Menu

The Tramp (1915)

చార్లీ చాప్లిన్ సినిమాలతో నాకు పెద్ద పరిచయం లేదు. అప్పుడెప్పుడో “easy street” వంటి చిన్న సినిమాలు ఒకట్రెండు చూసాను కానీ, ఆ తరువాత మళ్ళీ ఎప్పుడూ చూడలేదు. “ఆవారా” చూస్తున్నప్పుడు “ఆవారాహూ” పాటలో రాజ్ కపూర్ ని చూసాక చాప్లిన్ ని మళ్ళీ చూడాలనిపించింది. ఆ విధంగా “ది ట్రాంప్” అన్న 1915 మూకీ చిత్రం చూసాను. ఆవారా పాత్ర రూపకల్పనకి ప్రేరణ అయిన “ట్రాంప్” పాత్రధారణ మొదలైన తొలి సినిమా ఇదేనని తెలిసింది. చాప్లిన్ అనగానే నాకు గుర్తు వచ్చే ఆ వేషధారణ, నడకా – ఈ సినిమా నుండి మొదలయ్యాయని తెలుసుకుని నాకెంతో excitement కలిగింది.

ఇంతకీ, ఈ వర్ణన చూసి అదేదో పెద్ద సినిమా అనుకునేరు. అదొక లఘు చిత్రం. ఇరవై నిముషాలు మాత్రమే నిడివి. బహుశా మూకీ కనుక, నిడివి తక్కువ ఏమో. ఆకాలంలో సినిమాల నిడివి ఎంత ఉండేదో నాకు తెలీదు. దాదాపు వందేళ్ళ నాటి సినిమా ని చూసినట్లు లెక్క. ఐనప్పటికీ, సినిమాలోని హాస్యం ఇప్పుడు కూడా చాలా చోట్ల నవ్వించగలిగింది నన్ను. కనుక, చాప్లిన్ evergreen అని ఒప్పుకుని తీరాల్సిందే నేను 🙂 కథ గమనం అర్థం కావడానికి ఓ నాలుగైదు నిముషాలు పట్టింది – మూకీలతో నాకు గల అనుభవం చాలా తక్కువ కావడంతో. కానీ, విషయం అర్థమయ్యాక ఇక నవ్వుకోవడమే.

కథ: మన ట్రాంప్ (దేశదిమ్మరి అనుకోవచ్చా తెలుగులో?) అలా తిరుగుతూ ఓ చోట తినడానికి ఆగుతాడు. ఓ దొంగ అతని బ్రెడ్ దొంగిలించి వాటి స్థానంలో ఇటుకని పెడతాడు. దానితో మన ట్రాంప్ ఏమీ తోచక గడ్డి తింటాడు. తరువాత ఘట్టంలో అక్కడొక పొలం యజమాని కూతురు దగ్గరున్న డబ్బు దొంగిలించేందుకు అదే దొంగ ప్రయత్నిస్తూ ఉంటే, ట్రాంప్ అతన్ని తరిమేస్తాడు. తరువాత ఆ దొంగ మరో ఇద్దరితో వస్తే, హీరో వాళ్ళని కూడా తన శైలిలో తరిమేస్తాడు. దానితో ఆ అమ్మాయి అతన్ని వాళ్ళ నాన్న కి పరిచయం చేసి అక్కడ ఏదో పని ఇప్పిస్తుంది. మన హీరోగారు ఏ పని చెప్పినా సవ్యంగా చేయలేక పాడుచేస్తూ ఉంటారు. కానీ, మళ్ళీ దొంగలు ఆ ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళని తరిమేసేందుకు సాయం చేస్తాడు. ఇంతలో హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. తను అక్కడ ఉండనక్కరలేదు అని భావించిన ట్రాంప్ ఓ ఉత్తరం రాసి పెట్టి మళ్ళీ రోడ్డున పడతాడు. ఇదీ ఈ సినిమా కథ.

అదటు పెడితే, అంతా మూకీలో నడవడం వల్లో ఏమో, పాత్రల నటనపైనే సమస్తం ఆధారపడి ఉండింది. చాప్లిన్ ఇచ్చిన హావభావాలు అద్భుతం. అలా క్షణానికో విధంగా ముఖ కవళికల్ని మార్చడం అంత సులభమేమీ కాదు కదా. ఈ వేషధారణా, ఆ పాత్ర కి ఉన్న మేనరిజమ్స్ – ఇవన్నీ తరువాత తరువాత ట్రెండ్ సెటర్లు అయాయి అని అందరికీ తెలిసిందే. ఇరవై నిముషాల సినిమా గురించి ఇంతసేపు రాసానంటే అర్థం చేసుకోండిక, సినిమా ఎలా ఉండి ఉంటుందో. ఆద్యంతమూ సుమారుగా నవ్వుకోగల హాస్యం. “లౌడ్‍నెస్” లేని హాస్యం చూసి ఎన్నాళ్ళైందో! తెరపై హాస్యం లో – సంభాషణలతో హాస్యం పుట్టించడం ఒక రకం, ముఖ కవళికలతో హాస్యం పుట్టించడం ఒక రకం, పాత్రల మధ్య ఉన్న అశరీర భాషతో హాస్యం పుట్టించడం ఒకరకం, వెకిలి హాస్యం మరో రకం. ఇంకేవన్నా రకాలుంటే ఉన్నాయి కానీ, నాకు తోచట్లేదు. ఇందులో, ముఖ కవళికలతో, ఆశరీర భాషతో హాస్యం చాలా బాగా పలికింది.

రచన, ఎడిటింగ్, దర్శకత్వం: చార్లీ చాప్లిన్, 1915.

One Response
  1. venkat December 6, 2008 /