.ఇక్కడ ప్రముఖంగా ప్రస్తావించాల్శిన అంశమేమంటే అతనికి నాదగ్గర్నుంచి తనకు కావాల్సింది ఎలా రాబట్టుకోవాలో బాగా తెలుసు.స్లమ్ డాగ్ మిలియనీర్ వేదన,ఆశావహ దృక్పధం, విమోచనలను గురించిన చిత్రం. నా సంగీతాన్ని అతను సినిమాలో ఉపయోగించిన తీరు అద్భుతం.స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలో చూపినంత అమోఘంగా ముంబై నగరాన్ని మరెవ్వరూ చూపలేదని నా భావన.అతను ముంబై నాడిని అద్వితీయంగా పట్టుకోగలిగాడు” అంటూ నవ్వాడు రహమాన్.

‘సరే అతను మీ వద్దనుంచి వద్దనుకున్నది ఏమిటో అదీ కాస్తచెప్పండి’అన్నప్రశ్నకు ‘అదా!రొమాంటిక్,సెంటీ సంగీతం వద్దన్నారు, ఆయనకు మంచి బీట్,ఎడ్జీ మ్యూజిక్ అంటే బాగా ఆసక్తి,మేము అలాంటి సంగీతమే సృష్టించగలిగాము, అదొక టెర్రిఫిక్ డిస్కోథక్ అన్నారు. నాతో మాట్లాడుతూనే ఆ రోజు సాయంత్రం చెన్నైలో మరొకమూల జరగనున్న శాస్త్రీయసంగీతకచేరీ గురించి వాకబు చేసారు రహమాన్.

స్లమ్ డాగ్ సంగీతానికి ఎలాంటి స్పందన వచ్చింది?

“ప్రోత్సాహకరంగానే ఉండింది, కానీ లాస్ ఏంజలీస్ ఎంటర్ టైన్ మెంట్ పరిశ్రమలో మొహమాటానికి చాలా చెప్తుంటారు, అందువల్ల నేను కూడా వాళ్ళ కామెంట్స్ ను అంత సీరియస్ గా తీసుకోలేదు. తర్వాత నాకు తెలిసింది ఏమంటే హాలీవుడ్ పెద్దతలకాయలు అన్నవన్నీ అక్షరసత్యాలనీ.కొందరు సమీక్షకులు ఇలాంటి సినిమా చూసి ఎన్నాళ్ళయ్యిందో అన్నారు. కొన్ని పాటలు హిందీలో ఉన్నా ఒక్కళ్ళు కూడా మాకు అర్ధంకాలేదు అని చెప్పలేదు.జై హో,ఓ సాయా,రింగా రింగా ఇవన్నీ హిందీ పాటలే కానీ వాళ్ళకు బాగా నచ్చాయి అన్నారు రహమాన్.

తొలినాటి జ్ఞాపకాలు

యం.యస్.సుబ్బలక్ష్మి లాంటి మహామౌలను అందించిన చెన్నయ్ నగరంలో జనవరి మాసం అంటేనే సంగీతకళాకారులకూ, సంగీతప్రియులకూ ఏ కచ్చేరీకి వెళ్ళాలా అని అతృతగా ఉండే నెల. ‘ఇవ్వాళ రాత్రికి నేనా కచ్చేరికి వెళ్ళలేననుకుంటా’ అంటూ నిట్టూర్చారు ఆయన.

సంగీతదర్శకులకు శాస్త్రీయపరిజ్ఞానం ఎంతమేరకు అవసరమంటారు’?

’తెలిసి ఉండటమూ మంచిదే,తెలియకపోవటమూ మంచిదే,తెలిసుండీ తెలియనట్లుండటమూ ఒకరకంగా మంచిదే.సంగీతజ్ఞానం ఒక్కొక్కసారి ముందుకు సాగనివ్వదు.అలాంటి జ్ఞానమే గనకలేకుంటే నిరంతరం నేర్చుకుంటూ ఉండవచ్చు,తద్వారా మనలోని ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.ఎలా చూసినా నేర్చుకోవాలీ అన్న జిజ్ఞాస మాత్రం తప్పనిసరిగా ఉండాలి’.

తీవ్రంగా జబ్బుపడ్డ తన తండ్రి ఒక సూఫీగురువు సలహామేరకు ఊహాతీతంగా ఆరోగ్యవంతుడయ్యాక, దిలీప్ కుమార్ ఇస్లాం మతం స్వీకరించారు. సంగీతకళాకారుడైన రహమాన్ తండ్రి కుటుంబాన్ని పోషించేందుకు ఎంతగానో శ్రమించారు.’అవును,మానాన్నప్రాణం పోయేలా పనిచేసారు.తొంభై శాతం పని ఆయనే చేసినా,ఆపేరు ఎవరికో దక్కేది,తన ప్రతిభకు ఎలాంటి గుర్తింపూ దొరికేది కాదు.అన్నిటికన్నా దారుణం ఆయన్ని అసిస్టెంట్ అని పిలిచి అవమానించేవారు, ఇలాంటి మర్యాద ఆయన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు, కన్నుమూసేంతవరకూ ఆయన ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది.

మా నాన్నగారి అనుభవాలు నాకొక మంచి పాఠాలు నేర్పాయి.అందుకే నేను చేతులనిండా పని పెట్టుకోను.భారీపారితోషికాలిస్తామంటూ నాకు అవకాశాలు వస్తుంటాయి.కానీ సంవత్శరానికి ఒక ఇరవై సినిమాలు అంగీకరించి వాటి గురించి పరులుపెట్టటం కంటే,రెండో,మూడో ఒప్పుకుంటాను.జీవితం పాఠాలు నేర్పుతుంది’అంటూ చలించిపోయిన రహమాన్,తనను జీవితాంతం వెంటాడుతున్న గతస్మృతులగురించి చెప్పుకొచ్చారు.

రహమాన్ తండ్రి చనిపోయాక ఇల్లు గడవటానికి ఆయన సంగీతపరికరాలను తాకట్టుపెట్టుకుని కొంతకాలం గడిపారు.చిన్నవాడైన రహమాన్ తనమిత్రులతో కలసి సంగీతం సమకూర్చేంతవరకూ వారి కుటుంబం డబ్బుకు ఇబ్బందులు పడుతూనే ఉంది.డ్రమ్మర్ శివమణి,టి.వి.గోపాలకృష్ణన్ అనే మృదంగకళాకారుడు,దేవా అనే మరొక డ్రమ్మర్ తో కలిసి మ్యాజిక్ అనే సంగీతబృందాన్ని రహమాన్ 1980 ల్లో ఏర్పాటు చేసారు.ముగ్గురుమిత్రులు కలసి ‘డిస్కో-82’ అనేపేరుతో ఒక ప్రవేట్ ఆల్బం విడుదల చేసారు ఆప్పటి యువతరం ఎంతగానో ఆదరించింది.ఆ బృందం ఇవ్వాళ లేకపోయినా అందులోని సభ్యులంతా సంగీతప్రపంచంలో తమదైన స్థానాలను సుస్థిరం చేసుకున్నారు.

తాత్వికత-జీవనదృక్పధం

కష్టాలలో సహజీవనం చేసి,బ్రతుకులోని క్లిష్టదశలను అతి సమీపంగా చూసిన రహమాన్ లో మనకు కొట్టొచ్చినట్లు కనిపించేది అతనిలోని సగటుజీవిగుణగణాలు.జీవితాన్ని తాత్వికదృష్టితో అవగాహనచేసుకుంటూ సంవత్శరాలుగా స్వాంతన పొందుతున్న వ్యక్తి రహమాన్.సమాజములో మన చేతులూ,చేతలూ ఉన్నా శిరస్సు మాత్రం అడవిలో ఉండాలన్నసూఫీ సిద్ధాంతాలతో జీవిస్తున్న రహమాన్,మనమందరమూ అడిగే ప్రశ్న,శాశ్వతమైన ప్రశ్నకు సమాధానాన్ని పొందేందుకు గాను నేను సూఫీ విధానాలను స్వీకరించాను.అది,నేను ఎవరిని?నా పుట్టుక అసలు ఎందుకోసం?ఈ ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిస్తూ నన్ను నేను వెతుక్కుంటున్నాను.సూఫీ విధానాలలో నాకూ,నాకుటుంబసభ్యులకు అనంతమైన వెలుగు,ప్రేమ దొరికాయి.

అసలైన మలుపు ఎక్కడంటే మనలను మనం ప్రశ్నించుకుంటూ జవాబు కోసం అంతరాళాల్లోకి పయనించగలగాలి.ఒక్కచోటికి చేరేసరికి మనలోని మేధొపరమైన గర్వం ముక్కలూచెక్కలూ అవుతుంది.నీలోనే నిబిడీకృతమైన ఒకానొక శక్తిని ఉన్నదని మనకు తెలిసివస్తుంది,ఆ మూలశక్తి నిన్ను నడిపిస్తుంది.మనమందరమూ మన అంతరాత్మలను అన్వేషించుకోవాలి.అదే విజయానికీ,ఆనందానికీ గల రహస్యం.

తనది ఎంతటి తీరికలేని దినచర్య అయినప్పటికీ మతంపట్ల భక్తిశ్రద్ధలున్న ముస్లిముగా రహమాన్ రోజూ అయిదుసార్లు నమాజు చెయ్యటం మాత్రం మరువరు.మొదటిసారి మక్కాయాత్ర చేసివచ్చాక రహమాన్ కు పుత్రోదయం అయ్యింది,దేవుని నిజమైనదీవెనా అన్నట్లుగా తండ్రీకొడుకుల జన్మదినాలు ఒక్కటే! రహమాన్ లోని సూఫీతత్వం పట్లగల గాఢానురక్తి అతనిచేత అధ్భుతమైన సంగీతాన్ని సృజింపచేస్తుంది.

సంగీతం…తన ప్రపంచం…

సంగీత దర్శకుడిగా ఎ.ఆర్.రెహమాన్ తన స్థాయి, అనుభవాలతో భారతీయ సినీ సంగీతంలో విప్లవాత్మక మార్పుల్ని తీసుకొచ్చాడన్నది కాదనలేని నిజం. ఇలాంటి సంగీత దర్శకుడి సంగీతసృష్టి మీద ట్యూన్లు కాపీ కొడతాడని, గోప్యమైన మార్మిక విధులు పాటిస్తాడనీ కొన్ని పుకార్లు ఉన్నాయి. ఇలాంటి వదంతుల్లో నిజానిజాలు ఈ సంగీత దిగ్గజం నమోదు చేసుకున్న 99% విజయాల్ని చూస్తే అత్యంత ప్రశ్నార్థకంగా అనిపిస్తాయి. ఈ విషయమై మాట్లాడుతూ, “నేను శాస్త్రీయ సంగీతం వింటాను. బెక్,బిథోవెన్,వర్డిలను ప్రేమిస్తాను. శాస్త్రీయసంగీతం ఒక మహాసముద్రం. మిగతా సంగీత విధులు ఆ సముద్రంలోని చిరుబిందువుల వంటివి. కాబట్టి ఆ సంగీతం యొక్క ప్రభావం నా సంగీతంలో ఉండటం సహజం.వీలైనంత వరకూ ఇప్పటికీ శాస్త్రీయసంగీత కార్యక్రమాలకు హాజరవుతాను. వ్యక్తిగతంగా డాక్టర్ ఎల్.సుబ్రమణ్యం,ఎల్.శంకర్ గారు నాకు చాలా ఇష్టం. నన్నడిగితే, భారతీయ సంగీతంలో నిజమైన హీరోలు వీరేనంటాను. భారతీయ సంగీతం గురించి తెలియని సమయంలో వీరు మన సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయి పరిచయం చేసారు. ఆలోచిస్తేనే అదొక అధ్భుతమనిపిస్తుంది.” అంటారు రెహమాన్. ఇక మార్మిక విధులగురించి సమాధానమిస్తూ,”నా సంగీత సృష్టిలో మార్మిక విదుల ప్రసక్తే లేదు.నేను సంగీతం చెయ్యాలంటే ప్రశాంతత కావాలి,అందుకే రాత్రిపూట సంగీతం చేస్తాను. నేనిప్పుడు ముగ్గురు పిల్లల తండ్రినికూడా. వారి గొడవలలో తగువు తీర్చే బాధ్యతతో రోజంతా గడిచిపోతుంది. అలాంటప్పుడు నాకు సంగీతం కంపోజ్ చెయ్యడానికి మిగిలింది రాత్రి మాత్రమే!” అనేది రెహమాన్ నవ్వుతూ చెప్పే సమాధానం.

మిగతా సంగీత దర్శకులూ ఈ దారిలో ఫ్యూజన్ మ్యూజిక్ అంటూ విఫలప్రయత్నాలు చేసారుగా అంటే,”ఇప్పుడు చాలామంది కొన్ని ధ్వనుల్ని కలగలిపి ఫ్యూజన్ మ్యూజిక్ అనేస్తున్నారు.మరికొందరు ఏదోఒక బోరింగ్ రాగాన్ని తీసుకుని బలవంతంగా ఫ్యూజన్ చెయ్యడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో రాగాన్నికూడా చెడగొడతారు.” భాషాప్రాంతీయ భేధాలు దాటి తమిళ్, తెలుగు, మళయాళం హిందీ లో సంగీతం చేసే మీరు సంగీతం ఫ్లాప్ అవడంపట్ల ఎలా స్పందిస్తారు అని ప్రశ్నిస్తే,”హిట్టూప్లాపుల సంగతి నాకు తెలీదు.నేను సంగీతాన్ని అందిస్తాను అంతే.మణిరత్నం గారి ‘ఇరువర్’ (ఇద్దరు) సినిమా సంగీతం చిత్రం రిలీజయినప్పుడు కాక దాదాపు ఒక సంవత్సరం తరువాత చాలా మందికి నచ్చి అభిమానించారు. అంటే కొందరికి ఫ్లాపనిపించిన సంగీతం మరికొందరికి విపరీతంగా నచ్చింది. ఈ విధంగా చూస్తే ఏది ఫ్లాపు ఏది హిట్ అనేది చాలా సందేహాస్పదంగానే అనిపిస్తుంది. నా వరకూ మాత్రం నన్ను నేను అర్పించుకోకుండా సంగీతాన్ని సృష్టిస్తే మాత్రమే అది ఫ్లాప్ క్రింద లెక్క. అది ఇప్పటివరకూ జరగలేదు.”

సంగీతంలో వారసత్వం ఒక సమస్యగా మారింది. చరిత్రలో చూస్తే పెద్దపెద్ద సంగీతకారులు తమ వారసత్వాన్ని సుస్థిరం చేసినట్లు అనిపించరు. దీనికి మీరేమంటారు అన్న ప్రశ్నకు,”సంగీతం కాలానుగుణంగా మారాలన్నది నా ఆలోచన. ఉదాహరణకు ఆర్.డి.బర్మన్ కేవలం తన తండ్రి ఎస్.డి.బర్మన్ ను అనుసరించి వుంటే ఇంత గొప్ప సంగీతాన్ని అందించేవారు కాదుకదా? కాబట్టి ఎవరైనా నా సంగీతాన్ని వారసత్వంగా తీసుకుంటారు అన్న ఆలోచనే నాకు ఇబ్బంది కరంగా అనిపిస్తుంది, నా లాంటి తండ్రుండటం బహుశా నా పిల్లలకు సమస్యాత్మకంగా పరిగణించొచ్చు. నా సంగీతంతో వాళ్ళ సంగీతాన్ని పోల్చడం అర్థరహిత మవుతుంది. వారసత్వం యొక్క ప్రభావం ఉంటేవుండొచ్చేమోగానీ చివరకు మిగిలేది సొంత సంగీతం మాత్రమే.

రెహమాన్ సినీసంగీతంతో పాటూ ఇతర సంగీతాన్ని కూడా చేస్తున్నారు. దాని గురించి చెబుతూ,” ప్రస్తుతం ప్రముఖ సూఫీ కవి ఫరీద్ అల్దిన్ అట్టార్ యొక్క ‘Conference of Birds’ ని హ్యాంబర్గ్ ఆర్కెస్త్రా వారితో కలిసి స్వరబద్ధం చేస్తున్నాను. ఏదో చర్చల్లో అలవోకగా ప్రతిపాదించిన ఈ విషయాన్ని వారు కమిషన్ చేసేశారు. పని ప్రారంభించాకగానీ దానీ లోతులు తెలియలేదు. అందుకే ఇప్పటి వరకూ పెద్దగా పని జరగలేదు. బహుశా నేను ఆధ్యాత్మికంగా ఇంకా ఆ సాహసానికి తయారవలేదేమో!” అంటాడీ నిజమైన సూఫీ భక్తుడు. తనకు నచ్చే గాయకులూ సంగీత దర్శకుల గురించి చెబుతూ,”మొహమ్మద్ రఫీ గారు నాకు అత్యంత ఇష్టమైన గాయకులు వారు కాకుండా విట్నీ హూస్టన్, ఒఫ్రా హాజా అనే జ్యూయిష్ గాయకుడు అలాగే కైలీ మినోగూ ఇష్టం”. సంగీతంతో పాటూ సినిమాల్నీ అభిమానించే రెహమాన్ “ఈ మధ్యకాలంలో ‘తక్వా’ అనే టర్కీ సినిమా, వారిస్ షా – ఇష్క్ దా వారిస్’ అనే గురుదాస్ మాన్ (పంజాబీ) చిత్రం చాలా బాగా నచ్చాయని చెప్పారు.

లోకోపకారం..ఇంకా కొన్ని సంగతులు

నిరాపేక్ష, దానగుణం లేకుండా సూఫీతత్వాన్ని ని అవలంబించడం కష్టతరం. ఈ కారణం చేతనే రహమాన్ తను చేయాలనుకున్న సేవా కార్యక్రమాలకు గానూ A,R.Rahman Foundation ను ఏర్పాటు చేసారు. “వెనిజులా లోని El Systema ప్రాజెక్టు నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. అక్కడి మురికి వాడల్లోని బాల బాలికలను తీసుకుని శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇస్తారు. అక్కడ ఇది ఒక ఉద్యమం లాగా ఎదుగుతూ వచ్చింది. అన్ని వర్గాల నుంచీ ఈ ప్రయత్నానికి అపారమైన ఆదరణ లభిస్తోంది. ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళు చాలా మంది మంచి సంగీతకళాకారులుగా స్థిరపడ్డారు. నేను స్థాపించిన ఫౌండేషన్ కూడా దాదాపు ఇలాంటిదే. మనందరం కలిసి పనిచేస్తే మన దేశంలో కూడా పేదరికాన్ని చరిత్ర పుటల్లోకి నెట్టెయ్యవచ్చు. మనం చెయ్యగలమన్న నమ్మకమూ ఉంది. మంచి ఉద్దేశంతో మనం విత్తనం నాటి నీరు పొయ్యాలంతే. అందులోనుంచి ఎదిగే వృక్షం మన చేతుల్లో నిలవదు. ఒక్కో సారి మనమనుకున్న ఫలితాలు లభించకపోవచ్చు అంతమాత్రాన మనం మంచి పనులు చెయ్యడం ఆపకూడదు” అంటూ చెప్పుకొచ్చాడు సమాజహితం కోరుతున్నరహమాన్.

తన ఫౌండేషన్ కోసం నిధులు సేకరించే ప్రయత్నంలో భాగంగా ‘Pray for me Brother’ అనే ఆంగ్ల గీతాన్ని స్వరపరిచారు రహమాన్. “నా దృష్టిలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అన్నింటికంటే ముఖ్యంగా కొంచెం ప్రేమ కొంచెం మంచితనం అవసరమనిపిస్తుంది. నేను స్వరపరిచిన ఈ గీతం పేదరికం గురించి అవగాహన కలుగచేయడంలోనూ, దీనావస్థలో ఉన్న బాలబాలికల జీవితాల్లో వెలుగు నింపడంలోనూ సహాయం చేస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు రహమాన్. ఆయన్లోని ఈ సేవగుణమే జాసన్ హంటర్ మొదలుపెట్టిన freehugs అనే కార్యక్రమానికి తన సంఘీభావాన్ని ప్రకటించేలా చేసింది. ఈ కార్యక్రమానికి తన వంతు సహకారాన్ని అందిస్తూ తన మిత్రుడు శివమణి తో కలిసి ఇప్పటికే దేశమంతా సంచలనం సృష్టిస్తోన్న ’జియా సే జియా’ అనే మ్యూజిక్ వీడియో రూపొందించారు. “Believe in the power of love and love your fellow-humans. This is the answer the world needs at the moment, అంటూ ముగించారు.

తన జీవిత విశేషాలను మనతో పంచుకున్నందుకు రహమాన్ కి, రహమాన్ తో మాట్లాడి ఆ కబుర్లు మనతో పంచుకున్నందుకు విజే సాయికి,సంక్రాంతి కానుక గా రహమాన్ ఇంటర్వ్యూని నవతరంగం లో ప్రచురించడంలో తోడ్పడిన మిత్రులకు,ధన్యవాదాలు.అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

12 Comments
  1. saif ali gorey January 14, 2009 /
  2. afsar January 14, 2009 /
  3. చండీదాస్ January 14, 2009 /
  4. రానారె January 14, 2009 /
  5. Sudhakar January 14, 2009 /
  6. narasimha rao mallina January 14, 2009 /
  7. నాగన్న January 14, 2009 /
  8. Madhuravani January 14, 2009 /
  9. veejay sai February 13, 2009 /