Menu

భావోద్వేగాల ప్రయాణం ‘ద వే హోం’

మా చిన్నప్పుడు వేసవి సెలవులకు అమ్మమ్మగారింటికి మా అమ్మ తీసుకెళ్ళేది. వెళ్ళేటప్పుడు సరదాగానే ఉండేది కాని వచ్చేటప్పుడు ఒకటే ఏడుపు. నేనయితే పారిపోయేవాడ్ని.నన్ను వెతకటానికి మా మామయ్యలు పరుగెట్టేవారు. అలాంటి అనుభవం మళ్ళీ ఇన్నాళ్ళకు ద వే హోం సినిమా చూస్తూంటే కలిగింది. అప్పటి సంగతులన్నీ కలసికట్టుకుని ఒక్కసారిగా కళ్ళముందు ఆడాయి. అందుకేనేమో టైటిల్ ఇంటికి దారి అనే పేరు పెట్టారు.

నిజానికి ఇది పెద్ద కధేమీ కాదు. ఊహకందని ట్విస్టులు అస్సలే లేవు.రెండు పాత్రలు ఒకరితో మరొకరు తప్పని స్ధితిలో మొదలు పెట్టిన ప్రయాణం…స్నేహ పూర్వకంగా ముగియటమే ఈ సినిమా. డెభ్భై ఏళ్ళు పై బడిన ఓ మాటా మంతి లేని మూగ అమ్మమ్మ పల్లెలో ఆధునికతకు అతి దూరంగా జీవిస్తూంటూంది. ఆవిడ కూతరు ఎప్పుడో పదిహేడేళ్ళ వయస్సులో ..గ్రామీణ జీవితానికి స్వస్తి పలకి నచ్చిన వాడితో ఆధునికతను వెతుక్కుంటూ సిటీ వెళ్ళిపోతుంది. అందరిలాగానే అక్కడ అతి సహజంగా మోసపోయి…పిల్లాడుతో మిగిలిపోతుంది. ఉదరపోషనార్ధం ఉద్యోగాన్ని వెతుక్కునే క్రమంలో కొడుకు శాంగ్ ఫూ ని ఓ నెల రోజుల పాటు తల్లి దగ్గర వదిలి పెట్టాలని బయిలుదేరుతుంది. అలా తను వదిలిన మూలాలను చాలా కాలం తర్వాత వస్తూండటంతో సినిమా ప్రారంభమవుతుంది

పిజ్జాలు,బర్గర్ లు ,ఎలక్ట్రానిక్ బొమ్మలు,వీడియో గేమ్స్తో సిటీ జీవితానికి అలవాటు పడ్డ ఆ పిల్లాడుకి ఆ పల్లె సహించదు. అందులోనూ మూగ అమ్మమ్మ ముసలి డొక్కులా కనిపిస్తుంది. మరో ప్రక్క అమ్మమ్మ కొండపై ఇల్లు,ఏ మాత్రం డవలప్ కాని రిమోట్ విలేజ్ విచిత్రంగా ఉంటాయి. మట్టి గోడలు,ముడుతలు పడి నడుం వంగిన అమ్మమ్మ అసహ్యంగా కనిపిస్తాయి. తల్లికోసం తప్పదనుకుని ఆ గందరగోళాన్ని భరించటానికి రెడీ అవుతాడు.

కానీ అమ్మమ్మ మనకన్నా గొప్పది కదా..మొదటిసారి వచ్చిన ముద్దుల మనవడుని గారాబంగా చూసుకోవటానికి ప్రయత్నాలు ప్రారంభిస్తుంది.వాడి సంతోషం కోసం కష్టపడుతుంది.కెంటకీ చికెన్ కావాలంటే ఇంట్లో వస్తువులు అమ్మి కోడి కూర చేస్తుంది. కానీ పిజ్జాలకు,బర్గర్స్ కు అలవాటు పడిన ఆ చంటోడి నాలుకకు అది సయించదు. కాళ్ళు కొట్టుకుంటూ ఏడ్చి నానా గోల చేస్తాడు. కానీ కాస్సేపటికి వర్షంలో తన కోసం తడిసి జ్వరంతో వణుకుతున్న అమ్మమ్మకు దుప్పటి తెచ్చి కప్పుతాడు. రక్త సంభంధం కదా.మళ్ళీ అంతలోనే చిరాకు…ఈలోగా వంగిపోయిన నడుముతో అమ్మమ్మ ఆ వయిస్సులో ..తన పల్లెలో ఎవరికో ఒంట్లో బాగోపోతే వెళ్ళి పలకరించటం చూసి విస్మయం చెందుతాడు. సిటీల్లో …నన్ను ముట్టుకోకు…నామాల కాకి అన్నట్లు ఉండే తమ ఒంటరితనం..అక్కడి సహజీవన సౌందర్యానికి సలాం చేస్తుంది.

ఇక కూరగాయలు పండించి,వాటిని అమ్ముకుంటూ పొట్ట పోసుకునే అమ్మమ్మ..వాడ్ని తీసుకుని ప్రక్కనున్న టౌన్ కి వెళ్తుంది.అక్కడ తెచ్చిన కూరగాయలు అమ్మి మనవడుకి ఇష్టమైనవి అడిగి కొనిపెట్టి తృప్తిగా బస్సెక్కిస్తుంది. తనకి టిక్కెట్ కి డబ్బుల్లేక చేతిలో బరువుతో ..అన్ని కిలోమీటర్ల దూరం నడిచివస్తుంది. అప్పుడు ఆ పసి హృదయంలో స్పందన వస్తుంది. వెంటనే వెళ్ళి ఆర్తితో కౌగిలించుకుంటాడు. అంతకుముందు ఆవిడ ప్రక్కన నడవటానికి సంకోచిస్తూ..ఆవిడ చేతిలో వస్తువులు తీసుకోవటానికి నామోషి పడేవాడు తెలియకుండానే ఆమె ఒడి చేరతాడు.
అలా మెల్లి మెల్లిగా వాళ్ళిద్దరూ మన మనస్సులను గెలిస్తూ ముందుకెళ్తూంటే వాళ్ళ అమ్మ తిరిగి తీసుకెళ్ళటానికి వస్తుంది. భాధతో ఆ పిల్లాడు తన అమ్మమ్మకు(ఫోన్ లో మాట్లాడలేదని) ఉత్తరాలు రాయమని, కొన్ని గుర్తులు నేర్పుతాడు. ఒంట్లో బాగోపోతే ఏమీ రాయకుండా ఖాళీ ఉత్తరాన్ని పోస్ట్ చేయమంటాడు. అలాగే తను గీసిన బొమ్మలు బహమతి గా ఇస్తాడు. ఆ ఇద్దరూ ఒక్క మాట మాట్లాడుకోపోయినా కొన్ని లక్షల పదాలతో ఏడుస్తూ సెండాఫ్ ఇచ్చుకుంటారు. మనం మూలాలని మరిస్తే మసైపోతాం అని స్పష్టంగా అంతకు మించి పొరలు పొరలుగా విడివడే సీన్లతో హెచ్చరించే ఈ దర్శకురాలే కథకురాలు. ఆవిడ పేరు జియాంగ్ హ్యాంగ్ లీ.

అలాగే సినిమాలో అమ్మమ్మగా జీవించిన ఇల్-బూన్-కిమ్ కిదే మొదటి సినిమా. షాకయ్యే విషయం ఏమిటంటే ఈవిడ తన 78 ఏళ్ళ జీవితంలో ఒక్క సినిమా కూడా చూసి ఎరగదు.ఇక మనవడుగా వేసిన సియాంగ్ హోయూ..చిచ్చర పిడుగే.ఇక ఈ సినిమా హైలెట్స్ లో ఒకటి చెప్పుకుని ముగిద్దాం. ఆ సిటీ కుర్రాడు తను తెచ్చుకున్న వీడియో గేమ్ సెట్ లో బ్యాటరీలు అయిపోతే ..అమ్మమ్మ తల పిన్ను అమ్మి కొనుక్కుందామని తాపత్రయపడతాడు. ఆవిడకు తెలియకుండా దొంగిలించి పల్లెలోకి పరుగెడతాడు. కానీ ఆ పల్లె ఆ పనికి అవకాశమివ్వదు. దాన్నే సినిమా మొత్తానికి మెటాఫర్ గా వాడాడు. సిటీలైఫ్ ఇచ్చే ఎనర్జీ..బ్యాటరీలో పవర్ లాంటిదంటూ ఛార్జింగ్ అయిపోతే చలనం ఉండదని పల్లే శాశ్వతం అంటూ చెబుతుందా సన్నివేశం. గ్రేట్ కదా.

ఇక ఉత్తర కొరియాలో 2005 లో నిర్మించిన ఈ లొ బడ్జెట్ చిత్రం ఉత్తమ స్క్రీన్ ప్లే,ఉత్తమ చిత్రంగా కొరియన్ అకాడమీ గోల్డెన్ భెల్ అవార్డులను సొంతం చేసుకుంది. ఓ నాయని పచ్చ నాకు సాక్షి కధలా కమ్మగా సాగిపోయే ఈ సినిమా చూస్తూంటే మనస్సు అమ్మమ్మ చంక ఎక్కుతుంది.తాత గోచి లాగుతుంది. మామయ్యలతో పరుగులు గుర్తుకు తెస్తుంది. మరో ప్రక్క రోజురోజుకీ గ్లోబలైజేషన్ వంకతో మారి పోతున్న మన బ్రతుకులు సానుభూతితో పరికిస్తుంది. ఇక ఈ సినిమా చూసాక అమ్మమ్మ గారింటికి వెళ్ళాళని బలంగా అనిపిస్తుంది…అందుకే ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని చూడండి.

13 Comments
  1. మేడేపల్లి శేషు December 5, 2008 /
  2. ప్రపుల్ల December 5, 2008 /
  3. venkat December 5, 2008 /
  4. Sowmya December 5, 2008 /
  5. Harinath Mallepally December 5, 2008 /
  6. sreeram kannan December 5, 2008 /
  7. రానారె December 7, 2008 /
  8. Jonathan December 8, 2008 /
  9. ravikumar.b August 6, 2013 /