Menu

మరో రీకాప్

బాలీవుడ్ సినిమాలపై రాసి తెలుగు-తమిళాల గురించి రాయకుండా ఉంటే ఎలా? అన్న సందేహం నా గురించి నాకే కలిగి మరో రీకాప్ వ్యాసంతో వస్తున్నాను. తెలుగు-తమిళ సినిమాల్లో కూడా నాకు ఈ సంవత్సరం చూసిన సినిమాల్లో కాస్త వైవిధ్యం కనిపించింది. అయితే, బాలీవుడ్ లెవెల్లో కాదు. ఒక విషయం మాత్రం అర్థమైంది. తమిళులైనా కాస్త వెరైటీ కథాంశాలతో తీయగలరు కానీ, తెలుగు వారిలో మాత్రం అలాంటి కథా వైవిధ్యం ఇప్పట్లో రాదేమో అనిపించింది. ఇక్కడ నేను రాస్తున్న సినిమాలు నిజానికి వైవిధ్యభరితమైనవి కాకపోవచ్చు. ఎటొచ్చీ ఏదో చేద్దామనుకున్న సినిమాలు ఉన్నాయి అని చెప్పడం నా ఉద్దేశ్యం. మళ్ళీ, ఈ భాగోతమంతా నేను ’చూసిన’ సినిమాల గురించి మాత్రమే అని గమనించగలరు.

’గమ్యం’ వీటన్నింటిలోనూ చెప్పుకోదగ్గ సినిమా. తెలుగు సినిమాలో ఇలాంటివి ఏడాదికి ఓ నాలుగైదొచ్చినా చాలు, మన దర్శకుల ఆలోచనల్లో కాస్త కొత్తదనం వస్తుందన్న నమ్మకం మనకు కలగడానికి. ఈ సినిమా దర్శకుడికి తొలి సినిమా అనుకుంటాను. ఇలాగే ఇతను మరిన్ని సినిమాలు తీస్తారో లేక ఎప్పట్లాగే ఉన్న నాలుగైదు మూసల్లో ఒక మూసకి ఇరుక్కుపోతారో మరి. ’దశావతారం’ నాకు బాగా నచ్చిన మరో సినిమా. ఈ సినిమా గురించి ఇదివరకే నవతరంగంలో రెండుసార్లు రాసి ఉన్నాను నేనే. ఇతరత్రా వ్యాసాలు కూడా ఉన్నాయి. కమల్ హాసన్ అభిమానిని కనుక కూడా ఈ సినిమా నచ్చి ఉండొచ్చు నాకు. కానీ, ఇలాంటి ఓ సినిమా భారతీయ సినిమాలో నేనైతే ఎప్పుడూ చూడలేదు. Like it or hate it. You can’t ignore it. రెండు పాటలు విని ఏదో ఊహించేసుకున్నాక సినిమా బిగ్ స్క్రీన్ మీద చూసి విపరీతంగా నిరాశపడ్డ చిత్రం ’కథానాయకుడు’. రజనీ అభిమానులనైతే ఇంకా ఇంకా నిరాశపర్చి ఉంటుందీసినిమా. నిర్మాతలని అందరికంటే ఎక్కువగా.

’రెడీ’ కామెడీకి పెద్ద పీట వేసింది. సినిమా కథంతా పక్కా మూస పద్ధతిలో సాగినప్పటికీ, అసలు కొత్తదనమంటూ ఒక శాతమైనా ఈ కథలో లేకపోయినప్పటికీ హాస్యం పాళ్ళు తగినంత ఉండటంతో సినిమాకి బాగా ప్రేక్షకాదరణ లభించింది. ఈ సినిమా విజయం చూశాకే మనవారికి కామెడీ ఉంటే ఇంకేం అక్కర్లేదు అన్న నా నమ్మకం మరింత బలపడింది. అలాగని నాకీ సినిమా నచ్చలేదు అనట్లేదు. నేను కూడా మూడుసార్లు చూశాను ఇప్పటికి ఈ సినిమాని. అయితే, సినిమా అంటే ఇంతేనా? ఇంకేమీ లేదా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి నాకు. బహుశా సినిమా అనేది ఎందుకు చూస్తారు మనుష్యులు అన్న ప్రశ్నకి ఒకరిచ్చే జవాబు మీద ఆధారపడి ఉంటుంది రెడీ ఎందుకు విజయవంతమైంది? అన్న ప్రశ్నకి జవాబు. ’అష్టాచమ్మా’ కూడా ప్రధానంగా హాస్య ప్రధాన చిత్రమే. కాకపోతే, ఇది వేరే తరహా సినిమా, రెడీ తో పోలిస్తే. దీనిలోని హాస్యం కుడా వేరే తరహాది. ప్రధాన నటీ నట వర్గం అంతా తెలుగువారు కావడం కూడా ఈ సినిమా ఫ్రెష్ గా అనిపించడానికి ఓ కారణం. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. రెడీ కంటే కూడా నేను దీన్ని మంచి ’తెలుగు’ సినిమాగా రేట్ చేస్తాను.

’బ్లాక్ అండ్ వైట్’ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి ఈ ఏటి సినిమాల్లో. వీలైనంతవరకూ ఈ సినిమా బాగా తీసేందుకు ప్రయత్నించారు. సినిమాలోని సస్పెన్స్ తుదివరకూ అనుభవించేవారు ఎక్కువమంది ఉండకపోవచ్చు. అయినా కూడా, సినిమా ఇతరత్రా చాలా సినిమాలతో పోలిస్తే నయమే. అసలు అన్నింటికంటే ముఖ్యంగా ఒక సినిమా గురించి చెప్పాలి. దాని గురించి చెప్పకుంటే మన తెలుగు దర్శకుల సృజనాత్మకతను కించపరిచినట్లే అవుతుంది. అదే మన ’హరేరామ్’. ఈ సినిమా చూడ్డానికి మీకు రెండొందలు ఇక్యూ ఉండాలని ఫుల్ హైదరాబాద్ లో రాస్తే నవ్వుకున్నాను అప్పట్లో. సినిమా చూసాక అర్థమైంది అంతమాటెందుకన్నారో. అబ్బో! ఈసినిమా దర్శకుడికి అంకెలు -1,2,3,4,5,6,7,8,9,0 అన్న వరుసలో తెలీవు. 1,3,5,6,9,2,4,8,0,7 – ఇలాంటి ఏదో ఆర్డర్ అనమాట వారిది. సీన్లు కూడా అదే వరుసలో వచ్చి వెళతాయి. మీరిక ఏ బ్రెయిన్ మాపింగో చేసి, వాళ్ళ మనసులోని ఆలోచనల్ని తెలుసుకుంటే, ఈ సినిమా అర్థం చేసుకోవచ్చు. అంత గొప్ప చిత్రరాజం. మిక్కీ జె.మేయర్ సంగీతమొక్కటే కాస్త ఊరట ఈ సినిమాకి సంబంధించినంతవరకూ.

తమిళ సినిమాల విషయానికొస్తే, నేను చూసిన నేను చూసిన ఆరేడు సినిమాల్లో నాకు నచ్చినవే ఎక్కువ. అప్పట్నుంచే సందేహం మొదలైంది. వాళ్ళకి కథా వైవిధ్యం ఎక్కువా లేక నేను ఆ వైవిధ్యం ఉన్నవి మాత్రమే చూశానా? అని.

’సుబ్రమణ్యపురం’, ’పరుత్తి వీరన్’, ’అరయిల్ 305ఇల్ కడవుల్’, ’వెళ్ళి తిరై’ – అన్నీ పూర్తి సంబంధంలేని కథలతో రావడమే కాక అక్కడ బానే ప్రజాదరణ కూడా పొందాయి. వీట్లో నాకు ప్రధానంగా “అరయిల్….” హాస్యం పరంగా నచ్చింది. మిగితావి సీరియస్ కథలే అయినా కూడా సినిమా జరుగుతున్నంతసేపూ ప్రేక్షకుల్ని కట్టిపడేయగలవు. ’బిల్లా’ సినిమా కూడా తమిళ సినిమాల పరంగా సాంకేతికంగా బాగా కష్టపడి తీసిన సినిమా అనిపించింది. ’నేపాలీ’ సైకో థ్రిల్లర్ అనాలేమో. భరత్ బాగా చేసినా కూడా, అతన్ని అస్తమానం ఇలాంటి పాత్రల్లో చూసి బోరు కొట్టేసింది నాకు.

నాకా ఆశ చావదు. కనుక, మన తెలుగు సినిమాలు కూడా రకరకాల కథాంశాలతో వస్తాయి అని ఆశిస్తూనే ఉంటాను. అంటే, మరీ రకరకాలు అన్నా కదా అని ’మెంటల్ కృష్ణ’ వంటివి కావు. ఏదో మరీ extrems కి వెళ్ళకుండా కాస్త చూడబుల్ గా….

3 Comments
  1. అబ్రకదబ్ర January 12, 2009 /
  2. sasank January 12, 2009 /
  3. sasank January 12, 2009 /