Menu

ట్వైలైట్

కం. పొరబడి పేరంటంలో

జొరబడి చతికిలబడి మనసొప్పనిదైనా

స్థిరపడినందుకు వ్యధపడి

భరియించి తుదకు త్వరపడి బయటపడితిరోయ్

క్లుప్తంగా చెప్పాలంటే అలాంటిదే ట్వైలైట్ అనుభవం కూడాను. శనివారం ఉదయం పదకొండు గంటల సమయానికి ఇంటిదగ్గర ఉన్న హాలులో యస్ మాన్ ఆడుతోందేమో చూద్దామనుకొని వెళ్ళి, త్వరలో ఆటేదీ లేదని తెలిసాక, మరో ఐదు నిమిషాలలో ట్వైలైట్ ప్రారంభం కానున్నదిని గమనించి, అది మొదటి వారంలో అమెరికాలో ఢంకా మ్రోగించిందని లీలగా గుర్తురావడం వలన ఆబతో డబ్బుపెట్టేయడం ఆ అనుభవానికి నాంది.

ఎన్నో ఏళ్ళుగా పదిహేడేళ్ళ కుర్రాడిలా బ్రతుకుతున్న రక్తకుడికి, కొన్ని నెలలుగా అదే వయసులో ఉన్న ఓ మామూలు అమ్మాయికీ మధ్య నడిచే తొలిప్రేమే ఈ సినిమా కథ. వాంపైరబ్బాయిది మొదటి ప్రేమో కాదో తెలుసుకునే వీలులేదు కానీ, అమ్మాయిది మాత్రం తొలిప్రేమే. రాక్షసులకి, మనుష్యులకి మధ్య ప్రేమ సాధ్యమా అనే ప్రశ్నని పక్కనపెడితే, ఇక ఈ చిత్రంలో చెప్పుకోదగ్గదేమీ లేదు.

సాధారణమైన ప్రేమకథలు నడిచే మూసలోనే ఈ కథా పరుగెడుతుంది. మొదట, అమ్మాయి. అబ్బాయి తొలిసారి కలవడం, వారికి పడకపోవడం. తరువాత, అలా పొసగని పరిచయం వల్ల కుతూహలం పెరగడం, కుతూహలం ప్రేమగా మారడం. ప్రేమ పుట్టేముందు, ఇద్దరిలో ఒకరికి తమ నిక్షిప్తమైన భావాలని బయటపడేసే సంఘటనేదో సంభవించడం. ఈ మధ్యలో చుట్టుపక్కల ఖాళీ జాగా నింపడంకోసం, కథకు అతికినా అతకకపోయినా తెరకి జిగురులా అంటుకునే ఓ గుంపు. ఈ సరంజామా అంతా ట్వైలైట్ లో సుబ్బరంగా ఉంది.

రాక్షసులలోనూ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు, మనవాడు అరుదైన మంచి కూటమికి చెందినవాడు. (కుటుంబం అనకుండా కూటమి అని ఎందుకు అన్నానో మీకు చిత్రం చూస్తే ఇట్టే తెలుస్తుంది). అందరి ఆలోచనలను చదివేయగలిగే అతడు, ఆమె దగ్గర ఖంగు తింటాడు, ఎందుకో నాకు తెలియలేదు. ప్రేమ పుట్టడానికి అది ఒక కారణమైతే, ఆమె మెడలో తన వాడి కోరలు దించాలనీ, ఆమె వేడి రక్తాన్ని ఆశ్వాదించాలనీ అమితమైన కోరిక కలగడం మరో కారణం. కొరికేయాలనేంత ముద్దొచ్చేయడం అంటే అదే.

అంతా సవ్యంగానే జరుగుతోందనగా, అలవాటు ప్రకారం దుష్టుల ప్రవేశించి అల్లకల్లోలం సృష్టిస్తారు. అష్టకష్టాల కోర్చి ఆ దుష్టత్రయంలో రెండొంతులని జమకట్టేయడంతో కథ ముగింపుకి వస్తుంది. మిగిలిన వంతు దుష్టురాలు ‘ఇంకాఉంది’ అన్నట్టుగా కోపంగా తెరవైపు నడుస్తూంటే తెరపడుతుంది. తెలియక చిక్కుఫ్లిక్కులో చిక్కుకున్నా పెట్టిన పది డాలర్లు వృథా చేయడం ఇష్టంలేక కుర్చున్న నా బోటి వాళ్ల పరుగు మొదలవుతుంది.

–గిరి లంక

3 Comments
  1. shree December 24, 2008 /
  2. గిరి December 24, 2008 /