Menu

స్వర్ణకమలం – మొదటి భాగం

చిన్నప్పటి నుండీ ఎన్నిసార్లు చూసినా కూడా విసుగురాకుండా మళ్ళీ మళ్ళీ చూస్తూనే వస్తున్న సినిమాల్లో స్వర్ణకమలం ఒకటి. ఇటీవలే ఎన్నోసారో గుర్తులేదు కానీ, మళ్ళీ చూశాను. ముందైతే నవతరంగం లేదు కనుక చూసి మనసులో అనుకునేదాన్ని సినిమా గురించి. ఇప్పుడలా కాదు కదా 😉 కె.విశ్వనాథ్ తీసిన సినిమాల్లోకెల్లా నాకు బాగ నచ్చిన సినిమాల్లో ఇదీ ఒకటి. ఇదివరలో శుభలేఖ గురించి అన్నట్లే, విశ్వనాథ్ బెస్ట్ ఫైవ్ ని నేను ఎంపిక చేస్తే అందులో ఇది ఉంటుంది. ఈ సినిమా గురించి రాసేది 2 భాగాలుగా విభజించి రాయడం మంచిదేమో అనిపిస్తోంది.
1. కథ – కథనం – నటన వగైరా
2. సంగీతం – సాహిత్యం.
ఇలా విభజించుకోడం నా స్వార్థానికే. నేను అన్నీ కలిపి చాట భారతం లా ఒకేసారి రాసేస్తే మీకు విసుగొచ్చి నా రచనల్ని చదవడం మానేస్తారేమో నన్న భయం అని గమనించగలరు.

ప్రస్తుతం కథ గురించి మాట్లాడుకుందాం. నాట్య కళాకారుల కుటుంబం లో పుట్టిన మీనాక్షి కి నాట్యం నేర్చుకున్నా కూడా దాని గురించి అంత అంకిత భావం ఉండదు. వాళ్ళింటి వద్దే ఉన్న చంద్ర శేఖర్ అనే పెయింటర్ కి మీనాక్షి అంటే అభిమానం. వీరిద్దరూ హీరో-హీరోయిన్లు. మీనాక్షి తండ్రి కి ఆమె నాట్య కళాకారిణి కావాలన్న కోరిక. ఆమెకేమో ఇవన్నీ వదిలి ఏదన్నా పని చూసుకోవాలన్న కోరిక. వీరిద్దరి మధ్యా మీనా అక్క. మీనాకి ఇష్టం లేకుండా చంద్రశేఖర్ ఓ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయిస్తే, కోపం కొద్దీ మీనా దాన్ని పాడుచేస్తుంది. ఆవేశంలో తానే నృత్యం చేయబోయి మీనా తండ్రి గుండెపోటుతో మరణిస్తాడు సభలోనే. తరువాత మీనా ఓ హోటెల్ లో రెసెప్షనిస్ట్ గా చేరుతుంది. ఇక్కడనుండి మీనాలోని కళాకారిణిని ఆమెకి చూపి, ఆ కళ గొప్పతనాన్ని ఆమెకి చెప్పి, ఆమెని నృత్యం వైపుకి రప్పించడానికి చంద్రశేఖర్ చేసిన ప్రయత్నాలు, సాధించిన విజయం, హీరో హీరోయిన్లు కలవడంతో కథ సుఖాంతమౌతుంది. నిజానికి ఈ సినిమా కథ చెప్పడం అనవసరం అనుకుంటా. ఇది చూడని తెలుగు వారు కూడా ఉన్నారంటే, వారు ఈ పోస్టు చదవడానికి కూడా వచ్చే అవకాశం లేదు కనుక. కానీ, నేను ఇంకోళ్ళకి ఈ కథ ఏమిటీ? అంటే ఎలా చెబుతానా అని ఊహించుకుని చెబుతున్నాను అనమాట.

నిజానికి ఈ సినిమా ఇలా ఏళ్ళ తరబడి జనాల మనసుల్లో నిలిచిపోయి, మరుపు రానీయకుండా వెంటాడుతూ ఉండటం వెనుక ఈ కథ కంటే కూడా ఇతర అంశాల ప్రభావమే ఎక్కువని నాకు అనిపిస్తుంది. అందులో ప్రధానమైనవి :
1. సాయినాథ్ రాసిన సంభాషణలు. ఒకటనీ, రెండనీ చెప్పడానికి వీలు లేకుండా, ఒక్కో డైలాగూ అలా గుర్తుండిపోవాల్సిందే. బయట విడిగా చెప్పినా కూడా ఇది స్వర్ణకమలం డైలాగని చెప్పేసేంతగా నాటుకుపోయాయి కొన్ని వాక్యాలు. “గూడ్సు బండి వెధవా” వంటి తిట్లు విని జంధ్యాల గుర్తు వచ్చారు. వీరిద్దరికీ ఏమన్నా రచనానుబంధం ఉండేమో మరి. ఇద్దరూ విశ్వనాథ్ తో పని చేసిన వారే కావడం మాత్రం పైకి నాకు కనిపిస్తున్న బంధం.
2. ఇందులో సాక్షి రంగారావు – శ్రీలక్ష్మి ల ఎపిసోడ్ ఓసారి చూసిన వారెవరైనా మర్చిపోగలరా అసలు? “బాల మురుగన్-పెరియాళ్వార్” అనగానే ఆ దృశ్యం కళ్ళముందు కదలాడుతోంది ఇప్పుడే.
“ఓంకారం గారు బ్రహ్మ జ్ఞాని” అంటే, “సరిగా చూడు, ఆ అజ్ఞానిని నేనే నాయనా” అన్నప్పటి సాక్షి రంగారావు ముఖం తలుచుకుంటేనే నవ్వు ఆగట్లేదు.
3. “అర్థం చేసుకోరూ!” – ఎన్నిసార్లు ఎంతమంది ఈ వాక్యాన్ని భానుప్రియ ని అనుకరిస్తూ వాడగా చూసానో ఇన్నాళ్ళలో! అసలీ సినిమాలో భానుప్రియ మాట మాట్లాడని సన్నివేశాల్లో కూడా ఎన్ని కబుర్లు చెప్పిందో. చూసిన ప్రతి సారీ కొత్తగానే కనిపిస్తుంది ఈ సినిమాలో భానుప్రియ నటన. మొదటంతా ఇలా హాస్యం నిండిన పాత్ర సినిమా ముందుకెళ్ళే కొద్దీ కాస్త బరువౌతుంది, ప్రధానంగా సినిమా చివరి పావు భాగంలో.
4. స్క్రీన్ ప్లే. Subtle romance. హీరో-హీరోయిన్ ల మధ్య “ప్రేమ” అని ప్రత్యేకంగా ఏమీ చూపరు. కానీ, మనకి తెలుస్తుంది. అదే అక్కడ ప్రత్యేకత. అసలు సినిమాల్లో “ప్రేమ” అన్న భావాన్ని ఎన్ని రకాలుగా చూపొచ్చు అన్నది ఒక ఆసక్తికరమైన కేస్ స్టడీ అవొచ్చు.
5. భానుప్రియ ఇంటి కాంపౌండ్, ఆ కుటుంబాలు, అక్కడి సన్నివేశాలన్నీ చాల బాగా తీసారు. ఈకాలం లో మరి అలాంటి నాలుగిళ్ళ చావిళ్ళు కనబడవేమో ఎక్కువగా. 20-30 ఇళ్ళున్న అపార్ట్‌మెంట్లు తప్ప. అన్ని పాత్రలూ మన చుట్టు పక్కల ఉన్న మనుషుల్లానే అనిపిస్తారు. మొదట్నుంచీ అపార్ట్మెంట్లలో ఉన్న వారి సంగతి నేను చెప్పలేను కానీ, అలాంటి ప్రాంతం లో ఎప్పుడైనా ఉండి ఉంటే, ఈ సన్నివేశాలు వస్తున్నంతసేపు కాలం వెనక్కి పరుగు తీస్తున్నట్లు అనిపించక మానదు.
6. భానుప్రియకి రియలైజేషన్ కలిగే దృశ్యం ఉంది చూశారూ – అద్భుతం.
7. భానుప్రియ కి వచ్చిన కల – ప్రపంచం అంటా పరుగులు తీస్తూ ఉంటే తాము మాత్రం ఇలా ఎడ్లబండి లో వెళుతూ ఉన్న దృశ్యం – అదొక్కటి చాలు హీరోయిన్ పాత్ర స్వభావం అర్థం చేసుకోడానికి.
8. మీనా అక్కని పెళ్ళిచేసుకుంటా అని అడగడానికి స్టేషన్ మాస్టర్ గారి అబ్బాయి వచ్చే దృశ్యం – ఆ వయొలిన్ వాదనలో అసలు విషయం ఎలా చెప్పాడో అన్నది నాకు తెలీదు కానీ, ఐడియా మాత్రం చాలా నచ్చింది నాకు.
9. షరాన్ లోరెన్ ఉన్న భాగం కూడా సినిమాలో సందర్భోచితంగా చాలా బాగా కుదిరింది.
10. ఫొటోగ్రఫీ అమోఘం.
11. సంగీతం సాహిత్యం రెండూ నాకు చాలా ఇష్టం ఈ సినిమాలో. దీని గురించి మళ్ళీ రాస్తాను కనుక ఇక్కడేమీ చెప్పను.

అసలివన్నీ కాదండీ. విశ్వనాథ్ గారికి ఈ సినిమా తీయాలన్న ఐడియా రావడమే చాలా గొప్ప విషయం. దానికి తగ్గ అభిరుచి గల నిర్మాత కూడా దొరికాక, మనకి అదృష్టం పట్టింది. జంధ్యాల సినిమాల మీద “జంధ్యా మారుతం” రెండు భాగాల సంకలనం వచ్చింది కదా, అలాగ విశ్వనాథ్ సినిమాల గురించి ఎవరూ రాయలేదా? మన తరువాతి తరం వారు మిస్సయ్యే (అసలు నా తరమే మిస్సయిందని నా అభిప్రాయం. స్వర్ణకమలం వచ్చే నాటికి ఐదేళ్ళైనా లేవు నాకు) దర్శకుల గురించి, వారి సినిమాల గురించీ రాయడం తక్షణ కర్తవ్యమని ఏ జర్నలిస్టుకీ అనిపించలేదా ఏమిటీ? 🙂 ఈ సినిమా కి ఉన్న అప్పీల్ IMDB లో ఒక తెలుగు వాడు కాని స్వర్ణకమలం అభిమాని రాసిన వ్యాఖ్య చూస్తే అర్థమౌతుంది. “It is not a really serious or grave movie at all. I found it very light yet quite unbearable in its beauty. It is a movie I would recommend blindly to absolutely anyone, and especially to non-native speakers of Telugu.” – Indeed! ఈ సినిమా గురించి నిజానికి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా సంగీతసాహిత్యాల గురీంచి ప్రత్యేకంగా చెప్పుకోవలసినది చాలానే ఉంది. మరో వ్యాసం తో మీ ముందుకొస్తాను త్వరలోనే.

Movie Details:
Name: Swarnakamalam
Release: 1988
Producer: V. Apparao
Director: K.Viswanath
Music Director: Ilayaraja
Lyrics: Sirivennela Sitarama Sastry
Cinematography: Loksingh.

10 Comments
  1. శ్రీ లక్ష్మీ కళ December 12, 2008 /
  2. cbrao December 12, 2008 /
  3. గీతాచార్య December 12, 2008 /
  4. Madhu December 12, 2008 /
  5. Manjula December 12, 2008 /
  6. krishna rao jallipalli December 12, 2008 /
  7. Satya Shyam KJ December 14, 2008 /
  8. kranthi December 16, 2008 /
  9. Venu December 18, 2008 /