Menu

The Kid (1921)

“ది కిడ్” 1921 నాటి చార్లీ చాప్లిన్ మూకీ సినిమా. అప్పటి సినిమాల్లో అత్యంత ప్రాచూర్యం పొందినవాటిలో ఇదీ ఒకటి. ఇప్పటికీ “ది కిడ్” అభిమానులు చాలా మంది ఉన్నారు. సినిమా విడుదలై తొంభై ఏళ్ళౌతూ ఉంటే ఇంకా ఆ సినిమా పేరు జనాల మధ్య ఉండటం అంటే మాటలు కాదు. అదొక్క విషయం చాలు ఈ సినిమా చారిత్రక విలువను తెలియజెప్పడానికి.

కథ: ప్రేమలో మోసపోయిన ఓ యువతి బిడ్డకి జన్మనిస్తుంది. ఆ బాబునేం చేయాలో తెలీక ఓ జీపులో వదిలేస్తుంది. అనేక చేతులు మారి ఆ అబ్బాయి ఓ వీథిలోకి చేరతాడు. ఆ వీథి వెంబడి వెళ్తున్న దేశదిమ్మరి (చార్లీ చాప్లిన్) ఆ పిల్లవాడ్ని చూస్తాడు. అనుకోని పరిస్థితుల్లో ఆ పిల్లవాడ్ని తానే పెంచుకోవాల్సి వస్తుంది. అతనికి జాన్ అని నామకరణం చేస్తాడు. ఐదేళ్ళు గడుస్తాయి. జాన్ తల్లి ఇప్పుడు పేరు మోసిన నటి. జాన్ (జాకీ కూగన్), మన ట్రాంప్ (Tramp-nameless character) ఇద్దరూ రకరకాల పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు. ఒకానొక పరిస్థితిలో జాన్ తల్లికి తన కొడుకు బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది. కాసేపు జాన్ చాప్లిన్ కి దూరమై, రకరకాల సంఘటనల తరువాత తల్లివద్దకి చేరతాడు. కథ చివర్లో జాన్-చాప్లిన్ ఇద్దరూ జాన్ తల్లి ఇంట్లోనే కలుసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది.

బహుశా, తరువాత బోలెడు సినిమాల్లో కనబడ్డ – కుప్పతొట్లో కనబడ్డ పిల్లవాడ్ని వేరే ఒకరు పెంచుకుని వారి మధ్య అనుబంధం పెరిగే సన్నివేశాలు అన్నింటికీ ఈ సినిమా లాంటివే ప్రేరణలు కాబోలు. సరే, ఈ కథ విషయం అటు పెడితే, ఆద్యంతమూ నవ్వులే ఈ సినిమాలు. “నవ్వూ, ఏడుపూ రెండూ ఉంటాయి ఈ సినిమాలో” అన్న భావం వచ్చే సందేశం ఒకటి సినిమా మొదట్లోనే వేశారు. నిజం! ముమ్మాటికీ నిజం! పిల్లవాడు జాకీ కూగన్ అద్భుతంగా నటించాడు. చాప్లిన్ సంగతి చెప్పడానికి మాటలు చాలవు. ఈ సినిమా తరువాత కూగన్ చాలా పాపులర్ అయ్యాడు. ఇతని సంపాదనంత తల్లి, సవతి తండ్రీ తినేస్తూ ఉంటే కూగన్ కేసు వేసాడు వారి మీద. అప్పుడే అమెరికా లో California Child Actor’s Bill అనబడు కూగన్స్ బిల్ అమలు చేయబడింది.

Back to the movie – నాకు బాగా నచ్చిన సన్నివేశాలు:
1. ఆ బిడ్డని వదిలించుకోడానికి చాప్లిన్ చేసిన ప్రయత్నాలు
2. చాప్లిన్-జాన్ కలిసి పగిలిన అద్దాలు బాగు చేసే వ్యాపారానికి కేసులు రావడానికి అమలు పరచిన విధానం
3. జాన్, మరో కుర్రాడు వీథిలో కొట్టుకునే సన్నివేశం
4. చాప్లిన్ కల
5. జాన్-చాప్లిన్ ఇద్దరూ జాన్ ని తీసుకుపోడానికి వచ్చిన వారి నుండి తప్పించుకునే దృశ్యాలు – Touching!

సినిమాలో చక్కటి హాస్యమే కాదు, కదిలించే గుణం కూడా ఉంది. ఆ పిల్లవాడికి-చాప్లిన్ కి మధ్య ఉన్న అనుబంధం ప్రేక్షకులని కట్టిపడేస్తుంది. ఒక సినిమాలో మాటలు లేకుండానే ఇంత ప్రభావం తీసుకురాగలగడం-ఇప్పటి సినిమాలు చూశాక ఆశ్చర్యంగానే ఉంది నాకు. అప్పటికి సబ్-టైటిల్స్ అన్న కాన్సెప్ట్ కూడా ఉన్నట్లు లేదు. ఎక్కడన్నా డైలాగు చెప్పాల్సింది ఉంటే, అది తెరపై ఒక స్లైడ్ లాగా వస్తూ ఉండింది. 🙂 అన్నట్లు, ఈ సినిమా కి నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, కథా రచయిత – అన్నీ చాప్లినే!! Wow! అయితే, నేపథ్య సంగీతం అంతా బాగా ఉంది కానీ, ఒక్కోచోట సీన్ మూడ్ కి తగినట్లు లేదేమో అనిపించింది.

సినిమా నిడివి గంటలోపే, నేను చూసిన ప్రింటులో. మరో ప్రింటులో 68 నిముషాలుందని చదివాను. ఏదేమైనా సరే, “ది కిడ్” తప్పక చూడవలసిన సినిమా. మాటలక్కరలేకుండానే మనకు భావాలు తెలిసిపోతాయి. మూకీని ఎలా చూడాలని వర్రీ కాకండీ, ఒకవేళా ఆ అనుమానం వచ్చి ఉంటే 🙂

4 Comments
  1. అబ్రకదబ్ర December 17, 2008 /
  2. srinivas goud December 19, 2008 /