Menu

2008 లో యూరోపియన్ సినిమాలు-1

2008 లో నేను చూసిన సినిమాల గురించి రాస్తున్న వ్యాసావళి లో రెండో వ్యాసం ఇది. ఈ సీరీస్ లో వచ్చిన మొదటి వ్యాసం (2008:ఫ్రెంచ్ సినిమాలు) ఇక్కడ చదవొచ్చు.

Hooked-రొమానియా

గత సంవత్సరం రెండు మంచి రొమానియన్ సినిమాలు చూడడం అదీకాక పత్రికల్లో రొమానియన్ న్యూ వేవ్ వచ్చేసిందని తెగ వ్రాయడంతో ఈ సంవత్సరం వచ్చిన మంచి రొమానియన్ సినిమాలు చూద్దామని ఎదురు చూసినప్పటికీ రొమానియా నుంచి ఈ సంవత్సరం ఒక్కటే మంచి సినిమా వచ్చిందనుకుంటాను. అదే Hooked.

కేవలం ముగ్గురు ప్రధాన పాత్రధారులీ సినిమాలో. ఒక పెళ్ళయిన అమ్మాయి. ఆమె ప్రేమించే మరో వ్యక్తి. వీరిద్దరూ కలిసి ఒక వారాంతం పిక్ నిక్ కి వెళ్తుంటారు. మార్గమధ్యంలో ఒక వేశ్యను వీరి కారు కిందపడి గాయపడుతుంది. స్పృహలో లేని ఆ అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా కార్లో తమతో పాటే తీసుకెళ్తారు. మధ్యలో ఆ అమ్మాయికి స్పృహ వస్తుంది. వారి ముగ్గురి మధ్య నడిచే డ్రామా ఈ సినిమా ముఖ్య కథాంశం. నాకైతే రోమన్ పొలాన్స్కీ మొదటి సినిమా “Knife in the water” గుర్తొచ్చింది. చూడదగ్గ సినిమా.

ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన/నచ్చని విషయం ఒకటే. ఈ సినిమాలో కెమెరా ఎలా పని చేస్తుందంటే ఎక్కడా objective point of view ఉండదు. దాదాపు ప్రతి షాటు కూడా సినిమాలోని ఎవరో ఒక పాత్ర దృష్టి కోణంలోనే ఉంటుంది. అయితే ఇలా ఉండడం ప్రయోగాత్మకంగా బాగానే ఉన్నా అక్కడక్కడా కొంచెం చిరాకు పుట్టిస్తుంది.

The Candidate-డెన్మార్క్

సినిమాలో హీరో ఒక లాయర్. అతని తండ్రి కూడా ఒక పేరు మోసిన లాయర్. ఏడాది క్రితం తన తండ్రి ఒక కేసులో ఓడిపోయి ఇంటికెళ్తుండగా ఒక కారు యాక్సిడెంట్లో మరణిస్తాడు. కానీ అది యాక్సిడెంట్ కాదనీ మర్డర్ అనీ అతని నమ్మకం. అది ఎలా నిరూపించాలో తెలియక అటు తన వృత్తి లోనూ ఇటు తన వ్యక్తిగత జీవితంలోనూ చాలా కష్టాలు ఎదుర్కొంటుంటాడు. ఒక సాయంత్రం తన గర్ల్ ఫ్రెండ్ తో గొడవ జరుగుతుంది. కోపంగా ఇంట్లోనుంచి బయటకు వచ్చి తన మిత్రునితో కలిసి ఒక బార్ కి వెళ్తాడు. అక్కడ ఒకమ్మాయి పరిచయం అవుతుంది. అతనికి అంత వరకే గుర్తుంటుంది. ఆ తర్వాత ఉదయం ఒక హోటల్లో నిద్రలేచి చూసేసరికి బాత్ రూమ్ లో ఆ అమ్మాయి శవం వుంటుంది. అసలేం జరిగిందో అతనికి గుర్తుండదు. ఇది సినిమా ఎత్తుగడ. అక్కడ్నుంచి మరో గంట సేపు ఉత్కంఠంగా సాగే ఈ సినిమా edge of the seat thriller అని చెప్పొచ్చు. థ్రిల్లర్ లో ఉండాల్సిన ట్విస్ట్స్ మరియు టర్న్స్ అన్నీ ఉన్నాయి.

ఈ సినిమాలో నాకు నచ్చిన అంశం ఫోటోగ్రఫీ. సినిమా థ్రిల్లర్ అయినప్పటికీ చాలా థ్రిల్లర్స్ లాగా కాకుండా డాక్యుమెంటరీ లాగా ఉంటుంది.

Silence of Lorna-బెల్జియం

ఈ చిత్రోత్సవంలో చూసిన మరో అత్యుత్తమ సినిమా. లోర్నా అల్బేనియా దేశస్థురాలు. బెల్జియంలో ని ఒక డ్రగ్ ఎడిక్ట్ ని పెళ్ళి చేసుకుని బెల్జియం పౌరసత్వం పొందుతుంది. వారిద్దరి మధ్య పెళ్ళి కేవలం ఒక ఒప్పందం మాత్రమే. ఆమెకు బెల్జియం పౌరసత్వం రాగానే విడాకులు తీసుకోవాలన్నది ఆమె పథకం. అలా విడాకులు పొందగానే మరో రష్యన్ ని పెళ్ళి చేసుకుని అతని వద్దనుంచి వచ్చిన డబ్బుతో అల్బేనియాలోని తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి బెల్జియంలో ఒక హోటల్ తెరిచి హాయిగా జీవించాలని ఆమె ప్లాను. అంతా అనుకున్నట్టుగా జరిగితే కథేముంటుంది. మొదటి భర్తతో విడాకులు పొందడంలోనూ, రష్యన్ ని పెళ్ళిచేసుకోవడంలోనూ , తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి డబ్బులు కూడబెట్టి హోటల్ కోసం స్థలం అద్దెకు తీసుకోవడంలోనూ లోర్నా అనుభవించిన కష్టాలు ఈ సినిమా మూల కథ.

ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే కథ-కథనం వేగంగా పరిగెడ్తుంది. అలా అని కెమెరా గిమ్మిక్కులూ, ఫాస్ట్ ఎడిటింగ్ ఉండవు. దర్శకుడు ఈ వేగాన్ని సినిమాలో ఎలా నెలకొల్పాడంటే ఒక సీన్లోని కాలానికి ఆ తర్వాత సీన్లోని కాలానికి చాలా గ్యాప్ ఉంటుంది. ఉదాహరణకు నాచ్ సినిమాలో అభిషేక్ బచ్చన్ అంత్రా మాలీని “సినిమాకెళ్దామా” అంటాడు అక్కడ కట్ చేస్తే తర్వాత సీన్ వాళ్ళు సినిమా చూసి ఆటోలో తిరిగి వస్తుండగా మొదలవుతుంది. ఈ సినిమాలో కూడా అంతే. అరటి పండు వలిచి పెట్టినట్టు కాకుండా సినిమాలోని కొన్ని విషయాలు ప్రేక్షకులకే ‘fill in the blanks’ లాగా వదిలేస్తాడు దర్శకుడు/రచయిత. ఈ టెక్నిక్ చాలా సినిమాల్లో అక్కడక్కడా ఉపయోగించినా పూర్తి స్థాయిలో గమనించింది మాత్రం ఈ సినిమాలోనే. బహుశా అందుకే ఈ సినిమాకి కాన్ లో ఉత్తమ స్క్రీన్ ప్లే గా అవార్డిచ్చారు.

బెల్జియంలోని అత్యుత్తమ సినిమా దర్శకులయిన Dardenne బ్రదర్స్ నుంచి వచ్చిన మరో మంచి సినిమా. తప్పక చూడండి.

Three Monkeys-టర్కీ

Nuri Bilge Ceylan ఈ సినిమాకి దర్శకుడు. 2006 లో వచ్చిన Climates అనే సినిమా ద్వారా ఈయన పరిచయం అయ్యింది. సమకాలీన ప్రపంచ దర్శకుల్లో ఉత్తమమైన వారిలో ఈయన ఒకడని చాలా మంది అభిప్రాయం. Climates చూసాక నాకూ అలానే అనిపించింది. అలాంటి దర్శకుడి సినిమా కాబట్టి కొంచెం ఎక్కువే అంచనాలు పెట్టుకున్నానేమో కొంచెం నిరాశ చెందాను.

కథ విషయానికొస్తే….

ఒక రాజకీయ నాయకుడు కార్లో ప్రయాణిస్తూ చేసిన యాక్సిడెంట్లో ఒక వ్యక్తి మరణిస్తాడు. ఆ రాజకీయ నాయకుడు త్వరలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా వుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసు తన మెడకి చుట్టుకుంటే కష్టమని ఆ కేసు తనపై వేసుకోమని డ్రైవర్ ని అడుగుతాడు. పెద్ద మొత్తం సొమ్ము ఆశ చూపెడతాడు. అతను సరే అంటాడు. జైలు కెళ్తాడు. అతను మొదటి మంకీ. ఇక మిగిలిన ఇద్దరు మంకీలు ఆ డ్రైవర్ భార్య మరియు కొడుకు. తండ్రి జైల్లో ఉండడంతో అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు కొడుకు. తల్లి మందలిస్తుంది. తనకో కారు కొనిపెడితే హాయిగా టాక్సీ నడుపుకుంటానంటాడు కొడుకు. భర్త కి చెప్పకుండా ఆ రాజకీయ నాయకుడిని సంప్రదించి అతనిస్తానన్న డబ్బుల్లో కొంచెం ముందుగానే ఇవ్వమంటుంది. ఈ తతంగం జరుగుతుండగా వారిద్దరి మధ్యా శారీరక సంబంధం ఏర్పడుతుంది. కొడుక్కి ఈ విషయం తెలుస్తుంది. ఈలోగా భర్త జైలు నుంచి తిరిగివస్తాడు. ఇలా ఒక చిన్న సంఘటన ముగ్గురి జీవితాలని ఎలా కొత్త దారులు తొక్కించిందో అనేది సినిమా మూల కథ. అంతా బాగానే ఉంది కానీ సినిమా మొత్తం చూసాక ఏదో వెలితిగా అనిపించింది. అది నా అంచనాల వల్ల అయ్యుండొచ్చు. చూడదగ్గ సినిమా.

Tricks-పోలండ్

పోలిష్ సినిమా. నాకు పోలిష్ సినిమాలంటే చాలా ఇష్టం. కానీ అవన్నీ 80-90 లలలో వచ్చిన కిస్లోస్కీ, వైదా, అగ్నెష్కా లాంటి పేరు మోసిన దర్శకుల చిత్రాలు.ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి పోలిష్ సినిమా ఏదీ చూసినట్టు గుర్తు లేదు.

ఈ సంవత్సరం నేను చూసిన పోలిష్ సినిమా ట్రిక్స్. ఈ సంవత్సరంలో నాకు బాగా నచ్చిన సినిమాల్లో ఒకటి. కథ చాలా చిన్నది. ఒక కుర్రాడు.  ఆ కుర్రాడు అతని తండ్రిని ఎప్పుడూ చూసి వుండడు. తన తల్లిని వదిలేసి వేరే ఆమెతో ఎక్కడో వుంటున్నాడని మాత్రం వినివుంటాడు. ఈ అబ్బాయికి రైళ్ళు, రైలు పట్టాలంటే పిచ్చి. రోజంతా రైల్వే స్టేషన్లో గడుపుతుంటాడు. అలా రోజూ రైల్వే స్టేషన్ కి వెళ్తూ అక్కడ చూసిన ఒక పెద్ద మనిషిని ‘ఇతనే నా నాన్న ‘ అని నిర్ణయించేసుకుంటాడు. అతనితో చిన్నగా పరిచయం పెంచుకుంటాడు. ఇంతకీ అతనే వాళ్ళ నాన్నా కాదా అని తెలుసుకోడానికి ఆ అబ్బాయి చేసే ప్రయత్నాలే ముఖ్య కథ.

చిన్న పిల్లాడు మంచి నటన ప్రదర్శించాడు.

—-ఇంకా ఉన్నాయి

6 Comments
  1. Madhu January 13, 2009 /
  2. మేడేపల్లి శేషు January 14, 2009 /
  3. shree January 16, 2009 /