Menu

2008 లో ఫ్రెంచ్ సినిమాలు

సౌమ్య గారు రాసిన 2008 Bollywood రౌండప్ చూసాక చాన్నాళ్ళుగా రాయాలనుకుంటూ వున్న ఈ వ్యాసాన్ని అర్జంటుగా రాసెయ్యాలనిపించింది. 2008 సంవత్సరంలో 2007 కంటే తక్కువ సినిమాలు చూసాను. అలా అని 2008 లో మరీ తక్కువ సినిమాలు చూసానని కాదు. సగటు మూవీ గోయర్ కంటే కాస్తా ఎక్కువ సినిమాలే చూసుంటాను.వాటిల్లో నాకు నచ్చిన వాటిని కొన్నింటిని గుర్తు చేసుకునే ప్రయత్నం ఇది.

ముందుగా నాకు నచ్చిన ఫ్రెంచ్ సినిమాలతో మొదలుపెడ్తాను.

1) The Class

ఫ్రాన్స్ లోనే కాదు ప్రపంచంలోనే ఈ సంవత్సరం వచ్చిన సినిమాల్లో అత్యుత్తమ సినిమా ఏదంటే The Class అని గట్టిగా చెప్పెయొచ్చు. ఇది నా మాటే కాదు. ప్రపంచం అంతా ఈ మాటే అంటున్నారు.ఇప్పటికే కాన్ చలనచిత్రోత్సవంలో ఈ సినిమా అత్యుత్తమ సినిమాగా ఎన్నుకోబడింది. దాంతో పాటు ఆస్కార్ నామినేషన్ కూడా వస్తుందని నా అంచనా.

ఏంటి ఈ సినిమాలో అంత గొప్ప అంటే… ఫ్రాన్స్లోని ఒక సబర్బన్ ఏరియాలో ని ఒక పాఠశాలలో సినిమా జరుగుతుంది. సినిమా మొత్తం ఆ పాఠశాలలోనే జరగడం ఒక విశేషమైతే సినిమాలో తొంభై శాతం కి పైగా ఒకే క్లాస్ రూం లో జరగడం మరో విశేషం. అందుకే ఈ సినిమాకి The Class అనే టైటిల్.

ఒక సినిమా మంచి సినిమానా కాదా అని నిర్ణయించడానికి ఒక్కొక్కరికీ ఒక్కో criteria ఉంటుంది. నా వరకూ నేను బాగా గమనించే విషయాల్లో ఒకటి point of view లేదా దృష్టికోణం. మనం చూస్తున్న సినిమాలో కథ ఎవరి దృష్టి కోణం లోనుంచి చూస్తున్నామనేది నాకు చాలా ముఖ్యం.

The Class సినిమా విషయానికొస్తే సినిమా మొత్తం కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ లో నడుస్తుంది.ఇలాంటి సినిమాలు ప్రేక్షకుడిని బాగా ఇన్వాల్వ్ చేస్తాయని నా అభిప్రాయం.సినిమా మొత్తం ఎలా ఉంటుందంటే కెమెరా స్థానంలో ప్రేక్షకుడే ఉండి నిజ జీవితంలో సంఘటనలు చూస్తున్నట్టుగా ఉంటుంది. ఈ సినిమా ఎలా మొదలవుతుందంటే….. ఆ పాఠశాల శెలవుల తర్వాత మళ్ళీ తెరవబడుతుంది. పిల్లలందరూ తమ తమ క్లాసుల్లోకి వెళ్తుంటారు. కెమెరా అలా అందరినీ కాసేపు చూపించాక అక్కడున్న చాలా మంది ఉపాధ్యాయుల్లో ఒక ఉపాధ్యాయుణ్ణి ఫాలో అవుతుంది. అంటే ఈయన క్లాసు ఎలా ఉంటుందో చూద్దాం పదండి అన్నట్టుగా ఆ క్లాసులోకి వెళ్తాము. ఎదో కొన్ని అవసరమైన సీన్లో తప్పిస్తే సినిమా చివరిదాకా ఆ క్లాసు రూం లో నుంచి బయటకు రాదు (దాంతో పాటు మనమూ రాలేము).

ఈ సినిమా నాకు బాగా నచ్చడానికి కారణం ప్రేక్షకుడిని కూడా సినిమాలో ఒక పాత్రని చేసి జరుగుతున్న సంఘటనలకు సాక్షిగా నిలబెడతాడు దర్శకుడు. ఈ సినిమా మధ్యలో ఒక సీన్ ఉంటుంది. నిజానికి ఈ సీన్ లేకుంటే సినిమాకొచ్చే నష్టమేమీ లేదు. ఆ సీన్ ఏంటంటే….మనం చూసే క్లాసు రూంలో ఉన్న అందరు విద్యార్థులు చాలా అల్లరి చిల్లరిగా ఉంటారు. ఎప్పుడూ టీచర్ తో గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఒక్క చైనీస్ విద్యార్థి మాత్రం టీచర్ కి ఎప్పుడూ ఎదురు చెప్పకుండా అన్ని పనులూ సక్రమంగా చేస్తుంటాడు. ఈ విద్యార్థి పాత్ర కూడా సినిమాలో అంత ప్రాధాన్యత ఉండదు. అయితే నేను చెప్తున్న సీన్లో ఏమవుతుందంటే ఆ చైనీస్ విద్యార్థి తల్లి ఫ్రాన్స్ లో సరైన వీసా లేకుండా ఉంటుందనీ, అది తెలిసిన పోలీసులు ఆమెని అరెస్టు చెయ్యడంతో ఆ కేసు కోసం అందరి దగ్గరా విరాళాలు సేకరిస్తున్నామని ప్రకటిస్తుంది ఒక ఉపాధ్యాయిని. ఈ సీన్ ఎంత సాధారణంగా ఉంటుందంటే ఒక 30 సెకండ్లలో ఆవిడా స్టాఫ్ రూం లో ఈ ప్రకటన చేస్తుంది. అయితే అప్పటివరకూ మనం క్లాస్ రూం లో ఉంటూ అక్కడి విద్యార్థుల గురించి ఎంతటి పరిచయం పెంచుకుంటామంటే ఆ వార్త వినగానే “అయ్యో…పాపం ఆ పిల్లాడు బాగా చదువుకుంటున్నాడే. అతనికి ఎందుకింత కష్టం రావాలి” అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సీన్ గురించే ఎందుకు చెప్పానంటే ఈ సీన్ ముందు కానీ , తర్వాత కానీ ఈ విషయం గురించి మరెక్కడా ప్రస్తావన ఉండదు. అయినా కూడా మనం ఆ సీన్ కి ఎందుకు రియాక్ట్ అవుతామంటే అక్కడ కెమెరా స్థానంలో మనల్ని ఉంచడంతో ప్రేక్షకులు తమ వయసు బట్టి తాము కూడా ఆ విద్యార్థుల్లో ఒకడిగానో, లేదా మరో ఉపాధ్యాయిడిగానో అక్కడి వారందరితో బాగా పరిచయమున్నట్టుగా భావం కలుగుతుంది.

నేను ఇంత చెప్పాను కదా అని ఈ సినిమా గురించి ఎక్కువ అంచనాలు లేకపోతేనే మేలు. ఒక క్లాసు రూం లో కెమెరా పెట్టి చూడమంటే అందరికీ నచ్చే విషయం కాదు. ఇందులో నవ రసాలు, మసాలాలు, కామెడీలు, వినోదాలు లాంటివి ఏమీ ఉండవు. ఎక్స్పెరిమెంటల్ అనలేను కానీ ప్యూర్ సినిమా అని మాత్రం చెప్పగలను. వెరైటీ కోరుకునే వారికి మాత్రమే ఈ సినిమా.

2) 57,000 Kms Between Us

నాకు బాగా నచ్చిన మరో ఫ్రెంచ్ సినిమా ఇది. టైటిల్ వెరైటీ గా ఉంది కదా. సినిమా ఇంకా వెరైటీ. ఇది మిక్స్డ్ మీడియుం తో నిర్మించిన సినిమా. అంటే కొంచెం ఫిల్మ్ రీలు మీదా, కొంచెం డిజిటల్ కెమెరా లోనూ చిత్రీకరించారు. అలా ఎందుకు? అంటే ఈ సినిమాని అలాగే తియ్యాలి.ఎందుకంటే ఈ సినిమా మన జీవితాల్లో టెక్నాలజీ పాత్ర గురించి చర్చిస్తుంది. టెక్నాలజీ మన జీవితాలను ఎంతగా మార్చివేసిందో చూపెడుతుంది.

కథా పరంగా ఇది ఒకరిద్దరి కథ కాదు. ఫ్రాన్స్ లోని కొన్ని కుటుంబాలు, వారి జీవితంలో టెక్నాలజీ పాత్రలతో ఈ సినిమా కథ నడుస్తుంది. టెక్నాలజీ ఒక్కటే కాదు ఈ సినిమాలో పాశ్చాత్య సంస్కౄతిలోని ఎన్నో వింత పోకడలకు అద్దం పడ్తుంది.

ఈ సినిమాలో ఒక కుటుంబం ఉంటుంది, వాళ్ళకి ఒక వెబ్ సైట్ ఉంటుంది. వాళ్ళకి ఉద్యోగాలు లాంటివేవీ ఉండవు. వాళ్ళకున్న పనల్లా వారి రోజు వారీ జీవితాన్ని డిజిటల్ కెమెరాలో రికార్డు చేసి ఈ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తుంటారు. ఈ సైట్ కి వచ్చే హిట్స్, స్టాట్స్ చూసుకోవడం, అలాగే యాడ్ రెవెన్యూ చూసుకోవడమే వీరి జీవితం. అంటే బతకడానికి వాళ్ళని వాళ్ళు అమ్ముకుంటూంటారన్నమాట. వాళ్ళకి ఒక కూతురు. ఆ అమ్మాయికి పన్నెండేళ్ళయినా ఉండవేమో. రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని రోల్ ప్లేయింగ్ వీడీయో గేంస్ ఆడుతుంటుంది. ఇలా కంప్యూటర్, టివి లాంటివి మన జీవితాల్లోకి ప్రవేశించి ఎలా ఆక్రమించేస్తున్నాయో చూపించే సినిమా. అక్కడక్కడా హాస్యం తెప్పించే సన్నివేశాలున్నా అపుడప్పుడూ మన జీవితాలు ఇంతకంటే ఏం బావున్నాయనే చేదు నిజం గుర్తు చేస్తూ ఉంటుంది కాబట్టి చూడాలనుకునే వారు కాస్త జాగ్రత్త.

3) Possibility of an Island

Michel Houellebecq అనే ఫ్రెంచ్ రచయిత ఇదే పేరుతో రాసిన నవలను మొదటి సారిగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తెరకెక్కించిన సినిమా ఇది. కథా పరంగా ఇది సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ ఎలిమెంట్స్ కలిగి ఉంటుంది. ప్రపంచం ఇక ముగిస్పోతుందన్న సమయంలో క్లోనింగ్ ద్వారా మళ్ళీ బతకొచ్చనుకుని నమ్మే వాళ్ళందరూ ఒక తెగ (cult) గా మారి ఒక మారుమూల ప్రదేశంలో క్లోనింగ్ గురించి పరిశోధనలు జరుపుతుండడం సినిమా మొదటి సగంకాగా రెండో భాగంలో ప్రపంచం నిజంగానే అంతమవుతుంది. కాకపోతే గతంలో క్లోనింగ్ గురించి చేసిన పరిశోధనలు మరియు ప్రయోగాల వల్ల ఒక యువకుడు ఒక యువతి మాత్రం తిరిగి జన్మిస్తారు. కానీ వారిద్దరూ వేరు వేరు ప్రదేశాల్లో ఉంటారు. వీళ్ళిద్దరూ చివరకు ఒక సముద్రపుటొడ్డున కలుసుకోవడంతో సినిమా ముగుస్తుంది.

నాకైతే ఈ సినిమా బాగానే అనిపించింది.అదీ రెండో భాగంలో వారిద్దరూ ఎడారిలో తిరుగుతూ ఉండే సన్నివేశాలు, ఆ సీనరీ, సెట్ డిజైనింగ్ అయితే breath taking అని చెప్పొచ్చు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపైన విమర్శల వర్షం కురిపించడమే కాకుండా ఈ సినిమా దర్శకుడిపై జోకులుకూడా వేసారు. నాకైతే మరీ అంత ఘోరంగా అనిపించలేదు. బహుశా నేను ఈ నవల చదవకపోవడం ఒక కారణం అయ్యుండొచ్చు. మీరెవరైనా ఈ చూస్తే మీకెలా అనిపించిందో తెలియచేయండి.

4) A Chirstmas Tale

ఇప్పటివరకూ నేను చెప్పిన మూడు సినిమాలనీ ఎవరో నాలాంటి సినిమా పిచ్చోళ్ళకి తప్పితే రికమెండ్ చెయ్యను కానీ ఈ సినిమా (A Christmas Tale ) మాత్రం అందరూ చూడాల్సిన సినిమాగా రికమెండ్ చేస్తాను.

అయితే ఇక్కడ కూడా ఒక చిన్న disclaimer. టైటిల్ చూసి ఫీల్ గుడ్ సినిమా అని మోసపోకండి. సాధారణంగా హాలీవుడ్ లో ఇలాంటి టైటిల్ ఉంటే మంచి ఫీల్ గుడ్ సినిమా expect చెయ్యవచ్చు కానీ వీళ్ళు ఫ్రెంచ్ కదా కాస్తా వెరైటీ.

కథ విషయానికొస్తే….ఒక పెద్ద కుటుంబం. తల్లి, తండ్రి, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కాబడానికి పెద్ద కుటుంబమే అయినా ఎవరికి వారు విడివిడిగా తమ తమ కుటుంబాలతో జీవిస్తుంటారు. తల్లికి కాన్సర్ అని తెలుస్తుంది. ఆవిడకి బోన్ మ్యారో transplantation చెయ్యాలంటారు. ఈ విషయం తెలుసుకుని క్రిస్మస్ కి అందరూ ఒక చోటుకు చేరుతారు. ఆ సందర్భంగా వారి గత కాలపు జ్ఞాపకాలు, ప్రస్తుత జీవితంలోని సమస్యలు…ఇలా నడుస్తుంది కథ.

ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్ పరంగా చూసినా, లేదా కథ కథనాల పరంగా చూసినా ఇది మంచి రంగు, రుచి, చిక్కదనం ఉన్న సినిమా…తప్పక చూడొచ్చు.

5) Lets talk about the Rain-ఫ్రాన్స్-2008

ఫ్రాన్స్ లోని ఒక చిన్న పట్టణం. ఆ ఊరికి ఒక ప్రముఖ ఫెమినిస్ట్ రచయిత్రి వస్తుంది. ఆమె త్వరలో రాజకీయాల్లోకీ వెళ్ళాలనుకుంటుంటుంది. ఆమె గురించి ఒక డాక్యుమెంటరీ సినిమా రూపొందించాలనుకుంటారు ఆ ఊరిలోని ఇద్దరు wannabe filmmakers. స్థూలంగా అదీ కథ.

సున్నితమైన హాస్యం ఈ సినిమా ప్రత్యేకత. ఫర్వాలేదనిపించే సినిమా.

ఇవి నేను నచ్చిన మెచ్చిన 2008-ఫ్రెంచ్ సినిమాలు.ఇవి కాకుండా A Lake అనే సినిమా చూసాను. అర్థం కాలేదు. 🙂 ఇక 2008 లో చూడాలనుకుని చూడలేకపోయిన ఫ్రెంచ్ సినిమా ‘I’ve loved you so long‘. త్వరలో నాకు నచ్చిన ఇటాలియన్ సినిమాలు గురించి రాస్తాను.

9 Comments
  1. మేడేపల్లి శేషు January 9, 2009 /
  2. shree January 9, 2009 /
  3. శంకర్ January 12, 2009 /
  4. sasank January 12, 2009 /