Menu

ది క్యూరియస్ కేస్ ఆఫ్ ‘బెంజిమన్ బటన్’

న్యూఆర్లియన్స్, లూసియానా 2005. కత్రీనా కన్ను ఆ నగరం పై పడ్డ వేళ.. ఓ ఆసుపత్రిలో మరణశయ్యపై ఓ వృద్ధురాలు. పక్కనే ప్రౌఢ వయస్సులో ఉన్న అమె కూతురు. ఆమె చేతిలో ఓ పుస్తకం. అది వేరెవరిదో కాదు మన కథానాయకుడు ‘బెంజిమన్ బటన్’ రాసుకొన్న డైరీ.

ఇక్కడి నుంచి కథ ప్రారంభం అవుతుంది. అక్కడ ఒక్కో పేజీ తిప్పుతూంటే ఇక్కడ బెంజిమన్ జీవితంలో ఒక్కో ఘట్టం మన ముందుకు వచ్చి పోతూంటుంది. ఏ కథకైనా ప్రారంభం, ముగింపు ఉన్నట్టే, మన జీవితాలకూ పుట్టుక, చావు కూడా ఉంటాయి- మన బెంజిమన్`తో సహా. కానీ ఇక్కడ తేడా అల్లా ఒక్కటే – అది మన బెంజిమన్ గిట్టడానికి పుట్టి, పుట్టడానికి గిట్టుతాడు. అగమ్యగోచరంగా ఉందా? పుట్టుకతో 80 ఏళ్ల వృద్ధుడైన వ్యక్తి, పెరుగుతూ(తరుగుతూ?) రోజుల పసిగుడ్డులా మారడమే ఈ చిత్ర కథాంశం. ఆశ్చర్యంగా ఉంది కదూ…’బ్రహ్మరాత’ను మించిన రాత ‘రచయిత’ రాయగలడు అన్న దానికి ప్రత్యక్ష నిదర్శన- ఈ ఊహ సృజించిన ‘స్కాట్ ఫిట్జ్`గెరాల్డ్’.

ఆయన రాసిన చిన్నకథను ఆధారంగా చేసుకొని ‘ఎరిక్ రాథ్’ (ఫారెస్ట్ గంప్ స్క్రీన్ ప్లే రచయిత) రాసిన కథ, స్క్రీన్ ప్లేలతో దర్శకుడు ‘డేవిడ్ ఫించర్’ తీసిన అద్భుతమైన కళాఖండం ఈ చిత్రం. కళాఖండం అని వినగానే కొందరి గుండెలు బేజారుమనడం తెలుస్తూనే ఉంది. ఇది ‘ఆర్టు’ సినిమా కాదు ‘హార్టు’ సినిమా. గాఢ సుషుప్తిలో ఉన్న మీ మనసుల్ని తట్టిలేపే సినిమా, బండబారిన మీ గుండెల్ని సున్నితంగా తడిమే సినిమా. మీకు తెలియకుండానే మిమ్మల్ని తనలోకి లాక్కునే సినిమా. సినిమాతో పాటు మీరూ నవ్వుతారు, ఆర్ద్రతతో కన్నులు తడి చేసుకొంటారు. సృష్టిలో, మీలో, నాలో ఉన్న ప్రేమ, విరహం, అసూయ, వ్యామోహం, కాంక్ష, వేదన, ఆనందం, విషాదం ఈ సినిమాలో చూసుకొని you will surf up a tide of emotions and transcend the feelings of love and lust.

ఇక కథ విషయానికొస్తే, మొదటి ప్రపంచ యుద్ధకాలంలో…పుట్టినప్పుడు నిముషాల పసిగుడ్డైనా, చూడ్డానికి ఎనభై ఏళ్ల పండు ముదుసలిలా ఉంటాడు బెంజిమన్. ఉండడమే కాదు క్యాటరాక్టు,ఆర్థ్రైటిస్`లతో సహా సర్వరోగాలతో చూడ్డానికే భయంగొలిపేలా ఉంటాడు. దానికి తోడు పుట్టుకతోనే తల్లి మరణానికి కారణం అవుతాడు. దీంతో బటన్ల ఫ్యాక్టరీతో బాగా డబ్బు సంపాదించిన వాళ్ల నాన్న ఈ పసి’తాత’ని ఓ వృద్ధాశ్రమం మెట్లమీద వదిలిపెట్టి వెళతాడు. అక్కడే పని చేసే నల్లామె ‘క్వీనీ’ తన సొంత బిడ్డలా, ఆ వృద్ధాశ్రమంలో మరో వృద్దుడిలా సాకుతుంది. అక్కడే స్నిగ్ధలాంటి ఓ అమ్మాయి ‘ఢైసీ’ పరిచయం అవుతుంది మన తాతకు. ఇద్దరి మధ్య స్నేహం పరవళ్లు తొక్కుతుంది. ఆ చిన్నారి స్నేహాన్ని ఎప్పటికీ మనస్సులో నిలుపుకొంటాడు బెంజిమన్.

పెద్దవాడైయే కొద్దీ శరీరంలో పటుత్వం, మనస్సులో యవ్వనం పురివిప్పుకొంటాయి. ఈ దారిలో అన్నీ అనుభవించి, అంటే మొదటి ముద్దు, మొదటి పెగ్గు, మొదటి సిగ్గు వగైరా…అనుకోకుండా రెండో ప్రపంచ యుద్ధంలో తేలుతాడు. అక్కడి నుంచీ మన బెంజిమన్ దారీ, న్యూయార్క్`లో బాలే డాన్సర్`గా జీవితం మొదలు పెట్టిన డైసీ దారీ సమాంతర రేఖలౌతాయి. అనుకోకుండా ఇద్దరి దారులూ ప్యారిస్`లోని ఓ హాస్పటల్లో కలుస్తాయి. కారణం ఓ accident. అక్కడి నుంచీ 0 నుంచీ 40కి చేరిన డైసీ, 80 నుంచి 40కి చేరిన బెంజిమన్ శృంగారంలో మునిగితేలుతారు. ఫలితంగా ఓ పాప పుడుతుంది. యుక్తవయస్సు మీద పడుతున్న బెంజిమన్ పాప పెంపకం విషయమై మథనపడి ఇల్లు విడిచి వెళ్లిపోతాడు.

ఎక్కడైతే మనిషి తన చిత్తం వచ్చిన పని చేయవచ్చో, ఎక్కడికైతే మనిషి చావుపుటకలకు దూరంగా పారిపోవాలనుకొంటాడో, ఎక్కడైతే ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కుతుందో అక్కడ చేరుతాడు (కనుక్కోండి చూద్దాం!). చాన్నాళ్లు అలా గడిపి చివరకు మళ్లీ సొంత ఊరు న్యూఆర్లిన్స్ చేరుకొంటాడు. అన్నీ మరచిన పాపాయిగా మారి, తన చిన్ననాటి నేస్తం, మధ్యవయస్సులో జీవిత భాగస్వామి, చివరికిలా తల్లిలా లాలించే ‘డైసీ’ ఒడిలో కన్నుమూస్తాడు. ‘కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటుదీ జీవితం’ అన్న కవి భావాన్ని ఎంతో హృద్యంగా చూపిందీ చిత్రం. చివర్లో ఆపుకొందామన్నా ఆగని కన్నీళ్లు వెచ్చగా, వెక్కి వెక్కి ఏడుస్తున్న చెంపల్ని తడిమాయి, ఓదార్చాయి.

కథ ఇంతేనా? అంతా చెప్పేసాడు అనుకోకండి. ఇది రేఖాచిత్రం మాత్రమే, అసలయిన కథ సినిమా చూస్తే తెలుస్తుంది. ఇందులో ఒక్కో నటుడు తమ పాత్రలకు సంపూర్ణంగా న్యాయం చేసారు. ఇక బ్రాడ్ పిట్, కేట్ బ్లాంచెట్`లు పోటీపడి నువ్వా, నేనా అన్నంతగా తమ పాత్రలకు జీవం పోసారు. ఒక్కోసారి ఇది డైసీ కథనా అనే డైలమాలో పడతాం మనం. క్వీనీ, ఓడ కేప్టను, ‘పిడుగు’రాముడు అందర్నీ చూసి మనసారా నవ్వి, తనివితీరా ఏడ్వాలంటే ఈ సినిమా చూడండి. మీ వయస్సులో ఓ సంవత్సరం ఎక్కువ చేసే పూచీ నాది! ఇంకా రాయాలనుంది, మరెప్పుడైనా…adios amigos.

– డా.ఇస్మాయిల్ పెనుకొండ.
http://krishnadevarayalu.blogspot.com

14 Comments
 1. విష్ణువర్థన్ రెడ్డి December 27, 2008 /
 2. kumar December 27, 2008 /
  • shree February 9, 2009 /
 3. cbrao December 28, 2008 /
 4. కొత్తపాళీ December 31, 2008 /
 5. అబ్రకదబ్ర January 18, 2009 /
  • అబ్రకదబ్ర January 19, 2009 /
 6. విజయ్ నామోజు January 18, 2009 /
  • శంకర్ January 18, 2009 /
  • shree February 9, 2009 /
 7. shree February 9, 2009 /