Menu

ది మెజెస్టిక్

హాలీవుడ్ హాస్య చిత్రాలనగానే నేటి తరం ప్రేక్షకులకి గుర్తొచ్చే మొదటి పేరు: జిమ్ క్యారీ. ‘ది మాస్క్’, ‘ఏస్ వెంచురా: పెట్ డిటెక్టివ్’,  ‘లయర్-లయర్’, ‘డంబ్ అండ్ డంబర్’, ‘హౌ ది గ్రించ్ స్టోల్ క్రిస్మస్’,  ‘బ్రూస్ ఆల్‌మైటీ’ వంటి హిట్ చిత్రాలతో హాస్యనటుడిగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నాడీ ప్రతిభావంతుడు. క్యారీ పేరు చెప్పగానే అతని ఎలాస్టిక్ ముఖమే మదిలో మెదులుతుందెవరికైనా. ఐతే జిమ్ క్యారీ హాస్య చిత్రాలకే పరిమితమవకుండా ‘ది ట్రూమాన్ షో’, ‘ఎటర్నల్ సన్‌షైన్ ఆఫ్ ఎ స్పాట్‌లెస్ మైండ్’, ‘నంబర్ 23’ వంటి విభిన్న తరహా చిత్రాల్లోనూ ప్రధాన పాత్రలు పోషించాడు. అతని హాస్య చిత్రాల్లాగే ఇవి కూడా బాక్సాఫీసు వద్ద మంచి విజయం నమోదు చేసినవే. అయితే – క్యారీ చిత్రాలన్నింటిలోకీ తలమానికమైనదిగా పలువురు విమర్శకులు పేర్కొనే చిత్రం పేరు సైతం చాలామంది వినుండకపోవచ్చు! అది, 2001 డిసెంబర్లో విడుదలైన ‘ది మెజెస్టిక్’. జిమ్ క్యారీ అంటే వెకిలి చేష్టలతో వింత వేషాలేసే ఓ సాధారణ హాస్యనటుడు మాత్రమే అనే అభిప్రాయం మీకుందా? మీరీ సినిమా చూస్తే ఆ అభిప్రాయాన్ని మార్చుకుతీరతారు.

* * * * * * * *

అమెరికాకీ కమ్యూనిజానికీ చుక్కెదురన్నది అరవయ్యేళ్లుగా ప్రపంచానికి ఎరుకే. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఐరోపాలో శరవేగంగా విస్తరిస్తున్న సోషలిస్టు భావజాలం తమదేశంలోనూ అడుగు పెడుతుందేమోనని అమెరికన్ ప్రభుత్వం బెదిరిపోయింది. అప్పట్లో అమెరికన్ కమ్యూనిస్టు పార్టీలో సుమారు యాభై వేల మంది సభ్యులు ఉండేవారు. ఆ సంఖ్య మరింత పెరగకుండా చేయటానికీ, కమ్యూనిస్టు పార్టీని మట్టిలో కలిపేయటానికీ ప్రభుత్వం పావులు కదిపింది. అందులో భాగంగా హాలీవుడ్‌లో లబ్దప్రతిష్టులైన పలువురు నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, కధకులు, ఇతర సాంకేతిక నిపుణులపై కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్నట్లుగా అభియోగాలు మోపి వారిని కాంగ్రెస్ ప్రత్యేక కమిటీ ముందు విచారణకు హాజరు కావలసిందిగా ఆదేశించింది. ఇది 1947 అక్టోబరు నాటి కధ. సినీ మాధ్యమం ద్వారా అమెరికా వ్యతిరేక భావజాలాన్ని అమెరికన్లలో వ్యాపింపజేస్తున్నారనేది వారిపై ప్రధాన ఆరోపణ. నిందితుల్లో కొందరు నిజంగానే కమ్యూనిస్టు సానుభూతిపరులు, ఎక్కువమంది మాత్రం తమకు సంబంధం లేకున్నా ఇందులో ‘ఇరికించబడిన’ వాళ్లు. విచారణకు హాజరు కాని వారు, హాజరయినా కమిటీ ఆశించిన సమాధానాలు ఇవ్వనివారు, కమిటీతో సహకరించటానికి నిరాకరించినవారు తదనంతరం పలు ఇబ్బందులకు, శిక్షలకూ గురయ్యారు. కొందరు కోర్టు ధిక్కార నేరం కింద జైలు పాలవగా, ఎందరో ప్రతిభావంతుల వృత్తి జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోయాయి (మోషన్ పిక్చర్ అకాడెమీ ఆఫ్ అమెరికాపై కాంగ్రెస్ కమిటీ వత్తిడి తెచ్చి  ఈ నిందితులను హాలీవుడ్ సినిమాలకి పనిచేయకుండా బహిష్కరించేలా చేసింది). 1947లో పదిమందితో ప్రారంభమైన ఈ ‘హాలీవుడ్ బ్లాక్‌లిస్ట్’ ఏ ఏటికాయేడు విస్తరిస్తూ పోయి క్రమంగా ఇతర వినోద రంగాలకూ పాకింది. 1957లో ఉపసంహరించబడేలోపు ఈ బ్లాక్‌లిస్ట్ పాలిటబడి బలయినవారి సంఖ్య సుమారు మూడువందలు!

* * * * * * * *

ఈ నేపధ్యంలో రూపొందిన హాలీవుడ్ ఆణిముత్యం ‘ది మెజెస్టిక్’. కధాకాలం – 1951 ప్రాంతం. పీటర్ ఆపిల్‌టన్ – హాలీవుడ్ ద్వితీయ శ్రేణి చిత్రాల కధా రచయితగా పేరు తెచ్చుకుని అప్పుడప్పుడే ప్రధమ శ్రేణి సినిమాలకేసి అడుగులేస్తున్న యువకుడు. వ్యక్తిగతంగానూ, వృత్తిగతంగానూ అంతా సజావుగా జరుగుతున్న దశలో ఎవరి పుణ్యానో అతని పేరు హాలీవుడ్‌లో కమ్యూనిస్టు సానుభూతిపరుల కోసం భూతద్దాలతో గాలిస్తున్న ప్రత్యేక ప్రభుత్వ బృందం దృష్టిలో పడుతుంది. కాంగ్రెస్ కమిటీ ముందు హాజరు కావలసిందిగా అతనికి సమన్లొస్తాయి. ఇంకేముంది, తెల్లవారేసరికి స్టూడియోలు అతన్ని ‘హలీవుడ్ బ్లాక్‌లిస్ట్’లో చేరుస్తాయి. అతని సినిమాలు ఆగిపోతాయి. ప్రియురాలు ముఖం చాటేస్తుంది. తెలిసినవారంతా అతన్ని దూరం పెట్టనారంభిస్తారు. అతనితో మాట్లాడితే తమనీ ఎక్కడ కేసుల్లో ఇరికిస్తారోనని వాళ్ల భయం! చేయని తప్పుకు అతని జీవితం నాశనమయ్యే ప్రమాదం. ఒక్క రోజులో తలక్రిందులైన జీవితం.

ఆ బాధలో రాత్రంతా బార్లో తప్ప తాగి కారు నడుపుతూ దారిలో ఓ వంతెనమీద ప్రమాదానికి గురై కారుతో సహా నదిలో పదిపోతాడు పీటర్. ప్రమాదంలో తలకు బలమైన గాయాలై స్పృహనీ, దానితోపాటే జ్ఞాపకశక్తినీ కోల్పోతాడు. మెలకువ వచ్చేసరికి ‘లాసన్’ పేరుగల గ్రామంలో సముద్రతీరంలో పడిఉంటాడు. తనెవరో కూడా తనకి తెలీని స్థితిలో ఉన్న పీటర్ ఆపిల్‌టన్‌ని ఆ గ్రామవాసులు తమ ఊరికే చెందిన లూక్ ట్రింబుల్‌గా భావిస్తారు. ఈ లూక్ ట్రింబుల్ లాసన్ గ్రామస్థుడు హ్యారీ ట్రింబుల్ ఏకైక కుమారుడు. తొమ్మిదేళ్ల క్రితం రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడుతూ జాడ తెలియకుండా పోయిన లూక్ కి, జ్ఞాపక శక్తి కోల్పోయిన స్థితిలో తమ ఊరు చేరిన పీటర్‌కి కొట్టొచ్చే పోలికలు ఉండటంతో హ్యారీతో సహా ఊరి వారందరూ అతన్ని లూక్ గా భావిస్తారు.

వెయ్యిలోపు జనాభాగల లాసన్ గ్రామం అరవై రెండుమంది యువకుల్ని రెండవ ప్రపంచ యుద్ధంలో కోల్పోయింది. ఇప్పుడక్కడ మిగిలిందల్లా వృద్ధులు, ఇంటింటా యుద్ధం మిగిల్చిన గాయాలు. యుద్ధానికి ముందుదాకా హ్యారీ నడిపే ‘ది మెజెస్టిక్’ పేరుగల సినిమా హాల్ ఆ ఊరంతటికీ వినోదాన్నందించే ఒకే ఒక చోటు. కొడుకుని కోల్పోయిన బాధతో హ్యారీ సినిమా హాల్‌ని మూసేస్తాడు. ఇప్పుడా ఊర్లో ఎక్కడ చూసినా నిశ్శబ్దం, నిస్తేజం. ఆ దశలో లూక్ రాక గ్రామంలో ఓ నూతనోత్తేజాన్ని తీసుకొస్తుంది. గ్రామస్తులంతా లూక్‌లో తిరిగొచ్చిన తమ కుమారుల్ని చూసుకుంటారు. మొదట్లో వాళ్లు తనని చూసి పొరబడుతున్నారనుకున్న పీటర్, మెల్లిగా తాను లూక్‌నే కాబోలుననుకోవటం మొదలు పెడతాడు. లూక్ తిరిగొచ్చిన ఆనందంలో హ్యారీ మెజెస్టిక్‌ని పునఃప్రారంభిస్తాడు. చాలా ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో మళ్లీ సందడి మొదలవుతుంది. ఈ కొత్త లూక్ అందరికీ ఆత్మీయుడవుతాడు.

అంతా బాగుందనుకుంటున్న సమయంలో ఒక రోజు పీటర్‌కి తన గతం గుర్తొస్తుంది. తనెవరో హ్యారీకి చెప్పేద్దామనుకుంటుండగా వయసైన హ్యారీ హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తాడు. అదే సమయంలో – హాలీవుడ్ నుండి మాయమైన పీటర్ ఆపిల్‌టన్ కోసం గాలిస్తున్న ఎఫ్‌బిఐ బృందానికి అతను లూక్ ట్రింబుల్ పేరుతో చెలామణి అవుతూ లాసన్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఏమయిందో సినిమా చూసి తెలుసుకోండి.

* * * * * * * *

‘ది షాషాంక్ రిడెంప్షన్’, ‘ది గ్రీన్ మైల్’ వంటి అద్భుతమైన చిత్రాలనందించిన ఫ్రాంక్ డరబాంట్ దర్శకత్వంలో రూపొందిన ‘ది మెజెస్టిక్’ చిత్రం నిండా దర్శకుడి శైలి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. గ్రాఫిక్కుల గిమ్మిక్కుల మీద అతిగా ఆధారపడకుండా హృదయానికి హత్తుకునే కధలతో సినిమాలు తీసే కొద్దిమంది హాలీవుడ్ దర్శకుల్లో ఫ్రాంక్ డరబాంట్ ఒకడు. ‘ది మెజెస్టిక్‌’లో సైతం అదే బాణీ కనిపిస్తుంది. సినిమా రంగం నేపధ్యంలో తీసిన చిత్రం కావటంతో సహజంగానే అక్కడక్కడా హాలీవుడ్ పనివిధానంపై చురుక్కుమనిపించే చెణుకులు మెరుస్తాయి. మల్టీప్లెక్సుల రంగప్రవేశానికి ముందు అమెరికాలో సినిమా ధియేటర్లు ఎలా ఉండేవో మెజెస్టిక్ ధియేటర్ కళ్లకు కడుతుంది. తన ధియేటర్ గురించి పీటర్/లూక్‌కి వివరిస్తూ ప్రజలు అసలెందుకు సినిమా చూడటనికొస్తారో హ్యారీ తెలియజెప్పే సన్నివేశం – పిచ్చి పిచ్చి సినిమాలు తీసి మనమీదకి వదిలి, అదేమంటే ‘నేనింతే’ అనే పోకిరీ దర్శకులు చూసి తీరాలి. రెండున్నర గంటల సుదీర్ఘమైన చిత్రమైనా, కధనం మెల్లిగా సాగుతున్నా, ఎక్కడా విసుగు పుట్టించకుండా ‘ది మెజెస్టిక్’ కధ నడుస్తుంది. సినిమా నిండా సందర్భోచిత సంభాషణలు. ఏ వాక్యం ఎంతవరకు ఉండాలో అంతే ఉంటుంది. సినిమా అంతా ఒకెత్తు, చివర్లో వచ్చే కోర్టు సన్నివేశం ఒకటీ ఒకెత్తు. ‘టికెట్ డబ్బులు మొత్తం ఈ సీన్‌కే ఇచ్చేయొచ్చు’ అని మనోళ్లంటారే, అలాంటి సన్నివేశమన్నమాట. వ్యక్తి స్వేచ్చకీ, వాక్‌స్వాతంత్రానికీ పెద్దపీట వేస్తూ మొదటి అమెరికన్ రాజ్యాంగ సవరణ ప్రసాదించిన పౌర హక్కుల్ని ప్రస్తావిస్తూ పీటర్ ఆపిల్‌టన్ ‘నేను కమ్యూనిస్టునా కానా అన్నది కాదు సమస్య. అంతకన్నా పెద్ద సమస్య గురించి మాట్లాడుదాం .. ‘ అంటూ మొదలెట్టి లేవనెత్తే ప్రశ్నలు వింటున్నవారిని, సినిమా చూస్తున్నవారిని కట్టిపడేస్తాయి. తన వాగ్ధాటికి పదే పదే అడ్డుతగులుతున్న జడ్జిగారిని లెక్కచేయకుండా పీటర్ సంధించే ప్రశ్నలు తూటాల్లా పేలతాయి. ‘ఈ రాజ్యాంగం లూక్ ట్రింబుల్ వంటి ఎందరో యువకులు రక్తంతో సంతకాలు చేసిన ఒప్పంద పత్రం. దాన్ని మార్చే, ఏమార్చే అధికారం మీకెవరికీ లేదు’ అంటూ బాధతో మిళితమైన ఆవేశాన్ని ప్రదర్శించే ఆ సన్నివేశంలో జిమ్ క్యారీ చూపిన అభినయానికిగానూ అతనికి ఆ ఏడాదికి ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు ఇచ్చేసుండొచ్చు (ఆ ఏడాది అకాడెమీ అవార్డు డెంజెల్ వాషింగ్‌టన్‌కి లభించింది).

‘పీరియడ్ సినిమా’ అనేది భారతీయ సినిమాల్లో- ముఖ్యంగా హిందీ సినిమాల్లో – ఇటీవల విరివిగా వినిపిస్తున్న మాట. ‘లగాన్’, ‘మంగళ్ పాండే’ వంటి చిత్రాలు ఈ కోవకి చెందినవి. కధాకాలాన్ని సజీవంగా ప్రేక్షకుల కళ్లముందు నిలపటం ఈ తరహా చిత్రాలకి ప్రాణం. ఆ విషయంలో మనవాళ్లు కొంత ప్రయత్నం చేసినా అంతంత మాత్రమే విజయవంతమయ్యారు. ఫ్రాంక్ డరబాంట్ ఇతర చిత్రాల్లాగానే, పీరియడ్ ఫిల్మ్ అనేది ఎలా ఉండాలో ‘ది మెజెస్టిక్’ చూసి తెలుసుకోవచ్చు. యాభైలనాటి అమెరికన్ గ్రామీణ జీవన విధానాన్ని కళ్లకు కట్టేలా చూపటంలో ఫ్రాంక్ మరోసారి విజయం సాధించాడు. ఫ్రాంక్ డరబాంట్ సినిమాల్లో తరచూ నటించే జేమ్స్ విట్‌మోర్, జెఫ్రీ డె-మన్, బ్రెంట్ బ్రిస్కో, బిల్ గ్రాటన్ తదితరులు ఈ సినిమాలోనూ కనిపిస్తారు. జిమ్ క్యారీ తర్వాత ప్రస్తావించి తీరవలసింది లూక్ తండ్రి హ్యారీ ట్రింబుల్ పాత్రలో నటించిన మార్టిన్ లాండౌ గురించి. మిగతా పాత్రధారులూ – పాత్ర చిన్నదా పెద్దదా అనే తేడా లేకుండా – అందరూ తమ సహజ నటనతో ఆయా పాత్రలకు ప్రాణం పోశారు. వాళ్ల ఎంపికలో ఫ్రాంక్ డరబాంట్‌కి తోడ్పడ్డ కాస్టింగ్ డైరెక్టర్ డెబొరా అకీలా ని ప్రత్యేకంగా అభినందించాలి.

డెబ్భై మిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మితమై 2001 డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం రోజర్ ఎబర్ట్ వంటి ప్రఖ్యాత హాలీవుడ్ సినీ విమర్శకుల మన్ననలందుకున్నా, బాక్సాఫీసు వద్ద ముప్పై మిలియన్లలోపే వసూలు చేసి భారీ నష్టాలు చవి చూసింది. కొన్ని సినిమాలంతే. ఎంత బాగున్నా నడవకపోవచ్చు. వాటికి అనేక కారణాలుంటాయి. ‘కాలం కలిసిరాకపోవటం’ అనేది ఈ సినిమాకి బాగా వర్తిస్తుంది. 9/11 దాడుల నేపధ్యంలో ‘ది మెజెస్టిక్’ విడుదలవటంతో ఆశించిన విజయం సాధించలేకపోయింది. దేశభక్తికి అసలు సిసలు నిర్వచనం చెబుతూ, ‘అమెరికా అంటే యుద్ధాలూ, విజయాలూ కాదు; అమెరికా అంటే స్వేచ్ఛ, స్వాతంత్రాలు’ అనే ప్రాధమిక విషయాన్ని గుర్తు చేస్తూ రూపొందిన ఈ సినిమాలోనీ సందేశాన్ని ఆమోదించే స్థితిలో అప్పుడు అమెరికన్ ప్రజానీకం లేకపోవటం చిత్ర పరాజయానికి ఓ ప్రధాన కారణం. అయితే, జయాపజయాలతో నిమిత్తం లేకుండా మంచి సినిమాలు చూడాలనుకునేవారికి తప్పక నచ్చే సినిమా ‘ది మెజెస్టిక్’.

–అబ్రకదబ్ర

8 Comments
  1. shree December 23, 2008 /
  2. నిషిగంధ December 23, 2008 /
  3. రవి December 24, 2008 /